Facebook Twitter
కల కల్పన కళ

కల... కల్పన... కళ             

 

                                                       
 
- డా. ఎ.రవీంద్రబాబు

       

  ఎద వాకిళ్లు తెరిచి వెన్నెలను దోసిటపట్టిన రోజుల్లో జ్ఞాపకానికి ఇంత పదును ఉంటుందని తెలియదు. ఎదను కోస్తూ... జీవితం కత్తి అంచుపై యమపాశంలా నర్తిస్తున్నదని తెలియదు. తెలియదు పాపం తెలియదు... ఎడబాటుకు మండుటెండకున్నంత పదును ఉంటుందని నిజంగా తెలియదు. ఊహలు, ఊసులు, ఆశలు, ఆశయాలు మాత్రమే యవ్వనపు పొరిమేర్లలో గమ్మత్తుగా సంచరిస్తుంటే నీ వేడి నిట్టూర్పుల మధ్య కాలాన్ని కౌగిళ్లగా కరిగించిన రోజులకు తెలియదు. పాపం తెలియదు. తెలియదు... తెలియదు. మరణం ముందు ఊగిసలాడే గుండెను ఒడిసిపట్టి కన్నీటిలో ముంచేస్తుందని ఆరోజు తెలియదు... ప్రియా తెలియదు. నిజంగా తెలియదు. అసలు ప్రేమ జగత్తులో మరో మాయా జగత్తు ఉందన్న సత్యం తెలియదు. తెలియకపోవడం కూడా తెలియదు ఈ పిచ్చి ప్రేమ మదికి.  నీ వక్షం మీద ఆన్చిన ఈ తలలో ఇన్ని కల్లోలాలు చెలరేగుతాయని తెలియదు. నిఝంగా తెలియదు.

         వాడెవడో విరహం అంటా...నాతోనే నిత్యం జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తూ స్నేహితుడిలా ప్రాణం తీస్తున్నాడు. ఆది అంతంలేని ఈ చరాచర జగత్తుకు వాడే రాజ్యాధిపతి అట. దేవుడు, సైతాన్ రెండూ వాడేనట. నిన్ను నన్ను ఈ కాలగతిలో చక్రంలా తిప్పేది వాడేనట. ఆ రోజుల్లో హృదయం సినిమా చూసి ప్రేమదేవత ముందు మోకరిల్లిన ప్రేమికుడి గుండెనుండి వచ్చే శూలాల్లాంటి మాటలకు నే కార్చిన కన్నీరుకు లెక్కల్లేవు. ఇప్పటి నా వర్తమానానికి అది పునాది అన్న దృశ్యం తప్ప. సంతోషం అంటే ఏమిటి... ఎక్కడ దొరుకుతుంది... ఎసలు సంతోషం అనేది ఉందా... మనకు మనం కల్పించుకున్న భ్రమా... ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు. ఈ మర్రినీడల్లా సాగే జీవితానికి పరమార్థమే కాదు. అర్థం కూడా లేదేమో... సన్యాసులకూ తెలియక అలా తిరుగుతున్నారేమో... దేవుడిపై భారం వేసి మధ్యతరగతి మానవుడు ఆ ఆలోచనల నుంచి తప్పుకుంటున్నాడేమో... నిజాల్లేవు, అబద్దాల్లేవు... అంతా కల్పించుకున్న ఓ కుత్రిమ జీవిత చిత్రం. నిజమే కదా... అవును నిజం. నిప్పులాంటి దహించే నిజం.
 
           అక్షరాలు గుండెనరాలును తెంచేస్తూ నీ గుర్తులను ధారగా కురిపిస్తున్నాయి. అవి చిదుగుల్లా పొడిపొడిగా రాలుతున్నాయి. అమావాస్యరోజు కురిసే చీకటి సవ్వడిలా... స్మశానం లాంటి నిశ్శబ్దాన్ని మోస్తూ... పదాలు, వాక్యాలు. అర్థం మాత్రం నీవు వదిలేసిన దేహం మత్రమే. దెయ్యాల్లా రాత్రులు శరీరం నిండా గాయాలు చేస్తున్నాయి నీ చేతి గుర్తులను జ్ఞప్తికితెస్తూ... అయినా ప్రేమను పంచుకోడానికే కాదు. కోపంలో కసురుకోడానికీ ఓ తోడు లేకపోతే...ఎంత హాయిగా ఉంటుంది. రోడ్డు మీద మన తలమీదే ఓ నాలుగు చక్రాల వాహనం ఎక్కినట్లు, ఓ ట్రైన్ హటాత్ గా మనలోకి దూరి వెళ్లినట్లు... అవును ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తమలో తాము, తమతో తాము యుద్దం చేస్తున్న ఓ సైనికుడే... ఏకాంతాలు, ఒంటరితనాలు చలినెగళ్లులా కాగుతున్న రక్తకాషారాలే... అప్పుడు ఎవరికి వారే ఓ సునామీ, ఓ బద్దలవుతున్న అగ్ని పర్వతం...
 
           ప్రపంచంలో అన్నిటికన్నా సుఖమైంది, సంతోషమైంది మరణం అట. కాఫ్కా కథలు చదువుతున్నా... జీవితం మరణం వైపు సాగే కళ అట. అవును కళ కల్పన, కల్పన కళ. కల ఓ వాస్తవానికి ప్రతీక. ఫ్రాయిడ్ ఎలా చెప్పాడో... కలల తీరాన్ని దాటే మనిషి అంతరంగాన్ని. ఆ కలల ఒడిలో మునిగిపోయే మనో తీరాన్ని. ఏడుపు గొప్ప కళ అట. ఆ కళ అందరికీ చేతకాదట. అవును నేను నిజంగా ఆకళలో నిరక్షరాస్యుడ్ని. ఎడుపు నా కళ్లనుండే కాదు, నా గుండె నుండి కూడా వెళ్ళిపోయింది. నిషేధం విధించింది నాపైన... మనస్ఫూర్తిగా ఏడిస్తే భారం తగ్గుతుందట. ఏడవకు అని మాట తీసుకొని వెళ్లి... ఏడుపునే నాకు దూరం చేశావు.
 
            ఈ రోజు ఆకాశంలో నక్షత్రాలులేవు. మబ్బుల్లేవు. మానవత్వం లేదు. మనో నేత్రం విప్పే మనుషులు లేరు. నేను ఇక్కడో వలస జీవిని. ఎదస్పర్శలన్నీ ధనంలోకి కుదించబడ్డాయి. ఐదుకు, పదికి ప్రేమలు దొరుకుతున్నాయి. వాటికి ప్రేమ అని పేరుపెట్టి శరీరాలను డబ్బుతో కొనుక్కుంటున్నారు. పెళ్లిళ్ల పేరుతో వ్యాపారం సజావుగానే సాగుతుంది. కట్నాలతో కూడా ప్రేమలు బాగానే దొరుకుతున్నాయి. ముసుగుల మధ్య జీవితాలు నాట్యాలు చేస్తు... నటిస్తున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ నేనే.  నాలో నేను ఉప్పొంగే సముద్రం, వర్షించని నా ఎడారి కళ్లు తప్ప అంతా బాగనే ఉంది. చావుకు, బతుక్కు మధ్య గడియార లోలకంలా కొట్టుకుంటుంది నా ఎద లయ. వింటే మనసుంటే..., తట్టుకునే నీ లాంటి శక్తి ఉంటే...
             కాలం ఎప్పుడూ ఇంతే అకారణంగా హత్యలు చేస్తుంది. నిన్ను, నన్ను, మరణాన్ని, మన ప్రేమను... ఎన్నని చెప్పను. తగలబడుతున్న నా ఎద సాక్షిగా... ఇంకో సారి చెప్తా విను. ఇక్కడ ప్రేమలు లేవు. అవసరాలు, అవకాశాలు, కోర్కెలు, డబ్బు, హోదాలు, కీర్తి... వాటికోసం నటన. మరి నేనెలా బ్రతకాలి... నీ పాటికి నీవు వసంతాన్ని వెంటేసుకుని, నీయాత్రను ముగించుకొని అలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోయావు. నాకు ఇక్కడేం పని. నే చెయ్యాల్సిన పనులు ఏముంటాయి. ఈ రక్కసి మనసుల మధ్య, ఈ వస్తువినిమయ మనుషుల మధ్య... అందుకే అందరినీ వేడుకుంటూ ఉన్నాను. ఆరిపోయిన వెలుగుల మధ్య ఆరిపోయిన కొవ్వొత్తిని ఎవరూ వెలిగించడానికి ప్రయత్నించకండి. ఈ పేజీ చించేయబడింది. ఈ పుస్తకం శాశ్వతంగా మూసివేయబడింది. దయచేసి చివరి అట్టకూడా తెరవకండి. అటునుంచి చదవాలని పిస్తుంది.
బై.... ఒక జీవితకాలం... కాలం... లయం... యం.