English | Telugu
అక్షయ్ దగ్గర 350 జతల బూట్లు, రెడీ చేయడానికి 11 మంది మనుషులు ఉంటారంట!
Updated : Jul 17, 2021
జనం అత్యంత ఇష్టపడే ప్రముఖ జంటలలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా జంట ఒకటి. ఎప్పుడూ చమత్కారంగా మాట్లాడుతూ, సరదాగా వ్యవహరించే ఆ ఇద్దరూ అభిమానుల నుండి చాలా ప్రేమను పొందుతుంటారు. వాళ్లు వివాహం చేసుకుని 20 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ మంచి స్టైల్ మెయిన్‌టైన్ చేస్తూ రెండేళ్ల క్రితం స్టైల్ అండ్ ఫ్యాషన్ అవార్డును కూడా వారు సొంతం చేసుకున్నారు.
ఇద్దరూ తమ స్టైల్ కోషియంట్ గురించిన వివరాలను పంచుకున్నారు. ఫ్యాషన్‌గా ఉండటంలో ట్వింకిల్ ఎలా తనను ఇన్‌స్పైర్ చేస్తుంటుందో, తన వ్యక్తిగత ఫ్యాషన్ పోలీస్‌గా ఎలా వ్యవహరిస్తుంటుందో అక్షయ్ షేర్ చేసుకున్నాడు. ఇక అక్షయ్ గదిలో 350కి పైగా జతల బూట్లు ఉన్నాయని, గది మొత్తం ఆ బూట్లతోనే నిండిపోయి ఉంటుందనీ, అతన్ని రెడీ చేయడానికి 11 మందితో కూడిన బృందం ఉంటుందని వెల్లడించింది ట్వింకిల్.
దాన్ని బట్టి ఫ్యాషన్‌కూ, స్టైల్‌కూ అక్షయ్ ఎంతటి ప్రాముఖ్యం ఇస్తున్నాడో ఊహించుకోవాల్సిందే. ఇప్పుడు అక్షయ్ వయసు 53 సంవత్సరాలు. ఈ వయసులోనూ తన ఫిజిక్‌ను అతను మెయిన్‌టైన్ చేసే విధానం కానీ, బయటకు వెళ్లేటప్పుడు కానీ, పార్టీలకు-ఫంక్షన్లకు అటెండ్ అయ్యేటప్పుడు కానీ ఫ్యాషనబుల్‌గా అతను కనిపించే తీరుగానీ నేటి యువతకు ఏమాత్రం తీసిపోడు. అందుకే ఇప్పటికీ అతని ఫ్యాన్స్‌లో మేల్, ఫిమేల్ యూత్ ఇద్దరూ ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు.
ఎక్కువ సందర్భాల్లో తను ధరించే తన ఫేవరేట్ ట్రాక్ ప్యాంట్స్‌ను, హుడీస్‌ను ట్వింకిల్ కత్తిరించి పారేసిందని ఒకసారి సరదాగా ఫిర్యాదు చేశాడు అక్షయ్. అవి వేసుకుంటే తనకెంతో సౌకర్యంగా ఉన్నట్లు భావించేవాడినని అతను తెలిపాడు.
ఎక్కడికైనా వెళ్లాలంటే అక్షయ్ చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతాడని ట్వింకిల్ ఒప్పుకుంది. "అతను చాలా ఫాస్ట్‌గా ఉంటాడు. అతని బట్టలకు ప్రత్యేకంగా ఒక రూమ్ ఉంది. అది అతని ఫ్యాషన్ సెన్స్‌కు తగ్గట్లు మార్చబడింది. అతను రెడీ అవడానికి 11 మంది మనుషులు ఉంటారు. నాకు ఎవరూ లేరు. కాబట్టి రెడీ అవడానికి నేను కొంచెం సమయం తీసుకుంటాను. అది అర్థం చేసుకోతగ్గదే.” అని ఆమె తెలిపింది.
