Facebook Twitter
పందిలి కింద

 

పందిలి కింద

బందా కనకలింగేశ్వరరావు నాటక ప్రదర్శనే వృత్తిగా జీవించారు. స్వయంగా ప్రభాత్ థియేటర్ స్థాపించి ఎందరో నటులకు శిక్షణ ఇచ్చారు. కూచిపూడి గ్రామంలో సిద్ధేశ్వర క్షేత్రాన్ని స్థాపించారు. తొలితరం విడుదలైన సినిమాలలో నటించారు. ఇవన్నీ కనకలింగేశ్వరరావులో ఒక వైపు మాత్రమే. రచన ఆయనలోని మరో వైపును మనకు పరిచయం చేస్తుంది. కథలు, గేయాలు రాశారు. బళ్లారి రాఘవ లాంటి సుప్రసిద్ధ నటులు వీరిని తన వారసునిగా చెప్పుకున్నారు. కనకలింగేశ్వరరావు రచనలు ఆహ్లాదంగా, ఆనందంగా సాగుతాయి. మనం మర్చిపోతున్న, వదిలేస్తున్న కౌటంబిక సంబంధాల్లోని మానవీయతను గుర్తు చేస్తాయి. వీరి పందిలికింద కథ ఇందుకు ఓ మంచి ఉదాహరణ.
          పందిలి కింద కథ ఇంటి వర్ణనతో ప్రారంభమవుతుంది. ఇంటి వెనక తాటి చెట్లు,   ఉత్తరంగా పశువుల దొడ్డి, పిల్లి కూనలు... అన్నిటిని మించి ఇంటినిండా సందడి. ఇక ఆఇంట్లో మనుషుల విషయానికి వస్తే- నలుగురు ఆడపిల్లలు, రచయిత, వాళ్ల అన్నయ్య. వీళ్లందరితో నిండిన తన ఇంటి వాతావరణాన్ని రచయిత పెద్దవాడయ్యాక కాలక్షేపం లేక గుర్తు చేసుకుంటాడు.
            గంపెడు పిల్లలతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. అందరికంటే పెద్దది రచయిత అక్క సత్తెప్ప. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఇంట్లోని పిల్లలు గోవిందనామాలు చదువుతుండే వాళ్లు. పుస్తకాలు మాత్రమే ఉండే ఆ ఇంట్లో కాళింది మర్దనను రచయిత కూడా చదివేవాడు. వేసవి రోజుల్లో సత్తెప్ప సాధారణంగా ఇంటికి వచ్చేది. ఆమెతోపాటు, కిష్టిగాడు, అమ్మాణి కూడా వచ్చేవాళ్లు. కిష్టిగాడు చేసే అల్లరికి అంతూపొంతూ ఉండేది కాదు. సత్తెప్ప వస్తే ఊళ్లో వాళ్లందరికీ పండుగే. ఆమె చిన్నపిల్లలను అదుపాజ్ఞలలో ఉంచేది. పనులన్నీ చేసేది. పెత్తనం కూడా చెలాయించేది. సంకురాత్రి ముగ్గులు వేసేది. తప్పాళాబిల్లలు వండేది. పిల్లలు వేసిన ముగ్గులు చూసి ఆమే పాస్ చెయ్యాలి. చివరకు చిన్నవాడైన రచయిత వేసుకునే నిక్కరు కూడా ఆమె చేత్తో కుట్టేది. చద్ది అన్నాల నుంచి పక్కమంచాల వరకు, అంతా సత్తెప్ప పెత్తనమే....
         పిల్లలందరిని కంచాలు పరిచి వరసగా అన్నాలు పెట్టేది. పప్పుపులుసు, ఉల్లిపాయ కారం, వెన్నపూస మీగడ... అన్నీ ఉండేవి. కానీ సత్తెప్ప తెలివి తేటలు కిష్టిగాడి ముందు పనికొచ్చేవి కాదు. ప్రాణం పోయేలా విసిగించేవాడు. రచయిత వెన్నపూస అడిగితే సత్తెప్ప పెట్టకపోయినా, వాళ్లమ్మ మజ్జిగ చిలుకుతూ తెెచ్చి వెన్న పెట్టేది. అత్తా కూతుళ్ల సరసం అమితంగా ఉండేది. అమ్మాణి కూడా అణకువగా ఉండేది కాదు.కిష్టిగాడితో కలిసి మామిడి పండ్లకోసం పోట్లాటకు దిగేది. ముసలమ్మ మాత్రం ఈ వయసులో నాకు ప్రణయగాథలు, వింతకథలు తలనొప్పి అంటూ ఉండేది. సత్తెప్పకు తగిన పిల్లలు పుట్టారు అనేది. ఎవరన్నా తప్పు చేస్తే మొట్టు మొట్టితే గిద్దెడు మిరియాలు రాలాలి అనేది.
        కిష్టిగాడికి లేగదూలతో ఆడుకోవడం ఇష్టం. రచయిత వాళ్లమ్మ ఆదెమ్మకు పాడి చేయడం ఇష్టం. సత్తెప్పకు సీతాకళ్యాణం కంటతా వచ్చినా అందరూ బతిమాలితేనే పాడేది. అది, రాత్రుళ్లు మాత్రమే పాడేది. రచయిత వాళ్లమ్మ కూడా మజ్జిగ చిలుకుతూ గుమ్మాడేడే కన్నతల్లీ అని పాడేది. అవి వింటూంటే చెవులకు హాయిగా మనసుకు ఇంపుగా ఉండేవట. పందిట్లో అందరూ కూర్చొని ఉంటే అమ్మాణి గోవిందనామాలు చదువుతుంది. కిష్టిగాడు లేగదూడకు గంగిరెద్దు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అమ్మాణి-  కౌశల్య, గోవిందా రామ అంటే పోటీగా కిష్టిగాడు- ఆదెమ్మగారికి గోవిందరామ, ఆవుల్లు లేవంట గోవింద రామ అన్నాడు. అలా పందిట్లో ఉన్న అందరినీ కిష్టిగాడు ఆటపట్టిస్తుంటే నవ్వుతూ ఉన్నారు. చివరకు కిష్టిగాడు- గంగిరెద్దుకు ధాన్యం వద్దు, వస్త్రాలు వద్దు, మామయ్య కూతురు కావాలి అంటే, రచయిత వాళ్ల అమ్మ, గంగిరెద్దుల వాడికి పిల్లనెవరు ఇస్తారు అని నవ్వింది. దాంతో అందరూ  ఆనందంగా నవ్వుకున్నారు.
       ఇలా రచయిత తన చిన్ననాటి సంగతులను, పందిలి కింద కలబోసుకున్న అనుభూతులను, మానవీయ దృశ్యాలను కథలో చెప్తాడు. రోజులు మారిపోయాయి, బంధాలు, అనుబంధాల మధ్య దూరం పెరిగిపోయింది. ఇలా రచయిత మౌనిలా మారిపోవడంతో ఆ ఊసులలో కిష్టిగాడ్ని, అమ్మాణిని, శ్యామలను చూద్దామా అనుకోవడంతో కథ ముగుస్తుంది.
         ఈ కథంతా జ్ఞాపకాల కలపోత. ఎంతో నైపుణ్యంతో బందా కనలింగేశ్వరరావు వాటిని దారంతో అల్లారు. ముద్దు పేర్లు, అల్లరి, చుట్టాలతో కలిసిమెలిసి జీవించడం, గడ్డ పెరుగు, పాలమీద మీగడ, పాటలు, పద్యాలు... స్త్రీల మధ్య అన్యోన్యం అన్నింటిని కథలో పొదిగారు. వీటితోపాటు- మొగ మొండాకొడుకు ఒకడికంటే ఎక్కువెందుకు పోనిస్తూ, పేరు ఒకటైతే మాత్రం బుద్ధులు ఒకటవాలని ఏ శాస్త్రంలో లేదు, నీ అబ్బాయి నీకు ముద్దు మా అబ్బాయి నాకు ముద్దు... లాంటి సామెతలు ఈ కథకు మరింత మెరుగు తెచ్చాయి. అలానే ఆ రోజుల్లో స్త్రీలు పాడుకునే గోవింద నామాలు, కాళింది మర్దన వంటి పాటలతో పాటు, గుమ్మాడేడే గోపీతల్లి వంటి జానపద పాటల ప్రస్తావన కూడా తెచ్చాడు రచయిత. స్త్రీల జీవితంలో భాగమై పోయిన సాహిత్యం ఎంతో గొప్పది. కథ చివరిలో ఆ రోజుల్లో అనుభవించిన సంతోషాన్ని గుర్తు చేసుకుంటూ రచయిత బాధపడడం, నేనొక వ్యర్థుడనైనాను అని చిన్నపిల్లాడిలా కంటనీరు పెట్టుకోవడం కథ ముగింపుకు అందాన్ని తెచ్చింది. కథా వస్తువుకు బలాన్నీ చేకూర్చింది. అందుకే ఈ కథ చదివితే బాగా ఊరిన ఆవకాయ రుచి మన మనసుకు తప్పకుండా కలుగుతుంది.

- డా. ఎ.రవీంద్రబాబు