Facebook Twitter
గాలిపటం

  గాలిపటం


                                                   - వట్టికోట ఆళ్వార్ స్వామి

 


         వట్టకోట ఆళ్వార్ స్వామి. తెలుగులో తొలితరం కథారచయితల్లో ముఖ్యుడు. అంతేకాదు తెలంగాణలో కథకు ఓ భూమిక ఉంది అని చెప్పడానికి ఓ చారిత్రక సాక్ష్యం. ముదిగంటి సుజాతరెడ్డి వట్టికోట ఆళ్వార్ స్వామి కథలన్నీ సేకరించి ముద్రించారు. అవి తెలుగు సాహిత్యంలో నిలిచే మణుల్లాంటివి. ఒక్కో కథ వైవిధ్యంతో కూడి మన మనసునను సునితంగా గాయం చేసి బాగుచేస్తాయి. మనల్ని నిజమైన మనుషులుగా తయారు చేసే మానవీయతను నింపుతాయి. అలాంటిదే గాలిపటం కథ.
         ఈ కథ ఉత్తమ పురుషలో రచయిత చెప్తున్నట్లు నడుస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకుని హాస్పెటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు కథలో నాయకుడు. అయితే డాక్టరు రోజూ ఆవుపాలు తాగు ఆరోగ్యానికి అవసరం అని చెప్తాడు. అయితే ఎన్ని చోట్ల తిరిగినా, ఎంతమంది పాలవ్యాపారులను అడిగినా కల్తీలేని ఆవుపాలు దొరకటం కష్టం అని తెలుస్తుంది. అయితే చివరకు వాళ్ల ఇంటికి దగ్గరగా ఉండే ఓ చిన్న దుకాణంలో అడుగుతాడు. ఆ దుకాణం ముసలాయని దొరకుతాయి కానీ మనం కల్తీలేనివని పూర్తిగా నమ్మలేం అంటాడు. అప్పుడు ఆ ఇంట్లో నుంచి ఓ అందమైన స్త్రీ బైటకు వచ్చి దొరుకుతాయి. మీకు ఎన్ని కావాలి? అని అడుగుతుంది. ఆమె మాటలు, చూపులు, ప్రవర్తనలో అతనికి ఆమె తనను కోరుకుంటుంది అని అర్థమవుతుంది. కానీ తనకు పాలు అవసరం కాబట్టి... రోజూ నా కొడుకును పంపుతాను. అద్దసేరు చాలు అని చెప్పి ఇంటికి వెళ్తాడు. జరిగిన విషయం అంతా భార్యకు చెప్తాడు. భార్య సరదాగా ఆటపట్టిస్తుంది. రోజూ పాలు కొడుకుతో డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటూ ఉంటాడు. రోజూ ఆ కొట్టు మీద నుంచి వెళ్లేటప్పుడు ఆమె తనను గమనిస్తున్నదన్న విషయం అతనికి తెలుస్తూనే ఉంటుంది. ఒకసారి భార్యకు కూడా ఆమెను చూపిస్తాడు.
             ఒకరోజు బయటకు వెళ్తుంటే ఆమె అతడిని లెక్క సరిచూసుకోవా? అని కొట్టు దగ్గరకు పిలుస్తుంది. వెళ్తాడు. పాలు కల్తీ లేకుండా పోస్తున్నావా? అని అడిగితే... మీకు మనిషి పాలు ఇష్టమేనా...!? నా పాలే కలుపుతున్నా...! అని ఒయ్యారాలు తిరుగుతూ మా మామ లేడు. రాత్రి ఎనిమిది గంటలకు వస్తే...! అని చెప్తుంది. ఇంతలో అతని స్నేహితుడు మల్లేశం వస్తే బతుకు జీవుడా అని అతనితో ఇంటికి వెళ్తాడు. జరిగిన విషయం అంతా భార్యకు చెప్తాడు. రాత్రి ఎనిమిది గంటలకు ఆమెకు తెలియకుండా మల్లేశాన్ని తనను వెంబడించమని చెప్తాడు. అలానే ఆ సమయానికి ఆమె దగ్గరకు వెళ్తాడు. మా మామ వచ్చాడు. ఎక్కడికైనా వెళ్దాం? అని అడుగుతుంది. ఇద్దరూ కలిసి పబ్లిక్ గార్డెన్ కు వెళ్తారు. ఒక చెట్టుకింద కూర్చొంటారు. మల్లేశం వాళ్లని వెంబడిస్తూనే ఉంటాడు.

             అతను నీకు పెండ్లికాలేదా... అని అడిగితే ఆమె కండ్ల నీళ్లతో చెప్తుంది. ఆ కొట్లో ఉండే ముసలాయనికి, ఆమెకు ఏ సంబంధం లేదని, అందరూ మోసం చేశారని, పెండ్లి చేస్తామని ఇక్కడకు తెచ్చారని. జనాలకు భయపడి పుట్టిన పసిగుడ్డుని మామయం చేశాడని, ఆ పాలే రోజూ అతనికి పోస్తున్నాని...!  అతనికి కూడా కండ్లలో నీళ్లు తిరుగుతాయి. నీ పాలు తాగిన కొడుకుగా చెప్తున్నాను... నీకు మంచి జీవితం చూపిస్తాను. నీకు పెండ్లి చేసుకోవాలిని ఉంటే మీ మామను వదిసలేసి రా... నిన్ను పదిలంగా కాపాడుతాను అని చెప్తాడు. చివరకు మల్లేశాన్ని, ఆమెను తీసుకొని ఇంటికి వెళ్తాడు అతను. భార్య ఆమెను సాధరంగా ఆహ్వానిస్తుంది. మల్లేశం ఆమెను చేసుకోడానికి ఒప్పుకుంటాడు. ఆ సంతోషంలో ఆమె అతడ్ని ఒక తల్లిలా వచ్చి కౌగిలించుకుంటుంది.
               ఈ కథ హృదయాన్ని ద్రవింపజేస్తుంది. మనలోని మూనవత్వపు లోతులను వెలికితీసి కన్నీరు పెట్టిస్తుంది. పైగా ఆళ్వార్ స్వామి ఎక్కడా కుత్రిమమైన వర్ణనలు, వస్తువును దాటిన సన్నివేశాలు కల్పించడు. ప్రతిదీ హృద్యంగా చిత్రీకరిస్తాడు. మధ్యమధ్యలో మనుషుల తీరును, సమాజ పోకడను ఎండగడతాడు. పాలబేరం చేసే ప్రతివాడు కల్తీలేని ఆవుపాలు దొరకవని చెప్పే స్థాయికొచ్చాడు. అటువంటి నగ్నసత్యాన్ని అరమర లేకుండా బయటపెడ్తున్నారు. కల్తీపాలు కల్తీ కానివని చెప్పి అమ్మచూపే చైతన్యం మనోనిబ్బరం దెబ్బతిన్నందుకు సంతషించాను. మరోచోట పురుషుని నిజాయితీని, నైతికతను చెప్తూ.. ఎవరో ఏమేమో తప్పులు చేస్తుంటారని మనం అనుకుంటాం. కానీ అటువంటి వాతావరణం పరిస్థితి ఒత్తిడి మనకు కలిగినపుడు మనము ఏమౌతామో అప్పుడుగాని తేలదు... ఇలాంటివి కథ మధ్య ఇతివృత్తానికి బలాన్ని చేకూరుస్తాయి.
               భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఒకరికి ఒకరిమీద పూర్తి నమ్మకం. ఈ కథలో భార్యాభర్తల మధ్య రచయిత కొంటెతనాన్ని చిత్రీకరించినా... ఇరువురికీ ఉన్న సంబంధాన్ని చెప్తూ... ఎవరేమనుకొంటే మనకేంటండీ...! మన సంగతి మనకు తేలియకుండా ఉందా..! ఎవరినీతి వారినే కాపాడుతుంది అని భార్య ద్వారా చెప్పిస్తాడు ఆళ్వార్ స్వామి. అలానే మరోచోట... స్త్రీ, పురుషల మధ్య కోరిక కలగటానికి పురుషుడు కూడా కారణమే అని చెప్తూ... ఒక స్త్రీని వలలో వేసుకోడానికి, ఆమెలో దుర్బుద్ది రేకెత్తించడానికి నూటికి నూటాయాభై వంతు పురుషుని దుష్టచింత, ప్రేరణ ఉంటుందని నా విశ్వాసం అని రాస్తాడు.
               కథలో వ్యావహారిక భాష వాడినా పాత్రోచిత భాషగా తెలంగాణ బాషను వాడారు.. రేపో, ఎల్లుండో వస్తడు... నీకోసం మీగడ దాచి ఉంచిన తినరాదూ... ఆ కల్తీ నీకు నుక్సాన్ చెయ్యదులే, మరింత బలం వస్తది... ఇక కథకు గాలిపటం అని పేరు పెట్టడంలోని విశేషం...ఆమె పాత్రకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. కథ ప్రారంభంలో పాల ప్రాస్తావన తెచ్చి, అవే నాయకుడి పాత్రకు జీవంగా చేసి, కథ మధ్యలో వాటికి ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి, చివరలో... ఆ అమ్మాయి అమాత్తంగా వచ్చి నన్ను కౌగిలించుకున్నది. చేపిన ఆమె పాల రొమ్ములు నా చొక్కాను తడిపాయి. అని ముగించడం కథా నిర్వహణకు ప్రాణం. జీవం.
         అందుకే ఈ కథ తెలుగు కథా సాహిత్యంలో ఒ కలికితురాయి అనిచెప్పొచ్చు.                
                                                                        
                                                         
-   డా.ఎ. రవీంద్రబాబు