Facebook Twitter
వృత్తికథలకు మూల శిల్పి అందె నారాయణస్వామి

వృత్తికథలకు మూల శిల్పి అందె నారాయణస్వామి

        నేడు వస్తున్న అనేక వృత్తికథలకు మూల శిల్పి అందె నారాయణశిల్పి. గుంటూరు జిల్లా మంగళగిరిలో జన్మించాడు.  బహుశా తెలుగులో వృత్తికళాకారుల గురించి పూర్తికథను రాసింది వీరేనేమో. చేనేత కుటుంబంలో పుట్టిన నారాయణస్వామి ఆ వృత్తి వాళ్లు పడుతున్న కష్టాలను, వారి కన్నీళ్లను కథలో చెప్పే ప్రయత్నం చేశారు. సుమారు వంద కథలు రాసిన నారాయణస్వామిని తొలి వృత్తికథా కథకుడిగా చెప్పుకోవాలి. విమర్శకులు ఇతనిని ఆంధ్ర మొపాసా అంటారు. ఇతర కళల్లో కూడా ప్రవేశమున్న నారాయణ స్వామి రచించిన శిల్పి కథలోకి వెళ్తే-

       శివయ్య, సీతమ్మ భార్యాభర్తలు, వారికి ఇద్దరు కూతుళ్లు. చేేనేత కుటీర పరిశ్రమల్లోకి యంత్రాలు అడుగుపెట్టేక రోజూవారి మగ్గాలమీద బట్టలు నేసే వారికి పనిలేకుండా పోయింది. పనిలేకపోయే సరికి వారి కుటుంబాలు పడుగుపేకల్లా కూలిపోయి, తిండిగింజలకు కూడా జరగక పస్తులు ఉండాల్సి వస్తుంది. అదే పరిస్థితిలో శివయ్య కుటంబం ఉంది. అస్థిపజరంలా ఖాళీమగ్గం,  ఆకలితో యేడ్చియేడ్చి శోష వచ్చి నిద్రపోయిన కూతుర్ని చూసిన శివయ్య ఎక్కడన్నా నాలుగు తిండిగింజలు అప్పు తెమ్మంటాడు భార్యని. అప్పటికే ఇళ్ల పక్కన మానెడు, తవ్వ అప్పులు చేసిన సీతమ్మ ఇక తేవడం తన వల్ల కాదంటుంది. షావుకారు శాల్తీ (నేయించిన బట్టలు) అమ్ముడుపోకపోయే సరికి ఇంకా నేయించడానికి పడుగులు (నేయడానికి నూలు) ఇవ్వడం మానేస్తాడు.
           శివయ్య ఇంటి సూర్లోనుంచి ఎలుకలు కొట్టేసిన ఓ ఉత్తరం కిందపడుతుంది. అది 1940లో మద్రాసు ఖాదీ కాన్ఫరెన్సువాళ్లు నేతలో గాంధీ విగ్రహాన్ని నేసినందుకు శివయ్యకు బహుమతిగా ఇచ్చింది. నేతపనిలో అద్భుతాలు సృష్టించగల శివయ్యకు ప్రస్తుతం పనిలేకుండా పోయింది. ఇలా ఆలోచిస్తున్న శివయ్య ఇంటికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రావు వస్తాడు. మిల్లు బట్ట మా పరిశ్రమను కూలదోసింది అని శివయ్య అతనితో వాదనకు దిగుతాడు. అతను మాత్రం చీరెలు ధోవతలు ప్రభుత్వం వారు మీకు కేటాయించే పనిలో ఉన్నారని కబుర్లు చెప్తాడు. చివరకు శివయ్య బ్రిటీషు వాళ్ల పాలనలో ఉన్నప్పుడు యిటువంటి పరిశ్రమలన్నీ నాశనమయ్యాయని వాపొయ్యాం. ఇప్పుడు స్వంత ప్రభుత్వం వచ్చిమాత్రం యేంచేసింది అని ఆవేదనతో మాట్లాడతాడు. రావు నూరు చిలప కావాలని అడిగితే, ఉరిపోసుకొని చనిపోడానికి ఒక పోగుకూడా లేదని ఆక్రందనతో సమాధానం చెప్తాడు.   
               రావు వెళ్లిపొయ్యాక శివయ్య తమ్ముడు రాఘవయ్య వస్తాడు. అతను ఆ గ్రామానికి పదికోసుల దూరంలో మరో గ్రామంలో ఉంటాడు. రాఘవయ్య  చేనేత పనులు లేక అక్కడి వాళ్లందరూ వలసలు పోతున్నారని, తను ఈ గ్రామానికి వస్తే ఎలా ఉంటదని శివయ్యను అడగుతాడు. ఇక్కడి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయని చెప్పి, తమ్ముడికి తిండిపెట్టాడానికి ఇంట్లో ఏమీ లేవు కదా... అని, షావుకారును ఓ రూపాయన్నా అడుగుదామని వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి, షావుకారుతో నూలు ఆసామి నూలు తీసుకెళ్లి ఇంతకాలమైనా డబ్బు ఇవ్వలేదని గొడవ పెట్టుకుంటుంటాడు. షావుకారు సరుకు నిల్వ ఉంది అమ్ముడు పోలేదని అతనికి నచ్చజెప్తుంటాడు. అది విన్న శివయ్య రూపాయి అడగలేక ఇంటికి తిరిగి వస్తాడు. రాఘవయ్య వెళ్లిపోయి ఉంటాడు. మరో కూతురు కూడా తిండిలేక శోషతో పడిపోతుంది. అది చూసి  సీతమ్మ ఎవరి కాళ్లైనా పట్టుకొని గింజలు తెస్తాను అని బయటకెళ్లి కొంగున మూటతో తిరిగి వస్తుంది. కానీ అవి గింజలు కాదు- నాలుగిళ్ల దగ్గర మాదాకవళం అడిగితెచ్చిన అన్నం. అది తెలుసుకున్న శివయ్య తొట్రుపాటుతో- వీడి శరీరం మంటలో కాలి భస్మం కాకముందే నువ్వు జోలి కట్టావా... అవును. నీ తప్పేముంది. వీడు బ్రతికి వుండీ చచ్చిన వాళ్లలో జమే అయ్యాడు. అని ఆక్రేశించాడు.

    ఈ కథలోని చేనేత కార్మికుల జీవితాలు ఇప్పటికీ మారలేదు. వారి వాస్తవ జీవితాల్ని గుండెపిడచకట్టేలా చెప్పారు నారాయణస్వామి. ప్రభుత్వం తీరును ఎండగడుతూనే చేనేత కార్మికుల శ్రమలోని గొప్పతనాన్ని, సౌందర్యాన్ని వర్ణించాడు. పాలితులు మారినా, వారి బతుకులు మారలేదన్న కఠోర సత్యానికి ఈ కథ ఓ సాక్ష్యం. ఇక శిల్పపరంగా ఈ కథ-  ఆకలితో ప్రారంభమవుతుంది. చివరికి ఆ బాధను తట్టుకోలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని మాదాకవళం ఎత్తుకోవడంతో ముగుస్తుంది. మగ్గాన్ని అస్థిపంజరంతో పోల్చడం- చేనేతవృత్తి కళాకారుల జీవితానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. అలానే రావు నూలు చిలపకోసం రావడం,  రాజకీయ నాయకుల ప్రవర్తనను కళ్లకు కడుతుంది. శివయ్య తమ్ముడి పాత్రను చేనేత కార్మికుల స్థితి దేశంలో అన్నిచోట్లా అలానే ఉందని చెప్పడానికి ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. ఇలా పాత్రలన్నీ కథను మరింత రక్తి కట్టించే విధంగా తీర్చి దిద్దాడు రచయిత. అలానే కథ చివరిలో తనను తాను చచ్చిన వాడిగా భావించుకున్న శివయ్య మాటలు కథకు మణిరత్నాలు వంటివి.
              అందుకే ఇలాంటి కథలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. సార్వజనీన, సార్వకాలిక కథలుగా పాఠకుల్లో కళ్లపై నీటిపొరల్లా కదలాడుతుంటాయి. 

- డా. ఎ. రవీంద్రబాబు