Facebook Twitter
సాహిత్యానికి వేగుచుక్క


సాహిత్యానికి వేగుచుక్క
 
కందుకూరి వీరేశలింగం పంతులు

 

తెలుగు సమాజానికి, సాహిత్యానికి వేగుచుక్క కందుకూరి వీరేశలింగం పంతులు. భవిష్యత్ సమాజాన్ని ఊహించిన క్రాంతదర్శి. సంఘసంస్కరణకు గొప్ప కృషి చేసిన మార్గదర్శి. తెలుగు సాహిత్యంలో అనేక ఆధునిక ప్రక్రియలకు ఆద్యుడు. మాటల్తో కాదు, చేతల్తో సైతం కార్యరంగంలోకి దిగి అనేక సంఘసంస్కరణ కార్యక్రమాలు స్వయంగా చేపట్టిన ఘనుడు. అందుకే ఆధునిక సాహిత్యంలో ఆయన స్థానం విశిష్టమైంది. తెలుగులో ఆధునిక యగ ఆరంభానికి వీరు సుప్రభాత గీతాన్ని ఆలపించారని నిస్సందేహంగా చెప్పొచ్చు.
           కందుకూరి వారి కుటుంబం సంప్రదాయాలకు నిలయం. అలాంటి కుటుంబంలో ఏప్రిల్ 16, 1848న జన్మించారు వీరేశలింగం పంతులు. తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు. వీధిబడిలో చదువుకున్న వీరేశలింగం సర్వకళాశాల పరీక్ష పాసై 1871లో రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో దొరవారి మండల పాఠశాలలో ఉపాధ్యాయవృత్తిలో చేరారు. ఆ తర్వాత కోరంగిలో ఆంగ్ల పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా కూడా పనిచేశారు. 1876లో రాజమహేంద్రవరంలోని రాజకీయ పాఠశాలలో ఆంధ్ర ద్వితీయోధ్యాయ పదవిలో నియమింపబడ్డారు. 1861లో రామలక్ష్మమ్మతో వీరికి వివాహం జరిగింది. కేశవ చంద్రసేన్, ఆత్మూరి లక్ష్మీనృసింహం వంటి వారి బోధనలలతో ప్రభావితం అయ్యారు. నేరుగా సంఘసంస్కరణ కార్యక్రమాలను చేపట్టారు. ఆ కార్యాల ప్రచారానికి, ప్రజలలో చైతన్యం తేవడానికి రచనా మార్గాన్ని కూడా ఎంచుకున్నారు. 1879లో ప్రార్థనా సమాజాన్ని నెలకొల్పారు. 1881లో వితంతు వివాహం చేశారు. 1897-98లో మద్రాసులో వితంతు శరణాలయం స్థాపించారు. 1906లో యజ్ఞోపవీతాన్ని సైతం తీసేశారు. హితకారిణీ సమాజాన్ని నెలకొల్పారు. బాలికా పాఠశాల స్థాపించారు. స్త్రీ విద్యకు, బాల్యవివాహాల నిషేధానికి, వితంతువివాహాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా... పంతులుగారు విశేషమైన కృషి చేశారు.

కందుకూరి వారే స్వయంగా తన స్వీయచరిత్రలో ఆధునిక సాహిత్య ప్రక్రియలలో నేనే చాలామటుకు మొదట రచించాను అని చెప్పుకున్నారు. ఇది అక్షర సత్యం. స్వీయచరిత్ర, నాటకం, ప్రహసనం, వచన ప్రబంధం, కవుల చరిత్ర, శాస్త్రీయ గ్రంథాలు అన్నీ వీరే తొలుత రాశారని చెప్పాలి. అర్థం పర్థంలేని భాషతో, ఊహలతో సరస్వతిని అవమానిస్తున్నారని సరస్వతీ నారద విలాపాన్ని (1895) లో రాశారు. ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ది ట్రావెలర్ ను పథికా విలాపము పేరిట అనువదించారు. శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధాన్ని ప్రాచీన కావ్యరీతులో రాశారు. ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ను చమత్కార రత్నావళి పేరుతో నాటకంగా అనువదించారు. బ్రాహ్మవివాహం, స్త్రీ పునర్వివాహం, సభానాటకం లాంటి ఎన్నోనాటకాలు సంఘస్కరణ దృష్టితో రచించారు. చాలామంది విమర్శకులు, పరిశోధకులు వీరు రాసిన రాజశేఖరచరిత్రను తొలి నవలగా పేర్కొంటారు. దీనిపై గోల్డ్ స్మిత్ రచించిన ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ ప్రభావం ఉందని కందుకూరి వారే చెప్పుకున్నారు. ఇంకా సత్యరాజా పూర్వదేశ యాత్రలు, సత్యవతీ చరిత్రము, చంద్రమతీ చరిత్ర అనే నవలలు కూడా రచించారు. ఈ నవలల ప్రధాన ఉద్దేశ్యం స్త్రీ విద్య, స్త్రీ అభివృద్ధి, స్త్రీల ప్రాధాన్యం.

వీరేశలింగం గారికి పేరుప్రఖ్యాతులు తెచ్చినవి ప్రహసనాలు. వ్యంగ్యంతో సమాజంలోని అంధవిశ్వాసాలు, స్వార్థం, ప్రజల అమాయకత్వాన్ని విమర్శకు పెట్టారు. ప్రధానంగా సంఘసంస్కరణ ప్రభోదించారు. దాదాపు 50కి పైగా ప్రహసనాలు రచించారు. పెళ్లి వెళ్లిన తర్వాత పెద్ద పెళ్లి, లోకోత్తర వివాహము, వేశ్యాభిమానం, శాఖాభేదాలు, అజ్ఞానం లాంటివి ముఖ్యమైనవి. ప్రహసనాలతో పాటు కందుకూరి వారు కథలను కూడా రచించినట్లు తెలుస్తుంది. సతీహితబోధిని పత్రికను నడిపి ఆ పత్రికలో కథల్ని ప్రచురించారు. బాలబాలికల కోసం నీతి కథలు కూడా రాశారు. ప్రతి కథ చివర ఓ నీతి పద్యాన్ని రచించారు.  పరోపకారం, బాదము కాయ, వరాల చెట్టు లాంటి చిన్నచిన్న కథలు కూడా వీరి ప్రచురించారు. కందుకూరి వారికి విశేషమైన కీర్తి తెచ్చిపెట్టినవి వీరి వ్యాసాలు. వాటిని ఆ కాలంలో ఉపన్యాసములు అనేవారు. వివేకవర్థిని, సతీహితబోధిని, చింతామణి, సత్యసంవర్థిని, సత్యవాది పత్రికలలో వీరి వ్యాసాలు విరివిగా ప్రచురింపబడేవి. తర్వాత ఇవి సంపుటాలుగా వచ్చాయి.  రాజకీయ, నైతిక, ఆర్థిక, మత, విద్య, స్త్రీ సంబంధమైన అంశాలతో పంతులుగారు వ్యాసాలు రాశారు.

తెలుగు సాహిత్యానికి వీరు అందించిన మరో ముఖ్య గ్రంథం కవుల చరిత్ర. అటువంటిదే స్వీయచరిత్ర. స్వీయ చరిత్ర రచించిన వారిలో వీరే మొదటివారు. ఎటువంటి అసత్యాలకు, అపోహలకు, కల్పితాలకు తావులేకుండా నిఖ్ఖర్షగా స్వీయచరిత్రలో తన గురించి తాను చెప్పకున్నారు వీరేశలింగం పంతులుగారు. వీరి రచనలు ఆనాటి సమాజంలోని చెడును వివరిస్తాయి. మంచి మార్గాన్ని నిర్దేశిస్తాయి. గ్రాంథికంలో కాకుండా సరళ గ్రాంథికంలో ఉండి అందరికీ అర్థమవుతాయి. ముఖ్యంగా సంఘసంస్కరణ దృష్టితో స్త్రీల అభివృద్దే ధ్యేయంగా వీరి రచనలు సాగాయని చెప్పాలి. జీవితాన్ని పరులకోసం వెెచ్చించిన వీరేశలింగం గారి గురించి చిలకమర్తి వారు-
            తన దేహము తన గేహము
            తన కాలము తన ధనము తన విద్య జగ
            జ్జనులకు వినియోగించిన
            ఘనుడీ విరేశలింగ కవి జనులారా.... అన్నారు.                                     

- డా. ఎ.రవీంద్రబాబు