Facebook Twitter
వలచి వచ్చిన వనిత - 2

వలచి వచ్చిన వనిత

-వసుంధర

 

పార్ట్ - 2

శ్రీదర్ బాబు మళ్ళీ ఒక్కక్షణం ఆగి చెప్పసాగాడు.__" స్పహతప్పినా సుదర్శనం చావలేదు. నేను హంతకుణ్ణి కాలేదు. కానీ__సుదర్శనమంతటివాడిని దెబ్బతివిపించిన  మొనగాడిగా స్కూల్లో నాకు పేరువచ్చింది. నాకూ సుదర్శనానికి శత్రుత్వం ఏర్పడలేదు. మేమిద్దరం ఇంకా  మిత్రులయ్యాం. ఒకరి చెల్లెలి జోలికి మరొకరు పోరాదనీ__పార్వతి నా చెల్లెలని తెలియక పోరబాటు చేసినందుకు క్షమింఛవలసిందనీ__సుదర్శనం నన్ను కోరాడు__"

    శ్రీధర్ బాబు చెప్పినదివింటూ నేను ఆలోచిస్తున్నాను ఇతగాడికి పరాయి అడదంటే ఏ మాత్రం గౌరవంలేదు. తను అందరి ఆడపిల్లల వెనుక పడలేడు. కానీ__తన చెల్లెలిని ఎవ్వరేమన్నా సహించలేడు. ఏమిటీ విచిత్ర మనస్తత్వం?......నిజం చెప్పాలంటే ఒక్క శ్రీధర్ బాబుకే కాదు-ఇటువంటి మనస్తత్వం ఎంతో కొంత ప్రతి మగవాడిలోనూ కూడా ఉన్నదేమోనని నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకోవాలనిపించింది.

    "వింటున్నావా__నా చెల్లెలని తెలియక సుదర్శనం పొరబాటు చేసినప్పుడే నేను క్షమించలేకపోయాను. అటువంటప్పుడు తెలిసి ఎవరైనా పొల్లుమాటంటే...."శ్రీధర్ బాబు వాక్యం పూర్తి చేయకుండా నాకేసి చూసాడు. అతని చూపుల్లో ఆ తర్వాత వాక్యం కనిపించింది.

    నేనుకాస్త నెమ్మదిగా అన్నాను__"చావంటే నాకు భయంలేదు. అలాగని కోరి చావుని ఆహ్వానించను. కానీ ఒక్క సందేహం ప్రతి ఆడది నీ చెల్లెలిలాంటిదేనని ఎందుకు భావించవు?"

    శ్రీధర్ బాబు సినిమా విలన్లా వికటాట్టహాసంచేసి__" చాలా చచ్చు ప్రశ్ననీది. మగాడికి ఆడదాన్నిచూస్తే వెర్రెత్తుతుంది. మీసమున్న మగవాడిగా నాకు తోచినట్లు ప్రవర్తిస్తాను. భావుంటే ఎవడినైనా అడ్డుకోమను. ప్రతి ఆడదానికీ నాకు లాంటి అన్నదోరకడు. అందుకు శిక్ష వాళ్ళనుభావించవలసిందే_" అన్నాడు.

    ఆ నాటినుంచి శ్రీధర్బాబు నేను మళ్ళీ ఎన్నడూ వాగ్యుద్ధం చేయలేదు. అతను నన్ను పంతులూ అని మరి పిలవనందువల్ల  నేనతన్ని బావా అనవలసిన అవసరంకూడా రాలేదు. మా స్నేహం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చినా శ్రీధర్ బాబుకు మూర్కత్వముందనీ, అతను కాస్త ప్రమాదకరమైన వ్యక్తి అనీ అన్నవిషయం మాత్రం నేను విస్మరించలేదు.....

    జరిగిన విషయం ఈ రోజు మధ్యాహ్నం నా చెవినపడింది. నిన్న సాయంత్రం ప్రపుల్ల అనే అమ్మాయిని శ్రీధర్బాబు చేయిపట్టుకుని లాగి కన్నుకొట్టాడట. పుల్లారావు ప్రపుల్లకు అన్న. అతను తన మిత్రబృందం సమక్షంలో శ్రీధర బాబు చెల్లెలికి తనద్వారా నడిరోడ్డుపై__అలనాడు ద్రౌపదికి జరగబోయి ఆగిపోయిన అవమానం __ఆగకుండా జరగబోతోందనీ___అందుకోసం తను బయల్దేరి శ్రీధర బాబు ఊరికి వెళ్ళబోతున్నాననీ ప్రకటన చేశాడు. అ ప్రకటన  రాకెట్  కంటే వేగంగా పయనించి శ్రీధర బాబుని చేరుకుంది.

    ఆ రాత్రి గదిలో నావంక చూసి___"వాడికి మూడింది.!" అని  శ్రీధర బాబు అన్నప్పుడు వాడంటే పుల్లరావని నాకు అర్ధమైంది. పైకి  అనకపోయినా ___"శ్రీధర బాబు__నీ ప్రవర్తన మూలంగా నీచెల్లెల్ని నలుగురి నోళ్ళలోనూ పారవేస్తున్నావు.___అనుకున్నాను నాలో నేనే.

    ఆ మర్నాడు చావు తప్పి కన్ను  లొట్టపోయిన దశలో బైట పడ్డాడు పుల్లారావు. శ్రీధర బాబు చాలా తెలివిగా వ్యవహరించి మరీ పగతీర్చుకున్నాడు. కొట్టినదెవరో సాక్ష్యం దొరకకుండా పుల్లరావును ఒంటరిగా పట్టాడు. పొలిసు పద్దతిలో వళ్ళంతా కుళ్ళబొడిచి వదిలిపెట్టాడు. ఏమన్నా గొడవ చేసినా మరోసారి తన చెల్లెలి ప్రసక్తి తీసుకువచ్చినా___ప్రాణాలు దక్కవని హెచ్చరించాడు.