Facebook Twitter
దుర్బుద్ధి

దుర్బుద్ధి

టి.రామాంజినేయులు

         అనగా అనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర ఒక పంది, ఒక నక్క, ఒక ఏనుగు జీతానికి పని చేస్తూ ఉండేవి. రైతు ఆ మూడు జంతువులను రోజూ పొలంలో పని చేయడానికి పంపిస్తుండేవాడు. తరువాత ఆయన భోజనం తీసుకొని పోయేవాడు. ఇట్లా రైతు రోజూ చేస్తా ఉండేవాడు. ఇవి పొద్దునే ముందుగా పోయి మడక దున్నడం, గెనాలు చెక్కడం, పైరు పీకడం చేస్తూ ఉండేవి. వాటిలో ఏనుగు, పంది బాగా పనిచేసేవి. రోజూ బురదలో దిగి గెనాలు చెక్కడం, పెల్లగడ్డలు వేయడం వంటివి చేసేవి. కానీ నక్క తెలివైనది కదా, వీటితో పని మొదలు పెట్టించి, పక్కనుండే వంకలోకి పోయేది. ఆ వంకలోకి పోయి, ఎండ్రకాయల బొక్కలలోకి తోకపెట్టి అల్లాడించేది. అట్లా అల్లాడిస్తే ఎండ్రకాయలు ’ఏదో వచ్చింది’ అనుకొని ఆ తోక జుబ్బరను (వెంట్రుకలను) పట్టుకునేవి. నక్కకు ఆ విషయం తెలిసిపోయేది. తర్వాత అది తోకను మెల్లగా పైకి పీకేది. ఆతర్వాత తోకకు అంటుకున్న ఎండ్రుకాయలను పట్టుకొని తినేది. అట్లా రోజంతా చేస్తూండేది; కాని రైతు భోజనం తెచ్చే సమయానికి మాత్రం, గబా గబా వంకలోంచి బయటకు వచ్చి, బురదలో పొర్లాడి, మగమంతా బురద పూసుకొని బయటకు వచ్చేది. రైతు వచ్చి, ’భోంచేస్తురాండి!’ అని పిలిస్తే అప్పుడు ఏనుగు పంది మొత్తం అంతా శుభ్రంగా కడుక్కొని వచ్చేవి; కాని నక్క మాత్రం దబ్బలు దబ్బలు కడుక్కొనేది. అపుడు రైతుకు జాలి వేసేది. ’అయ్యో, పాపం! ఈ నక్క ఎంత కష్టపడి పని చేస్తుందో! చాలా నిజాయితీ కలది’ అనుకొని మంచి భోజనం పెట్టేవాడు; అంటే నెయ్యి వేసేవాడు; పెరుగు వేసేవాడు; మంచి అన్నం పెట్టేవాడు. దీండ్లకు (పంది, ఏనుగు) మాత్రం మాడు చెక్కలు పెట్టేవాడు. ’ఇవి సరిగా పనిచేయలేదు; కనీసం బురద గూడ పూసుకొలేదు’ అని అనుకునేవాడు. పాపం వీటికి బాధ కలిగేది. కారణం నిజంగా కష్టపడి పని చేసింది ఇవే కదా, అందుకని. నక్క మాత్రం ఊరికే పైపైకి నటించేది. కాని ఇవి అట్లాగే పనిచేసేవి.

కొన్ని రోజుల తరువాత, ఏనుగు రైతు దగ్గరికి పోయి ’అన్నా! మేము చాలా కష్టపడుతుంటే, ఏందన్నా! అట్లాంటి భోజనం పెడతాండావు అది మేము వచ్చినప్పటినుంచి వంకలోకిపోయి ఆ కప్పలు, ఎండ్రకాయలు తింటూ మీరొచ్చే సమయానికి ఇట్లా వస్తాది’ అంటే రైతు ’అవునా’ అని పొలంలో కాపు కాసాడు. భార్యను అన్నం తీసుకొని రమ్మన్నాడు, అపుడు నక్క ’అది బట్టు, ఇది బట్టు, ఆ పెల్లగడ్డలు వేయి, ఆ గెనిమి చెక్కు అని ఈ రెండిటికి చెప్పి, మెల్లిగా గెనిమింటి గెనిమింటి వంకలోకి పోతుంది. రైతు భార్య అన్నం తెచ్చే సమయానికి చూపెట్టుకొని వస్తాది. ఆ మోంట్లో కొంత పొర్లాడేసి, ఆప్రక్క ఈప్రక్క పొర్లాడేసి, ఆప్రక్క ఈ ప్రక్క దబ్బలు దబ్బలు కడుక్కొని వస్తుంది. ఈ రెండూ మాత్రం శుభ్రంగా కడుక్కొని వస్తాయి. ’ఇవే బాగా పని చేస్తాయి’ అని రైతుకు అర్థం అయ్యింది. ఆ రోజున రైతు నక్కకు సద్ది అన్నము, సద్దిచారు, మాడుచెక్కలు, నీళ్ల చారు, నీళ్ళ మజ్జిగ పోశాడు. పందికి, ఏనుగుకు మాత్రం ఆ రోజున నెయ్యి, మంచి అన్నము, పెరుగు పెడతాడు. ఆవిధంగా రెండు రోజులు జరిగే సరికి, నక్కకు కుళ్ళెత్తుకుంటుంది.

ఇవి తిన్న తర్వాత రైతు సద్ది తీసుకొని ఇంటికి బయలుదేరాడు. అతను వెళ్ళిన తర్వాత ఏనుగు ,పందితో నక్క అన్నది: "నాకు చెరుకులు బాగా తినబుద్ధవుతున్నది. పక్కనుండే తోటలోకి పోదాము రండి; చెరుకులు తినేసి వద్దాము" అని అనింది. పంది, ఏనుగు అన్నాయి: "వద్దు, వాళ్ళు కొడతారు, చంపేస్తారు" ఇట్లా అని చెప్తే నక్క అంది, " ఏయ్ ! ఏముంది, రాండి, నేనుండా గదా!" అని. అలాగే ఆ మాటా ఈమాటా చెప్పి తోలక పోయింది. అందరూ చెరుకులు బాగా తిన్నారు. తిన్న తరువాత నక్క " నాకు చిన్న ఊళ వస్తున్నది; చిన్నగా ఊళ వేస్తాను" అంది. అపుడు పంది "వద్దు వద్దు నక్కా, సామీ!వద్దయ్యా! వాళ్ళు వచ్చారంటే కొట్టి చంపేస్తారు. అంతేకాదు మన రైతు కూడా కొడతాడు" అంటే "ఏడా లేదు లేవయ్యా! ఏడొస్తరు గానీ" అని పోయేసి "ఊ! ఊ!" అని ఊళ పెట్టింది. మళ్ళీపోయి, ఒక ఉబ్బరం(మరొక మారు) చెరుకులు తింటుంది. తిన్న తరువాత "అవి అరగాలి కదా! ఇంకొక ఊళ వస్తోంది, వేస్తాను" అన్నది.

ఏనుగు పంది వద్దన్నా వినకుండా పోయి నక్క గట్టిగా ఊళ పెట్టింది. ఈ కూతను చెరుకు తోట రైతు విని, మిగిలిన వారితో "ఒరేయి! చెరుకు తోటలో నక్కలున్నాయి. రాండి వలలు తీసుకొని పోదాము" అని చెప్పి, చుట్టూ వలలు వేసి ఒక వైపు నుండి సోపేసుకొంటు వస్తే నక్క ఆడదూరి ఈడదూరి వెళ్ళిపోయింది. ఈ రెండూ మాత్రం వలలో చిక్కిపోయాయి. వారువీటిని చంపేసారు. అందుకనే ’దుష్టులతో స్నేహం చేయటం ప్రమాదకరం’ అని గుర్తుపెట్టుకోవాలి.

 

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యం తో