Read more!

English | Telugu

ఆర్య‌న్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన‌ ఎన్సీబీ ఆఫీస‌ర్‌పై రూ. 8 కోట్ల లంచం ఆరోప‌ణ‌లు!

 

ఆర్య‌న్ ఖాన్ అరెస్ట‌యిన క్రూయిజ్ షిప్ డ్ర‌గ్ కేసులో ద‌ర్యాప్తు అధికారిగా ఉన్న స‌మీర్ వాంఖ‌డేపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌రిపేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విజిలెన్స్ విభాగానికి చెందిన ఐదుగురు స‌భ్యుల టీమ్ రేపు న్యూఢిల్లీ నుంచి ముంబైకు వెళ్ల‌నుంది. వాంఖ‌డే లంచ‌గొండిత‌నానికి పాల్ప‌డ్డార‌ని ఈ కేసులో సాక్షిగా ఉన్న వ్య‌క్తి ఆరోపించ‌డంతో, విజిలెన్స్ విచార‌ణ‌కు ఎన్సీబీ ఆదేశించింది. దౌర్జ‌న్యం, అక్ర‌మ ఫోన్ ట్యాపింగ్‌, ఫోర్జ‌రీ డాక్యుమెంట్ల ద్వారా షెడ్యూల్డ్ కులాల కోటాను కార్న‌ర్ చేశార‌ని వాంఖ‌డేపై మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై కూడా ఎన్సీబీ విచారించ‌నుంది.

26 ఆరోప‌ణ‌ల‌తో కూడిన ఒక లెట‌ర్‌ను ట్వీట్ చేస్తూ, వాంఖ‌డేపై విచార‌ణ జ‌ర‌పాల‌ని మాలిక్ ప‌ట్టుప‌ట్టారు. ఈ విష‌యంలో త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎన్సీబీ డిప్యుటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ముథా అశోక్ జైన్ ఈ రోజు ఉద‌యం తెలిపారు. 

స‌మీర్ వాంఖ‌డే నిన్న ఢిల్లీకి వెళ్లారు. అయితే త‌న‌ను ఉన్న‌తాధికారులు పిలిపించార‌ని వ‌చ్చిన ప్ర‌చారాన్ని ఆయ‌న తోసిపుచ్చారు. మంత్రి త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌ను తిర‌స్క‌రిస్తూ కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు.

డ్ర‌గ్ కేసులో సాక్షి ప్ర‌భాక‌ర్ సెయిల్ త‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన త‌ర్వాత‌, ఇందులో త‌న‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా ఇరికిస్తున్నార‌ని ఆరోపిస్తూ ఆయ‌న ముంబై పోలీసుల‌కు లేఖ కూడా రాశారు.

ప్రైవేట్ ఇన్వెస్టిగేట‌ర్ కె.పి. గోసావి ప‌ర్స‌న‌ల్ బాడీగార్డున‌ని చెప్పుకుంటున్న ప్ర‌భాక‌ర్ సెయిల్‌, డ్ర‌గ్ కేసులో ఆర్య‌న్ ఖాన్‌ను త‌ప్పించ‌డానికి షారుక్ ఖాన్ మేనేజ‌ర్ నుంచి రూ. 25 కోట్లు డిమాండ్ చేయాల‌ని త‌న బాస్ ప్లాన్ చేశార‌ని ఆరోపించాడు.

భారీ మొత్తంలో రూ. 25 కోట్లు అడ‌గాల‌ని, ఆ త‌ర్వాత రూ. 18 కోట్ల‌కు సెటిల్ చేసుకోవాల‌ని గోసావి చెప్పార‌నీ, అందులో స‌మీర్ వాంఖ‌డే వాటా రూ. 8 కోట్లు అనీ త‌న అఫిడ‌విట్‌లో ప్ర‌భాక‌ర్ సెయిల్ పేర్కొన్నాడు. వాంఖ‌డే త‌న‌తో ప‌లు ఖాళీ పేప‌ర్ల‌పై సంత‌కం చేయించాడ‌ని కూడా అత‌ను ఆరోపించాడు. సీనియ‌ర్ అధికారి జ్ఞానేశ్వ‌ర్ సింగ్ ఆధ్వ‌ర్యంలో ఎన్సీబీ బృందం రేపు ముంబైకి వెళ్ల‌నుంది.