Facebook Twitter
పడగనీడ

 

పడగనీడ


    హైదరాబాద్‌లో ఎప్పుడూ గొడవలూ సంఘర్షణలే! మార్చ్‌లూ, ఉద్యమాలూ, మతకలహాలూ, అలజడులూ. ఏ అవాంతరం వచ్చినా కంట్రోల్‌ చెయ్యడానికి అక్కడున్న పోలీస్‌ఫోర్స్‌ చాలదు. జిల్లాలనుండి వేలమందిని రప్పిస్తారు. హడావుడయిపోయాక చార్జీలు, ఖర్చులూ, డ్యూటీకిచ్చే డబ్బూ ఇవ్వడానికి ఒకటిరెండు రోజులక్కడే ఉండాలి. అలజడి ఉన్నన్ని రోజులూ రెస్ట్‌లెస్‌ డ్యూటీ, రాత్రీ పగలూ.. అయిపోయాక పోలీసు ప్రాణాలకీ కాస్త 'మార్పు' కావాలని ఉండదా? అదీ యువరక్తం అయితే జల్సా చెయ్యాలనీ ఉంటుంది. రాజారావు, రమణా పోలీసులు, స్నేహితులు. రాజారావు అనుభవజ్ఞుడు. రమణని రెడ్‌లైట్‌ ఏరియాకి తీసుకుని వెళ్లాడు రాత్రికి. (రెడ్‌లైట్‌ ఏరియాలనేవి ముంబయిలోనే కాదు, ప్రతీ ఊళ్లోనూ ఉంటాయ్‌. పేరు మార్పు అంతే. అంచేత హైదరాబాద్‌లో అది, ఆపేరుగల ప్రాంతం లేదనే టెక్నికల్‌ అబ్జెక్షన్‌ తీసుకుని రావద్దు) తెలిసున్న 'ఆ రకం' ఇంటికి తీసుకుని వెళ్లాడు సీనియర్‌ జూనియర్‌ని. రాజారావుకి సెలక్షన్‌ చకచకా జరిగిపోయింది. అమ్మాయిని తీసుకుని గదిలోకి వెళ్లిపోయాడు. 'మోడస్‌ ఆపరండే' అంతా రమణకు చెప్పడంతో కొంచెం ఆలస్యమయినా అమ్మాయిని సెలక్ట్‌ చేశాడు. ఆ అమ్మాయి తనగదిలోకి వెళ్ళిపోయింది. 'సెటిల్‌మెంట్‌' అయిపోయాక నాయకురాలు చెప్పిన నెంబరు గదికి రమణవెళ్లి లోపల తలుపు గడియపెట్టాడు..
అతనికంతా కొత్త. గది అలంకరణ అదిరింది. నీట్‌గా ఉన్న బెడ్‌. అమర్చి ఉన్న డ్రెస్సింగ్‌ టేబుల్‌, నిలువుటద్దం. మత్తెక్కించే సెంటు వాసనలు, పూలపరిమళాలు.. కళ్లు జిగేల్‌మనిపించే లైట్స్‌... తనపాలిటి స్వప్నలోకం... సీనియర్‌ స్నేహితుని సలహామేరకు డ్రెస్సింగ్‌ టేబుల్‌ దగ్గర నిలబడి, కొంచెం ట్రిమ్‌ అయి, చొక్కాతీసి హేంగర్‌కి తగిలించాడు.. అతని వెనుకగా కొంచెం దూరంలో బెడ్‌. బెడ్‌మీద కూర్చుని కుర్రవాడిని చూస్తున్న 'అమ్మాయి' రమణ వీపు చూసి ఒక్కసారి ఉలిక్కి పడింది.. అతడు తనను చేరేలోవులో.
''బాబూ రమణా! ఇలారా!'' అది పిలుపా, వేడుకోలా, ఆవేదానభరిత ఆక్రందనా???
     రమణ ఆశ్యర్యంతో తబ్బిబ్బయ్యాడు. తన పేరు ఈమెకేం తెలుసు? అయిదారుగురు అమ్మాయిల్లో తనూ నిలబడింది. నవ్వుతూ! తాను సెలక్ట్‌ చెయ్యగానే ఆమె మెట్లెక్కి వెళ్లిపోయింది. నిర్వాహకులు చెప్పారా? అవకాశం లేదు. తనపేరూ, ఊరు వాళ్లకెందుకు? వాళ్లు అడగలేదు. తను చెప్పలేదు. వాళ్ళక్కావలసింది రేటు ప్రకారం డబ్బు, అదీ ఎడ్వాన్స్‌ పేమెంటు! అది సెటిల్‌ చేసి తాను వాళ్లు చెప్పిన రూంకి చేరుకున్నాడు. అయితే ఈమెకు తన పేరెలా తెలిసింది? అడిగాడు...
''నా పేరు నీకెలా తెలుసు?''
    ''తెలుసు! నీవీపుమీదున్న కత్తిపోటు గాయం మానిపోయినా ఆనవాలు పోలేదు, పోదు. ఇంకా కావాలంటే.. మరిన్ని..'' ఆగింది.. ఉద్వేగాన్ని అదిమిపట్టి ''నీ కుడిమోకాలుపైన తొడమీద ఒక పుట్టుమచ్చ. నీ ఎడమ మోకాలు భాగంలో మరో పుట్టుమచ్చ..'' ఇంకా...
''ఆగు.. ఆగండి..'' ఆమె చెప్పేవన్నీ నిజమే. తన వీపు మీద ఫ్రెండ్‌ విసిరిన కత్తి పోటు వాడు కొబ్బరికాయ కొడుతుంటే కత్తిపిడి ఊడి కత్తి తనవీపును తాకిందట. పెద్ద గాయమే అయినా తగ్గిపోయి గాటు మిగిలిపోయింది. ఇక తను ఇంకా పేంటు తియ్యలేదు. ఆమె చెప్పిన పుట్టుమచ్చలు అతను రోజూ చూస్తున్నవే... ''బాబూ, రమణా ఇంకా చెబుతాను విను. నీ పేరు రమణా రావు. 'రమణ' అనే అందరూ పిలుస్తారు. నీతండ్రిపేరు సుబ్బారావు. మీది ఏలూరు పడమర వీధిలో, మీది చిన్న పెంకుటిల్లు. నీకొక నాయనమ్మ ఉంది... నీతల్లి చిన్నప్పుడే ''చనిపోయింది'', అని నీకు చెప్పబడింది..'' ఆగింది.
''ఇంతకీ నువ్వు... మీరెవరు?''   
''నేను నీ కన్నతల్లిని'' రమణ కుప్పకూలిపోయాడు.. ఆమె కూడ తను కూర్చున్న చోటే సొమ్మసిల్లి పడిపోయింది.
 
   రిటైర్డ్‌ లెక్చరర్‌ లక్ష్మీనారాయణ ఊరుకి కొంచెం దూరంగా ఉన్న జూనియర్‌ కాలేజీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాడు. అతను లెక్కల్లో దిట్ట. అతన్ని కోరితీసికుని వెళ్లారు నిర్వాహకులు. రిటైరయినా నెలకు రూ||25వేల జీతం.
  లక్ష్మీనారాయణ పనిచేస్తున్న కాలేజి ఊరుకి దూరమే. రోజూ 9.30కి ఇంటిబయట ఆటోస్టాండుకి చేరేసరికి ఒక ఆటో సిద్ధంగా ఉంటున్నది. రెండు మూడు రోజులు అదే ఆటోలో వెళ్లాక దారిమధ్యలో ఆటోవాలాతో సంభాషణ ప్రారంభించాడు.. టైమ్‌పాస్‌కి.
''అబ్బాయ్‌ నీపేరేంటి బాబూ?''
''ప్రభాకర్‌ సార్‌'' మర్యాదకు ఆనందించాడు లక్ష్మీనారాయణ...
'' ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నావ్‌!''
''అవును సార్‌, సిద్దిపేటకు కొత్తే''
''ఏ ఊరునుండి వచ్చావు?''
''మాది కాకినాడ, సార్‌''
''అంత దూరం నుండి ఇక్కడికెందు కొచ్చావ్‌, అక్కడే ఆటో నడుపుకోవచ్చు కదా!''
'   'ప్రభాకర్‌ ఆలోచించాడు. అతనికి సమాధానం చెప్పే అవసరం తప్పింది. ''మీ కాలేజ్‌ వచ్చేసింది, సార్‌! రేపు అన్నీ చెబుతాను'' అవును. లక్ష్మీనారాయణ కాలేజికి చేరవలసిన టైమ్‌ అయింది...''సరే బాబూ'' అంటూ డబ్బులిచ్చి దిగిపోయాడు. ''హమ్మయ్య, ఈరోజుకి గండం గడిచింది'' అనుకుంటూ వెనుదిరిగాడు. రేపటికి రక్తికట్టించే కథ అల్లడం తేలిక... దొరికిన బేరాలు చూసుకొని తిరిగి తానుండే చోటుకి బయలుదేరాడు. అందరి ఆటోవాలాలకన్న తను లక్ష్మీనారాయణ గారిదగ్గర తక్కువే తీసుకుంటుండడంతో ఆయన తన ఆటోకోసం ఎదురుచూస్తుంటాడు... మరునాడు యథాప్రకారం ఆటో ఎక్కగానే లక్ష్మీనారాయణ ప్రభాకర్‌ వివరాలు అడిగాడు.

(సశేషం)


కొట్టి రామారావు

సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో