Facebook Twitter
అక్షరంతో చరిత్రను మార్చిన... భాగ్యరెడ్డివర్మ

అక్షరంతో చరిత్రను మార్చిన - భాగ్యరెడ్డివర్మ

 


తెలంగాణలో తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ప్రశంసలు, విమర్శలూ ఎలా ఉన్నా... ఈ సభల సందర్భంగా కొందరు పెద్దలను తల్చుకునే అవకాశం వచ్చిందన్నమాట మాత్రం వాస్తవం. వారిలో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు భాగ్యరెడ్డి వర్మ. ఇప్పటి తరం ఆయనని పూర్తిగా మర్చిపోయి ఉండవచ్చు. కానీ ఆయన చేసిన మేలుని మాత్రం తరతరాలూ అనుభవిస్తూనే వస్తున్నాయి.


భాగ్యరెడ్డివర్మ 1888లో జన్మించారు. పెద్ద కుటుంబం, ఆపై తండ్రి కూడా చిన్నప్పుడే చనిపోవడంతో... ఆయన బాల్యం అంతా బీదరికంలోనే గడిచింది. అయినా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగారు. పనిచేసిన ప్రతిచోటా తానేమిటో నిరూపించుకున్నారు. భాగ్యరెడ్డి దళితుడు. దళితుల జీవితాలు మెరుగుపడాలంటే, సాహిత్యం చాలా ఉపయోగపడుతుందని నమ్మారు భాగ్యరెడ్డి. అందుకే 1911లో మన్యసంఘం అనే సంఘాన్ని స్థాపించారు.

ఇప్పుడంటే టీవీలు, సినిమాలు ఉన్నాయి కానీ అప్పట్లో భజనలు, హరికథలే కాలక్షేపంగా ఉండేవి. మన్యసంఘం ఆధ్వర్యంలో ఉపన్యాసాలు, భజనలు, హరికథలు ఏర్పాటు చేయడం ద్వారా... ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేశారు భాగ్యరెడ్డి. మరోవైపు ఎక్కడికక్క రీడింగ్‌ రూమ్స్ ఏర్పాటు చేసి, అందరికీ సాహిత్యాన్ని అందుబాటులో ఉంచేవారు. దేవదాసి, బాల్యవివాహాలు, మద్యపానం లాంటి దురాచారాల మీద కూడా మన్యసంఘం తీవ్రంగా పోరాడేది. ఆయన ఒత్తిడి కారణంగానే ఆనాటి నిజాం ప్రభుత్వం దేవదాసి ఆచారాన్ని నిషేధించింది.

ఒకవైపు దురాచారాల మీద పోరాడుతూనే, మరోవైపు దళిత బాలికల కోసం పాఠశాలలు మొదలుపెట్టారు భాగ్యరెడ్డి. ఇప్పుడంటే ఈ విషయం అంత విచిత్రంగా తోచదు. కానీ 150 ఏళ్ల క్రితం దళితులకి, అందులోనూ అమ్మాయిలకి పాఠశాల ఏర్పాటు చేయడం అంటే గొప్ప సాహసమే! అలా ఒకటి కాదు రెండు కాదు... భాగ్యరెడ్డి నేతృత్వంలో 26 పాఠశాలలు నడిచేవట. వాటిలో రెండువేల మందికి పైగా అమ్మాయిలు చదువుకునేవారు.

అప్పట్లో దళితులని పంచములుగా పేర్కొనేవారు. కానీ వారిని ‘ఆదిహిందువు’లుగా గుర్తించాలని భాగ్యరెడ్డి పోరాడారు. ఆదిఆంధ్ర మహాసభల పేరుతో 1917 నుంచి 20 ఏళ్ల పాటు మహాసభలను నిర్వహించారు. హైదరాబాదులోని చాదర్‌ఘాట్‌లో కనిపించే ‘ఆదిహిందూ భవన్‌’ కూడా ఆయన నిర్మించినదే! 

వెనుకబడినవారిని ముందుకు నడిపించేందుకు వారిలో చదువునీ, రచనలనీ ప్రోత్సహించడమే కాదు... తను కూడా రచనలు చేశారు భాగ్యరెడ్డి. ‘భాగ్యనగర్‌’ పత్రికను స్థాపించి అందులో ఓ నవలని కూడా రాశారు. భాగ్యరెడ్డి వర్మ కృషిని మెచ్చుకుంటూ ఆనాటి నిజాం ప్రభుత్వం సైతం ఆయనను సత్కరించింది. ఆర్యసమాజ్‌ ఈయనను ‘వర్మ’ అన్న బిరుదునిచ్చింది. అప్పటి నుంచి ఆయనను ‘భాగ్యరెడ్డివర్మ’గా పిలుస్తున్నారు.

తెలంగాణలో దళితులు చదువుకునేందుకు, రచనలు చేసేందుకు తొలిమెట్టు వేసింది భాగ్యరెడ్డివర్మే అని చెబుతారు. అందుకే ఇక్కడ జరుగుతున్న ప్రపంచ తెలుగుమహాసభల సందర్భంగా ప్రభుత్వం ఆయనను గుర్తుచేసే ప్రయత్నం చేస్తోంది.

- నిర్జర.