Facebook Twitter
అమ్మ పిలుపు

అమ్మ పిలుపు

ఎపిసోడ్ -4

- వసుంధర

        

       గోపీకి మళ్ళీ భయమేసింది. సొరంగం లోంచి దిగిపోదామా అని కాసేపు మనసూగిసలాడింది. అప్పుడు మళ్ళీ "నీకేం భయం లేదు. నేనున్నాను. ముందుకురా!" అన్న మాటలు గోపీ చెవిలో వినిపించాయి.

    అప్పుడు గోపీకి చాలా అనుమానాలు కలిగాయి. తనతో ఎవరైనా మాట్లాడుతున్నారా? లేక తను భయపడుతున్నాడా?

    సొరంగంలోకి ప్రవేశించి బంగారం చేయడం నేర్చుకోవాలని తనకు చాలా కోరికగా వుంది. ఎవరికైనా బలమైన కోరిక వున్నప్పడది నెరవేర్చుకుందుకిలాంటి భ్రమలు కలుగుతాయని జానకిరామయ్య తాతయ్య చెప్పాడు. అలాంటి భ్రమే తనకు కలుగుతోందా?

    అప్పుడు గోపీకి తను చూసిన 'పాతాళభైరవి' సినిమా గుర్తుకొచ్చింది. ఎంతో పాత సినిమా అది. కానీ ఎంత బాగుందో! అందులో ఎన్టీరామారావు తనలాగే గుహలో ప్రవేశిస్తాడు -ఓ మాంత్రికుడితో. ఫలితంగా పాతాళభైరవి విగ్రహం సంపాదించుకుంటాడు. సాహసం చేయాలనుకునేవాడికి మొండితనం వుండాలి. దురాలోచన వుండకూడదు.

    అప్పుడే గోపీకి తను చూసిన 'రాజూ-పేద' సినిమా కూడా గుర్తుకొచ్చింది. అందులో రేలంగికి జేబులో ఓ బొమ్ముంటుంది. ఆ బొమ్ముంటే తననెవరూ ఓడించలేరని రేలంగి నమ్మకం. ఆ బొమ్మ దగ్గరుంటే ఎలాంటి వీరులతో అయినాసరే ఫైటింగ్ చేసి ఓడించేసేవాడు. ఒకోసారి బొమ్మ పడిపోయినా అది  తన దగ్గరే వుందనుకుని బాగా ఫైట్ చేసేవాడు. బొమ్మ లేదని తెలిస్తే మాత్రం కత్తి పక్కన పారేసి ఏడుస్తూ కూర్చునేవాడు. నిజానికి బొమ్మలో ఏమీ లేదు. బొమ్మ మీద వున్న నమ్మకమే రేలంగికి బలాన్నిచ్చింది. అదంతా రేలంగి భ్రమ!

    తనూ అలాగే భ్రమపడుతున్నాడా? తనకు సొరంగంలోకి వెళ్ళాలనుంది. అందుకని ఎవరో పిల్చినట్లు భ్రమపడుతున్నాడా? ఎవరో పిలిచారు కాబట్టే వెడుతున్నానని సరిపెట్టుకుంటున్నాడు.

    "ఒరేయ్ గోపీ! త్వరగారా! నువ్వేమీ భ్రమంపడ్డం లేదు. నీకున్నది భ్రమే అయితే రామనాథం మేస్టారి చావు గురించి నీకెలా తెలిసింది? త్వరగా బయల్దేరిరా- ఊ-వెంటనే ముందడుగు వేయి" అన్న మాటలు మళ్ళీ గోపీకి వినిపించాయి.

    అవునా-నిజమే! రామనాథం మేస్టారి చావు గురించి తనకు ముందుగానే తెలిసింది. అంటే గోపాల్రావు తాతయ్య నిజంగానే నన్ను పిలుస్తున్నాడు.

    గోపీ ముందుకు వెళ్ళాడు. సొరంగం మరీ ఎత్తుగా లేనందువల్ల వాడు కాస్త వంగి నడవాల్సి వస్తోంది. అంతా చిమ్మచీకటి.

    లోపల అదో రకం వాసన. ఆ వాసన బాగోలేదు. గోపీ ఒక్క క్షణం ఆగి ముక్కు మూసుకున్నాడు.

    "అదేమీ విషవాయువు కాదులే- ధైర్యంగా ముందడుగు వేయి" మళ్ళీ గోపీకి హెచ్చరిక వినబడింది.

    గోపీ యింక జాప్యం చేయలేదు. చకచకా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. కాసేపటికి వాడా సొరంగంలోని వాసన కలవాటు పడ్డాడు. అలా కొంత దూరం నడిచేసరికి వున్న పళంగా వాడికి వెలుగు కనబడింది. గోపీ చటుక్కున కళ్ళు మూసుకున్నాడు. చిమ్మచీకటిలో ఒక్కసారి వెలుగు కనబడే సరికి వాడి కళ్ళుచెదిరి పోయాయి. అందువల్ల వాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా కనబడ్డ దృశ్యం చూసి భయంతో గజగజ వణికి పోయాడు.

    అక్కడ ఒక కొండ చిలువుంది. ఎంత పొడుగుందో తెలియదు. కానీ గుహ లాంటి నోరు తెరిచి గోపీ వంకే చూస్తూ నెమ్మదిగా ముందుకువస్తోంది.

    గోపీ వెనక్కు తిరిగి పారిపోవాలనుకున్నాడు. కానీ కాళ్ళూ, చేతులూ కూడా వాడికి పనిచేయలేదు. మెదడు మొద్దు బారిపోయింది.

    కొండ చిలువ క్రమంగా గోపీకి దగ్గరవుతోంది. గోపీ భయంగా నిస్సహాయంగా దాని వంక చూస్తున్నాడు. అది బాగా దగ్గరవగానే గోపీ కెవ్వుమని కేకవేసి నిలువునా కూలబడి పోయాడు. తన ప్రాణాలు పోయినట్లే అనుకున్నాడు గోపీ. క్షణాల మీద వాడి స్పృహ తప్పింది.


            7


    ఎవరో తన గుండెల మీద రాస్తున్నట్లనిపించి చటుక్కున కళ్ళు తెరిచాడు గోపీ. ఎదురుగా వాడికి గెడ్డం, మీసాలు గుబురుగా పెరిగి ఉన్న ఓ సన్యాసి లాంటి వాడు కనిపించాడు.

    "స్పృహ వచ్చిందా గోపీ!" అన్నాడు సన్యాసి.

    గొంతుణు గోపీ గుర్తించాడు "నువ్వే నా గోపాల్రావు తాతయ్యవి" అన్నాడు వుత్సాహంగానూ, ఆశ్చర్యంగానూ!

    "బాగానే గుర్తు పట్టావు" అంటూ  నవ్వాడా సన్యాసి.

    "నేనిక్కడికెలా వచ్చాను?" అన్నాడు గోపీ. అప్పుడే వాడికి జరిగిన దంతా గుర్తుకు వస్తోంది. కొండ చిలువొకటి మీదకు వస్తూంటే స్పృహతప్పింది తనకు. ఆ తర్వాతేం జరిగిందో తెలియదు.

    "నువ్వెక్కడికి రావాలో అక్కడికే వచ్చావు. నువ్వు కోరిక కుబేరుడి కొలను నీ పక్కనే వుంది చూడు" అన్నాడు సన్యాసి.

    గోపీ లేచి కూర్చుని చుట్టూ చూశాడు. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా వుంది. చుట్టూ పచ్చని ఎత్తైన చెట్లున్నాయి. పక్కనే ఓ అందమైన  కొలనుంది. కొలనులోని నీరు బంగారు ఛాయలో మెరుస్తోంది.

    "నేనిక్కడికెలా వచ్చాను?" అన్నాడు గోపీ మళ్ళీ.

    "తమకు తామై సొరంగంలో ప్రవేశించిన వారా కొండ చిలువకు బలైపోతారు. నేను రప్పించిన వారు క్షేమంగా కుబేరుడి కొలను చేరుకుంటారు. ఎటొచ్చీ దారి మాత్రం ఎవ్వరికీ తెలియదు. అక్కణ్ణించి ఇక్కడికెలా వచ్చానని అడక్కు. ఎందుకొచ్చానని అడుగు చెబుతాను" అన్నాడు సన్యాసి.

    "ఎందుకో నాకు తెలుసు. బంగారం చేయడం నేర్పుతానని పిలిచావు నువ్వు. సాయంత్రానికల్లా వెనక్కు పంపేస్తానని కూడా అన్నావు" అన్నాడు గోపి. 

    "అది నిజమే! కానీ నీకు చెప్పని విషయాలు కూడా కొన్ని వున్నాయి. నేను నిన్ను రప్పించడానికి అసలు కారణం వేరే వుంది" అన్నాడు సన్యాసి.

    "ఏమిటది?" అన్నాడు గోపీ కంగారుగా.

    "అది తెలుసుకునే ముందు నువ్విక్కడి విశేషాలు, వింతలు తెలుసుకోవాలి. నేనిక్కడికెలా వచ్చానో కూడా తెలుసుకోవాలి!" అన్నాడు సన్యాసి.

    "చెప్పు తాతయ్యా! అన్నీ తెలుసుకోవాలనుంది నాకు" అన్నాడు గోపీ ఆత్రుతగా.

    సన్యాసి చెప్పడం ప్రారంభించాడు.

    కాంతికిరణం సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. అరవై సెకన్లు ఒక నిమిషం. అరవై నిమిషాలు ఒక గంట. ఇరవై నాలుగు గంటలు ఒక రోజు. 365 రోజులు ఒక సంవత్సరం. కాంతి కిరణం ఒక సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అంత దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. సూర్యుణ్ణి తప్పిస్తే- మనకు దగ్గర్లో వున్న నక్షత్రం దూరం 4.3 కాంతి సంవత్సరాలు. అంటే మనం కాంతి వేగంతో అనగా సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు  ప్రయాణం చేయగలిగితే ఆ నక్షత్రం చేరుకుందుకు 4.3 సంవత్సరాలు పడుతుందన్నమాట. మనకు కాంతివేగంతో ప్రయాణం చేయగల అవకాశం ఇప్పట్లో లేదు.

    మనకు సుమారు వంద కాంతి సంవత్సరాల దూరంలో జడ్యా అనే గ్రహముంది. ఆ గ్రహవాసులు వైజ్ఞానికంగా గొప్ప ప్రగతిని సాధించారు. ఆ గ్రహ వాసులు ఏ క్షణాన ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళగలరు. ఏ పదార్ధం కావాలనుకున్నా క్షణాల మీద తయారు చేయగలరు. వారు అన్ని రోగాలకూ మందులు కనిపెట్టారు. మృత్యువును జయించడం తప్ప వారికి చేతకానిదేదీ లేదు. అలాగని మృత్యువును జయించడం వారికి అసాధ్యమూ కాదు. శరీరానికైనా నాశనం అవసరం. అప్పుడే మనిషి లక్ష్యా లేర్పడతాయి. తను బ్రతికుండగా ఏమేం చేయాలో మనిషి నిర్ణయించుకుంటాడు. మృత్యువు తన్ను వెంట తరుముతున్నదని భయపడి మెదడుకు పదునుపెట్టి కొత్త కొత్త విశేషాలు నేర్చుకుంటాడు. మృత్యువు లేకపోతే మనిషి సోమరి అయిపోతాడు. మనిషికి లక్ష్యమన్నది వుండదు. అటుపైన ప్రపంచంలో మనుషుల సంఖ్య పెరిగిపోయి చోటు కోసం వెదుక్కోవలసిన దుర్గతి పడుతుంది. ఎప్పటికప్పుడు ప్రపంచంలోకొత్త మనుషులు వస్తూండాలి. పాత మనుషులు పోతూండాలి. అందుకే జడ్యాగ్రహవాసులు మృత్యువును జయించలేదు. అయితే వారికి చావు తనంత తాను రాదు. జడ్యాగ్రహంలో చావును నిర్ణయించడానికి ఓ అధికారి వున్నాడు. ఎవరెవరు ఎప్పుడు పోవలసిందీ ఆయన నిర్ణయిస్తాడు. గ్రహమంతటా ఆయనకు ఆఫీసులున్నాయి. కొన్ని లక్షల మంది ఆ ఆఫీసుల్లో పని చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతి గ్రహవాసి వివరాలూ సేకరిస్తూంటారు.

    ఇవన్నీ ఎలా జరుగుతాయీ, ఆ గ్రహం పూర్తి విశేషాలేమిటీ అన్నవి మనకు అప్రమత్తం. ఆ విశేషాలు మరెప్పుడైనా తెలుసుకోవచ్చు.     

    ఆ గ్రహవాసులు విశ్వాంతరాళంలో ఎక్కడెక్కడ జీవమున్నదా అని అన్వేషిస్తుంటారు. ఎక్కడ జీవజాలమున్నా అక్కడికి వెళ్ళి విశేషాలు తెలుసుకుని వస్తూంటారు. ఆ విధంగా ఒకసారి భూగ్రహం మీదకు జడ్యా గ్రహవాసి ఒకడు వచ్చాడు. కొన్నివేల సంవత్సరాల క్రితం. అప్పటికి మనిషింకా ఆటవిక దశలో వున్నాడు. భూమిపైన నాగరికత ఏర్పడలేదు.

    జడ్యా గ్రహవాసికి మానవులకు సాయపడాలన్న బుద్ధి పుట్టింది. తనకు తెలిసిన విజ్ఞానాన్నంతా మానవులకు చెప్పి వారినీ తమ గ్రహవాసులకు వలెనే తయారుచేయాలనుకున్నాడు. అయితే అందుకతడు జడ్యా గ్రహాధినేత అనుమతి తీసుకోవాలి. ఆ విషయం మరిచి అతడు ఆటవికుల మధ్యకు హేరి "మీరు జంతువుల్లా జీవిస్తున్నారు. మనుషుల్లా జీవించాలి" అని చెప్పాడు.

    మానవుల్లో అప్పుడప్పుడే భాష పుడుతోంది. జడ్యా గ్రహవాసి వారికర్ధమయ్యే భాషలో నాగరికత గురించి చెప్పసాగాడు. అతడు చెప్పేది చాలామందికి అర్ధం కాలేదు. తెలుసుకోవాలని ఉత్సాహం చూపించి ముందుకు వచ్చిన యిద్దరు ఆటవికులు అతడు చెప్పేది కాసేపు విని పెద్ద కేక పెట్టి చచ్చిపోయారు.

    ఊహించని ఈ పరిణామానికి జడ్యా గ్రహవాసి ఆశ్చర్యపోయాడు. మిగతా ఆటవికులతడినేమీ చేయలేక ప్రాణభయంతో అక్కణ్ణించి పారిపోయారు. జరిగిన విశేషాన్ని జడ్యా గ్రహవాసి గ్రహాధినేతకు తెలియపరిచాడు. తన అనుమతి లేకుండా అటువంటి కార్యం తలపెట్టినందుకు జడ్యాధినేత గ్రహవాసిపై మండిపడి "మన గ్రహం ఇప్పటి దశకు చేరుకునేందుకు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు పట్టింది. జీవ పరిణామం క్రమంగా జరుగవలసిన విశేషం. నీవు చెప్పే విజ్ఞాన విశేషాలకు తట్టుకోలేక మెదడు చిట్లి ఆ యిద్దరు ఆటవికులూ చచ్చిపోయారు" అన్నాడు. 

    అంతేకాకుండా జడ్యాధినేత ఆ గ్రహవాసిని భూమిపైనే వుండిపొమ్మని శాసించాడు. అదే అతనికి శిక్ష.

    "నీ శక్తులతో భూగ్రహవాసులకు సాయపడగలిగితే వారికి నీ శక్తి గురించి చెప్పకు. నీకు అపూర్వ శక్తులున్నట్టు వారికి చెప్పు. నాగరికత ఆరంభంలో మనిషిని విజ్ఞానంతో కాక మూడనమ్మకాలతో నమ్మించాలి" అని జడ్యాధినేత ఆ గ్రహవాసికి చెప్పాడు.

    అప్పట్నుంచీ జడ్యా గ్రహవాసి భూలోకంలో యోగిగా వ్యవహరించబడ్డాడు. అతడు క్రమంగా ప్రజలకు దైవం, మతం గురించి ఎన్నో మూడనమ్మకాలు నేర్పాడు. ఎంతకాలం నడిచినా మనుషులు కొద్దికొద్దిగా మారుతున్నారు తప్పితే యోగి తెలివితేటలు స్థాయికి చేరుకోలేకపోతున్నారు. అందుకని యోగి వారి మధ్యన జీవించడం మానేసి కుబేరుడి ఆలయమన్న పేరుతో వున్న గుడిలోంచి సొరంగమార్గం ఏర్పరచుకుని నాగరికతకు దూరంగా జీవించసాగాడు. ఆ లోపల నుండి అతడో కొత్త ప్రపంచం ఏర్పాటు చేసుకున్నాడు. తన సామర్ధ్యంతో అతడక్కడే వుండి భూమ్మీద ఎక్కడే వింతలున్నా చూస్తుండేవాడు. తనకు కావలసిన ఆహారం తయారుచేసుకుని తినేవాడు. ప్రపంచంలో ఎక్కడైనా కాస్త తెలివైన వాడు పుట్టి సృష్టి రహస్యాలనర్ధం చేసుకుందుకు ప్రయత్నిస్తుంటే వెంటనే తనకు తెలిసే ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి మనుషుల మెదడును తట్టుకోగలిగినంతగా ప్రభావితం చేసి సహకరిస్తుండేవాడు యోగి. ఈ భూమ్మీద కనిపెట్టబడిన ఎన్నో వైజ్ఞానిక విశేషాలకు సొరంగం లోపల తన ప్రపంచంలో వుండే సహకరించేవాడు యోగి.

    ఇలా ఎన్నో ఏళ్ళు గడిచాయి. జడ్యా గ్రహంలో మృత్యు అధికారి భూలోకం గ్రహవాసిని పట్టించుకోకపోవడం ఏమో యోగికి చావు రావడం లేదు. అతడికీ జీవితంపై విరక్తి పుడుతోంది. తన శరీరానికి నాశనం లేదని అతడికి తెలుసు. తను మనుషుల మధ్యకు వెళ్ళి సామాన్యుడిలా బ్రతకలేడు. తను ప్రతిభను చూపిస్తే మనుషులు తట్టుకోలేరు. జడ్యా గ్రహానికి తిరిగివెళ్ళే అవకాశం లేదు. ఆఖరికి యోగి ఓ ఉపాయం కనిపెట్టాడు. తనకు తెలిసిన విజ్ఞానాన్నంతా పుస్తకరూపంలో వ్రాయడం మొదలుపెట్టాడు. యోగికి కాగితాలెక్కడివి. సిరా ఎక్కడిదీ అని ఆలోచించనవసరం లేదు. యోగి తను వ్రాయదలుచుకున్నది అచ్చుపుస్తకాలుగా తయారుచేస్తున్నాడు. అదెలాగంటే......

                    (సశేషం)