Facebook Twitter
ప్రతీకారం

                      ప్రతీకారం   


    "మేడమ్! ఈ రోజు మీకు ఫేర్ వెల్ పార్టీ ఎరేంజ్ చేశాము." లలిత చెప్పి వెళ్ళిపోయింది.

    అద్దం ముందు నిల్చున్న కల్పన అలాగే తన మొహాన్ని చూస్తుండి పోయింది. వెండితీగల్లాంటి తలవెంట్రుకల్ని ఆప్యాయంగా సవరించుకుంది.

    తన జీవితంలోని అనుభూతుల్ని ,ఆవేదనలనూ పంచుకొని తోడుగా నడిచింది అద్దమే! అది తన బింబం! దానికి తెలుసు తనలోని మాయని గాయాలు ఆనందాతిరేకాలు!

    అప్పుడే తను రిటైరు అవుతోందా! అంటే తనింక పనిచేయటానికి పనికిరాదనీ, విశ్రాంతి తీసుకోమనీ... ఇదెలా సాధ్యం... తను ఖాళీగా కూర్చొని విశ్రాంతి తీసుకోగలదా!

    ఈ రోజు ఈయబోయే పార్టీలో కాలేజీకి తనకూ ఋణం తీరిపోతుంది. తన జీవితంలోని ఒడుదుడుకుల్నీ, ఎత్తుపల్లాలను స్పర్శించిన గాలీ, తన జీవితంలోని అవహేళనలూ, అమర్యాదలతో బాటు ఆరాధననూ గౌరవాన్నీ అమితంగా పొందేట్లు చేసిన కాంపౌండు వాతావరణం...

    అసలు తన మనసుకు నిజంగా దగ్గరైన వ్యక్తి ఉన్నారా... చప్పున మధు గుర్తొచ్చాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ స్వచ్చమైన మనిషికి ప్రతీకలా...అటువంటి మధును తన జీవితంలోకి ప్రవేశించనీయకుండా తనే నిర్ధాక్షిణ్యంగా తోసేసింది. సమాజానికి భయపడా?... హు... ఇంతలా శాసించిన సమాజం తన బాగోగుల్ని పట్టించుకుందా? తన భయంకరమైన మానసిక సంఘర్షణ గురించి ఆలోచించిందా?... ఆఖరికి కట్టుకున్న భర్త కూడా... నిర్ధాక్షిణ్యంగా తనను పట్టించుకోలేదు... కానీ చిత్రం... మధు తన మనసును అంత స్పష్టంగా ఎలా ఫోటో తీయగలిగాడు.  

    ఈపాటికి తాత హోదాలో ఎక్కడో మనవళ్ళు, మనవరాళ్ళతో కాలక్షేపం చేస్తుంటాడు... నిజంగా జీవితం ఎంత భయంకరమైనది. ఎంత విచిత్రమైనది... నవ్వుకుంది కల్పన. గతం తాలూకు ఆలోచనలు పరదాల్లా చుట్టేసి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

    అందరు ఆడపిల్లల్లాగానే కోటి కోరికలతో కలల ఇంద్రధనుస్సును వెంట బెట్టుకొని పారాణి పాదాన్ని అత్తింట్లో పెట్టింది కల్పన.

    "ఏమ్మా! మీ నాన్న ఇస్తానన్న కట్నం తాలూకు బాకీ ఏది" అడిగింది అత్తగారు ఆ రోజు సాయంత్రమే!

    నిర్ఘాంతపోయింది కల్పన.

    "నాన్న నాతో ఏమీ చెప్పలేదే" కన్ ఫ్యూజన్ గా అంది.

    "అవును తల్లీ ఎందుకు చెప్తాడు? తల్లిలేని బిడ్డ అంటూ నా కొంపమీద పడేసి చేతులు దులిపేసుకున్నాడు మీనాన్న... అయినా ఇదంతా నా కొడుకు చేసిన నిర్వాకమే... వాడేగనుక నిన్నే చేసుకుంటానని పట్టుబట్టకపోతే... ఆ నూజివీడు సంబంధం చేసుకుంటే మూడు లక్షలిచ్చేవాళ్ళు... అంతా నా ఖర్మ" వ్యంగ్యంగా అందావిడ.

    "కల్పనా! మా అమ్మ మాటలకు కష్టపెట్టుకోకు..." మొదటి రాత్రి తనని దగ్గరగా తీసుకొన్న భర్త గుండెలపై తల ఆనించింది కల్పన. ఆమె కన్నీళ్ళు అతని లాల్చీని తడిపాయి.

    "ఛీ... పిచ్చీ... ఎందుకీ కన్నీళ్ళు... ఆవిడే సర్దుకుపోతుంది. నువ్వు ఎమ్.ఎ. చదివావంటే నాకు నమ్మకం కుదరటం లేదు" తేలికపడిన మనసుతో తన బేలతనానికి తానే సిగ్గుపడిపోయింది.

    శ్రీనివాస్ ఆఫీసుకి వెళ్ళాక అత్తగారి విశ్వరూపం చూసి భయపడిపోయింది కల్పన. ఎంత సర్దుకుపోతున్నా ఆవిడ సతాయింపు సణుగుడు పెరుగుతున్నాయే గానీ అవగాహన పెరగటం లేదు. భర్త ఉన్నప్పుడు ఒక రకంగానూ అతను లేనప్పుడు మరోవిధంగా ప్రవర్తించే ఆవిడ్ని చూస్తుంటే సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసే పాత్రలు గుర్తొస్తున్నాయి కల్పనకు.

    ఆరోజు మధ్యాహ్నం కల్పన దొడ్లో బట్టలారేస్తుంటే మళ్ళీ మొదలెట్టింది అత్తగారు.

    "మీ నాన్న చచ్చేలోపయినా ఇస్తాడా ఆ ఐదువేలు".

    కల్పనకి చాలా కోపం, ఆవేశం వచ్చాయి.

    "అసలెందుకియ్యాలి... ప్రాణంలా పెంచిన నన్నిచ్చాడు... చాలు" గభాల్న అనేసింది.

    "ఏంటే... అంత రోషమొచ్చింది... వెళ్ళి ఆ ఐదువేలు తీసుకొచ్చి మాట్లాడు..." బరబరా కల్పనని వాకిలి దాకా లాక్కెళ్ళింది.

    "ఫోవే పో... డబ్బు తెచ్చాకే నా గడపతొక్కేది..." మొహం మీదే తలుపు లేసిందావిడ.

    ఇరుగుపొరుగు వాళ్ళంతా చోద్యం చూస్తున్నారు. కానీ ఒక్కరూ నోరు మెదపలేదు.

    కల్పనకి పౌరుషం ముంచుకొచ్చింది. "తను బతకలేదా! డబ్బు ఎదురు ఇచ్చి బానిసగా బతికే ఈ దుర్భర జీవితం కోసం ఎందుకు పాకులాడాలి... తన జీవిత సౌధాన్ని తాను నిర్మించుకోగలదు... భర్తకి తన శరీరమే గానీ మనసు అవసరం లేదన్నది తేలిపోయింది. అనుభూతుల్ని పట్టించుకోని అవకాశవాది... తల్లి దోషాలను పరోక్షంగా సమర్ధిస్తున్న పిరికివాడు..."

    స్నేహితురాలు రమణి దగ్గరికి విజయవాడ వెళ్ళే రైలెక్కేసింది. అక్కడే రమణి సాయంతో కాలేజిలో లెక్చరర్ గా చేరింది. తండ్రిని సమాధానపరచి పిలిపించుకుంది. జీవిత వైకుంఠపాళిలో పాముల్ని తప్పించుకుంటూ కష్టపడి నిచ్చెనలనే ఎక్కింది.

    ప్రిన్స్ పాలయినా ఆడంబరం లేక సంస్కార ముట్టిపడే ఆమె ప్రవర్తనే ఆమెకు శ్రీరామరక్షగా నిలిచింది. జీవితంలో ఎదురుపడిన ఆత్మీయుని చేయి మాత్రం అందుకోలేకపోయింది... సమాజానికి భయపడిందా... తను!... శ్రీనివాస్ మరో పెళ్ళి చేసుకున్నాడనీ... ఆమె పరమగయ్యాళి కావటంతో ఇల్లు నరకంగా మారిందనీ అతను పచ్చితాగుబోతుగా మారాడనీ... ఎవరిద్వారానో తెలిసింది. 

    "మేడమ్ పార్టీకి టైమయింది..." లలిత పిలుపుతో ఆలోచనల్ని వదిలించుకుని అనుసరించింది కల్పన.

    పొగడ్తలూ ,ప్రశంసల మధ్య వీడ్కోలు ఇచ్చిన తన వారందర్నీ చూస్తుంటే కళ్ళు చెమర్చాయి. భారమయిన హృదయంతో అందరికీ కృతజ్ఞతలు తెలిపి మౌనంగా ఇంటికి వచ్చి వరండాలోని కుర్చీలో చేరగిలబడి కళ్ళు మూసుకుంది.

    మొమెంటోలు, పూలదండలు టీపాయ్ మీద పెట్టి లలిత నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. మేడమ్ ని అప్పుడు డిస్ట్రబ్ చేయకూడదని ఆ అమ్మాయికీ తెల్సు.

    ఇన్నాళ్ళూ కాలేజి, ఉపాధ్యాయులు, విద్యార్ధినులు వాళ్ళ వ్యవహారాలకు జీవితాన్ని సమర్పించుకొని తన ఉనికినే మర్చిపోయిన కల్పనకు ఇప్పుడు ఎన్నడూ లేనంత ఒంటరితనంగా ఉంది. ఎవ్వరున్నారు తనకి? ఎందుకింత వేదన తన జీవితంలో... తనవాళ్ళనుకున్న వాళ్ళంతా ఈ రోజు వీడ్కోలు చెప్పేశారు...ఇన్నాళ్ళూ ఇంత ఒంటరితనం ఎక్కడ దాక్కుంది... నాన్న ఉన్నా ఈ రోజు ఇంత బాధగా అన్పించేది కాదేమో...!

    తండ్రి గుర్తు వచ్చేసరికి ఆమె కనుకొలకుల్లో తడితడిగా కన్నీరు... అరె...ఇంకా ఈ కన్నీరు నాలో దాగుందా... తండ్రి తన జీవితం పట్ల అసంతృప్తితోనే కళ్ళు మూశాడు... కూతురు పచ్చగా పిల్లపాపలతో కళకళలాడాలని ఏ తండ్రి కోరుకోడు... తన హోదా... డబ్బు ఆయనకి తృప్తినీయలేదు... తనకి మాత్రం? ఏ మూలో అసంతృప్తి లేదూ... ఎవరినైనా పెంచుకున్నా బాగుండేది.

    ప్చ్... కాలేజి పిల్లలే తన పిల్లలనుకుంది ఇన్నాళ్ళూ... బంధువులకు తానేనాడో దూరమయింది.

    లైటు కూడా వేయని ఆ చీకటి ఇంటిలో ఒంటరి నక్షత్రంలా ఆమె...

    గేటు దగ్గర 'దబ్బు'మని చప్పుడు విన్పించి చివాలున తలతిప్పి చూసింది.

    ఎవరో తెలీటం లేదు. అస్పష్టమైన ఆకారం. చేతిలో కఱ్ఱ కూడా ఉంది. పడిపోయినట్లున్నారెవరో...

    "ఎవరూ..." లేచి లైటు వేసింది.

    ఎవరూ బదులివ్వలేదు. దగ్గరిగా వెళ్ళిన కల్పన లైటు వెలుగులో ఆ వ్యక్తికి పోల్చుకుంది.

    ఆమె మనసు నిండా ఆశ్చర్యం, అనుమానం వింతగా కమ్మేశాయి.

    "మీరు... ఇలా... ఈ స్థితిలో..." తడబడింది కల్పన. ఆమె కల్పన కాళ్ళు చుట్టేసి ఏడవడం ఇబ్బందిగా కూడా ఉంది.

    పదినిమిషాలలా ఏడ్వనిచ్చి దుఃఖపు తెరతగ్గాక "ఏమిటిలా వచ్చారు... ఇలా అయిపోయారేమిటి..." అత్తగారి పట్ల కల్పన గొంతునిండా అంతులేని సానుభూతి. ఆ సానుభూతి అత్తగార్కి నిలువునా కత్తితో చీల్చినట్లు అన్పిస్తోంది.

    "నన్ను క్షమించు కల్పనా! నీకు చేసిన అన్యాయానికి నేనిలా బిచ్చగత్తెనయిపోయాను" కన్నీరు లావాలా కరుగుతోందామె కళ్ళనుండి.

    "ఇలా ఎందుకు జరిగింది... రండి లోపలికి..." ఆమె చేయిపట్టి లేవదీసింది కల్పన.

    అతి బలవంతంగా నడిపించుకొని లోపలికి తెస్తుంటే ఆయాస పడుతూనే ఆమె వివరిస్తోంది.

    "నళిని... అదే నా రెండో కోడలు ఎవరినో ప్రేమించిందట. వాళ్ళ వాళ్ళు బలవంతంగా వీడికిచ్చి చేశారుట... చివరికి అతనితో వెళ్ళిపోయింది... నా బంగారు తండ్రి శీనూ జీవితం నా చేతులతో నేనే... పాపిష్టి డబ్బుకోసం నాశనం చేశాను... తాగి తాగి వళ్ళు తెలీక లారీ కిందపడి నా శీనూ..." ఆమె పమిట కొంగు నోట్లో దోపుకొని ఏడ్వసాగింది. కల్పన గుండెల్లో కలుక్కుమంది.

    అతికష్టం మీద ఆమెను ఓదార్చి కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. కాస్త తేరుకుందావిడ.

    "కల్పనా! నిన్ను ఉసురు పెట్టినందుకే... ఇలా... బిచ్చమెత్తటానికి కూడా పనికి రాకుండా..." ఆవిడకి తనమీద తనకే అసహ్యమేసినట్లు కంపించిపోతోంది.   

    డెబ్బై ఏళ్ళు నిండిన ఆ ముసలి ప్రాణాన్నిలా చూస్తుంటే కల్పనలో జాలి, దయ పెల్లుబుకుతున్నాయి. మానవత్వం వివేకాన్ని వెన్నుదట్టి లేపుతోంది. తనకీ ఒంటరి జీవితమెందుకు మిగిలిందని ఇంతసేపూ బాధపడింది. తనవల్ల ఇంకో ప్రాణికి సహాయం జరుగుతుందని భగవంతుడు వెంటనే తెలియజేశాడు అనుకుంది జీవితం పట్ల పరిపూర్ణ విశ్వాసంతో.

    అత్తగారి చేయి పట్టుకున్న కల్పన దృడమైన ఆమె నిర్ణయాన్ని తెలియజేస్తున్నట్లుగా స్పర్శిస్తోంది.

    కానీ ముసలావిడ మనసు విలవిల్లాడిపోతోంది. కల్పన కసితీరా తిట్టినా బాగుండేది. ఇదేమిటి... తనపట్ల ఇంత దయగా ప్రవర్తిస్తోంది. ఇటువంటి కరుణామయినా... తనారోజు నిర్ధాక్షిణ్యంగా గెంటేసింది. "భగవాన్... ఇంతటి దయకు నేను అర్హురాలిని కాదు... ఈ నరకం నేను భరించలేను" పశ్చాత్తాపంతో ముసలావిడ హృదయం కుమిలిపోతోంది. ఆమెకు సాంత్వన ప్రసాదిస్తున్నట్లు స్వచ్చమైన చిరునవ్వులు చిందిస్తున్నది కల్పన.

    అపకారికి ఉపకారం చేయటం కన్నా ప్రతీకారం తీర్చుకొనే మార్గం లేదనీ, అది మనిషిని నిలువెల్లా కుదిపేస్తుందనీ ప్రత్యక్షంగా చూసిన ఆకాశం తలవంచి కల్పనను దీవించింది.