Facebook Twitter
నాణానికి రెండోవైపు

నాణానికి రెండోవైపు

 

- భవానీ దేవి

సూర్యుడు సహస్రాధిక బాహువులతో ప్రాణికోటి ముంగిట్లోకి వస్తున్నాడు.
       బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న వర్ధనమ్మ చుట్టూ ఓసారి చూసింది. బాత్ రూమ్ గోడలకు తెల్లటి టైల్స్ తాపడం చేసి ఉన్నాయి. షవర్ బాత్, సోప్ కేస్ లతో అధునాతనంగా ఉన్న ఆ స్నానాలగదిలో స్నానం చేయటం వర్ధనమ్మ జీవితంలోనే వింత అనుభూతిగా అన్పించింది.
    ఇస్త్రీ చీర కట్టుకొని బెడ్ రూమ్ నాలుగు వైపులా పరిశీలించింది. ఎంత పొందికగా సర్దుకుని మాధవి! గదిలో ఓ మూల గోడకి ఉన్న ర్యాక్ లో కొన్ని పుస్తకాలు నీట్ గా సర్ది ఉన్నాయి. వాటి పక్కనే ఉన్న షోకేస్ లో వింత వింత ఖరీదైన పింగాణీ బొమ్మలు... గోడ మూలగా ఉన్న టీపాయ్ మీద పింగాణీ ఫ్లవర్ వాజుల్లో అందమైన గులాబీలు... కిటికీలకున్న కర్టెన్లు సిల్కువి కాబోలు...తళతళా మెరుస్తూ ఆనందం అంతా అక్కడే ఉన్నట్లుగా ఊగుతున్నాయి.
    ఈ మాధవిలో చిన్నప్పటి మాధవి పోలికలు అసలు లేవు. చిన్నప్పుడు మాధవి ఎంత అల్లరిచిల్లరిగా ఉండేది. కాలేజి నుంచి రాగానే పుస్తకాలు చిందరవందరగా టేబుల్ మీద విసిరికొట్టొద్దని తనెన్నిసార్లు కోప్పడలేదు... పెళ్ళి కాగానే ఆడపిల్లలు ఎంతగా మారిపోతారు...! తనలో తాను చిన్నగా నవ్వుకుంది వర్ధనమ్మ... నిట్టూరుస్తూ దేవుడి మందిరం కేసి నడిచింది.
    వెండి దేవుడి విగ్రహాలు చెమ్కీ దండలతో రంగురంగుల బట్టలతో కళకళలాడుతున్నాయి.
    ఒక్కమారు నమస్కరించి వంటింట్లోకి నడిచింది. ఒక పొయ్యిమీద చిక్కని పాయసం కమ్మని వాసన వేస్తూ నోరూరించేలా తయారవుతోంది... మరో పొయ్యిమీద గారెలు ఉడుకుతున్నాయి.
    వర్ధనమ్మ మరోసారి నిట్టూర్చింది.
    "అమ్మా! స్నానం అయిందా!" గ్యాస్ స్టవ్ దగ్గర నిల్చుని గారెలు చేస్తున్న మాధవి వెనక్కి తిరిగిచూసి ప్రశ్నించింది.
    "ఆ! అయిందమ్మా..." బదులిస్తున్న వర్ధనమ్మ కళ్ళు మాధవిని నఖశిఖ పర్యంతం ప్రేమగా తడిమాయి.
    రాత్రి వచ్చేసరికి పొద్దుపోయింది. మాధవిని సరిగా చూడలేదు గానీ కొద్దిగా వళ్ళు చేసింది. పండు టమాటా కలర్ చీర... అదే రంగు బ్లౌజ్ వేసుకున్న ఆమె శరీరఛాయ-మరింత కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. జుట్టుకు రబ్బరు బ్యాండ్ వేసుకుంది. ఎఱ్ఱని బొట్టు... మెళ్ళో ఎఱ్ఱరాళ్ళ సింపుల్ నెక్లెస్... ముక్కుకు రవ్వపుడక... ఒక్కో చేతికి ఆరేసి బంగారు గాజులు... లక్ష్మీదేవిలా    ఉంది కూతురు.
    "అమ్మమ్మా... గుడ్ మార్నింగ్..." అన్న మనవరాలు హిమబిందు పిలుపుతో చూపు మరల్చుకుంది వర్ధనమ్మ... చిరునవ్వుతో మనవరాలి వీపు నిమిరి దగ్గరగా తీసుకుంది ఆప్యాయంగా.
    కూతుర్ని ప్రేమగా గారాబంగా స్కూలుకు తయారుచేస్తున్న మాధవిలోని తల్లిప్రేమని చూసి ఆశ్చర్యపోయింది వర్ధనమ్మ... హిమబిందును చూస్తుండిపోయింది ముచ్చటగా...
    మళ్లీ ఇంతలోనే మనసులో ముల్లు గుచ్చుకున్న అనుభవం... ఈ ఆలోచనని అణచుకోవటం కష్టంగా ఉంది. ఆధునిక సౌకర్యాల సాయంతో ఎక్కువ శ్రమ పడకుండానే కూతుర్ని స్కూలుకూ, భర్తను ఆఫీసుకూ పంపింది మాధవి.
    తర్వాత తల్లితో కబుర్లు చెపుతూ దగ్గరుండి ఇల్లంతా చూపించింది మాధవి. ముందు వరండా, దాని వెనుక పెద్ద హాలు, హాల్లోంచి మూడు బెడ్ రూంలు, ఒకవైపు డైనింగ్ హాలు, దాని వెనుక కిచెన్, ప్రతి బెడ్ రూంకు ఎటాచ్ డ్ టాయిలెట్లు... అడుగడుగునా ఖరీదైన ఫర్నిచర్, కర్టెన్లు, ఫ్లవర్ పాట్స్ తో ఇల్లంతా సిరి తాండవిస్తోంది.
    "చాలా బాగుందమ్మా..." పైకి మెచ్చుకుంటూ అన్నదే గానీ గుండెల్లో మాత్రం బరువు పెట్టినట్లుంది.... ఏదో వెలితి... బాధ.
    "రామ్మా! అన్నం తిందాం..." మాధవి పిలుపుకు యాంత్రికంగా డైనింగ్ హాల్లోకి నడిచింది.
    భోజనాలు అయినాక గెస్ట్ రూం చూపించి తల్లిని విశ్రాంతి తీసుకోమంది మాధవి.
    పడుకున్నదేగానీ వర్ధనమ్మకు నిద్ర పట్టలేదు. మనసులో పురుగు తొలుస్తున్న భావన... నిలువెల్లా అగ్ని దహిస్తున్నట్లుంది. నిద్ర మాగన్నుగా పట్టింది.
    నిద్ర లేస్తూనే "రేపు ఉదయం రైలుకు నన్ను పంపేయమ్మా..." అంటున్న తల్లికేసి ఆశ్చర్యంగా చూసింది మాధవి.
    "అదేంటమ్మా... వచ్చి ఒకరోజయినా కాలేదు... అప్పుడే..."
    "కాదులే తల్లీ... ఇంటి దగ్గర నేను లేకపోతే ఇబ్బంది పడతారు..." కూతురు మాటల్ని మధ్యలోనే అడ్డుకుంది వర్ధనమ్మ.
    మాధవి అలిగింది... బ్రతిమాలింది... ఉహు... లాభంలేదు... ఆ రాత్రి కడుపునెప్పిగా ఉందని ఏమీ తినలేదు వర్ధనమ్మ. పెళ్లయ్యాక ఇంతకాలం పారిన్ లో ఉండటం వలన అమ్మకి తన ఇంటికి రావటం కుదరలేదు. ఇప్పుడు మొదటిసారి వచ్చి ఇలా ప్రవర్తిస్తుందంటే... తల్లికి తనంటే... ఆలోచన జీర్ణించుకోలేక మౌనంగా ఉండిపోయింది మాధవి. ముళ్ళ మీద ఉన్నట్లుగా గడిపి రైలెక్కింది వర్ధనమ్మ.
    కూతురి ఐశ్వర్యం చూసి తను అసూయపడుతోందా... లేదు... అనుకుంది బాధ్యతగా.

            * * *

    వెలిసిన వోణితో ఒక చేతిలో చీపురు కట్టతో తలుపు తీసిన సువర్ణ మొహం తల్లిని చూసిన మరుక్షణమే చాటంతయింది.
    "అమ్మొచ్చిందర్రా... లేవండి లేవండి..." అంటూ హడావుడిగా తమ్ముణ్ణి, చెల్లెళ్ళనూ నిద్రలేపింది. జిడ్డు కారుతున్న వాళ్ళ మొహాల్లో పెన్నిధిని చూసినంత సంబరం... "అమ్మా! కాస్త కాఫీ పెట్టు... నేను నీళ్ళు పడతాను" సువర్ణ హడావుడి పడుతూనే "అక్కెలా ఉందమ్మా... ఎప్పుడొస్తుందిట" అడిగింది ఆత్రంగా.
    తన ఐశ్వర్యాన్ని ప్రదర్శించటమేగానీ ఇంటిదగ్గర చెల్లెళ్ళు, తమ్ముడు, అన్న ఎలా ఉన్నారని పన్నెత్తయినా ప్రశ్నించని మాధవి గుర్తొచ్చి వర్ధనమ్మ మనసు మూలిగింది.
    "ఊ... వస్తుందిలే" అంటూ పరధ్యానంగానే కొంగు దోపి పనిలో పడిపోయిందామె.
    పది రోజులుండొస్తానని అక్క ఇంటికి వెళ్ళి మర్నాడే తిరిగొచ్చేసిన తల్లిని సువర్ణ ఏమీ ప్రశ్నించలేదు... కానీ ఆమె చూపులో వచ్చిన మార్పు... ఆలోచనగా ఉండటం మాత్రం గ్రహించింది.


            * * *


    తండ్రి పోయినా బాధ్యత తీసుకొని సంబంధాలు చూస్తున్న అన్న రామంతో "నేను మామూలు గుమాస్తాను చేసుకోనన్నయ్యా! మరో పదివేలు కట్నం ఇచ్చయినా సరే ఇంజనీర్నో, డాక్టర్నో చూడు..." అంటున్న మాధవి కేసి ఆరోజు ధైర్యంగా తలెత్తికూడా చూడలేకపోయాడు రామం.
    "అంతగా మన దగ్గర డబ్బు లేదంటే నాన్న ఇచ్చిన ఈ ఇంటిలో నావాటా అమ్మి నా పెళ్ళి మంచి ఉద్యోగస్థుడితో చేయండి. నాకు ఒక దరిద్రుడ్ని ముడిపెడితే ఆ తర్వాత మీరెంత సహాయం చేసినా జీవితంలో ఎదుగూ బొదుగూ ఉండదు..." మాధవి ఆలోచనలకు కొయ్యబారిపోయింది వర్ధనమ్మ.
    అందరు అమ్మాయిల్లాగా "కట్నం తీసుకోని వాడినే పెళ్ళి చేసుకుంటాను" అనటంలేదు మాధవి. అదే ఆమెకు ఆశ్చర్యం!
    ఆమె కోరినట్లే రామ్మోహన్ ఆమె సౌందర్యానికి ముగ్ధుడై అందరికంటే తక్కువ కట్నంతోనే చేసుకున్నాడు. వాళ్ళ అదృష్టం బాగుండి ఫారిన్ లోనే ఆ దంపతుల కొత్త కాపురం మొదలయింది. తనకోసం ఇల్లు అమ్మేసిన తల్లి, అన్న, చెల్లెళ్ళు, తమ్ముడు ఎలా ఉన్నారో అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు మాధవి.
    హక్కులేగానీ బాధ్యతల గురించి ఆమె ఆలోచించదు. ఎందుకంటే ఆమె సగటు ఆడపిల్ల గనుక!
    "కుటుంబంలో మగ పిల్లలతో బాటు ఆడపిల్లలకి సమానత్వం కావాలంటే వాళ్ళు హక్కులేగాక బాధ్యతల్ని కూడా వహించాలి కదా! అలా ఆడపిల్ల నిండు వ్యక్తిగా తయారయితే ఆమెను సమాజం చిన్నచూపు చూడలేదు. ఆడశిశువుల హత్యలు, పెంపకంలో ఆడపిల్లల వివక్షత, మగపిల్లల పట్ల పిచ్చి ప్రేమతో సంతానాన్ని విపరీతంగా పెంచుకోవటం ఇటువంటివి జరిగే అవకాశం ఉండదు కదా!"
    వర్ధనమ్మ మెదడు నిండా తేనెటీగల్లాగా ఆలోచనలు ముసురుకుంటున్నాయి. ఆ మహారాజుకేం... హాయిగా... వెళ్ళిపోయాడు. అధిక సంతానాన్ని మోయటం తనకే కాదు... తన బిడ్డలకు కూడా భారమే... ఆమెలోని వేదన సుళ్ళు తిరుగుతోంది.
    చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఆ మధ్యతరగతి తల్లి పిల్లల భవిష్యత్ సౌధానికి పునాదులు వేయటానికి అప్పడాలు, వడియాలు చేసి అమ్ముతూ విధిని నిందిస్తూనే ఉంది. తండ్రి ఆస్తులియ్యకపోయినా ఆస్తిలా ఇచ్చిన చెల్లెళ్ళు, తమ్ముడి కోసం రామం, సువర్ణలు జీవితాలను కొవ్వొత్తుల్లా కరిగించుకుంటూనే ఉన్నారు. వర్ధనమ్మకిప్పుడు నాణానికి రెండోవైపు స్పష్టంగా కన్పిస్తోంది..
    అది బొమ్మ కాదు బొరుసే!