Facebook Twitter
“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” పదవ భాగం




“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” పదవ భాగం   
7 వ అధ్యాయం

nannayya.jpg

ఆదికవి నన్నయ

యుద్ధం సద్దు మణిగాక, అద్దంకి ప్రజలు సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు. రణమందు పోయిన ఏనుగులు పోగా మిగిలినవి ఢిల్లీకి కప్పం కింద తరలి వెళ్లాయి. సగం అశ్వబలం పోయింది. మరల అన్నీ సమకూర్చుకుని కోలుకోవడానికి ఐదారు వత్సరముల కాలం కావాలి.
   రాజు సజీవుడై వచ్చాడని ప్రాసాదంలో అందరూ ఆనందించారు.
   అక్కడక్కడా విషాద ఛాయలు తొలగలేదు.
   తమకు తోడుగా నీడగా ఉండి, మనుమలు మనుమరాండ్రనిచ్చి, వృద్ధాప్యంలో చేయూతనిచ్చి, తమని కడతేరుస్తారనుకున్న కొడుకులు కనిపించకుండా పోతే.. ఆ దుఃఖం తొలగడానికి జీవిత కాలం సరిపోదు.
   కానీ ఊపిరి ఉన్నంత కాలం బ్రతకాలి.. బ్రతికి ఏం సాధించాలి అన్నది వేరే విషయం.
   పెరుగుతున్న పసివారిని చూసి ఆనందించ వలసింది పోయి భయపడుతున్నారు సామాన్య ప్రజ. కాలం అక్కడే ఆగిపోతే ఎంత బాగుండును..
   పక్వానికొచ్చిన పండుని కోసుకుని తిన్నట్లు, నవయౌవనంలోనికి అడుగు పెట్టిన యువకులను సైన్యంలోకి తీసుకు పోతారు. ఎప్పటికప్పుడే, ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందా అని భయం..
   కాకతీయ చక్రవర్తి సామంతుడయ్యాడు.. సుంకాలు పెరిగాయి. సగం పైన ఆదాయం ఢిల్లీకి పయనం.. ఆచి తూచి ఖర్చుపెట్టాలి. నగలు, నాణ్యాల సంగతి సరే.. భుక్తికి లోటు లేకుండా జరుగుతే అంతే చాలు..
   స్తబ్దుగా సాగుతున్న కాలంలో సాహిత్యం మళ్లీ పుంజుకుంటోంది.
   ఎర్రన మహా భారతానికి నకలు చెయ్యడం మొదలు పెట్టాడు.
   రెండు నకళ్లు. ఒక ప్రతి, తాతగారి స్నేహితునికి, ఒకటి తనకి.
   నకలు చేస్తూనే తను అనుకున్న రామాయణ రచనకి ప్రణాళిక వేసుకుంటున్నాడు.
   యాంత్రికంగా కాకుండా రచనలోని అందాలను, పద్యాలలోని సొబగులను.. పదాల పొందికను, రచనా విధానాన్ని గమనిస్తూ, ఆనందిస్తూ చేస్తున్నాడు.

kavulu 2 copy.jpg
          

  ఎర్రన తాతగారు ప్రక్కనే కూర్చుని మందస్మిత వదనంతో మనవడి వేగాన్ని గమనిస్తున్నారు. గంటం కదిలిందంటే ఆగేది కొన్ని ఘడియల అనంతరమే.
    ఏ విషయంలో నైననూ సలహా అడుగుతే తయారుగా ఉంటారు. అలసి సొలసి కన్నులు మూస్తే తక్షణం ఆపెయ్యమంటారు.
   నన్నయగారి భారతం పూర్తి అవగానే, గుండె నిండుగా గాలి పీల్చి లేచాడు ఎర్రన. 
   "అద్భుతమైన రచన తాతగారూ! తెలుగులో ఇటువంటి కవిత్వం చదవలేదు నేనింత వరకూ. పలుకు మాటలు గా నున్న తెలుగు భాషకు గ్రాంధిక హోదా నిచ్చిన ఘనత ఆదికవి నన్నయ గారికే దక్కుతుంది. తొలుత ఇవ్విధమైన ప్రయత్నం చేయవలెనని ఎందుకనిపించిందో కానీ, అది తెలుగు వారు చేసుకున్న పుణ్యమే!"
   "దానికి చాలా రాజకీయ సాంఘిక కారణాలున్నాయి." ఎర్రపోతన సాలోచనగా అన్నాడు.
   "కవిత్వానికి రాజకీయ కారణాలా? కవి రాజకీయాలలో తల దూర్చడం చెప్పారు కానీ రాజకీయం కవిత్వంలో వేలు పెట్టడం.. అది తొలి ప్రముఖ తెలుగు రచనకి శ్రీకారం చుట్టడం ఆశ్చర్యకరమే!"
   "ఇంకేం.. ఆ కారణాలు రేపు తెలుసుకుందాం." నవ్వుతూ ఆసనం నుండి లేవబోయిన ముదిమి వయసు తాతగారికి చెయ్యందించాడు ఎర్రన, నవ యౌవన కాంతులతో మోము వెలిగి పోతుండగా.
                        ............................
  "మూడు నాలుగు శతాబ్దాల క్రితం, కొద్ది మంది అగ్రజాతుల వారికే పరిమితమైన మతము సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. అప్పుడు జైన తీర్ధంకరులూ, గౌతమ బుద్ధుడు మొదలైన వారు, ప్రజలందరికినీ ఆమోదయోగ్యమైన మత ధర్మాన్ని బోధించారు.
   ముఖ్యంగా స్త్రీలు ఆ మతాల్ని ఆమోదించి ఆదరించారు. రాజులు వైదిక మతాన్ని ప్రోత్సహించినా, ఆడవారు జైన, బౌద్ధ మతాలకు దానాలు చెయ్యడం, ఆరామాలు కట్టించడం చేశారు.
   సరిగ్గా మూడు వందల ఏళ్ల క్రితం వేంగి రాజ్యానికి రాజరాజు రాజయ్యాడు. అంతకు మునుపే, ఏడెనిమిది వందల వత్సరాల క్రితం, జైన బౌద్ధ మతాలు ప్రాచుర్యం పొంది నిలదొక్కుకున్నాయి. జనసామాన్యానికి అర్ధమయే భాషలో పాటలు, పద్యాలు ప్రచారమయ్యాయి. జనం ఈ మతాల వైపుకి తిరిగిపోతుంటే బ్రాహ్మణ్యానికి వేడి పుట్టింది.
   వైదిక మతాన్ని పునరుద్ధరించి, ప్రజలకు అందుబాటులోకి తేవాలనే సంకల్పం కలిగింది.
   మేధావులు కొందరు బౌద్ధ, జైన మతాలను క్షుణ్ణంగా చదివి వాటిని ఖండించ సాగారు. శంకరాచార్యులవారు బుద్ధుడిని, విష్ణుమూర్తి తొమ్మిదవ అవతారంగా చేసి, బౌద్ధ, హిందూ మతాల మధ్య గీతని చెరిపి వేశారు. ప్రజలు ఉభయతారకంగా ఉన్న శంకర వాక్కును శిరసావహించారు. సామాన్యుల దేవుడు రుద్రుడు పురాణాలకెక్కడం అంతకు మునుపే జరిగింది. శివపూజ వైదిక మతమయింది." ఎర్రపోతన ఇంచుక విరామమిచ్చాడు.. అలసటతో.
   "సమాజ పరిస్థితులను మార్చి, వ్యావహారిక భాషను లిపిలోనికి తీసుకురావడానికి జరిగిన ప్రయత్నమా?" ఎర్రన అడిగాడు.
   తల పంకించాడు ఎర్రపోతన.
   "చోళ చక్రవర్తుల దౌహిత్రుడు రాజరాజ నరేంద్రుడు. ఆ కాలంలో చోళ రాజ్యంలో శైవమతం విరివిగా వ్యాపించి ఆరాధనలందుకుంటోంది. అమ్మమ్మగారింట్లో రాజరాజుకి శైవమతం మీద అభిమానం పెరిగి, తల్లిదండ్రులు జైన మతస్థులైనా తాను శైవాన్ని స్వీకరించాడు. రాజ్యం కోసం సవతి తమ్మునితో జరిపిన పోరుల్లో బ్రాహ్మణులు సహాయపడ్డారు. అందుకని, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని ప్రోత్సహించే, వర్ణాశ్రమ ధర్మాలని నిలిపే మతాన్ని పునరుద్ధరించాడు.
   దానికి పంచమవేదం ప్రాచుర్యంలోనికి తేవడం తెలివైన పని. అందుకే దానిని మొట్టమొదట తెనిగించ దలచాడు రాజరాజు.
   అప్పట్లో విద్యా పరిషత్తులు ఉండేవి.. అంటే మహా కవుల సభలు. నన్నయగారు ఆరంభంలోనే ఈ సభలకు నమస్కరించి తన రచన మొదలు పెట్టారు."
   ఎర్రనకి తాను చదివిన భారతంలోని పద్యం గుర్తుకు వచ్చింది. ఏకసంథ గ్రాహి అయిన ఎర్రన వెంటనే అందుకున్నాడు,
   "సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకలితార్ధ యుక్తిలో
    నారసి మేలునా నితరు లక్షర రమ్యత నాదరింప నా
    నారుచిరార్ధసూక్తి నిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
    భారత సంహితా రచన బంధురుడయ్యె జగద్థితంబునన్."
   చిరునవ్వుతో తల పంకించి, వాత్సల్యంతో మనుమడిని చూశారు ఎర్రపోతన.
   "ఆ కాలం నాటికే గ్రంధాలు సంస్కృతాన్ని దాటి బయటికి వచ్చాయి. కన్నడంలో పంప భారతం, గదా యుద్ధం అనే మరొక కావ్యం భారతాన్ని ప్రచారంలోనికి తెచ్చాయి.
   తమిళంలో "వెణ్బా" అనే గీతాలలో భారతం సామాన్య జనానికి దగ్గరగా వచ్చింది.
   సంస్కృత భారతాన్ని దేవాలయాలలో పురాణాలుగా చెప్పేవారు. కర్ణభారం, ఊరు భంగం మొదలయిన భాసుని భారతంలోని నాటకాలు పాండవుల కథలను చిత్రించాయి.
   అందుకే రాజరాజు భారతం తెలుగులో కావ్యరూపంలో రావాలని, నన్నయభట్టును అడిగాడు. తమ చంద్రవంశంలోని పూర్వీకులైన పాండవులు జగత్ప్రసిద్ధులైనారు, వ్యాసమహర్షి కావ్యం ద్వారా! శ్రీ మహా భారతంలోని అంతరార్ధం వినాలని రాజరాజు వువ్విళ్ళూరాడు.
   ’బంగారు కొమ్ములున్న నూరు గోవులను, ఉత్తమ వేదపండితులకు దానమిచ్చిన ఫలం, భారతం వింటే కలుగుతుందని పెద్దలంటారు. కృష్ణద్వైపాయనుడు రచించిన మహాభారతంలోని అర్ధమును, పరమార్ధమును తెలిసేటట్లు మీరు ప్రతిభ చూపించి తెలుగులో రచించండి.’
   పౌరాణికులూ, కవితా విశారదులూ, తార్కికులూ, మంత్రులు, పురోహితులు, సేనాపతులు, దండనాయకులు, దౌవారికులు, ప్రధాని, సామంతులు మొదలుగాగలవారందరూ ఉన్న మహా సభలో నన్నయ భట్టారకుని కోరాడు రాజరాజ నరేంద్రుడు."
   ఎర్రన కన్నులు విప్పార్చి, సర్వమూ మరచి వింటూ, రాజరాజు సభని ఊహించుకుంటున్నాడు.
   "అత్యంత వైభవోపేతమైన ఆ సభలో అంతటి ప్రాధాన్యత లభించినందులకు నన్నయ భట్టారకుడు ఎంతటి పుణ్యం చేసుకున్నారో కదా!" పారవశ్యంతో అన్నాడు ఎర్రన.
   "నిజమే.. కానీ, రాజరాజు తన రాజ్యాన్ని, ఆ వైభవాన్ని పొందగలగడానికి నన్నయభట్టు గారి పాత్ర కూడా చాలా ఉంది."
   "తిక్కనార్యుడు ఓరుగల్లుకు పయనమయినట్లేనా?" ఎర్రన మోములో చిరునవ్వు.
   "అవును. రాజుల పేర్లు మారవచ్చు, కాలం ముందుకు జరవచ్చు.. కానీ, చరిత్ర కొంచెం అటూ ఇటూగా ఒక్కటే. బంధువుల దునిమి రాజ్య సంగ్రహణం చెయ్యడం అనాదిగా వస్తున్నదే. వేంగి చాళుక్యులలో విమలాదిత్యుని మరణం తరువాత రాజరాజు రాజ్యానికి వచ్చాడు.
   అయితే సవతి తమ్ముడు విజయాదిత్యుడు అందుకు అడ్డు వచ్చాడు. రాజరాజుని ప్రశాంతంగా పరి పాలన చెయ్యనియ్యలేదు.
   కర్ణాటకుల, కళింగ గంగారాజుల సహాయంతో వేంగీ సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. నిస్సహాయ స్థితిలో రాజరాజు, మేనమామ అయిన చోళ చక్రవర్తిని సహాయం అర్ధించాడు.
   మేనల్లుని దుస్థితి చూసి జాలిపడ్డ చోళ చక్రవర్తి తన సైన్యాన్ని రెండు భాగాలు చేసి, ఒక పాయని కర్ణాటక రాజులైన రాష్ట్రకూటుల మీదికి, ఇంకొక భాగాన్ని వేంగి దేశం మీదికి పంపాడు.
   చోళ సేనాని, విజయాదిత్యుని వెళ్లగొట్టి, సింహాసనాన్ని రాజరాజుకి అప్పగించాడు. కానీ పదేళ్లు కూడా గడవక ముందే విజయాదిత్యుడు కర్ణాటకుల సహాయంతోనే అన్నగారిని పదవీచ్యుతుణ్ణి చేసి బెజవాడ సింహాసనం మీద కూర్చున్నాడు.
   మళ్లీ తంజావూరికి పలాయనం తప్పలేదు రాజరాజుకి.
   ఈ సారి చోళరాజు ముగ్గురు దండనాయకులతో పెద్ద సైన్యాన్ని వేంగి మీదికి పంపాడు. దండనాయకులు మరణించినా రాజరాజు రాజ్యం దక్కించుకున్నాడు.
   పదేళ్లు గడవకుండా చరిత్ర పునరావృతం అయింది.
   కర్ణాటకులు తాము వేంగీ పురాధీసులమని ప్రకటించుకున్నారు. రాజరాజు, వేంగిలో కొంతభాగంతోనే తృప్తి పడవలసి వచ్చింది.
   ఈ సారి మేనమామ, మామగారు అయిన చోళరాజు మరణించడంతో బావమరది సహాయానికి వచ్చి, సింహాసనం ఇప్పించాడు. పట్టువదలని పగవాడైన తమ్ముడు.." తాతగారిని ఆపేశాడు ఎర్రన.
   "మళ్ళీ కర్ణాటకులు.. సింహాసనం. హూ.. ఇప్పటికి నాలుగు దండయాత్రలయ్యాయి తాతా! ఎంత జననష్టం అయుంటుందో.. ఊహ కేమాత్రం అందడం లేదు. ఇంతా చేసి అన్నదమ్ముల మధ్య పేచీలు. చెరోసగం పంచుకుంటే పోలేదా!" ఎర్రన నిట్టూర్చాడు.
   "అలా కౌరవులు అనుకుంటే భారత యుద్ధం లేదు.. వ్యాస భారతం లేదు. నన్నయ తిక్కనలు లేరు. మనము ఇవ్విధంగా కథలు చెప్పుకునే వాళ్ళం కాదు. జన నష్టం సృష్టిలో భాగమే.
   ఇంతకీ..
   ఈ నాలుగో యుద్ధంలోనే రాజరాజ నరేంద్రుని కుల గురువైన నన్నయభట్టు ప్రవేశించాడు. చోళరాజు ఈ మారు సహాయానికి రాలేదు. అప్పటికే చాలా సైన్యాన్ని కోల్పోయి ఉండాలి. ఉద్దండులయిన దండనాయకులు చెల్లెలి కాపురం కోసం ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఉదాసీనంగా ఉండిపోయి ఉంటాడు.
   వాణస నారాయణ భట్టు, నన్నయ భట్టు బాల్య స్నేహితులు. నారాయణ భట్టు దగ్గరి బంధువైన మధుసూనయ్య, పశ్చిమ చాళుక్యులకు ప్రధానామాత్యుడు. ఈ పరిచయాన్ని ఉపయోగించుకుని నన్నయ, రాజరాజుకు పశ్చిమ చాళుక్యులకు మైత్రిని కుదిర్చాడు.
   నారాయణ భట్టుని పశ్చిమ చాళుక్యుల ప్రతినిధిగా తమ రాజ్యానికి ఆహ్వానించాడు రాజరాజు.
   కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఉన్న బెజవాడ నుండి రాజధానిని, గోదావరీ నది ఆవలి ఒడ్డునున్న రాజమహేంద్ర వరానికి మార్పించాడు. రాజరాజు పేరు మీదనే ఆ పురి వెలిసింది.
   పశ్చిమ చాళుక్యులతో సంధి చేసుకోవడం, రాజధాని మారడం రాజరాజుకు శాంతినిచ్చింది. విజయాదిత్యుని బెడద కూడా తాత్కాలికంగా తప్పింది.
   ఆ సమయంలోనే అంగరంగ వైభవమైన సభలు నిర్వహించడం.. సాహిత్యం మీద దృష్టి నిలపడం జరిగింది. భారత రచనావిర్భావం కూడా అప్పుడే జరిగింది.
   నారాయణ భట్టు రాజకీయం నడపడంలోనే కాదు. రచనా వ్యాసంగంలో కూడా నన్నయగారికి తోడు నీడగా నిలిచాడు. సంస్కృత, కర్ణాటక, ప్రాకృత, పైశాచికాంధ్ర భాషల్లో ప్రావీణ్యమున్న నారాయణ భట్టు, కవీభవజ్రాంకుశ బిరుదాంకితుడు. మహాభారత సంగ్రామంలో, శ్రీ కృష్ణుడు, అర్జునునికి తోడ్పడినట్లు భారత రచనలో నన్నయకు తోడ్పడ్డాడు.
   తొలి తెలుగు రచన ఆరంభమయింది ఆ విధంగా."

   "తిక్కన సోమయాజిగారి భారతం ప్రారంభించే ముందు, నన్నయగారి రచన గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి." ఆ రో్జు ద్వాదశి. ఏకాదశి ఉపవాసానంతరం భోజనం చేసి, చెయ్యి కడుక్కోవడానికి లేస్తూ అన్నాడు ఎర్రపోతన.
   "నకలు తయారు చేస్తున్నప్పుడే కొంత అవగాహన అయింది తాతగారూ.." తాతగారికి చేతి మీద నీళ్ళు పోస్తూ, అంటుకున్న ఎంగిలి మెతుకుల్ని తన చేత్తో గట్టిగా రుద్ది తీశాడు ఎర్రన.
   చేతుల్ని అంగవస్త్రంతో అద్దుకుంటూ ఆలోచనలో పడ్డాడు ఎర్రపోతసూరి.
   తను అనుకున్నది ఎర్రాప్రగడ సాధించాలంటే నన్నయ, తిక్కనల కవిత్వం మీద అవగాహన సరిపోదు. అధికారము కావాలి. అనుకోకుండా తన మనసులోకి ఎర్రాప్రగడ అని వచ్చిందే.. అదే కాబోయే మహాకవి పేరు.. నిశ్చయించేశారు తాతగారు.
   "నన్నయగారు తొలిసారిగా అంతటి ఉద్గ్రంధాన్ని తెలుగులో రచించడానికి పూనుకున్న తక్షణం భాష మీద పరిశోధన ప్రారంభించారు." ఎర్రపోతన గొంతు సవరించుకున్నాడు.
   తాతామనుమలిద్దరూ తమ తమ ఆసనాలనలంకరించారు. ఎర్రన తను తెలుసుకున్న విషయాలు లిఖిత పూర్వకంగా భద్రపరచుకోవడానికి తాళపత్రాలు, గంటం సిద్ధం చేసుకున్నాడు.
   "భాషా ఛందస్సులు సమకూర్చుకోవడానికి కూడా కష్టపడవలసి వచ్చిందని కొందరు సమకాలీన పండితులు సెలవిచ్చారు. అది నిజమనుకోను.. ఆయనకి భాష మీదున్న పట్టు తెలిసినవాడై రాజరాజు ఆ కోరిక కోరాడని నా అభిప్రాయం.
   ప్రజల వ్యాహారిక భాషను, శాసనాదులలో నున్న దేశ్య భాషను పరిశీలించి అందుండిన పలుకులకు, వాని శబ్దములకు ఒక రూపము ఇచ్చుటకు ప్రయత్నించాడు. అస్తవ్యస్తంగానున్న తెలుగు శబ్దములకు ఒక వ్యవస్థనిచ్చాడు కనుకనే నన్నయగారికి "శబ్దశాసన" అనే బిరుదు లభించింది. ఇదంతా భారత రచనకి పూర్వమే జరిగింది.
   ఆ కాలంలో ఒకే మాటను వివిధప్రాంతాలవారు రకరకాలుగా ఉఛ్ఛరించే వారు. నన్నయగారు సహజంగా తాము ఉచ్చరించేటట్లే వ్రాశారు. అదే మనకు కావ్య భాషగా మిగిలింది.
   కొన్ని సంస్కృత పదాలు, తెలుగు మాటలను ప్రక్కకు త్రోసి వాని స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. సంస్కృత సమపదాలు వాడుకలోనికి వచ్చాయి.
   అయినా నన్నయగారు తమ కాలంనాటి వ్యావహారిక భాషలోనే రచన చేశారు. ఆనాటి సామెతలు, పలుకుబళ్ళు చిరస్థాయిగా నిలిచేవే.
   ’కడుపు చల్లగ’ అనే పదం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ పలుకుబడి తెలుగు భాష జీవించినంత కాలం ఉంటుంది.
  ”కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుడు" అని కర్ణుడ్ని గురించి నన్నయగారు వ్రాశారు.
   రొమ్మున చేయిడి నిద్రవోవుట, వంట ఇంటి కుందేలు ఓలె.. మొదలయిన నుడికారాలు చిరకాలము నిలిచిపోయేవే.
   మాటలు, పలుకులు.. వాని తీరులు మారవచ్చును కానీ మానవస్వభావం మాత్రం మారదు. పాత్రల లక్షణాలు కావ్యారంభం నుంచీ చివరి వరకూ ఒకే విధంగా ఉంటాయి. అందుకే పాత్రను పరిచయం చేసే టప్పుడే ఆ స్వభావానికి సంబంధించిన విశేషణాలను వాడారు. పాత్రలు పరస్పరం సంబోధించే విధానంలో కూడా స్వభావం బయలుపరచారు.
   ద్రోణుడు మాట తప్పని వాడు, అనృతం ఆడనివాడు. అర్జునుడికి విలువిద్య నేర్పే ముందు ఎవరూ నీ సాటి లేనట్లు నేర్పుతానని మాట ఇచ్చారు. ఏకలవ్యుడ్ని చూసిన అర్జునుడు అతని విద్యాపాటవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ద్రోణుడిని కలిసి ఏకలవ్యుడిని గురించి చెప్తాడు.
   "విలువిద్య నొరులు నీ క
   గ్గలముగ లేకుండ నిన్ను గరపుదునని మున్
   పలికిరి... కానీ ఇప్పుడు ఆ స్థితి మారునట్లు కనిపిస్తోంది.
   నాకంటెను మీకంటెను అతడు ధనువిద్యా కౌశలములో నధికుడు. మీకు ప్రియశిష్యుడట యమిథ్యా వచనా!"
   ఇక్కడ అమిథ్యావచనా అనే సంబోధన గురువుగారిని "మీరు అబద్ధాలాడరు సుమా.. మాట నిలుపుకునే ప్రయత్నం చెయ్యండి" అని హెచ్చరించుట కనిపిస్తుంది.
   అదే విధంగా, ఖాండవ దహనానికి ముందు అగ్నిహోత్రుడు విల్లును ఇస్తూ అర్జునుడిని ’ఘనభుజా’ అని సంబోధిస్తాడు. భుజబలం అధికంగా ఉన్నవాడు మాత్రమే ఆ విల్లుని ధరింపగలడు, ప్రయోగింపగలడు అనే అర్ధం ఆ ఒక్క పిలుపులోనే తెలిసిపోతుంది."
   ఎర్రన తాతగారు చెప్పినది శ్రద్ధగా విన్నాడు. తండ్రి సూరనార్యుని వద్ద కావ్యరచనలోని మెళకువలు నేర్చుకుని ఉన్నవాడు.. శబ్ద ప్రయోగాలలోని చమత్కారాలను నన్నయ భట్టారకుని రచనా విధానాన్ని గమనించి తెలుసుకుంటుంటే ఆశ్చర్యానందాలతో ఒడలు మరచి వినసాగాడు.. మున్ముందు రాబోయే విశ్లేషణలు ఇంకా ఎంత కర్ణానందకరంగా ఉంటాయో!

(చిత్రాలు కమల పర్చా గారి సౌజన్యంతో)
                         

……… ( ఇంకా వుంది) ………..

 

 

 

 

.... మంథా భానుమతి