Facebook Twitter
అమెరికాలో క్రిస్మస్, కొత్త సంవత్సరం సంబరాలు

 అమెరికాలో క్రిస్మస్, కొత్త సంవత్సరం సంబరాలు

 

-కనకదుర్గ-

 

 మెర్రీ క్రిస్మస్! : 

  అమెరికాలో వణికించే చలిలో, సాయంత్రం చాలా త్వరగా చీకటి పడిపోతుంది.  చాలా ప్రదేశాల్లో స్నో పడి ఇంట్లో నుండి బయటకు రావడం కూడా కష్టం అయిపోతుంది.  చాలా మంది సీజనల్ డిప్రెషన్ కి లోనవుతారు.  ఆకులన్నీ రాలిపోయి చెట్లు మోడువారి వుంటాయి మళ్ళీ వసంతం వచ్చేవరకు. ఈ చీకట్లను పోగొట్టి ప్రజల జీవితాల్లో ఉత్సాహం నింపడానికి క్రిస్మస్ కి నెలరోజుల ముందునుండే వీధులను, ఇళ్ళను లైట్లతో అలంకరించే పద్దతిని ఆరంబించారని చెప్పుకుంటారు.  ’థ్యాంక్స్ గివింగ్,’ పండగ నవంబర్ నాలుగో గురువారం జరుపుకుంటారు.  ఈ పండగ జరుపుకోవడానికి దేశంలో ఏ మూలనున్నా కుటుంబంతో టర్కీ డిన్నర్ చేసి సమయం గడపడానికి ప్లేన్లు, ట్రైన్లు, కార్లు, బస్సులు, ఎలా వీలయితే అలా ఇళ్ళకు చేరుకుంటారు.  మర్నాడు బ్లాక్ ప్రైడే రోజు క్రిస్మస్ కోసం షాపింగ్ చేస్తారు.  అప్పుడు దేశం మొత్తంలో, మాల్స్, షాపింగ్ సెంటర్స్ అన్నీ గురువారం రాత్రి నుండి శుక్రవారం రాత్రి వరకు కొన్ని చోట్ల, లేదా కొన్ని గంటలు సేల్స్ అని పెడతారు. 

ఆ సేల్స్, డిస్కౌంట్స్ కోసం విపరీతంగా షాపింగ్ చేస్తారు అమెరికన్లు.  మాల్స్, షాపింగ్ సెంటర్స్ దగ్గర కార్ల పార్కింగ్ దొరకడం చాలా కష్టం అవుతుంది.  థ్యాంక్స్ గివింగ్ తర్వాతే, వీదుల్లో క్రిస్మస్ లైట్లు, డెకొరేషన్స్ చేస్తారు.  సిటీల్లో, మాల్స్ లో పెద్ద పెద్ద క్రిస్మస్ చెట్లు పెట్టి డెకొరేట్ చేస్తారు.  న్యూయార్క్ లో రాకఫెల్ల ప్లాజా(Rockefeller Plaza) దగ్గర క్రిస్మస్ చెట్టు పెట్టి లైట్లతో చాలా అందంగా డెకోరేట్ చేస్తారు, వాషింగ్టన్ లో వైట్ హౌస్ (White House) ఎదురుగా పెట్టి డెకొరేట్ చేస్తారు, ఫిలడేల్ఫియాలో లవ్ పార్క్ (Love Park) లో పెట్టి లైట్లతో, అర్నమెంట్స్ (Ornaments)తో డెకొరేట్ చేస్తారు.  ఇలాగే మిగతా పెద్ద సిటీల్లో కూడా చేస్తారు.  ప్రతి ఏడు క్రొత్త రకం లైట్లు, క్రిస్మస్ డెకొరేషన్స్ మర్కెట్లోకి వస్తాయి.  చాలామంది ప్రతి ఏడు వచ్చే కొత్త ఐటమ్స్ తో అలంకరిస్తారు ఇళ్ళని, మరి కొంతమంది ప్రతి సంవత్సరం ఒకటే రకంగా చేస్తే మరికొంతమంది క్రిస్మస్ పండగ జీసస్ జననం గురించి కాబట్టి ఆ సన్నివేశాలు ఇంటి ముందర బొమ్మలు పెట్టి లైట్స్ పెట్టి అలంకరిస్తారు.  అవి చూస్తే మనం దసరా, సంక్రాంతికి చేసుకునే బొమ్మల కొలువు గుర్తోస్తుంది.  ఇంటి లోపల వారి ఇళ్ళల్లో పట్టేంత క్రిస్మస్ చెట్లు కొంతమంది కుటుంబంతో వెళ్ళి క్రిస్మస్ చెట్లను పెంచి అమ్మకాలు

 

చేసే దగ్గర నుండి వారే వారికి ఏ చెట్టు కావాలో ఎన్నుకుని స్వయంగా కొట్టి వాన్ పై పెట్టి  తీసుకొచ్చి ఇంట్లో

లివింగ్ రూమ్ లో పడిపోకుండా పెట్టి కుటుంబ సభ్యులు కలిసి చెట్టుని అలంకరిస్తారు...

 

 

 చెట్టుపైన పెట్టే నక్షత్రం ఇంటికి పెద్ద అయిన తండ్రి అయినా పెడతారు లేదా పిల్లల్లో ఒకరితో పెట్టిస్తారు. కొంతమంది ముందే కొట్టేసి అమ్ముతున్న క్రిస్మస్ చెట్లను ఎవరికి ఏ సైజువి కావాలో చూసి కొనుక్కుంటారు.   ఒకసారి చెట్టు పెట్టిన తర్వాత చాలా మంది కొత్త సంవత్సరం వరకు వుంచుకుని తర్వాత తీసేస్తారు.  క్రిస్మస్ రోజు చర్చ్ లలో సర్వీస్ లు చేసి, స్నేహితులతో, కుటుంబసభ్యులతో, బంధువులతో చాలా ఆనందంగా జరుపుకుంటారు.  క్రిస్మస్ సమయంలో చాలా మంది బీదవారికి, క్యాన్సర్ తో బాధపడ్తున్న చిన్నారులకు చాలా తక్కువ ఖర్చులతో ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్ కి డొనేషన్స్, ఇలాగే ఇతర భయంకరమైన జబ్బులకు రిసెర్చ్ చేస్తున్న సంస్థలకు, ఇళ్ళులేని వారికి ఇళ్ళు కట్టించి ఇచ్చే స్వచ్చంద సంస్థలకు, జంతువుల షెల్టర్లకు కూడా చాలా మంది డొనేషన్లు ఇస్తుంటారు.  ఇతర దేశాల కంటే అమెరికాలో క్రిస్మస్ వ్యాపారాత్మకంగా అయిపోయింది అని అంటారు ఇతర దేశాల వారు. క్రిస్మస్ పండగ అంటే జీసస్ పుట్టిన రోజు సంబరాల కంటే ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకునే పండగలా తయారయ్యింది అని కూడా అంటుంటారు.   క్రెడిట్ కార్డ్లు వాడి వారి స్తోమతకి మించి గిఫ్ట్స్ కొంటారు ముందు వెనకా ఆలోచించకుండా చాలామంది. ఈ పండగ అమ్మకాల్లో వచ్చే లాభాలపైనే చాలా బిజినెస్ వాళ్ళు ఆధారపడ్తారు.  పండగ అయ్యింతర్వాత ఇంకా హాలీడేస్ వాతావరణం వుంటుంది కాబట్టి సెలవులకి పిల్లలతో కొత్త ప్రదేశాలకి వెళ్ళడం లేదా, స్నేహితులు, బందువుల వూళ్ళకు వెళ్ళి వాళ్ళతో కలిసి సమయం గడిపి వస్తారు.  ఆఫీసులకి కొంతమందికి సెలవు ఇస్తారు కొన్ని రోజులు, కొంతమంది సెలవు తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆఫిసులు, స్కూళ్ళు తెరిచేవరకు వచ్చేస్తారు.  ఆ తర్వాత అప్పులు చేసి గిఫ్ట్స్ కొన్నవారు, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టిన వారికి బిల్స్ రావడం మొదలుపెట్టగానే డిప్రెషన్ కి గురవుతారు, వీళ్ళల్లో సైకియాట్రిస్ట్ ల దగ్గరికి వెళ్ళేవారు కూడా వుంటారు. 

హ్యాపీ న్యూ ఇయర్!

కొత్త సంవత్సరం సంబరాలు ప్రతి పెద్ద సిటీలో బ్రహ్మాండంగా చేసుకుంటారు.  న్యూయార్క్ లో టైమ్

స్క్వేర్ దగ్గర ఒక పెద్ద ఎలక్ట్రిక్ బాల్ చాలా అందంగా తయారు చేసి కరెక్ట్ గా డిసెంబర్ 31 మధ్యరాత్రి

పన్నెండు గంటలకు న్యూయార్క్ జడ్జి బటన్ ప్రెస్ చేయగానే మెల్లి మెల్లిగా క్రిందకి జారుతుంది. ఈ సారి

తయారు చేసిన ఈ బాల్ 12 అడుగుల వెడల్పు, 11,000 పౌండ్లు బరువుంది.  ఈ ఏడాది కొన్ని

రోజుల ముందు నుండే వలంటీర్లు ప్రతి రోజు స్టేషనరీ సైకిళ్ళ పై పెడల్ చేసారు, విధ్యుత్తుని ఉత్పత్తి చేసి

బాల్ ని కిందికి జారవిడవడానికి. బాల్ కిందికి జారడానికి తీసుకునే సమయం ఒక నిమిషం. ఈ

సంవత్సరం టైమ్స్ స్క్వేర్ దగ్గర ఒక మిలియన్ ప్రజలు చేరారు ఈ ముచ్చట చూసి కొత్త సంవత్సరానికి

స్వాగతం పలకడానికి. మరో మిలియన్ ప్రేక్షకులు టీ.వీ ముందు చేరి వీక్షించారు.

 

 దీనికి ముందు దేశం నలుమూలల నుండి, ఇతర దేశాల నుండి ఈ బాల్ క్రిందికి రావడాన్ని చూడడానికి పర్యాటకులు పొద్దున్నుండే వచ్చి టైమ్ స్క్వేర్ ప్రాంతంలో చేరారు.  మంచి చలి కాలం కాబట్టి ఎంత చలి వున్నా సరే పట్టించుకోరు. మొత్తం శరీరం పై నుండి క్రింది వరకు చలికి తట్టుకోవడానికి బాగా కవర్ చేసుకుని కొత్తసంవత్సరం సంబరాలు చూడడానికి రెడీగా వుంటారు. బాల్ కిందికి రాగానే ఫైర్ వర్క్స్ తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. సరిగ్గా పన్నెండు కాగానే అన్నీ సిటీల్లో, వూళ్ళల్లో ఫైర్ వర్క్స్ తప్పనిసరిగా వుంటాయి కొత్త సంవత్సరానికి స్వాగతం

పలకడానికి.   సాయంత్రం కాగానే మ్యూజిక్ కాన్సర్ట్స్ మొదలవుతాయి.  సిటీల్లో పెద్ద పెద్ద హోటల్లో

మ్యూజిక్ తో పాటు, డిన్నర్, డ్రింక్స్ కి ధరలు బాగా పెంచేస్తారు.  ఇళ్ళల్లో, పెద్ద పెద్ద భవంతులలో,

రెస్టారెంట్లలో, ఇలా ఎక్కడ పడితే అక్కడ పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి

స్వాగతం పలకడానికి పార్టీలు జరుగుతాయి.

 

 

.  ఫిలడెల్ఫియాలో ఎక్కడా జరగని పరేడ్ జరుగుతుంది, "మమ్మర్స్ పరేడ్," అని 17వ శతాబ్దం నుండి

చేస్తూ వస్తున్న పరేడ్ జనవరి 1న ఫిలడెల్ఫియా సిటీలో చేస్తారు.  ఈ పరేడ్ లో ఐర్లాండ్, బ్రిటిష్,

జర్మన్, ఆఫ్రికన్, యూరోపియన్ దేశాల నుండి వచ్చి సెటిల్ అయిన వారు ఎన్నో ఏళ్ళుగా

కుటుంబాలతో, స్నేహితులతో కలిసి చేస్తారు.  ఇది చూడడానికి దేశం నలుమూలలనుండి, ఒకోసారి

విదేశాలనుండి కూడా వస్తారు.  దేశం నలుమూలల నుండి మమ్మర్స్ క్లబ్ హౌస్ ల వాళ్ళు ఇందులో

పాల్గొంటారు, వీరి ప్రతిభకు గుర్తింపుగా ప్రైజులని కూడా ఇస్తారు.  కాలిఫోర్నియా, పాసెడినా

(Pasedena) లో గులాబీలతో తయారు చేసిన ఫ్లోట్స్ తో పరేడ్ జరుగుతుంది.  ఇది కూడా చాలా

పాపులర్ అయిన పరేడ్.  ఎన్ని రకాల, ఎన్ని రంగుల, ఎన్ని గులాబీలు ఈ పరేడ్ కోసం వాడతారో

చెప్పడం కష్టం. 

 

 

ఇలా కొన్ని సిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుపుకుంటే మిగతా సిటీల్లో, వూళ్ళల్లో ఆనందంగా పార్టీలు చేసుకుని కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకుంటారు. 

ఇవండీ అమెరికాలో క్రిస్మస్, పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే విశేషాలు! 

మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!  ఈ కొత్త సంవత్సరంలో మీకు మంచి ఆరోగ్యం, సంతోషాలను, విజయాలను, శాంతిని కల్గించాలని మనసారా కోరుకుంటూ.....