Facebook Twitter
పోలయ్య

  పోలయ్య  (కథ)
                              
                     

  - కరుణకుమార

 

 

 

         తెలుగు కథ పురుడు పోసుకున్న తర్వాత దాన్ని పసిపాపలా లాలించిన వాళ్లలో కరుణకుమార ఒకరు. అతని చేతిలో కథాబాల ఎన్నో ముద్దులొలికింది, మార్దవాన్ని, తొలి అడుగుల్ని, పలుకుల్ని నేర్చుకుంది. కాదు కాదు... తనవంతుగా కరుణకుమార నేర్పారు. ముఖ్యంగా ఆకాలం నాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను అందంగా కథకు అలంకరించి సంతోషించారు. ఆయన రాసిన ఎన్నో కథలు నేటికీ కాంతులీనుతూనే ఉన్నాయి. అలాంటి కథలలో పోలయ్య కథ ముఖ్యమైంది. ఆనాటి వాస్తవ పరిస్థితులకు చుక్కాని వంటిది.
            పోలయ్య కథ ఈ నాటి దళిత సమస్యను ఆనాటి సమాజంలో పంచములుగా  వాళ్ళు అనుభవించిన అంటరాని తనాన్ని చిత్రించింది. బ్రాహ్మణీయత, భూస్వామ్య స్వభావం వారిని ఎలా బాధించిందో తెలియజేస్తుంది. విఠలాపురానికి చెందిన వెంకటశాస్త్రి గొప్ప పండితుడు. కాశీలో వేదం చదువుకున్న సనాతన ధర్మపరుడు. పంచములంటే సుతారము ఇష్టం లేని వ్యక్తి. వారి గురించి కూలంకషంగా పరిశోధన చేసి వారికీ హిందూ మతానికి ఎలాంటి సంబంధం లేదని సిద్దాంతాన్ని లేవదీసిన ఘనుడు. కానీ- హరిజనులకు నూతన నామకరణం చేయాలని, దేవాలయ ప్రవేశం కలిగించాలని ఉద్యమాలు, ఉపన్యాసాలు బయల్దేరటాన్ని తట్టుకోలే పోతాడు. దాంతో సనాతన ధర్మాన్ని స్థాపించాలని ఉత్తరహిందూదేశ పర్యటనకు వెళ్తాడు. చివరకు పంచములు అన్యమతాల్లో కలుస్తున్నారని తెలుసుకుని పీడా విరగడైందని బ్రహ్మానందం పొందుతాడు.
        ఇతను దేశాటనలో ఉండగా అతనికి మనమడు పుట్టాడని, ఆ సంవత్సరం మాఘశుద్ధ పంచమీ మంగళవారం బారసాలకు తప్పక రావాలని టెలీగ్రామలు అందుతాయి. దాంతో హడావుడిగా కాశీనుంచి బయల్దేరుతాడు. సోమవారం రాత్రి 11 గంటలకు నెల్లూరు సమీపంలోని పుంజూరులో ట్రైన్ దిగుతాడు. కానీ అక్కడ నుండి విఠలాపురం వెళ్లడానికి ఏ బండీ దొరకదు. చివరకు చీకట్లో ఓ ఎద్దుల బండివాడు కనిపిస్తే... బతిమాలి, అర్థరూపాయి ఎక్కువిస్తానని చెప్పి ఆతనిని ఒప్పించి బండిలో ఎక్కుతాడు. బండి సరీగా లేకపోవడంతో నానా ఇబ్బందులు పడతాడు. కానీ మాటల మధ్యలో-
          ఆ గ్రామాల మధ్య మోటారు బండ్లు వచ్చాయని, దాంతో బండ్లు నడిపే వారి జీవనో పాది దెబ్బతిన్నదని, ఎద్దుబండ్లపై ఆధారపడి జీవనం సాగించే వడ్రంగులు, మేదరోళ్లు, ఎద్దుకు గడ్డి అమ్మే మాలమాదిగల స్త్రీలు, బండికొయ్యలు అమ్మేవాళ్లు... ఇలా అందరి జీవితాలు నాశనం అయ్యాయని తెలుసుకుంటాడు. తిండి గడవక వీళ్లందరూ కలిసి మోటారు బండ్ల వ్యాపారం చేస్తున్న గంగపట్నం చెంచునాయుడి లోగిలిలోని గింజలు దోచుకున్నారని వింటాడు. పగపట్టిన చెంచునాయుడు వాళ్లందరినీ జైలులో పెట్టించాడని కూడా మాటల్లో తెలుసుకుంటాడు. అతని మాటల వల్ల అతను పేరు పోలయ్య అని, అతనిది మాల కులమని కూడా అర్థమౌతుంది. దాంతో వెంకటశాస్త్రికి కంపరం ఎత్తుకొస్తుంది. కాశీనుంచి తెచ్చిన గంగ, ఇన్నాళ్లు కాపాడుకొస్తున్న తన సదాచారం అన్నీ మట్టిగొట్టుక పోయాయని తెగ బాధపడతాడు. పైగా చెెంచునాయుడు, వెంకటశాస్త్రి బాల్యస్నేహితులు. ఇతనికి ఇల్లుకట్టించింది, నాలుగెకరాల పొలం ఇచ్చింది కూడా చెంచునాయుడే.
         ఇంటికి  వెళ్లగానే శాస్త్రి చెంచునాయుడిని పిలిపిస్తాడు. అతనికి వీళ్లమీదున్న కోపాన్ని గుర్తుచేస్తాడు. పైగా పోలయ్య వర్ణాశ్రమ ధర్మాలు పాటించకుండా ఇంకోవృత్తి చేస్తున్నాడని, నే బ్రాహ్మణున్నని తెలిసి బండిలో ఎక్కించుకున్నాడని. నా శాస్త్రం మొత్తం మట్టిగొట్టుకు పోయింది అని చెప్తాడు. పాపం పోలయ్యకు మాత్రం తను చేసిన తప్పు ఏమిటో అర్థం కాక బాధపడుతుంటాడు. చివరకు పోలయ్యని కట్టేసి ఒళ్లు కాల్చాడానికి సిధ్దపడతారు. పోలయ్యకు ఏమీ చేయాలో పాలుపోదు. చివరకు ఓ నాటకం ఆడతాడు. తాను క్రైస్తవమతం తీసుకున్నానని, తన తాతకూడా క్రైస్తవుడని అబద్దం ఆడతాడు.  పేరు పౌలయ్య అని చెప్తే, మీరు పోలయ్యగా అర్థం చేసుకున్నారని నమ్మిస్తాడు. దాంతో వెంకటశాస్త్రి, చెంచునాయుడు వెనక్కు తగ్గుతారు. పాదరీలకు, సర్కారోళ్ల దోస్తీ ఉందని, రాజుమతమే, ప్రజల అభిమతమని పోలయ్యని విడిపించి, పైగా మూడు రూపాయలిచ్చి పంపుతారు.      
         ఇది 1932లో అప్పటి భారతి పత్రికలో ముద్రితమైంది. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా, పంచములను హిందూమతంలోకి తేవడానికి గాంధీ లాంటి వాళ్లు చేసిన హరిజనోద్యమం... వంటి చారిత్రక పరిస్థితులకు ఈ కథ అద్దం పడుతుంది. అక్కడక్కడా నెల్లూరు జిల్లా మాండలికాలు తెలుగు భాషా నుడిని గుర్తుకు తెస్తాయి. ఇక కరుణకుమార కథను అందమైన శిల్పంలా చెక్కారు. ముగింపు వరకు కథ ఉత్కంఠరేపగా పోలయ్య ఆలోచనతో దానికి తెరదించి పాఠకుడిని ఆనందపరిచాడు కరుణకుమార. అందుకే హరిజనోద్ధరణను గ్రంథస్తం చేసిన ఈ కథ తొలినాటి దళిత సాహిత్యోద్యమానికి ఓ కొండ గుర్తు లాంటిది. చరిత్ర రచనకు ఓ ఆనవాలు వంటిది.                 

                              

                                               డా. ఎ.రవీంద్రబాబు