Facebook Twitter
అమ్మ పిలుపు

అమ్మ పిలుపు

- వసుంధర

ఎపిసోడ్ - 6

     

        చలపతి అతడివంక క్రూరంగా చూశాడు. గోపీ పట్టించుకోకుండా వాడి పక్కనే కూర్చున్నాడు. చలపతి వెనువెంటనే గోపీని పక్కకు తోసేయాలనుకున్నాడు. కానీ ఎవరో చెప్పినట్లు ఆగిపోయాడు.

    క్లాసు క్లాసంతా ఆశ్చర్యంగా ఆ బెంచీ వంకే చూస్తున్నారు. అప్పుడేదో జరుగుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ లోగా క్లాసులోకి ఇంగ్లీషు టీచరు వచ్చాడు. క్లాసులోని కుర్రాళ్ళందరూ లేచి నిలబడి తిరిగి కూర్చున్నారు.

    ఇంగ్లీషు టీచరు దృష్టి కూడా అనుకోకుండా చలపతి బెంచీమీదనే పడింది. ఆయన ఆశ్చర్యంగా "అరె! చలపతి బెంచీ మీద ఈ రోజు ఇద్దరున్నారే" అన్నాడు అప్రయత్నంగా.

    చలపతి వెంటనే విసురుగా లేచి నిలబడ్డాడు. "ఈ వెధవనిక్కణ్ణించి మీరు లేపకపోతే మీ మర్యాదకూడా దక్కనివ్వను" అందామనుకున్నాడు. కానీ "ఇన్నాళ్ళూ అనాగరికంగా, అసహ్యంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను మేష్టారూ! నన్ను క్షమించండి. ఇవతల పక్క కూడా మరొకరువచ్చి కూర్చుంటే సంతోషిస్తాను" అంటూ అటున్న పుస్తకాల సంచీని తీసిముందు పెట్టుకుని కూర్చున్నాడు.

    చలపతి గోపీని పక్కన కూర్చోనిచ్చినందుకే ఆశ్చర్యపడుతున్న క్లాస్ స్టూడెంట్స్, టీచరూ అతడి ఈ మాటలకింకా ఆశ్చర్యపడ్డారు. ఇంగ్లీషు టీచరు చలపతిలో వచ్చిన మంచి మార్పును మెచ్చుకుని రామేశాన్ని లేచి వెళ్ళి చలపతి పక్కన కూర్చోమన్నాడు. రామేశం లేచి రాగానే చలపతి లేచి బయటకు వచ్చి "నువ్వు గోపీ పక్కన కూర్చో. నువ్వు వాడూ ఫ్రెండ్సు కదా" అన్నాడు రామేశం కూర్చోగానే చలపతి అప్పుడు తనూ పక్కన కూర్చున్నాడు. మొత్తం క్లాసు క్లాసంతా ఈ సంఘటనకు తెల్లబోయారు.

    చలపతికి మాత్రం అంతా విచిత్రంగా వుంది. వాడికి గోపీమీద చాలా కోపం వుంది. పట్టుకుని తన్నాలని కూడా వుంది. అందర్నీ కసికొద్దీ తిట్టాలని వుంది. కానీ వాడి అవయవాలేమీ వాడి స్వాధీనంలో లేవు. వాడొకటి చేయాలనుకుని ఒకటి చేస్తున్నాడు.

    క్లాసు అయిపోయాక అందరూ గోపీ చుట్టూ చేరారు. అందులోనూ తర్వాత క్లాసు లెక్కలది.. రామనాధం మేస్టారు పోయాడు. ఆ పీరియడ్ కి వేరే మాస్టార్నింకా వేయలేదు.

    "చలపతిలో ఎంత మార్పు? ఇదెలా జరిగింది గోపీ!" అని అంతా గోపీని అడిగారు. గోపీ అప్పుడుత్సాంగా "చలపతిగాడు జడ్డి వెధవ. చదువులో తెలివి లేదు. బుద్ధులు మంచివి కావు. అందరూ వాణ్ణి అసహ్యించుకుంటున్నారు. అయినా ఏమీ చేయలేకపోతున్నారు. ఇదినాకు నచ్చలేదు. నిన్న నేను వాణ్ణి చెడామడా తిట్టి మంచి బుద్దులు నేర్పాను. వాడప్పుడు నా కాళ్ళు పట్టుకొని ఇంక మీదట తను బుద్దిగా వుంటాననీ నేను చెప్పినట్టు వింటాననీ అన్నాడు. అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా చూడండి. పీరియడ్ కాళీ అయినా సరే సీట్లోంచి కదలద్దన్నానని అలా కదలకుండా కూర్చున్నాడు." అన్నాడు.

    ఈ మాటలు వింటూంటే చలపతికి వళ్ళుమండి పోయింది. అన్నీ అబద్ధాలు. వాడు గోపీని తిట్టాలని నోరు తెరిచాడు. చేయి విసిరాడు. కనీ అప్రయత్నంగా వాడు అందరికీ దణ్ణం పెట్టి, "నేను చాలా పాపాలు చేశాను. గోపీ నా కళ్ళు తెరిపించాడు. ఇన్నాళ్ళూ మీకు చేసిన అన్యాయానికి ప్రతిఫలంగా కొన్నాళ్ళ పాటు మీరందరూ ఎలా చెబితే అలా నడుచుకోవాలనుకుంటున్నాను" అన్నాడు. 

    అప్పుడు కొందరు వాడిని గుంజీలు తియ్యమన్నారు. కొందరు పిల్లిమొగ్గలు వేయమన్నారు. కొందరు నాట్యం చేయమన్నారు. కొందరు కాళ్ళకు మొక్కించుకున్నారు. చలపతి మాత్రం మారుమాట్లాడకుండా ఎవరేం చెబితే అది చేశాడు. కాసేపటికి గోపీ వాళ్ళను వారించి "చలపతి చేసిన పాపాలకు శిక్ష అయిపోయింది. వాడిప్పుడు మంచి వాడైపోయాడు. మంచి వాళ్ళనేడిపించడం పాపం. ఇంక వాడి జోలికి వెళ్ళకండి. మనమిప్పుడు రెండో సాహస కార్యం గురించి ఆలోచించాలి" అన్నాడు.

    రామేశం వెంటనే ఉత్సాహంగా "అయితే నువ్వు పాల పాపారావుతో పోటీ పడతావా?" అన్నాడు.

    "ఛాఛా-ఆ పాపారావుతో నేను పోటీ పడ్డమేమిటి? ముందు వాణ్ణి మన కనకరాజుతో పోటీ పడి నెగ్గమనండి. అప్పుడు చూద్దాం"-అన్నాడు.

    ఇది విని అందరూ తెల్లబోయారు. కనక రాజు ఆ స్కూల్లోనే పదవ తరగతి చదువుతున్నాడు. వాడికి ఒక కాలు పొట్టి. ఒక కాలు పొడుగు. మనిషి కుంటుతూ నడుస్తూంటాడు. వాడికో సైకిలుంది. కాళ్ళెగుడు దిగుడు కావడం మూలాన వాడు చాలా నెమ్మదిగా సైకిలు తొక్కుతాడు. ఆ స్కూల్లో నత్త నడకలా అనడానికి బదులు కనకరాజు సైకిల్లా అనడం మామూలు.

    "బాణంలా దూసుకు పోయే ఆ పాపారావెక్కడ? మన కనకరాజెక్కడ? నీకేమైనా మతి పోయిందా?" అన్నాడు రామేశం.

    "అదంతా నాకు తెలియదు. చేవుంటే పాపారావుని కనక రాజుతో పోటీ పడి ఓడించమనండి. కనకరాజు మీద నెగ్గేకనే నేను పాపారావుని ఓడిస్తాను. పాపారావు ఈ పోటీకి ఒప్పుకోలేదంటే, నా శక్తికి భయ పడ్డాడని అర్ధం" అన్నాడు గోపీ.

    ఈ వార్త పాల సైకిళ్ళ పాపారావుని చేరింది. కుంటి వాళ్ళతోటీ, సొట్టి వాళ్ళతోటీ పోటీ పడ్డం నాకవమానం అంటూ ముందు వాడు చిందులు తొక్కాడు. కానీ అందువల్ల తను గోపీకి భయపడ్డానన్న చెడ్డపేరు రావచ్చునని అర్ధమయ్యాక తను పోటీకి సిద్ధపడ్డాడు. ఈ పోటీలో పాల్గొనడానికి కనకరాజు సిగ్గుపడ్డాడు. కానీ గోపి వాడిని ఒప్పించ గలిగాడు. హైస్కూలు విద్యార్ధులందరూ తలో రూపాయి చందా తెచ్చి కనక రాజుకు బహుమతిగా యివ్వాలని గోపీ చెప్పాడు.

    కనక రాజెలాగూ నెగ్గడు కదా అన్న నమ్మకంతో రామేశం ఆ చందా డబ్బులు వసూలు చేసే పూచీ తనదన్నాడు.

    చలపతికి బుద్ధి చెప్పిన మర్నాడే గోపి ఈ పోటీ ఏర్పాటు చేశాడు. పోటీ స్కూలు దగ్గర సాయంత్రం ప్రారంభమయింది. గోపీ కనక రాజుతో "నువ్వు శ్రమ పడకు. ఎప్పటిలాగే మామూలుగా సైకిలు తొక్కు. విజయం నీదే అవుతుంది" అన్నాడు.

    పోటీదారు లిద్దర్నీ గమనించడానికి సురేష్ అనే కుర్రాడు మోటార్ సైకిల్ మీద బయల్దేరాడు. వాడి వెనుక గోపీ, రామేశం కూర్చున్నాడు.

    సరిగ్గా స్కూలు గేటు దగ్గర సాయంకాలం అయిదింటికి సైకిళ్ళు రెండూ బయల్దేరి సీతా నగరంలోని గంగమ్మ చెరువును చేరుకోవాలి. ఎవరు ముందు వెడితే వాళ్ళు నెగ్గినట్లు.

    విద్యార్ధుల్లో కొందరు స్కూలు గేటు వద్ద వుంటే కొందరు గంగమ్మ చెరువు వద్దనున్నారు.

    సరిగ్గా అయిదింటికి ఓ విద్యార్ధి ఈల వేయగా పాపారావు, కనక రాజు సైకిళ్ళు తొక్కసాగారు. గోపీ హెచ్చరికను మరిచిపోయి కనకరాజు తనశాయశక్తులూ ఉపయోగించి సైకిలు వేగంగా తొక్కుతున్నాడు. ఎటొచ్చి పాపారావు విషయమే విచిత్రంగా వుంది. అతడు కూడా తన శాయశక్తులూ ఉపయోగించి సైకిలు తొక్కుతున్నాడు. కానీ ఎదురుగాలి ఉన్నట్లుగా అతడి సైకిలు వేగంగా ముందుకు వెళ్ళడం లేదు. అది పాపారావుకే విచిత్రంగా వుంది.

    కనక రాజు గంగమ్మ చెరువు చేరుకునే సరికి పాపారావింకా సగం దూరం కూడా దాటలేదు. స్కూలు విద్యార్ధులందరూ గంగమ్మ చెరువు వద్ద ఉత్సాహంగా పెద్దగా కేకలు వేశారు. కాసేపు సైకిలు తొక్కేక పాపారావుకు పోటీలో ఓడినట్టు అర్ధమైంది. వాడింక చెరువు వైపుకు వెళ్ళకుండా ఊళ్ళోకే వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ వాడి సైకిలు రయిన దూసుకుపోయింది. పాపారావు ఆశ్చర్యపోతూ ముందు ఓ సైకిలు షాపు వద్దకు వెళ్ళి "సైకిల్ కండిషనెలాగుందో చూడు" అన్నాడు.

    షాపువాడన్నీ పరీక్షించి "నిక్షేపంగా ఉంది" అన్నాడు.

    ఏదో మోసం జరిగిందని పాపారావనుకున్నాడు. కానీ ఎలా జరిగిందో వాడికి అర్ధంకాలేదు. ఈ అవమానంనుంచెలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూంటే వాడి మెదడు అదుపు తప్పింది. అటు మీదట వాడు కనిపించిన వాళ్ళందరికీ కనకరాజనే హైస్కూలు కుర్రాడు సైకిల్ పందెంలో ఓడించాడు" అని చెప్పసాగాడు. ఈ విషయాన్ని వాడు కొంతమంది ఊరి పెద్దల యిళ్ళ క్కూడా వెళ్ళి చెప్పుకున్నాడు. అయితే అలా చెప్పుకోవాలని వాడనుకోలేదు.

    పాపారావు సంగతిలా వుంటే అక్కడ గంగమ్మ చెరువు వద్ద విద్యార్ధులందరూ సంతోషంలో కేరింతలు కొడుతూంటే చటుక్కున చెరువులోంచి అప్పారావు పైకి లేచి -"కుర్రాళ్ళు ఏమిటిక్కడ గొడవ?" అన్నాడు.

    అప్పుడు గోపీ అప్పారావుని చూసి కనకరాజు పందెంలో నెగ్గిన విషయం చెప్పి "ఇప్పుడు మాకుర్రాళ్ళంతా డబ్బు పోగుచేసి కనకరాజు కివ్వాలి. నువ్వే వెయ్యి రూపాయలూ ఇచ్చేస్తే మాకాశ్రముండదు. కావాలంటే నిన్ను ఈత పందెంలో ఓడిస్తాలే!" అన్నాడు.

    "ఏమిటి-నన్నీ పందెంలో ఓడిస్తావా? ఏదీ-చెరువులోకి దూకు" అన్నాడు అప్పారావు కసిగా.

    "పాపం-ఇప్పటికే ఈది ఈది అలిసియున్నావు. మన రేపొద్దున్న పోటీ పెడదాం" అన్నాడు గోపీ వేళాకోళంగా.
    "నీ లాంటి బొట్టికాయతో పోటీ పడ్డానికి రేపటి దాకా ఆగక్కర్లేదు. ధైర్యముంటే ఇప్పుడే దూకు-" అన్నాడు అప్పారావు.

    "సరే-నువ్వడిగావనే పోటీ పడుతున్నాను. తర్వాత అన్యాయమని అనకూడదు" అని "రామేశం-ఇప్పుడు టైము చూడు. ఎవరు ముందు ఒడ్డెక్కితే వాళ్ళోడినట్లు" అంటూ గోపీ నీళ్ళలోకి దూకాడు.

    అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. గంగమ్మ చెరువు ఒడ్డు దగ్గరే నిలువులోతుందని చెప్పుకుంటారు. గోపీ అంతకు ముందెన్నడూ ఆ చెరువులో ఈది వుండలేదు. అలాంటి వాడు ధైర్యంగా ఈ చెరువులో కెలా ఉరికాడు? ఉరికినా అప్పారావుతో ఎలా పోటీ పడగలడు?

    గోపీ, అప్పారావు చెరువులో హుషారుగా ఈతలు కొడుతున్నారు. చుట్టూ చేరిన వారందరూ వాళ్ళను గమనిస్తున్నారు.

    ఉన్నట్లుండి అప్పారావును వీపు మీద ఎవరో గుచ్చినట్లయింది. అప్పారావటూ యిటూ అనుమానంగా చూశాడు. గోపీ దగ్గర్లోనే ఈదుతున్నాడు. "నువ్వేదో మోసం చేస్తున్నావు." అనాలనుకున్నాడు. కానీ "అయ్యబాబోయ్, నాకాయాసం పెరిగిపోతోంది. నన్ను రక్షించండి" అన్నమాట లతడి నోట్లోంచి వచ్చాయి. తనలాగన్నందుకతడే ఆశ్చర్యపోయి "మోసం" అని అరవబోయాడు. కానీ "ఎవరూ రారేం-నన్ను రక్షించరేం?" అన్న మాటలే అతడి నోటి నుండి వెలువడ్డాయి.

    అంతే! వెంటనే ఈత తెలిసిన నలుగురైదుగురు కుర్రాళ్ళు చెరువులోకి దూకి అప్పారావును ఒడ్డుకిలాగేశారు. అప్పారావు వాళ్ళను ప్రతిఘటించాలనుకున్నాడు. "నన్నీత కొట్టనివ్వండి-నాకేమీ ఆయాసం లేదు" అని అరవాలను కున్నాడు. కానీ "థాంక్యూ! సమయానికి నన్ను రక్షించారు.

                   

(సశేషం)