Facebook Twitter
చొక్కాపు వెంకట రమణ

 

చొక్కాపు వెంకట రమణ

                                                                                       
         తెలుగులో బాలసాహిత్యానికి అతనొక చిరునామా... పిల్లలే నా ప్రపంచం అని ప్రకటించుకున్న బాలసాహితీ వేత్త. చిన్నారుల ఊహల్ని, కలల్ని తన రచనల్లో ప్రస్తావిస్తూ, వారిలో విజ్ఞానం, వినోదం, ఆశావాద దృక్పథం, నీతి, మానవీయత వంటి లక్షణాలను పెంపొందిస్తున్న బాలబంధువు చొక్కాపు వెంకట రమణ. బాలల వికాసమే తన మార్గంగా, పిల్లల ప్రపంచమే తన ప్రపంచంగా జీవిస్తున్న రచయిత ఆయన. కేవలం పిల్లల కోసమే సాంస్కృతికి కార్యక్రమాలు, సదస్సులు, రచయితల సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకే ఆయనను బాలసాహితీ విభూషణ అని పిలుస్తారు.
      చొక్కాపు వెంకటరమణ హైదరాబాదులో ఎప్రిల్ 1, 1948న జన్మించారు. తెలుగు సాహిత్యంలో బి. ఎ. చదువుకున్నారు. తొలినాళ్లలో జయశ్రీ, జనత వంటి పత్రికల్లో పనిచేశారు, తర్వాత ఈనాడు సంస్థవారి విపుల, చతుర పత్రికల్లో సహసంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమి ప్రచురణల విభాగానికి ప్రొడక్షన్ ఎడిటర్ గా 18 ఏళ్లు విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే పిల్లలకోసం సుమారు వంద పుస్తకాలను ముద్రించారు. అంతేకాదు బాలల రచయితల సంఘం కార్యదర్శిగా, తెలుగులో తొలి బాలల వ్యక్తిత్వ వికాస మాసపత్రిక ఊయలకు సంపాదకుడిగా కూడా పనిచేశారు. అప్పుడు చిన్నారులకోసం కథారచన శిక్షణ శిబిరాలు, బాలసాహిత్య రచయితల సదస్సులు నిర్వహించారు. తెలుగు నర్సరీ రైమ్స్ వర్క్ షాపులో పనిచేసి పిల్లలకోసం ఎన్నో గేయాలు రాశారు.
      ఎప్పుడు బాల సాహిత్య రచనలోనే మునిగి ఉండే చొక్కాపు వెంకట రమణ సుమారు ఆరవైకి పైగా బాలసాహిత్య గ్రంథాలను ప్రకటించారు. అల్లరి సూర్యం, చెట్టుమీద పిట్ట, కొతి చదువు, సింహం - గాడిద, బాతు - బంగారుగుడ్డు, గాడిద తెలివి, తేలు చేసిిన మేలు, ఏడు చేపలు, పిల్లలు పాడుకునే చిట్టిపొట్టి పాటలు, ఏది బరువు, మంచికోసం, నెలలు వాటి కతథలు, అక్షరాలతో ఆటలు, పిల్లలకోసం ఇంద్రజాలం, గోరింక గొప్ప... ఇలా ఎన్నో పుస్తకాలు వారికి కీర్తిని తెచ్చిపెట్టాయి. బాల సాహిత్యంలో మంచి పుస్తకాలుగా నిలిచిపోయాయి. జర్నలిస్టుగా కూడా వెంకటరమణకు మంచిపేరు ఉంది. బాల చంద్రిక పిల్లల మాసపత్రికకు సంపాదకుడిగా, బాల చెలిమి, చెకుముకి మాసపత్రికలకు గౌరవ సలహాదారునిగా వ్యవహరించారు. వీరు వివిధ దిన, వార, మాస పత్రికల్లో శీర్షికలూ నిర్వహించారు. సుమారు 500లకు పైగా వ్యాసాలు, కథలు, గేయాలు, శీర్షికలు  రాశారు. ఆంధ్రప్రభ దినపత్రికలో బాలప్రభ, ఆంధ్రభూమి దినపత్రికలో బాలభూమి వంటి ప్రత్యేక కాలమ్స్ నిర్వహించారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో వీరు నిర్వహించిన ఊయలకు మంచిపేరు వచ్చింది. వీరి చెట్టుమీద పిట్ట కథా సంపుటి పర్యావరణం గురించి చిన్నారుల్లో చైతన్యాన్ని నింపుతుంది. దీనికి పలు అవార్డులు కూడా వచ్చాయి.
         చొక్కాపు వెంకటరమణ కేవలం రచయితే కాదు. మెజీషియన్  కూడా. వేలాదిగా ప్రదర్శనలు ఇస్తూ భారతదేశం అంతా తిరిగారు. మేజిక్ చాప్లిన్ గా పేరు తెచ్చుకున్నారు. బాలసాహిత్యం, విద్యా విషయక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక పదవులు, హోదాలలో పనిచేశారు. బాలసాహిత్యానికి సంబంధించి అనేక సభలలో ప్రసంగాలు చేశారు. వీటితోపాటు సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. వికలాంగులకు ప్రోత్సాహాన్నిచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. కృత్రిమ కాళ్ల పంపిణీ, అనాథలకు మానసిక సంతోషాన్నిచ్చే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ లాంటివి స్వచ్ఛందంగా చేస్తున్నారు.
         వీరి కృషికి గాను ఎన్నో అవార్డులు వచ్చాయి. ఎన్నో సత్కారాలు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం, చైతన్య ఆర్ట్ థియేటర్స్ వారి సేవాభూషణ సత్కారం, లిమ్కాబుక్ రికార్డులు... ఇలా ఎన్నో... ఇటీవలే కేంద్రసాహిత్య అకాడమి బాలసాహిత్యవేత్తగా వీరిని గుర్తించి పురస్కారాన్ని ప్రకటించింది. ఇది తెలుగు వారందరూ గర్వించాల్సిన విషయం. అందుకే చొక్కాపు వెంకటరమణ బాలసాహిత్యంలో ఇంకా కృషి చేయాలని, మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం.  

- డా. ఎ.రవీంద్రబాబు