Facebook Twitter
దశరూపకం

  దశరూపకం (కథ)

                                          
   - భమిటిపాటి కామేశ్వరరావు
 
 
 
 
      సున్నితమైన హాస్యం, సంస్కారవంతమైన చమత్కారాలతో కథలు, నాటికలు రాశారు భమిడిపాటి కామేశ్వరరావు. ఇతర భాషల నుంచి తెలుగు చేసినా ఎక్కడా ఆ వాసనలు కనిపించకుండా తెలుగు వారి సంస్కృతిని ప్రతిబింబించేలా రాయడం ఆయనగొప్పతనం. భాషను ప్రయోగించే రీతిలోనే హాస్యాన్ని సృష్టించేవారు. సమకాలీన సమస్యలను రచనలో వస్తువుగా ఎన్నుకున్నా హాస్యంగానే రాసేవారు. అందుకనే వీరిని పండితలోకం హాస్యబ్రహ్మగా కీర్తించింది. వీరు కథలు, నాటికలే కాదు, వ్యాసాలు... లాంటి ఎన్నో రచనలు చేశారు. వీరు రచించిన హాస్యపు కథల్లో దశరూపకం ఓ చక్కటి కథ.
            ఈ కథ అరుదైన శిల్పంలో రాయబడింది. రచయిత భమిటిపాటి కామేశ్వరరావు కేవలం రెండు పాత్రలు రాసుకున్న లేఖల ద్వారా హాస్యాన్ని పండించారు. అంతేకాదు ఆ లేఖల్లో ఆయా పాత్రల మనస్తత్వాన్ని, సమాజంలో రచయితల మధ్య ఉన్న సంబంధాలను సమూలంగా వివరించారు, విమర్శించారు. దశరూపకం కథలో గోపీనాథం, రసరాట్ అనే రెండు పాత్రలు రాసిన లేఖలు మాత్రమే కథా వస్తువు. గోపీనాథ్ మందపిల్ల నుంచి, రసరాట్ పేరారం నుంచి లేఖలు రాసుకుంటూ ఉంటారు. ఈ లేఖలు కూడా 19.11.1938 న నుంచి 8.12.1938 వరకు జరిగిన సంభాషణకు సాక్ష్యాలు. ఈ ఉత్తారాలు గోపీనాథ్ తండ్రి తోటారం భూముల శిస్తుకోసం వెళ్లడం వల్ల  తండ్రి మాటప్రకారం ఓ పుస్తకంపై ప్రముఖ రచయిత రసరాట్ గారి అభిప్రాయం పంపమని గోపీనాథ్ మొదటి ఉత్తరం రాయడంతో దశరూపకం కథ మొదలవుతోంది.
            ఆ పుస్తకాన్ని గోపీనాథ్ రాశాడని అపోహతో రసరాట్ సగం పొగుడుతూ, సగం తప్పులను ఎత్తిచూపుతూ ఇది ఉత్తమోత్తమం అని వ్రాయజాలం కానీ, దీన్ని నీచకావ్యం అని కొట్టిపారెయ్యడానికీ మనస్కరించకుండా ఉంది అన్న అభిప్రాయం రాస్తాడు. వెంటనే గోపీనాథ్ మీకు తండ్రిగారు పంపమన్న రచన అది కాదు, నా కోటు జేబులోనే ఉంది అని మళ్లీ రచనను పంపుతాడు. వెంటనే రసరాట్ స్పందిస్తూ... రచనలో ఉన్నతప్పులు కుర్రతప్పులు కనుక క్షమించవచ్చు, రచయితది మంచి అక్కరకొచ్చే చెయ్యి, సవ్యసాచి అని రాసి పంపుతాడు. అది అందుకున్న గోపీనాథ్ ఆ రచన నాది కాదు అని తిరుగు జవాబు ఇస్తాడు. అందుకు రసరాట్ అసలు ఎవరు ఆ రచన చేశారో చెప్తే బావుండేది అని, రచనలో భాషబాగుంది, కవికి హిందూస్తానీ కూడా వచ్చు అని అభిప్రాయం మార్చి రాసి పంపుతాడు. అది చదివిన గోపీనాథ్ ఈ మానాన్నగారే ఈ రచన పంపమన్నారు. మీరు వారికి బాకీ అన్న విషయం కూడా గుర్తు చేయమన్నారు అని రాస్తాడు. అంతే రసరాట్ కవిగారు  అప్పు ను జ్ఞప్తికి తెచ్చుకొని మనసు మార్చుకొని ఈ రచన నవీన విజ్ఞానం, మహోన్నత కవితాగిరి శిఖరాల్లో ఈ కవి వాక్కు విహరిస్తుంది అని పొగుడుతూ తన అభిప్రాయాన్ని రాస్తాడు.
          కానీ ఇక్కడ మరో తిరకాసు ఉంది. వెంటనే గోపీనాథ్ మా నాన్నగారు కవిత్వం రాయరు. బహుశా అది ఆయనది కాకపోవచ్చు అని తిరుగు ఉత్తరం రాస్తాడు. దానికి రసరాట్ శైలి బాగాలేదు, అతనే అచ్చుకొట్టి ఉచితంగా పంచి ధన్యుడవ్వాలి అని తిడుతూ అభిప్రాయం రాస్తాడు. దానికి గోపీనాథ్ ఆ రచన ఓ కొత్తవానిది బి.ఎ. కూడా చదివాడట అని మా అమ్మ చెప్పింది అని రాయడంతో రసరాట్ తన అభిప్రాయాన్ని మార్చుకొని ఇంగ్లీషును మక్కికిమక్కి తెలుగులోకి పొట్టిగ్రాఫు దించేశాడు. భాష బాగాలేదు అని రాసిపంపుతాడు. గోపీనాథ్ రసరాట్ పంపిన అభిప్రాయం చదివి. ఆ రచన ఘంటారావుదట, మీ ఎన్నికల్లో ఎన్నికల్లో మీ తరపున పనిచేశాడట అని రాస్తాడు. అది చదివి రసరాట్ రచన ఉన్నత భావాలు కలిగి ఉంది, రసం సముద్రపు పోటులా ఉంది అని గొప్పగా రాస్తాడు. ఇలా ఇద్దరి మధ్య ఉత్తరాలు జరుగుతాయి. గోపీనాథ్ చెప్పేదాన్ని బట్టి రసరాట్ రచన గురించిన అభిప్రాయం మార్చుకుంటూ ఉత్తరాలు రాస్తూ ఉంటాడు.
         కథ ముగింపుకు వచ్చే సరికి అసలు విషయం బయటపడుతుంది. గోపీనాథ్ తండ్రి ఊరినుంచి తిరిగి వస్తారు. ఆ రచన సంవంత్సర కాలం క్రితం రసరాట్ రాసిందేనని, నాన్నగారు మర్చిపోయి తన స్వహస్తాలతో రాసి కోటుజేబులో పెట్టుకున్నారని రసరాట్ కు రాస్తాడు. రసరాట్ అంతకు మించిన ట్విస్ట్ ఇస్తాడు. నేను ఊరెళ్లి ఉదయమే వచ్చాను. ఇంతకాలం మా అమ్మాయి ఉత్తరాలు రాసింది. ఆ ఉత్తరాల్లో కూడా మీరు పంపిన కాగితాల్లో ఉన్న విషయాలే రాసిందట, అసలు అది నారచన కాదు కుంభయ్య అనే వ్యక్తి చేతికి నిరుడు మీ నాన్నగారే ఇచ్చారట అని చివరి ఉత్తరం రాస్తాడు.
        ఇలా దశావతారం కథంతా రచయితల్లోని, రచనల్లోని కల్లబొల్లి మాటలను, బహురూపాలను బయటపెడుతుంది. మలుపులు మీద మలుపులతో పాటకుడిలో ఉత్సుకతను పెంచుతుంది. ఒక్కోలేఖ ఒక్కో హాస్యపు గుళికలా మనకు నవ్వును తెప్పిస్తుంది. ఎత్తుకు పై ఎత్తులు, చతురోక్తులు, కుటిలత్వం, కప్పిపుచ్చుకునే ధోరణితో రసరాట్ స్వరూపాన్ని చిత్రించారు భమిడిపాటి కామేశ్వరరావు. కథా శిల్పంలో అప్పటికే ఓ ప్రయోగంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇలా కథను నడపడం అంటే మామూలు మాటలు కాదు. అందుకే భమిడిపాటి కామేశ్వరారవు హాస్యబ్రహ్మ అయినాడు.    
 
                              
                     
డా. ఎ.రవీంద్రబాబు