Facebook Twitter
నాకున్నది ఒక చక్కని బొమ్మ

నాకున్నది ఒక చక్కని బొమ్మ

- ఎపిసోడ్- 3

- వసుంధర


    వద్దు. మా ఇంట్లో ఒప్పుకోరు. చీకటి పడ్డాక మా అమ్మ ఎవరింటికీ వెళ్ళనివ్వదు" అన్నాను.

    శంకరం దీనంగా "పోనీలే మా ఇంటికి రావద్దు. నా జట్టు పచ్చి మాత్రం అయిపోకేం?" అన్నాడు.

    వాడి జట్టుపచ్చి అయిపోవాలనే వుంది నాకు. కానీ వాడి ముఖం చూస్తే జాలివేసి ఆమాట అనలేదు. "అవునులే" అని కూడా అన్నాను.

    "నీ అమెరికా బొమ్మ వచ్చేక నాకు చూపిస్తావా ?" అనడిగాడు శంకరం.

    "తప్పకుండా చూపిస్తాను" అన్నాను.

    "ఎక్కడ చూపిస్తావు? మా ఇంటికి తీసుకొచ్చి చూపిస్తావా? మీ ఇంటికి నన్ను పిలిచి చూపిస్తావా?" అనడిగాడు శంకరం.

    ఏం జవాబు చెప్పాలో తోచలేదు. వాళ్ళింటికి వెళ్ళడానికి అమ్మ ఒప్పుకోదు. ఇంటికి పిలుద్దామంటే శంకరం వేషం అసహ్యంగా వుంటుంది. అమ్మ అలాంటి వాళ్ళను ఇంటికి రానివ్వదు.

    "ఆలోచిస్తున్నావు కదూ? నీ బాధ నాకు తెలుసులే. నువ్వు నన్ను మీ ఇంటికి పిలు. ఆరోజు నేను వస్తాను. నన్నుచూసి మీ అమ్మ తిట్టదు. ఆరోజు స్నానంచేసి శుభ్రంగా వళ్ళు రుద్దుకోవడం కోసం ఓ చిన్న సబ్బు ముక్క దాచుకున్నాను. మంచి బట్టలు ఒక్కరోజుకు అద్దెకిస్తానని ఓ లాండ్రివాడు అన్నాడు. నువ్వేమీ కంగారు పడకు. నీ మర్యాద నిలబెడతాను. నువ్వు మాత్రం నీ అమెరికా బొమ్మను చూడ్డానికి నన్ను పిలవాలి...." అన్నాడు శంకరం.

    నేను ఆశ్చర్యపోతూ "సబ్బుముక్క దాచుకోవడం ఏమిటి? రోజూ సబ్బు వాడుకోరా మీరు? సబ్బు లేకుండా స్నానం చేస్తే వళ్ళువాసనపోతుందా?" అన్నాను.

        శంకరం దిగులుగా "సబ్బు కొనాలంటే రెండు రూపాయలవుతుందిట. ఆ డబ్బు పెడితే ఓరోజుకు సరిపడ బియ్యం వస్తాయట. అసలు నన్ను చదివించడం నాన్నకు ఇష్టం లేదు. అమ్మ పట్టుబట్టి నన్ను చదివిస్తోంది. నేను చదువుకుని గొప్పవాడినయి అమ్మ కోసం ఓ మేడ, కారు కొంటాను. అంతవరకూ  సబ్బు కొనుక్కోవడం  కుదరదు. ఎప్పుడయినా ఎవరింట్లోనయినా అడిగి అమ్మ సబ్బు ముక్కలు తెస్తే వాటిని పండగల కోసం మేము దాచుకుంటాం" అన్నాడు.

    శంకరం గురించి వింటే నాకు మనసు బాధగా అయిపోయింది. పేదవాళ్ళ గురించి నాకాట్టే తెలియదు. ఇప్పటికే నాకేదోలా వుంది. అందువల్ల నేను "నిన్ను తప్పకుండా బొమ్మను చూడ్డానికి పిలుస్తానులే!" అన్నాను.

    "వచ్చినవెంటనే పిలవాలి" అన్నాడు శంకరం.

    అలాగే అన్నాను. కానీ నామాట నిలబెట్టుకోలేనని అప్పుడు నాకు తెలియదు.

    బడికి సరిగ్గా రేపు శలవులిస్తారనగా వచ్చాడు అమెరికా బాబాయి. వచ్చిన రోజున నన్నోసారి పిలిచి ముద్దులాడేసి తర్వాత పెద్దవాళ్ళతో కబుర్లలో పడిపోయాడు. నా బొమ్మ గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు.

    కిష్టిగాడు చెప్పింది నిజమేనా అనిపించింది.

    మర్నాడు బడికి వెళ్ళేటప్పుడువాడు నన్ను అడిగేశాడు. "మీ బాబాయి వచ్చాడు కదా బొమ్మ తెచ్చాడా?" అని.

    "తెచ్చాడు. కానీ రేపు ఇస్తాట్ట" అని అబద్ధం చెప్పాను.

    ఆరోజు క్లాసులో కూడా నిరుత్సాహంగా వున్నాను. మా అమెరికా బాబాయి వచ్చినట్లు కిష్టిగాడు క్లాసులో అందరికి చెప్పేశాడు. అంతా నా దగ్గరకు వచ్చి బొమ్మ గురించి అడగసాగారు. అందరికీ కూడా కిష్టిగాడికి చెప్పినట్లే చెప్పేశాను.

    ఆఖరున శంకరం నాదగ్గరకు వచ్చి "మీ బాబాయి వచ్చేట్టకదా బొమ్మ గురించి నన్ను పిలవకూడదనుకున్నావా?" అన్నాడు.

    శంకరానికి అబద్ధం చెప్పాలనిపించలేదు. అందుకని నెమ్మదిగా "బాబాయి బొమ్మను తెచ్చినట్లు లేదు. మరి నాకింత వరకూ చూపించలేదు. దాని గురించి మాట్లాడలేదు. ఈ సంగతి ఎవరికీ చెప్పలేదు. నీ ఒక్కడికే చెప్పాను. నువ్వు కూడా ఎవరికీ చెప్పకు. మిగతా వాళ్ళంతా నన్ను వేళాకోళం చేస్తారు" అన్నాను.

    శంకరానికి చాలా సంతోషం కలిగింది "ఎవ్వరికీ చెప్పను నిన్నెవరూ వేళాకోళం చేయకూడదు" అన్నాడు.

    ఇదే కిష్టిగాడయితే అందరికీ చెప్పి నన్ను ఏడిపించేవాడు.

    "నువ్వు చాలా మంచివాడివి" అన్నాను.

    "పేదవాళ్ళు మంచిగానే వుండాలిట" అన్నాడు శంకరం.

    "ఎందుకని?" అనడిగాను.

    "నువ్వు నన్నేడిపించావనుకో- అప్పుడు నేను మాష్టారుకి చెప్పాననుకో ఆయన నన్నే తిడతారు. నేను నిన్నేడిపించాననుకో అప్పుడు నువ్వు మాష్టారుకి చెప్పావనుకో- ఆయన మళ్ళీ నన్నే తిడతారు. ఎందుకంటే నేను పేదవాళ్ళు వున్నవాళ్ళని గౌరవించక్కర్లేదు" అన్నాను.

    "నువ్వు చెప్పిందీ నిజమే! కానీ అమ్మ చెప్పిందీ -వున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళట. లేనివాళ్ళంతా చిన్నవాళ్ళట. మనుషుల పెద్దరికాన్ని వయస్సుతో కాక డబ్బుతో కొలవాలిట" అన్నాడు శంకరం.

    "ఏమో నేను నమ్మలేను" అన్నాను.

    "పోనీ ఓ ఉదాహరణ చెబుతాను. మీ ఇంట్లో పనిమనిషి వుందా అన్నాడు శంకరం.

    "వుంది" అన్నాను నేను.

    "అది మీ అమ్మ కంటే పెద్దదా, చిన్నదా?"

    "చాలా పెద్దది" అన్నాను.

    "మరి మీ అమ్మ దాన్ని గౌరవిస్తుందా? అనడిగాడు శంకరం.

    "బాగుంది. ఎవరైనా పనిమనుషుల్ని గౌరవిస్తారా?" అన్నాను మామూలుగా.

    "చూశావా. నువ్వే ఎలాగనేశావో దానికి డబ్బు లేకపోవడం తప్ప అది మాత్రం మనిషి కాదా?" అన్నాడు శంకరం.

    "అరే!" అనుకున్నాను నేను శంకరం నిజమే చెప్పాడు. పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు గౌరవించడంకాదు. వున్నవాళ్ళని లేనివాళ్ళు గౌరవించాలి. ఈ విషయం ఇన్నాళ్ళూ నాకు తెలియలేదు. అయితే కిష్టిగాడి విషయం పట్టాలి. వాళ్ళమ్మ అస్తమానం అంటూ వుంటుంది "మీకేమమ్మా, మా కంటే జీతమూ ఎక్కువ. స్వంత ఇల్లు వుంది. పొలాల మీంచి పంట వస్తుంది. మాకు జీతంరాళ్ళు ఒక్కటే ఆధారం" అని.

    నాకు చాలా ఉత్సాహం వచ్చింది. "శంకరం నువ్వు చాలా మంచివాడివి. నాకు చాలా మంచి విశేషం చెప్పావు" అన్నాను.

    "నేనేం చెప్పాను? వున్న మాట చెప్పాను. అంతేకదా !" అన్నాడు వాడు.

    "ఏదో ఒకటి. చాలా మంచిమాట అన్నాను. అందుకని నీకు ఏం చేయను?" అని ఓ క్షణం ఆలోచించి "నీకు కూడా ఎవరినైనా ఏడిపించాలని వుంటుందా?' అని అడిగాను.

    "ఎందుకుండదూ? వుంటుంది. కానీ ధైర్యం చాలదు."

    "అయితే ఓ పని చేయి. నువ్వు నన్ను ఏడిపించు. నేను ఏమీ అనుకోను. మేష్టారికి చెప్పను" అన్నాను.

    శంకరం కళ్ళు మెరిశాయి. "నువ్వు అడిగినా సరే నేను నిన్ను ఏడిపించను. ఎందుకంటే నువ్వు మంచిదానివి. అందుకని నువ్వంటే నాకు ఇష్టం" అన్నాడు.

    నేను ఇంక శంకరంతో మాట్లాడలేదు. నా దృష్టి అంతా కిష్టిగాడి మీదే వుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వాడితో అనేశాను. "ఒరేయ్ కిష్టీ! ఇంకెప్పుడూ నువ్వు నన్ను ఎదిరించడానికి వీల్లేదు. నువ్వు లేనివాడివి. నేను వున్నదాన్ని. నువ్వు నన్ను గౌరవించాలి."

    నేనేం అంటున్నానో కిష్టిగాడికి అర్ధంకాలేదు. వాడికి ఉదాహరణతో సహా వివరించి చెప్పేసరికి ఏడుపు మొహం పెట్టేశాడు. వాడి మొహం చూస్తే నాకు జాలి కూడా వేసింది. అయినా సరే కిష్టిగాడి లాంటి వాళ్ళ మీద జాలిపడకూడదని ఊరుకున్నాను.

    నేను ఇంటికి వెళ్ళాను. అప్పటికి బాబాయి ఇంట్లో లేడు. ఊళ్ళో ఎవరో తెలిసిన వాళ్ళింటికి వెళ్లేడుట.

    నాకు మాత్రం చాలా ఉత్సాహంగా వుంది. కిష్టిగాడి మీద దెబ్బతీయ గలిగాను గదా. ఇంక వాడు జన్మలో నా జోలికి రాడు.

    అయితే నా ఆనందం ఎంతోసేపు నిలబడలేదు.

    కిష్టిగాడి అమ్మ మా ఇంటికి వచ్చింది. అమ్మతో పెద్ద దెబ్బలాట వేసుకుంది.

    "మేము లేచి వాళ్ళమని ఎందుకు అనాలి?" అంటుందావిడ.

    "నేనెప్పుడన్నాను?" అంటోంది అమ్మ.

    అమ్మకు గొడవేమిటో అర్ధం కావడంలేదు కానీ నాకు అర్ధమైపోయింది.

    "మీరు అనకపోతే మీ అమ్మాయికి అంత పెద్ద విషయాలు ఎలా తెలుస్తాయి?" అందావిడ.    

    ఇంక లాభంలేదని అప్పుడు నేను కలగజేసు కున్నాను.

    "ఆంటీ నా మాట వింటావా?" అన్నాను.

    పిన్నీ అంటే గొడవ వస్తోందని ఆవిడని ఆంటీ అని పిలవడ మొదలుపెట్టాను. ఈ ఉపాయం నాన్నగారే చెప్పారు. పెద్దా, చిన్నా తేల్చకుండా వుండడానికీ. వావీ వరసా తెలియనివ్వక పోడానికీ ఇంగ్లీషు భాష చాలా మంచిదట. ఆంటీ అంటే పిన్ని కావచ్చు. దొడ్డ కావచ్చు. అత్త కావచ్చు.

    ఆవిడ నా వంక చిరాగ్గా చూసి "నీ మాట ఏమిటే?" అంది.

    "పాపం ఇందులో అమ్మకు ఏమీ తెలియదు. నువ్వు చాలాసార్లు అమ్మతో అన్నావు కదా- మీరు లేనివాళ్ళని అదే కిష్టిగాడికి చెప్పాను. నువ్వు అన్నమాటలే నేను వాడికి చెప్పాను. అమ్మ నాకేం చెప్పలేదు" అన్నాను.

    "మేము లేని వాళ్ళమయితే మాత్రం మా అబ్బాయి నీకు సలాం కొట్టాలా? మేము మీ దగ్గరేమైనా డబ్బు తీసుకుంటున్నామా? ఆడుకుంటున్నామా? మీకు వున్నది మీకు వుంటుంది. మాకు వున్నది మాకు వుంటుంది" అంటూ ఆవిడ చాలా కోపంగా నన్ను కసిరింది.

    ఆవిడిని ఎప్పుడూ అంత కోపంగా చూడలేదు నేను. అందుకని నాకు భయం వేసింది. కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి.

    అమ్మ మాత్రం వెంటనే "ఒక్క నిమిషం ఆగండి శాంతగారూ! జరిగింది ఏమిటో నన్ను తెలుసుకోనివ్వండి!" అంది.

    అమ్మ, ఆవిడ వరసలు మానేసి పేర్లతో పిల్చుకోవడం ప్రారంభించి కూడా చాలా రోజులైంది.

    నేను అమ్మకు ఏం జరిగిందో చెప్పాను.

    అమ్మ కోపంగా "ఆవిడకి కోపం రావడంలో తప్పేముందీ? వెంటనే ఆంటీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు" అంది.

    అలా చేయడం నాకు ఇష్టం లేదు. కానీ అలా చేస్తే గొడవ చల్లారిపోతుందేమో అనిపించింది.

    అమ్మ చెప్పినట్లే చేశాను. నాకు ఏడుపు కూడా వచ్చేసింది. అప్పుడు ఆంటీ నన్ను దగ్గరగా తీసుకుని "చిన్నపిల్లవు. నీకు ఏం తెలుస్తుందిలే. ఇంక ఎప్పుడూ అలా మాట్లాడకు" అంటూ తన చీర చెంగుతోనా కళ్ళు తుడిచి  "మీ అమ్మాయి ఎలాగైనా బుద్ధిమంతురాలు, మా వాడు చస్తే చెప్పిన పని వెంటనే చెయ్యడు" అని నన్ను మెచ్చుకుంది.

    అప్పుడు అమ్మ ఆవిడిని పొగిడేసింది. ఆవిడ అమ్మను పొగిడేసింది. ఇద్దరూ నవ్వుకున్నారు కూడా.

    వాళ్ళు ఏమిటో నాకు అర్ధంకాలేదు. నా గొడవ మాత్రం అప్పుడే అయిపోలేదు. సాయంత్రం నాన్నగారు వచ్చేక అమ్మ మళ్ళీ అంతా ఆయనకు చెప్పింది. నాన్నగారు కూడా నేను చెప్పేది వినిపించుకోకుండా నన్ను తిట్టి పోశారు.

    నేను మామ్మ దగ్గరకు వెళ్ళాను. మామ్మ జరిగిందంతా విని "నువ్వు చాలా చురుకైన పిల్లవే" అని నన్ను ముద్దులాడింది. మామ్మ మాటలు నాకు సంతోషం కలిగించలేదు. నేను తప్పేమిటీ అని ఆలోచిస్తున్నాను. ఏమీ తెలియడం లేదు. అందువల్ల నిరుత్సాహంగా వున్నాను. ఏమీ తోచక నా గదిలోకి పోయి క్లాసు పుస్తకం తీశాను.

    ఏమీ తోచనప్పుడూ, నిరుత్సాహంగా వున్నప్పుడూ క్లాసు పుస్తకం తీసి చదువుతాను. ఎవరూ చెప్పకపోయినా సరే!

    బాబాయి ఇంటికి ఎప్పుడు వచ్చాడో నేను గమనించ లేదు. కానీ వున్నట్లు బాబాయి మాటలు వినిపించాయి.

    "అమ్మలు ఏదీ? ఎక్కడా హడావుడి కనిపించదేం?" అన్నాడు బాబాయి.

    అమ్మ, నాన్న బాబాయికి జరిగింది చెబుతున్నారు.

                    (సశేషం)