Facebook Twitter
దాశరథి కృష్ణమాచార్య

 

దాశరథి కృష్ణమాచార్య

         తెలంగాణ మాగాణుల్లో ఉద్యమాలకు తన కవితల ద్వారా ఊపిరులు ఊదాడు. స్వయంగా ఉద్యమంలో పాల్గొని జైలు గోడల మీద అక్షరమై మెరిశాడు. నిజాం నిరంకుశ పాలనను తన కవితలతో చీల్చి చండాడాడు. ఆవేశంలో, ఆలోచనలో ఆయన కవితలు కత్తి అంచుపై కదం తొక్కాయి. అభ్యుదయ భావాలతో, సమాజంలోని అనేక సమస్యసలపై అలుపెరుగని పోరాటం చేశాడు. జీవితంలో, పోరాటంలో, కవిత్వంలో ఎక్కడా రాజీ పడకుండా జీవించాడు. నిజాం పాలన అంతమయ్యాక సినీ కవిగా అందరి అభిమానాలు చూరగొన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని తెలంగాణను కీర్తించాడు దాశరథి కృష్ణమాచార్య.
       దాశరథి కృష్ణాచార్య వరంగల్ జిల్లాలోని చినగూడూరు గ్రామంలో జన్మించాడు. జూలై 22, 1925న పుట్టిన దాశరథి వారిది శ్రీ వైష్ణవ సంప్రదాయ కుటుంబం. తండ్రి దగ్గర  సంస్కృతం నేర్చుకున్నాడు. పాఠశాలలో ఉర్దూ  మాధ్యమం ఆ రోజుల్లో నిర్బంధ విద్య కావడం వల్ల ఉర్దూ చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం బాగా అలవాటున్న దాశరథి ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే గాలీబ్ కవిత్వంలోని సౌందర్యాన్ని, ఇక్బాల్ కవిత్వంలోని విప్లవ భావాల్ని అవగతం చేసుకున్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే నిజాంకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో పాల్గొన్నాడు. వీరిపై  శ్రీశ్రీ ప్రభావం బాగా ఉండేది. స్టేట్ కాంగ్రెస్ లో సభ్యత్వం తీసుకొని హైదరాబాదు రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ లో కలపాలని ఊరూరా తిరుగుతూ ఉపన్యాసాలు ఇచ్చాడు. దాంతో అతనిని ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. జైలు గోడలపై-
                       ఓ నిజాము పిచాచమా, కానరాడు
                       నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
   లాంటి కవితలు రాశారు.జైలు నుంచి తప్పించుకున్నాడు. సైనికులు గుర్రాలపై వెంటపడ్డా తప్పించుకున్నాడు. తెలంగాణకు నిజాం నుంచి విముక్తి లభించాక ఆగిపోయిన చదువను కొనసాగించాడు. బి.ఎ. పట్టా తీసుకున్నాడు. గ్రామ పంచాయితీ తనిఖీ అధికారిగా ఉద్యోగం చేశారు. హైదరాబాదు, మద్రాసు ఆకాశవాణి కేంద్రాలలో ఉద్యోగాలు చేశారు.
        దాశరథి కవిత్వం అభ్యుదయ భావాలతో, ప్రజలను చైతన్య వంతం చేసేదిగా ఉంటుంది. వీరు సుమారు 30కి పైగా కవితా సంపుటాలను వెలువరిచారు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, కవితాపుష్పకం. తిమిరంతో సమరం, ఆలోచనాలోచనాలు వంటి గొప్ప రచనలు చేశారు. వీటితోపాటు గాలీబ్ గీతాలను ఉర్దూనుంచి అనువదించారు. యాత్రాస్మృతి వంటి రచనలూ చేశారు. పద్యం, గేయం, పాట, వచనం ఇలా అన్ని ప్రక్రియలలో రచనలు చేశాడు.దాశరధి కృష్ణమాచార్య కేవలం సాహిత్యానికి సంబంధించిన రచనలే చేయలేదు. చలనచిత్రాలకు అమూల్యమైన పాటలు ఎన్నో రాశారు. వాటిలో భక్తి, శృంగారం, అనుబందం గీతాలు ఎన్నో ఉన్నాయి. సుమారు 600లకు పైగా సినిమాలకు పాటలు రాశారు. పేరుకోసం ప్రయత్నించని కవి కావడం చేత వీరికి సినీ పరిశ్రమలో రావల్సినంత పేరు రాలేదని విమర్శకులు చెప్తారు.
         రంగుల రాట్నం చిత్రంలో నడిరేయి ఏ జాములో స్వామి నినుజేర దిగివచ్చునో... అని భక్తుని ఆర్తిని దేవునితో విన్నివించాడు. బుద్ధిమంతుడు చిత్రంలో ననుపాలింపగ నడిచి వచ్చితివా అంటూ భక్తుడితో, దేవుణ్ని ఆరాధింప జేశాడు. ఇక శృంగారానికి సంబంధించిన పాటల విషయానికి వస్తే- ఆత్మీయులు చిత్రంలో చిలిపి నవ్వుల నినుచూడగానే, గూడుపుఠాణి చిత్రంలో తనివి తీరలేదే నా మనసు నిండలేదే అని ప్రేమలోని ఆనందాన్ని ప్రేమికుల ద్వారా వ్యక్తం చేశాడు. దాశరథికి ఉర్దూ భాషపై పట్టు ఉండడం వల్ల ఆ భాషలోని మాధుర్యాన్ని, ఆ భాషా పదాలను పాటల్లో అద్భుతంగా ప్రయోగించేవారు. పునర్జన్మ చిత్రంలో దీపాలు వెలిగె పరదాలు తొలిగె, నవరాత్రి చిత్రంలో నిషాలేని నాడు హుషారేమిలేదు, ఖుషీ లేనినాడు మజా ఏమీలేదు... లాంటి పాటల్లో వారి ఉర్దూ ప్రతిభ కనిపిస్తుంది. ముఖ్యంగా పండండటి కాపురం చిత్రంలో బాబు వినరా అన్నాతమ్ముల కథ ఒకటి పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ లాంటిదే. అలానే ఆత్మీయులు చిత్రంలో మదిలో వీణలు మ్రోగె, ఆశలెన్నో చెలరేగె, అంతా మన మించికే చిత్రంలో నేనే రాధనోయి గోపాల పాటు వీణ పాటలుగా ప్రసిద్ధిపొందాయి. ఇప్పటికీ వీరు రాసిన తోటరాముడు చిత్రంలోని ఓ బంగరు రంగుల చిలకా పలుకవే పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. అలానే కన్నె వయసు చిత్రంలో ఏ దివిలో విరిసిన పారిజాతమో పాట అమ్మాయి అందాన్ని వర్ణించే విధానానికి ఓ మూలవిరాట్ లా మిగిలే ఉంటుంది. ఇక మూగ మనసులు చిత్రంలో పల్లెటూరి యువతి మనసును చెప్తూ- గోదారి గట్టుంది గట్టుమీద సెట్టుంది... అంటూ చివరకు అంతదొరకని నిండుగుండెలో ఎంత తోడితే అంతుంది అని ముగిస్తాడు పాటని ముగిస్తాడు దాశరథి. ఇంత గొప్పగా స్త్రీ హృదయాన్ని చెప్పడం అంత సామాన్య మైన విషయం కాదు.       
           వీరికి అనేక గౌరవాలు, పురస్కారాలు దక్కాయి. ముఖ్యంగా దాశరథికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చింది. ఆగ్రా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డిలిట్ లను ఇచ్చాయి. 1977లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా నియమించింది.  ఇతనే చివరి ఆస్థాన కవి. దాశరథి రంగాచార్యకు స్వయంగా అన్న దాశరథి కృష్ణమాచార్యులు. అలాంటి దాశరథి అనారోగ్యంతో 1987న ఏ దివికో పారిజాతం కోసం ఈ భువిని విడిచి వెళ్లిపోయారు.      
                                     
 

- డా. ఎ.రవీంద్రబాబు