Facebook Twitter
యాత్ర

 

యాత్ర

 


  
ఏడేళ్ళు! తను పదవీవిరమణ చేసి అన్నేళ్ళయినా ఈ మధ్యనే ఉద్యోగ బాధ్యతలనుంచి తప్పుకున్నట్టుంది ప్రకాశరావ్‌కు. కాలం ఎంత వడివడిగా పరుగెడుతోంది? కృష్ణానదీతీరంలో బాలకుటీర్‌లో ఉన్న, మామూలుగా ఎవరూ పట్టించుకోని పిల్లలకు ఆంగ్లపాఠాలు నైతిక విలువల గురించి బోధించి అతను అప్పుడే ఇంటికి వచ్చాడు. పెరట్లో పడక్కుర్చీలో తేనీరు సేవిస్తూ సేదతీరుతున్నాడు. నగరంలో చాలావరకు అపార్ట్‌మెంట్‌లు, బహుళ అంతస్తుల భవనాలు, పచ్చదనాన్ని నిర్దాక్షిణ్యంగా ఆక్రమించుకుంటుంటే సత్యనారాయణపురంలోని  తన ఇంటి ప్రాంతంలో పరిసరాలు మాత్రం చెట్లు చేమలతో, ఉద్యానవనాలతో కళకళలాడుతూ అతనికి శేషజీవితం మీద ఆశను కోల్పోకుండా చేస్తున్నాయి.
    బాదంచెట్టుమీద రెండు పకక్షులేవో ఊసులాడుకుంటున్నాయి. ఇంటిచుట్టూ చెట్లుండటంవల్ల బయటికంటే కాస్త  చల్లగానేవుంది. వేప, జామ చెట్ల ఆకుల సందుల్లోంచి  దొంగలాగా ఇంట్లోకి చొరబడ్డానికి సూర్యుడు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. హాల్లో గోడకు వేళ్ళాడుతున్న సీత ఫొటో బయటినుంచి వీస్తున్న గాలికి కొద్దిగా కదిలింది. ఆమె తననుంచి దూరమై మూడేళ్ళు పూర్తయ్యాయి. ఎవరు తనతోవున్నా, లేకపోయినా ఆమె సహచర్యంలో సేదతీరేవాడు. కన్నీళ్ళు, కష్టాలు, ఈతిబాధలు ఎన్నొచ్చినా ఒకరికొకరు  ధైర్యం చెప్పుకుంటూ ఇరుసుకటూఇటూ చక్రాల్లా జీవన సమీకరణాన్ని  సమతుల్యం చేసుకుంటూ క్షణక్షణాన్ని ఆస్వాదించేవాళ్ళు. కానీ రొమ్ముభాగంలో పుట్టిన రాచపుండు ఆమెను గద్దలా తనదగ్గర్నుంచి తన్నుకుసోయింది.
--------------
    ఇంట్లోని ఫోన్‌మోగడంతో అతను లోపలికి వచ్చాడు. శ్రీనివాస్‌ యు.ఎస్‌ నుంచి. ''నాన్నా ఎలా వున్నారు? ఏ ఇబ్బందీ లేదుకదా!'' అన్నాడు. ''లేదు శ్రీను, నేను సంతోషంగానే వున్నాను. ఆరోగ్యం కూడా పరవాలేదు'' అన్నాడు ప్రకాశరావ్‌. ''ఇంకా ఎన్నాళ్ళు నాన్నా ఒక్కడివే అక్కడుంటావ్‌? ప్లీజ్‌ కమ్‌ అండ్‌ స్టే విత్‌ అజ్‌ '' అన్నాడు శ్రీను. ''చూద్దాంలే అప్పుడే తొందరేముంది. నేను బ్రతకలేననుకున్నప్పుడు తప్పకుండా వస్తాలే'' అన్నాడు ప్రకాశరావ్‌. ''నువ్వెప్పుడూ ఇలాగే అంటావ్‌ నాన్నా'' అంటూ ఇంకాసేపు మాట్లాడాడు. సంభాషణ ముగిసిన తర్వాత అతను బ్రెడ్‌ టోస్ట్‌ చేసుకున్నాడు. నెస్కఫీతో అల్పాహారాన్ని ఆరగిస్తూ ఐప్యాడ్‌లో పాత హిందీ పాటలు వింటున్నాడు.  ఆ గానలహరిలో అతను ఈ లోకాన్ని మరచిపోయాడు.
--------------
    పక్కరోజు  బాలకుటీర్‌లో ఒక కొత్త పరిస్థితి ఎదురయ్యింది. వెళ్ళగానే అక్కడి మేనేజర్‌ మనోజ్‌ ''సార్‌ మీరు పిల్లలమీద మరింత శ్రద్ధ పెట్టాలి. వాళ్ళలో కొందరి భద్రతాభావం  బాగా పెరిగిపోయింది.  మన ఆలనాపాలనా  బాగావుందికాబట్టి ఎల్లకాలం ఇలాగే వుంటుందని, తమ జీవితానికి ఏ ఢోకా లేదని  ధీమా పెరిగిపోయింది. చదువు సరిగ్గా సాగడంలేదు. పైగా కొందరిలో పొగత్రాగడంలాంటి అలవాట్లు మొదలయ్యాయి. వీళ్ళు తాచెడ్డకోతుల్లాగా మిగతావారిని కూడా పాడుచేస్తున్నారు. ఈ పరిస్థితిని మనం తొందరగా చక్కదిద్దాలి'' అన్నాడు.
     ప్రకాశరావ్‌ ఆ రోజు క్లాస్‌లో, యువత స్వతంత్రంగా ఆలోచించడం గురించి అట్టడుగు స్థాయినుంచి స్వశక్తితో పైకెదిగిన కొందరి  జీవిత కథలను పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించాడు. తర్వాత అభియోగాన్నెదుర్కొంటున్న కృష్ణఅనే అబ్బాయికి  వేరేగదిలో కౌన్సిలింగ్‌   మొదలెట్టాడు.  ఆ బాబుకి ఐదేళ్ళ వయసులో   రైల్వేస్టేషన్‌ దగ్గర అనాథగా తచ్చాడుతుంటే  బాలకుటీర్‌  కార్యకర్తలు తీసుకొచ్చారు. ''కృష్ణా ఎలావున్నావ్‌? అంతాబాగానేవుందా ఇక్కడ?'' ఎదురుగా కూర్చున్న అతనిని అడిగాడు ప్రకాశరావ్‌. ''చాలా బాగుంది సార్‌ ఏ విధమైన ఇబ్బంది లేదు''. ''మరినువ్వు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావ్‌?'' ''ఆ విషయం గురించి ఆలోచించడంలేదు సర్‌. ఇప్పుడే దాని గురించి తొందరేముంది?'' ఎదురు ప్రశ్నించాడు వాడు. అతనిప్పుడు కుటీర్‌వాళ్ళు నడుపుతున్న స్కూల్లోనే పదవతరగతిలో వున్నాడు.
    ''కాదు కృష్ణా నువ్వెప్పుడూ ఇక్కడే వుండిపోవు. పై చదువులు చదవాలి. నీ అంతట నువ్వు స్వతంత్రంగా బతుకుతూ పదిమందికి సహాయపడే స్థితిలోవుండాలి''.    అంటూ చాలాసేపు ఓపిగ్గా చెప్పాడు. అయినా వాడిలో అప్పుడే పెనుమార్పునాశించడం అత్యాశ అవుతుంది. నెమ్మదిగా అతన్నీ, అతని ద్వారా ప్రభావితమవుతున్న ఇతరులను గాడిలో పెట్టాలనుకున్నాడు ప్రకాశరావ్‌. ఇలాంటి ఒత్తిళ్ళనెదుర్కోవడం అతనికి సవాల్‌గా వుంది. కానీ అందులో చాలా తృప్తి, అర్ధంకూడా ఉన్నాయి.
----------
    ప్రకాష్‌ ఆంగ్ల ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం ఆరంభించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పదవీవిరమణ పొందాడు. ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు. కొన్ని చేదువి మరికొన్ని తీయనైనవి. తన అదృష్టం సీత భార్యగా దొరకటం. ఆమె... శ్రీను, లక్ష్మి పుట్టాక  అంతకు ముందుదాకాచేస్తున్న ఉద్యోగం వదిలేసి పూర్తిసమయం వాళ్ళకు కేటాయించింది.  ఆమెది తనకులం కాదు. అయినా ఇద్దరూ భావుకులు. తను తెలుగు సాహిత్యంలో పరిశోధనకూడా చేసింది. గుంటూరులో అతను పని చేస్తున్నప్పుడు పరిచయం అయింది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నట్లు  ఇంట్లో చెప్పినప్పుడు పెద్దయుద్ధమే జరిగింది. '' ఏరా మన సాంప్రదాయం ఏం కావాలి? నేను నీ పెళ్ళికి ఒప్పుకుంటే మన బంధువర్గంలో తలెత్తుకు తిరగ్గలనా'' అన్నాడు నాన్న. అమ్మయితే కళ్ళనిండా నీరుకుక్కుకుంది.
    అనూహ్యంగా బామ్మ మాత్రం నాన్నతో ''ఒరేయ్‌ రాఘవా అమ్మాయి చక్కగా సాంప్రదాయబద్ధంగా బుద్ధిగా వున్నట్టుంది. కులం మనది కాకపోయినంతమాత్రాన వచ్చే నష్టం ఏముంటుంది'' అంటూ ప్రకాశ్‌కి నైతిక ఆసరా ఇచ్చింది. అయితే సీతావాళ్ళనాన్న ససేమీరా ఒప్పుకోలేదు. ప్రకాశరావ్‌ సీతను పెళ్ళి చేసుకోవడం మానలేదు. అందుమూలంగా ఇద్దరికీ అతనింట్లో ఆ తర్వాత ప్రవేశం దొరకలేదు. కానీ వాళ్ళిద్దరూ అధైర్య పడలేదు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ బ్రతుకు పండించుకున్నారు. అయితే ఇప్పుడు అన్నీ జ్ఞాపకాలే మిగిలాయి. ఎవరో మహానుభావుడన్నట్లు జీవితమంటే కొన్ని జ్ఞాపకాల శకలాల సమాహారం కదా! అని తరచుగా అతననుకుంటూంటాడు. తను కులాంతర వివాహం చేసుకున్నందుకు అభినందించిన వాళ్ళూ లేకపోలేదు.
---------
    శ్రీను, లక్ష్మి రెండేళ్ళ వ్యవధిలో ప్రకాశరావ్‌ సీతల జీవితంలోకి రావడం కొంత ఊరట కలిగించింది. కానీ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళేకులానికి  చెందుతారన్న ఆసక్తి, ఆరా వాళ్ళు పాఠశాలలో ప్రవేశించేటప్పుడు మళ్ళీ తెరమీదికొచ్చింది. అక్కడి అధికారిణి '' సార్‌ మీరు పిల్లల్ని చేర్చినప్పుడు ఏ కులానికి చెందుతారో వ్రాయలేదు'' అంది.  ''కులవ్యవస్థపోవాలని అంటున్నారు కదా! అలాంటప్పుడు దాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందంటారా?'' అన్నాడు ప్రకాశరావ్‌. ''లేదు సార్‌ మేము ప్రభుత్వానికి ఈ వివరాలు తప్పకుండా అందజేయాలి. కాబట్టి ఇవ్వక తప్పదు'' అందామె. అతను తప్పని పరిస్థితులలో ఆ వివరాలు చెప్పాడు కానీ చాలా రోజులు అతన్ని ఆలోచనలు మాత్రం వెంటాడాయి. వేదికలమీద అందరూ సమానత్వం కావాలంటారు. కానీ ప్రాంతీయ, కుల, మత, గోత్ర, శాఖ, నక్షత్రాల్లాంటి సవాలక్ష విభేదాలు చాలామందిలో వేళ్ళూనుకునిపోయాయి. అమ్మాయో, అబ్బాయో మన కులంవాళ్ళు కాకపోతే  తల్లిదండ్రులు ఆ వివాహానికంగీకరించరు. ఇక సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు అన్ని అంశాల్లో అంగీకారం కుదిరినా సగోత్రికులన్న ఒకేఒక కారణంతో అవివిఫలమవ్వడం ఎన్నోసార్లు చూశాడు. తనుగానీ సీతగానీ ఎదుటివారిని మీరెవరనీ మీదేకులమనీ అడిగిన సందర్భాలులేవు. ఎంతో మంది విద్యార్థులను వాళ్ళేవర్గానికి చెందినవారైనా అక్కున చేర్చుకున్నారు. నిబంధనలు లేని ప్రేమను వాళ్ళకు పంచారు.
-----------------
    ఓ రోజు సాయంత్రం ప్రకాశరావ్‌కు తన ఈడువాడే ఐన సన్నిహిత మిత్రుడు రామారావు పార్కులో కనిపించాడు. అతను అరవైఐదేళ్ళ వాడే ఐనా మరో ఐదు సంవత్సరాలు మీద అనిపిస్తున్నాడు. నిర్వేదంగా కూడా వున్నాడు. కొంచెంసేపు  పిచ్చాపాటి మాట్లాడుకున్న తరువాత అతను బేలగా ''నాకు చచ్చిపోవాలనుంది ప్రకాశ్‌'' అన్నాడు. రామారావు కొడుకు కోడలితో పాటు గాంధీనగర్‌లో వుంటున్నాడు. తనే మళ్ళీ ''చాలా ఒంటరితనం అనుభవిస్తున్నాను. నేను ఎవరికీ అక్కర్లేదు. భార్య పోయాక  నాకిక బతకడంలో అర్ధలేదనిపిస్తూంది. అబ్బాయి కుటుంబానికి నేను  గుదిబండలాగా అయ్యానేమో?'' అన్నాడు. ''నీకు పింఛను వస్తోందికదా'' అన్నాడు ప్రకాశరావ్‌. ''డబ్బుఒక్కటే సమస్య కాదు. వాళ్ళు నాతో ఇమడలేకపోతున్నారు. నా కొడుకు పైకి చెప్పలేక బాధపడుతున్నాడు'' అన్నాడు.
    రామారావు కొడుకు అనిల్‌ తనకి బాగానే తెలుసు. స్వార్ధపరుడు కాదు. ఈ రోజుల్లో అందరి జీవితాలూ సహజంగానే వేగవంతమయ్యాయి. అతను, భార్య ఇద్దరూ ప్రైవేట్‌ సంస్థల్లోనే పనిచేస్తున్నారు. వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకుంటాయి. రామారావుకి, తనకి పెద్దతేడా ఏమీ లేదు. తాను స్వతంత్రంగా బతుకున్నాడంతే. తను పిల్లలకు జంఝాటంకాదు. శ్రీను అమెరికాలో, లక్ష్మి బెంగుళూరులోవుంటున్నారు. తను వాళ్ళదగ్గర శాశ్వతంగా  వుండలేడు. కొన్నేళ్ళ క్రితం తను, సీత అమెరికాలోని మాడిసన్‌కు దగ్గరలో వాసా అనే చిన్న ఊరిలో పని చేస్తున్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళతోవున్నారు. అక్కడ విపరీతమైన చలి.  పక్కింటికో, ఉద్యానవనానికో వెళ్దామన్నా వీల్లేనిపరిస్థితి. అప్పటికీ కొద్దిదూరంలో వున్న గ్రంథాలయంలో సమయం గడపటానికి ప్రయత్నించారు. తన కొడుకు, కోడలు ఉదయాన్నే కార్యాలయాలకి వెళ్ళి సాయంత్రానికిగానీ  తిరిగిరారు. అలా నెలన్నర పోయాక వుండలేక విజయవాడకు తిరిగొచ్చారు.
    ఇప్పుడు సీత లేదు. ఆమెలేనిలోటు తప్ప  అతనికి ఇక్కడే హాయిగావుంది. ఎండలెక్కువే ఐనా ఇతరత్రా బాగానేవుంది. చుట్టూతా కొండలు. ఎక్కడికెళ్ళినా అవిమనతోనే ఉన్నట్లుంటాయి. రోజూ ఎక్కడో ఓ చోట సంగీత, సాహిత్య, నాటక కార్యక్రమాలు జరుగుతూంటాయి.   తను ఖాళీ దొరికితే ఏదోకటి చదువుతూ ఉంటాడు. కవితల్ని వ్రాసుకుంటూంటాడు. ఎలాగూ బాలకుటీర్‌కు చాలా సమయమే కేటాయించాలి. ఇన్ని వ్యాపకాలతో తనకు ఉన్న సమయమే సరిపోవడంలేదు.
    తన ఆలోచనలు తెగాక ''నీ సమస్యకు చావు పరిష్కారం కానేకాదు రామారావు. ఖాళీ సమయాల్లో కేవలం టి.వి. సీరియళ్ళు చూడటం కాక మంచి వ్యాపకాలనలవరచుకుంటే  సమయం సద్వినియోగమవుతుంది. కావాలంటే నాతోపాటు బాలకుటీర్‌కు రా. అక్కడి పిల్లలకు నీ అవసరం కూడా ఉంది. ఐతే నేను చేసినవన్నీ నిన్ను చేయమనడంలేదు. నీకిష్టమైన వ్యాపకాలను గుర్తించి కొనసాగించు'' అన్నాడు. అందుకు రామారావు ''నా భార్య పోయినదగ్గర్నుంచి నాకు జీవితం మరీ నిస్సారంగా అనిపిస్తోంది. బ్రతుక్కర్ధం కనిపించడంలేదు'' అన్నాడు.
    ''నిజమే! సీత పోయాక నాక్కూడా అలాగే ఉండేది. కానీ ఏం చేస్తాం? భూమ్మీద ఏవరూ శాశ్వతం కాదు. మనమందరం రైలు ప్రయాణికులం. ఎప్పుడు ఎవరి స్టేషన్‌ వస్తే వాళ్ళు దిగిపోవలసిందే. ఐతే అదెప్పుడో ఎవరికీ తెలియదు. మిగతావాళ్ళు తమ గమ్యం చేరుకునేదాకా ప్రయాణాన్ని  కొనసాగించవలసిందే. అలాగని నేనేదో పెద్ద వేదాంతిని కాదు. కొన్ని విషయాల్లో మనం తామరాకుమీద నీటి బొట్టులావుండాలి. ఇది నా స్వానుభవం. అంతేగాక సమాజంలో మనకన్నా ఎన్నో కష్టాలు భరిస్తున్నవాళ్ళు చాలామందే వున్నారు. మన మిత్రుడు శంకర్రావు విషయమే చూడు. ఉన్న ఇద్దరు కొడుకులూ ఆస్తి అంతా వ్రాయించుకుని ఇప్పుడు అతన్ని వృద్ధ శరణాలయంలో విడిచిపెట్టారు. డబ్బులుండీ, పిల్లలకి ఆస్తులిచ్చి అతనికా కర్మేంటి? ఇంకా చాలామంది వృద్ధులు ఎవరి ప్రేమకూ నోచుకోక బ్రతుకు గడుపుతున్నారు. వీళ్ళందరితో పోలిస్తే నీ పరిస్థితి చాలా మెరుగు. ఐనా పెద్దవాళ్ళు ఏ దేశానికైనా జాతీయ సంపదలు. వాళ్ళనుంచి యువతరం, పిల్లలు గ్రహించవలసినవి,  నేర్చుకోదగ్గవి చాలా విషయాలుంటాయి. ఆలోచించి చూడు'' అన్నాడు ఆప్యాయంగా ప్రకాశరావ్‌. రామారావుకు తనెప్పుడో చదివిన స్వామి వివేకానంద 'డిటాచ్డ్‌ అటాచ్మెంట్‌' జ్ఞాపకం వచ్చింది.
----------------
    కొన్నిరోజులు పోయాక బాలకుటీర్‌లో పరిస్థితి మెరుగయ్యింది. కృష్ణ చిన్నతరగతి పిల్లలకి వాళ్ళకర్ధంకాని పాఠాలను వివరించి చెపుతున్నాడు. మరింత బాధ్యతతో కుటీర్‌కు సంబంధించిన విషయాల్లో సహాయమందిస్తున్నాడు. రామారావు కూడా బాలకుటీర్‌లోనూ ,ఊర్లోవున్న వృద్ధ మరియు అనాథ శరణాలయాల్లో తనవంతు సేవలందిస్తున్నాడు. ఆ రోజు పౌర్ణమి.  వెన్నెల భూమ్మీద వెండి దుప్పటి కప్పినట్టు ఆవరించి వుంది. ప్రకాశరావు రాత్రి భోజనం ముగించి పడక్కుర్చీలోనే వెన్నెల విహారం చేస్తున్నాడు. రేడియోలోంచి మంద్రస్వరాన  ముఖేష్‌ 'జీనాయహా మర్నాయహా' అంటూ ఆత్మతో పాడుతున్నాడు. తను క్షణక్షణాన్ని ఆస్వాదిస్తున్నాడు. భౌతికంగా సీత అతనితో లేకపోయినా తను పెద్దగా ఒంటరి కాలేదు. ఆమె జ్ఞాపకాలు అతని వెన్నంటే వుంటూ సర్వదా ఉత్తేజ పరుస్తూ ఉన్నాయి. ప్రకాశరావ్‌ అర్ధవంతంగా  బ్రతుకుతున్నాడు. ఈ జీవనయాత్ర తనంతగాతాను సహజంగా అంతమయ్యేవరకూ నిరంతరం సాగిపోతూనే వుండాలి.  'కష్టాల్‌ నష్టాల్‌, కోపాల్‌ తాపాల్‌' అని శ్రీశ్రీ అన్నట్లు ఈ యాత్ర కొనసాగ వలసిందే అని అనుకున్నాడు ప్రకాశరావ్‌.


- బి.వి. శివప్రసాద్‌
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో