Facebook Twitter
ఆరుద్ర ఆనవాళ్లు

ఆరుద్ర ఆనవాళ్లు

 

                                                  - డా. ఎ.రవీంద్రబాబు
 
 
 
    
   ఆరుద్ర అధ్బుతమైన ప్రతిభాశాలి. పై చదువులు చదువుకోక పోయినా ఆయన ఓ విశ్వవిద్యాలయం. గురువు లేక పోయినా ఆయనే గురుతుల్యుడు. ఆయనకు ఏ డిగ్రీలు లేక పోయినా ఆయన రచనలే అనేక మంది పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలను ఇప్పించాయి. ఆయన సాహిత్యంలో చేపట్టని ప్రక్రియ లేదు. ఆయన చేయని ప్రయోగం లేదు. ఆయనకు రాని విద్య లేదు అంటే అతిశయోక్తి కాదు. సినీ కవులే కాదు, సాహితీ వేత్తలు కూడా ఏ అనుమానం వచ్చినా ఆరుద్రనే అడిగి ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకొనే వారట. అందుకే ఆరుద్ర అవిశ్రాంత సాహితీ యోధుడు.
       అరుద్ర అసలు పేరు భాగవతుల శంకరశాస్త్రి. ఆరుద్ర పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆయనను ఆరుద్ర అని పిలిచేవారు. అదే ఆయన కలం పేరుగా పెట్టుకున్నారు. ఆరుద్ర ఆగస్టు 31, 1925లో విశాఖపట్నంలో జన్మించారు. వరసకు శ్రీశ్రీ వీరికి మేనమామ. ఆరుద్రకు తొలి గురువు తండ్రి నరసింహారావు. ఆరుద్ర ప్రాథమిక విద్యను విశాఖపట్నంలో పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ కోసం విజయనగరం వెళ్లినా జాతీయ రాజకీయాల ప్రభావంతో చదువుకు స్వస్తి చెప్పారు. కానీ విశాఖపట్నంలోని రీండింగ్ రూమ్ అనే గ్రంథాలయాన్ని మాత్రం వదల్లేదు. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను అక్కడే చదివారు. పైగా శ్రీశ్రీ, రోణంకి అప్పల స్వామి, చాగంటి సోమయాజుల పరిచయాలతో కవిత్వంపై, తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. చాసో పరిచయం, అపారమైన పుస్తక పరిజ్ఞానంతో మార్క్సిజం పై అభిమానంతో కమ్యూనిస్టు సభ్యత్వాన్ని పుచ్చుకున్నారు. చివరి వరకు ఆ భావాలతోనే జీవించారు.
           కవిగా, రచయితగా కూడా ఆరుద్రది ప్రత్యేక ముద్రే. ఆరుద్ర 1960 నాటికి కవిగా గుర్తింపు పొందినా 13 ఏటనే నా కలలో అనే కవితను రాశారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో విశాఖపట్నం పై జరిగిన బాంబుల దాడిని ఖండిస్తూ లోహవిహంగాలు అనే కవిత రాశారు. 1948 జూలై 10న కృష్ణాపత్రికలో రజాకార్లచే అతిదారుణంగా మానభంగం చేయబడిన వార్త చదివి చలించి తెలంగాణ అనే కావ్యాన్నే రాశారు. కానీ శ్రీశ్రీ సూచన మేరకు దానికి త్వమేవాహమ్ అని పేరు మార్చారు. త్వమేవాహమ్ అంటే నువ్వే నేను అని అర్థం. కవిత్వంలో ప్రయోగాలు చేస్తూ సినీవాలీ అనే కావ్యాన్ని కూడా రాశారు. సినీవాలీ అంటే అమావాస్యలో కనిపించే చంద్రుడు అని అర్థం. గాయాలు - గేయాలు, కూనలమ్మ పదాలు, వెన్నెల - వేసవి, ఇంటింటి పద్యాలు, పైలా పచ్చీసు, రామలక్ష్మీ త్రిశతి వంటి కావ్యాలు ప్రచురించారు. రాముడికి సీత ఏమౌతుంది... వంటి పరిశోధనాత్మక రచనలూ చేశారు. వేమనవేదం, వ్యాసపీఠం, గురజాడ గురుపీఠం లాంటివి ఆరుద్ర వ్యాస రచనలు. డిటెక్టివ్ కథలు కూడా రచించారు. అంతేకాదు  తెలుగులో చదరంగం పై ఓ పుస్తకాన్ని కూడా వెలువరించారు. సాలభంజిక, శ్రీకృష్ణదేవరాయలు, కాటమరాజు కథ లాంటి నాటకాలు కూడా రచించారు. ఇవన్నీ ఒకెత్తైతే కె.వి. రెడ్డి కవి తిక్కన, ఖఢ్గతిక్కన ఒకరేనా అన్న ప్రశ్నకు సమాధానంగా సమగ్రాంధ్ర సాహిత్యాన్ని 13 సంపుటాలుగా తెలుగు ప్రజలకు అందించిన పరిశోధనా దురంధరుడు ఆరుద్ర. ఈ రచన చేసేటప్పుడు కళ్లకు సమస్య వస్తే బూతద్దంతో కావ్యాలను పరిశోధించాడు.  భరతనాట్యం గురించి కూడాపరిశోధనా రచనలు చేశాడు. ఇలా ఆరుద్ర ఏ పనిచేసినా, ఏ రచన చేసినా విపులంగా, సవివరంగా, పరిశోధనా పద్దతిలో సమగ్రంగా చేసేవారు.
         ఆరుద్ర బతుకు తెరువుకోసం అనేక ఉద్యోగాలు కూడా చేశారు. ఆనాటి బొంబాయిలోని రాయల్  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గుమస్తాగా, ఆనందవాణి పత్రికకు సంపాదకుడిగా, విశాఖ హర్బర్ లో గుమస్తాగా, ఫోటోగ్రాఫర్ గా, మద్రాసు ఢంకా పత్రికలో ఫ్రూఫ్ రీడర్ గా పనిచేశాడు. ఎక్కడ చేసినా చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడ్డారు. 1948లో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. అంత్యప్రాసలతో అలవోకగా కవిత్వం రాయగల ఆరుద్రకు పాటలు రాయడం పెద్ద కష్టమేమీ కాలేదు. అందుకే సుమారు 4,500 పాటలు రాశారని చెప్పొచ్చు. కొన్ని సినిమాలకు మాటలు కూడా అందించారు. వారి పాటలు చిత్రంలోని కథకు, సన్నివేశానికి, పాత్రలకు తగిన విధంగా ఉంటాయి. యుగళగీతాలు, విరహగీతాలు, దేశభక్తి గీతాలు, హాస్య గీతాలు, చారిత్రకగీతాలు ఏవైనా ఆరుద్ర తనదైన ముద్రతో రాశారు.    

         1964లో బొబ్బిలియుద్ధం చిత్రంలో ముత్యాల చెమ్మచెక్క రత్నాలచెమ్మచెక్క అంటూ జానపద బాణిని వాణిని పాటలో వినిపించారు. రక్తసంబంధం చిత్రంలో బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే అంటూ పెళ్లి కూతురు వైభవాన్ని కళ్లకు కట్టారు. అలానే అందాల రాముడు చిత్రంలో ఎదగడాని కెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందరవందర అంటూ విద్యా వ్యవస్థను, మానవుని జీవితాన్ని వ్యగ్యంగా చిత్రించారు. నాయకుడు చిత్రంలో ఏకంగా గోంగూర గురించి అద్భుతమైన పాట రాశారు. భాగ్యనగరం గురించి, మహాబలిపురం గురించి ఆయన రాసిన పాటలు ఆ ప్రదేశాల చారిత్రక వైభవాన్ని చాటుతాయి. లక్ష్మీనివాసం చిత్రంలో ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం అని పాటలో ఏకంగా ధనం విలవను, దానిని మనుషులు ఏలా చూడాలో వివరించారు. వీరాభిమన్య చిత్రంలో అదిగో నవలోకం వెలిసే మనకోసం అంటూ ప్రణయగీతానికి పల్లవి పాడారు.

          తొలి ప్రేమలో పడిన మనసు ఊహల్ని వర్ణిస్తూ - బందిపోటు చిత్రంలో ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే అని వలపు బాసల్ని తెలిపారు. గాంధి పుట్టిన దేశామా ఇది, నెహ్రుకోరిన సంఘమా ఇది అంటూ పవిత్రబంధం చిత్రంలో సామ్యవాద భావాలను సందర్భాను సారంగా రాశారు. కొండగాలి తిరిగింది గుండె వూసులాడింది గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది అని మనసులోని కోరికల గుట్టు తీవ్రతను తెలిపారు. నీలిమేఘాలు, గాజు కెరటాలతో తేలిపోయే అనుభూతిని బావామరదళ్లు చిత్రంలో ప్రేక్షకులకు కలిగించారు. పెళ్లిపుస్తకం చిత్రంలో వివాహం పరమార్థాన్నిమనసుమనసు కలపడమే అని నిర్ధారణ చేశారు. పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండూ అని రాము చిత్రంలో భార్యాభర్తల అనుబంధాన్ని పిల్లాడిచే పాడించారు. దేవుడు చేసిన మనుషులు సినిమాలో మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల అని.. ఘాటైన గీతాన్ని పసందుగా చెక్కారు. కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించారు. ఇలా ఆరుద్ర పాటలు భాషలో, భావంలో, అనుభూతిలో, ప్రయోగంలో అరుదైనవి, అతి సుందరమైనవి.
       వీరిని 1974లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ఉత్తమ విమర్శకుని పురస్కారం, 1985లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ పరిశోధకుడి అవార్డు, 1985లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు వరించాయి. 1987లో వీరి గురజాడ గురుపీఠం పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. ఆంధ్ర విశ్వకళాపరిషత్ వీరిని కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.  పెళ్లిపుస్తకం చిత్రంలోని శ్రీరస్తు శుభమస్తు గీతానికి మనస్విని ఆత్రేయ పురస్కారం కూడా వచ్చింది. వీరి రచనలపై పరిశోధనలు జరిగాయి. జరుగుతున్నాయి.
        కంటి చూపు కోల్పోయినా పరిశోధన సాగించిన ఆరుద్ర 1998 జూన్ 4న తన ప్రయాణం ముగించుకొని వెళ్లిపోయారు. ఆ అక్షరయోగి, ఆ పరిశోధనా పనిరాక్షసుడు తెలుగు సమాజానికి, సాహిత్యానికి అమూల్య నిధులను మిగిల్చి తన దారిన తాను వెళ్లిపోయారు. ఆయన పుస్తకాలే మనకు ఆయన జ్ఞాపకాలు. ప్రతి ఒక్కరూ చదవాల్సిన విజ్ఞాన నిలయాలు.