Facebook Twitter
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 4

 

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 4


మరునాడు కృష్ణానది దాటాలి. మేనాలూ, బోయీలూ కిట్టమ్మకీవల ఒడ్డునే ఆగిపోయారు. బోయీలు పేరు పేరునా వీడ్కోలు చెప్పారు.
   "అయ్యవారూ! మీతో గడిపిన ఈ రెండు దినాలూ క్షణాల్లా గడిచాయండి. అందరూ మీ వలె ఉంటే మాకు మేనా బరువే ఉండదండి.. ఎన్నో విషయాలు నే్ర్చుకున్నాం కూడా మేం.."
   మితాహారంతో, పని పాటలతో చక్కని సమ శరీర సౌష్టవంతో ఉన్న సూరనాదులకి వాహకులుగా ఉండడం ఆనందాన్నిచ్చింది వారికి. మేనా సమతుల్యానికి కూడా ఏ మాత్రం భంగ పాటు రాలేదు.
   దారంతా సూరన్న భాగవత కథలు చెప్తూనే ఉన్నాడు. వాతావరణం ఆహ్లాదంగా ఉన్నప్పుడు మేనాకున్న కప్పు తొలగించారు.
   రౌతులు, గుర్రాలు వేరు వేరు నావల్లో, సూరనాచార్యుల కుటుంబాన్ని సౌకర్యంగా నున్న నావలో దాటించారు.
   కొత్త మేనాలు.. కొత్త బోయీలు. అదేం చిత్రమో.. వాహకులందరూ ఒకే రకమైన శరీరాకృతితో ఉన్నారు. వారందరి శ్రమా ఒక్కటే కదామరీ అనుకున్నాడు సూరన్న. మోముల చిరునవ్వులూ.. కన్నుల పరవళ్లు తొక్కే ఉత్సాహం అదనపు అలంకారమయింది వారికి.
   "బాబూ నరసింహా! మంగళగిరి ఇచ్చటికి ఎంత దూరం?" ఎర్రపోతన్న సందేహిస్తూ అడిగాడు నరసింహ సేనానిని.
   "ఒక యోజనం పైన ఉంటుంది బాబుగారూ.."
   "అంటే మధ్యాహ్న వేళ అవుతుంది. కుదురుతుందో లేదో.." గొణుక్కుంటూ మేనా ఎక్కాడు ఎర్రపోతన. ఆ నారసింహుని దయ ఏ విధంగా ఉంటుందో..
   సూరన్న సతీమణి పోతమ్మ శిరోభారంతో వణికిపోతోంది. ఆమెకి ఏటి గాలి పడదు.. భార్య చెవుల మీది నుంచి నుదిటిని కప్పుతూ పలుచని బట్టని గట్టిగా కట్టి, పల్లకీలో ఆనుకోనుటకు వీలుగా మెత్తలమర్చి, కళ్లు మూసుకుని వెనుకకు వాలి కూర్చోమన్నాడు సూరన్న. కన్నుల మీదుగా వైద్య మూలికలు కలిపిన పాలాస్త్రి పట్టీ వేశాడు. అతని గురుకులంలో ప్రాధమిక వైద్యం కూడా ఒక భాగమే.
   పోతమ్మ నిస్త్రాణగా సోలిపోయింది. ఆదిత్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. బోయీలు రొప్పుతూ అక్కడక్కడున్న చెట్ల నీడల్లో పరుగు పెడుతున్నారు.
  "బాల ప్రహ్లాదుని కనికరించి బ్రోచిన నారసింహా!
   మమ్ము కరుణించి నీ దరికి తోడుకొని పొమ్మా!
   మార్తాండుని కాస్త తీవ్రత తగ్గించుమనుమా
   మానిని బాధను తొలగించి మమ్మద్దరికి చేర్చుమా."
   కన్నులు మూసుకుని తన ఇష్టదైవాన్ని ప్రార్ధిస్తున్నాడు ఎర్రపోతన. మనసారా..
   ఆలయం ప్రక్కనుండి వెడుతూ కూడా దర్శించుకోలేడా.. అంతటి దురదృష్టవంతుడా తను. అవును.. ఆయనే రప్పించుకోవాలి కానీ మనం అనుకుంటే వెళ్లగలమా?
   “లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం.. దేహి దేహి..”
   సూరన్న ఆరారా నోటికి అందిస్తున్న తేనె, మంచి తీర్థం పోతమ్మకి శక్తినిచ్చి, నీరసాన్ని పోగొట్టాయి.
   అక్కడా అక్కడా తారాడుతున్న మేఘాలు ఒక చోట చేరి, సూర్యునికీ బాటసారులకీ మధ్యనొక తెర నేర్పరచాయి. ఉన్నట్లుండి చల్లని గాలి నెమ్మదిగా వీస్తూ.. బోయీల స్వేదాన్ని చల్లపర్చి హాయి కలిగిస్తోంది. అశ్వాలు కూడా హుషారుగా వేగం పెంచాయి. అనుకున్న సమయం కంటే ముందుగానే మంగళగిరి చేరారు.
   నరసింహ సేనాని ఊరిలోనికి దారి మళ్లించి, ఆలయం వద్ద మేనాలని దింపించాడు.
   ఆలయ ద్వారాలు తెరిచే ఉన్నాయి. అనుకూల వాతావరణంతో అనుకున్న సమయం కంటే త్వరితమే రాగలిగారు.
   ఎర్రపోతన కన్నులు మూసుకునే ఉన్నాయి. పేరమ్మ మేనా లోనుంచి బయటికి వచ్చింది.
   పోతమాంబ కూడా తలకున్న పట్టీ తీసివేసి నవ్వుతూ నిలుచుంది. శిరోభారం మటుమాయం. మలయపవనాలు సేద తీరుస్తున్నాయి.
   సూరనార్యుడు గట్టిగా నిట్టూర్పు విడిచి మేనాలో మెత్తలు సరుదుతున్నాడు.
  "స్వామీ!" నరసింహ సేనాని ఎర్రపోతనగారి వద్దకేగి గట్టిగా పిలిచాడు.
   కన్నులు తెరిచిన ఎర్రపోతన వెలుపలికి రాగానే ఆశ్చర్యంతో కన్నులు పెద్దవి చేశాడు.
   తన ఆరాధ్య దైవం.. లక్ష్మీ నారసింహుని ఆలయం..
   కన్నుల ధారగా నీరు, ఆనందంతో. కాళ్లు, చేతులు వణుకుతుండగా ఆలయంలోనికి నడిచి, కాళ్లు, చేతులు, ముఖము ప్రక్షాళన గావించి ముకుళిత హస్తాలతో నారసింహుని దివ్యమంగళ విగ్రహం ముందు నిలిచాడు. కుటుంబమంతా ఆయన వెనువెంటే..
   యుధిష్ఠరుడు వనవాసంలో నున్నపుడు స్వయంగా ప్రతిష్ఠించిన విగ్రహం.. భానుమండలతేజోవిరాజితమై సమస్త భక్తుల ఈప్సితముల్తీర్చ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అచ్చట వసిస్తున్నచందాన కాంతులీనుతోంది.
   పరిసరాలు మరచి ఎర్రపోతన తదేకదృష్టితో.. కన్నులార కాంచుతూ స్తుతించసాగాడు.
   కమలాక్షు నీ చరణ కమలముల నే వ్రాలితి నీ కర
   కమలాల నా కభయమిచ్చి బ్రోచుటకు నన్ను నీ
   సమక్షమునకున్ రప్పించితివి నిరతము నిను భవదీ
   యు మదిన్ నిలిపి కొలుతు నన్ను రక్షింపవే నారసింహా!
   ఆ విధంగా మై మరచి ఎంత సేపుండిపోయేవాడో.. పూజారి వచ్చి, ఆలయం మూసే వేళయిందని గర్భగుడి తలుపులు వెయ్యకపోతే!
   తెలివి తెచ్చుకుని, అటూనిటు చూడగా.. ఆనందోత్సాహములతో కొడుకు, కోడలు, భార్య కాన వచ్చారు. దివ్యమంగళ నారసింహుని దర్శనం ఎవరికి మాత్రం సంతోషం కాదు..
   గుడి ప్రక్కనే ఉన్న అన్న సత్రంలో భక్తులందరికీ ప్రసాదాలు కడుపారగా కమ్మగా వితరణ చేశారు.
   "నేను మధ్యాన్న ప్రసాదానికి ఇచ్చటికి వద్దామనే ప్రణాలిక రచించాను స్వామీ.. కానీ ఆ ప్రహ్లాదవరదుడి ఆహ్వానం లేకుండా మనమిచ్చటికి అడుగిడలేము. అందుకే మిన్నకుండిపోయాను.
    ఆ స్వామి దయ కలిగింది.. ఎండ తీక్షణత తగ్గింది.. ఆలయం మూసి వెయ్యక ముందే రాగలిగాము. మీకు ఆనందం కలిగించినందుకు నేను పొంగి పోతున్నాను. ఇంక మనకి అడ్డే ఉండదు. అనుకున్నట్లుగా వారంలోగా గుడ్లూరు చేరగలమని చెప్పగలను." నరసింహ సేనాని నవ్వుతూ సెలవిచ్చాడు.

   మేనాలు, అశ్వాలు నెమ్మదిగా సాగుతున్నాయి. దారి కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది.
   "స్వామీ!" నరసింహ సేనాని మేనా ప్రక్కకి వచ్చి ఎర్రపోతనని పిలిచాడు.
   తెర పక్కకి తొలగించి చూశాడు ఎర్రపోతన.
   "మీరు పంచాయతనం తేవాలి అంటూ వెనక్కి వెళ్లారు కదా.. అంటే ఏమిటి స్వామీ? పూజా గృహంలో ఉంటుందని తెలుసు.. దేవతార్చన చేస్తారని తెలుసు.. మీరు కృష్ణా తీరంలో మనం ఆగినప్పుడు కూడా పూజ చేశారు."
   ఎర్రపోతన అభిమానంగా చూశాడు. కుతూహలమున్న శ్రోత దొరుకుతే ఏ వక్తకైనా సంతోషమే. గంభీర కంఠంతో మొదలు పెట్టాడు. అప్పుడప్పుడు విన వచ్చే పక్షుల కూతలు, వీచే గాలి శబ్దం తప్ప వాతావరణం ప్రశాంతంగా ఉంది.
   "పంచాయతనం అంటే ఐదుగురు దేవతా మూర్తులున్న పీఠం. ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, పరమేశ్వరుడు. మూర్తులంటే విగ్రహాలు కావు. ఆయా దేవతలకు ప్రతిరూపాలుగా భావించే శిలలు.
   ఆదిత్యుడికి ప్రతి రూపం స్ఫటికం. గోళీకాయంత ప్రమాణంలో ఉండే స్ఫటికం సూర్యునిగా పూజలందుకుంటుంది.
   అంబికకు ప్రతిరూపం నాపరాయి వలే ఉంటుంది. ఇందులో సువర్ణం ఉంటుందంటారు. కొన్ని నాపరాళ్లలో బంగరు రంగు గీతలుంటాయన్నది విదితమే కదా! దీనిని చంద్రశిల అంటారు.
   విష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడని అందరికే తెలిసిన విషయమే. ఇందులో జీవశక్తి ఉంటుంది. ఈ సాలగ్రామాలు ఉత్తరాన, హిమాలయాల్లో ప్రవహించే గండకీ నదిలో లభ్యమౌతాయి.
   గణపతి జేగురు రంగులో ఉండే శిలలో ఉంటాడు. ఇవి శోణా నదిలో ఉంటాయి. శోణం అంటే ఎరుపు, లేదా అగ్ని వర్ణం. శోణానది మైనాక పర్వతంలో పుట్టి గంగలో కలుస్తుంది. ఈ నదిలో లభించే శిలలను శోణభద్ర వినాయక మూర్తులని అంటారు.
   మహేశ్వరుడు బాణలింగ రూపంలో పూజలందుకుంటాడు. ఇది కూడా చిహ్న రూపమే. బాణలింగాలు నర్మదా నదిలో లభిస్తాయి. ఇవి శివలింగాకృతిలో ఉంటాయి.
   నువ్వు చెప్పినట్లుగా పంచాయతనం, పూజాగృహాల్లోనూ, దేవతార్చనా మందిరాల్లోనూ ఉంటుంది. కొన్ని గర్భగుడుల్లో కూడా ఉంటాయి. కానీ గుళ్ళల్లో ఉన్న పంచాయతనంలో విగ్రహాలుంటాయి. తిరుమలలో, శ్రీశైలంలో, కాళహస్తిలో, పంచాయతనాలు లేవు.. మూల విరాట్ఠులు మాత్రమే ఉంటారు. గృహస్థులు ఎచటికేగినా పంచాయతనాన్ని తమ వెంట తీసుకుని వెళ్లి పూజలు చెయ్యాలి. మధ్యలో ఉన్న శిలను బట్టి పంచాయతనానికి పేరు ఉంటుంది.
   మాది విష్ణుపంచాయతనం. అంటే సాలగ్రామం మధ్యలో ఉంటుంది.
   నాలుగు తరాలుగా ఈ పంచాయతనం మా గృహంలో ఉంది. మా ముత్తాతగారు రాజుగారివెంట గంగాతీరానికి వెళ్లి, దారిలో ఒక్కో నదిలో ఒక్కొక్క పవిత్రశిలని తీసుకొచ్చారు. అప్పటినుంచీ పూజలందుకుంటోందీ పంచాయతనం."
   "చాలా చక్కగా సెలవిచ్చారు స్వామీ! బాగా అర్ధమయింది." నరసింహుడు వేగం పెంచాడు.. రహదారి సమతలం అవడంతో.
 
   గుంటూరు సీమ దాటి వెళుతుంటే.. నిర్జీవమైన కొన్ని పల్లెలు కనిపించాయి.
   పేరమ్మ తెరతొలగించి చూసింది. జనహీనమైన వీధులు, ఎండిన పంట పొలాలు.. కూలిపోవడానికి సిద్ధంగా నున్న కొంపలు. ఎక్కడ చూసినా తుప్పలు, ముళ్ల చెట్లు.. పిశాచాల నివాసం లాగ ఉన్నాయి ఆ పల్లెలు..
  "ఏమిటండీ ఇది? ఇంతటి విధ్వంసం ఎప్పుడయింది?"
   "పలనాటి యుద్ధ ప్రభావం అది. వీర శైవ, వైష్ణవ మతాల మధ్య రగిలిన కార్చిచ్చు. ఒక ఆడదాని పంతంతో సర్వ నాశనమైన రాజ్యావశిష్టాలివి. మహాభారత యుద్ధం వలెనే దాయాదుల కార్పణ్యాలకి బలైపోయిన సామాన్యప్రజల ఆక్రందనలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. చరిత్ర పునరావృతమవుతుందంటారు చూడు.. ఆ విధంగానే జరిగింది." ఎర్రపోతన నిట్టూర్చారు గద్గద స్వరంతో.
   "అవునవును.. విన్నాను. మా ముత్తాతగారు ఆ యుద్ధంలోనే పోయారుట. మలిదేవుడికి కుడి భుజంలా ఉండేవారుట."
   "ప్చ్.. నిజమే. మహాభారత యుద్ధానికి మూలం మాయా జూదం.. పలనాటి యుద్ధమునకు కారణం కోడి పందాలు. అక్కడ వనవాసం.. ఇక్కడ రాజ్య బహిష్కరణ. కలి ఇంకా ప్రవేశించలేదు కనుక అక్కడ రాయబారిని చంపలేదు.. పైగా కృష్ణపరమాత్మ కద. ఇక్కడ రాయబారానికి వెళ్లిన అలరాజుని విషం పెట్టి చంపేశారు. అక్కడ అభిమన్యుడు, ఇక్కడ బాలచంద్రుడు."
   "భూ భారం తగ్గించడానికేనేమో.. ఈ యుద్ధం కూడా.." పేరమ్మ ఆవేదనగా అంది.
   "నిజమే... చుట్టుపక్కల రాజులంతా ఏదో ఒక పక్షం చేరి పోరుసలిపి పోయారు. అదే ఇక్కడి చాళుక్యుల పతనానికి నాంది అయింది. ఒక తరం తరం అంతరించిపోయింది."
   "ఏమిటో ఈ యుద్ధాలు, రాజ్య దాహాలు.. ఇప్పుడు మాత్రం.. కాకతీయ గణపతిదేవుడు ప్రశాంతంగా రాజ్యం ఏలగలిగాడా? ఎన్నో ఏళ్లు కారాగారంలో మగ్గి బయటికి వచ్చాడు. ఎన్నో యుద్ధాలు చేసి.. ఎందరో అసువులు బాసాక రాజ్యం స్థాపించాడు. కూతుర్నే కొడుకులా పెంచి రాజ్యం అప్పగించాడు. ముసలితనంలో.. చివరి యుద్ధంలో ఓడిపోయాడు. రుద్రమదేవి మాత్రం.. నిరంతరం రణాలే. ఇప్పుడు కూడా అంబయతో నడుస్తోంది. ఇన్నిన్ని యుద్ధాలతో కూడా రాజ్యం సుభిక్షంగా ఉంటోంది. ఏమవుతుందో ఏమో.." పేరమ్మ సిగ్గుపడింది.. ఎర్రపోతన దీర్ఘంగా తనవంకే చూస్తుంటే.
   "ఈ విషయాలన్నీ నీకు బాగానే తెలిశాయే.."
   "ఏదో.. మీరు మాట్లాడుకుంటుంటే విని, ఏటి దగ్గర చర్చించుకుంటుంటాము. అందులో రుద్రమదేవి మాకు.."
   "ఆదర్శం కదూ! నయం యుద్ధనీతులన్నీ వంటింట్లో చూపట్లేదు." పరాచకమాడాడు ఎర్రపోతన.
   "ఆలాగే! మరి ఆ చాతుర్యమంతా చూపుతుండబట్టే.. ఇంత కాలం ఇల్లు నడిచింది." పేరమ్మ ఏ మాత్రం తీసిపోలేదు.
   నిజమే.. అన్నట్లు నిట్టూరుపు విడిచాడు ఎర్రపోతన్న. ఎర్ర ఏగాని సంపాదనలేదు.. ఇంచుమించు ఏడాదిగా. ఏ విధంగా రెండు పూటలూ నాలుగు వేళ్లూ నోటికి చేరాయో.. ఇల్లాలి చాకచక్యమే
   అంతా స్త్రీ శక్తి నైపుణ్యం.
   ఓదార్పుగా.. నేనున్నా మీకు అన్నట్లుగా చేతి మీద చెయ్యి వేసింది అర్ధాంగి.
                                …………………
                                      అధ్యాయము-2
                                          
   "స్వామీ! ఇదియే తమ నివాస గృహము. ఇందు సమస్త సౌకర్యములు మాకు తెలిసినంతలో కలుగ జేశాము. ఈ గుడ్లేరు తటాకములతో, ఆలయములతో.. పచ్చని తోటలతో కన్నుల పండువలా ఉంటుంది. ఇచ్చటి జనులు పుణ్య చరితులు. మీరు ఇచ్చోట సుఖంగా ఉండగలరు.  మరింకేమైనా కావలసిన మీకొసంగవలెనని ప్రభువుల వారి ఆజ్ఞ." నరసింహుడు గుడ్లూరులోని ఒక ఇంటి వద్ద మేనాలని ఆపించి, సూరనకి విన్నవించాడు.
   "మరి రాజకీయ పరిస్థితి.." సూరన్న ఆందోళనగా అడిగాడు.
   "అవును స్వామీ! అనిశ్చితంగానే ఉంది. రాణీ రుద్రమదేవి స్త్రీ పాలన సహించలేని సామంతులతో, దాయాదులతో యుద్ధం చెయ్యవలసి వచ్చింది. అదే సమయంలో దేవగిరి రాజు దండెత్తాడు. గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నమయ్య మొదలగు సేనానుల సహాయంతో ఆ ఆపదని అధిగమించింది.
   అంతలో తూర్పున గంగ నరసింహుడు వేంగి సీమని ఆక్రమించాడు. అయితే పోతినాయక, ప్రోలి నాయకులు గంగ రాజుని ఓడించి తిరిగి కాకతీయ రాజ్యాన్ని స్థాపించారు.. తూర్పున. మరల దేవగిరి యాదవుడు.. అతన్ని ఓడించడం.. దక్షిణాన పాండ్యుల విజృంభణ.
   వల్లూరు రాజ్యం మాత్రం పాండ్యుల నుంచి కాకతీయుల వశమయింది. త్రిపురాంతక దేవుడు సామంతుడుగా ఉన్నంత కాలం బాగా ఉండేది. అతని తరువాత వచ్చిన అంబదేవుడే ప్రస్థుతం కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. చీటికి మాటికి యుద్ధాలే. రాణీగారు స్వయంగా అశ్వారూఢ అయి యుద్ధ రంగానికి వెళ్తున్నారు."
   "మరి అద్దంకి ప్రభువుల ఆస్థానంలో యుద్ధ వాతావరణం ఏ విధంగా ఉంది?" ఎర్రపోతన అడిగాడు.
   "ఈ యుద్ధం అద్దంకి నాయంకరానికి దూరంగా జరుగుతున్నట్లుంది. ప్రతాపరుద్ర చక్రవర్తికి రాజ్యం అప్పగించి, రాణీగారు సైన్యాన్ని నడుపుతున్నారు. తొందరలోనే సమాప్తి అయే అవకాశాలు కనిపిస్తున్నాయి."
   అప్పటికే ఎక్కువ మాట్లాడేశాననుకుని నరసింహుడు సంభాషణ ముగించి, సూరనాదులకి ఇల్లు చూపించడానికి ముందుకి నడిచాడు.

……… ( ఇంకా వుంది) ………..

(చిత్రాలు- కమలా పర్చా గారి సౌజన్యంతో)
.... మంథా భానుమతి