Facebook Twitter
సింహం-యువరాణి

సింహం-యువరాణి

K.భార్గవి

కొన్ని వందల సంవత్సరాల క్రితం మొగలి చక్రవర్తి అనే రాజు ఉండేవాడు. రాజ్యాన్ని చాలా బాగా పరిపాలించేవాడు ఆయన. ఆయనంటే ప్రజలకు అభిమానం. ఆయన ఎప్పుడూ ధర్మాన్నే పాటించేవాడు. కానీ ఆయనకు ఒక్కటే బాధ- తన తర్వాత రాజ్యాన్ని పాలించే వారసులే లేరని.

ఒకరోజు ఆయన ఎక్కిన రధం పట్టు తప్పి, దారి ప్రక్కనే పోతున్న కుక్కల కుటుంబం మీదుగా పోయింది. ఎంత ప్రయత్నించినా రధాన్ని ఆపటం రాజు వల్ల కాలేదు. పాపం, ఆ కుక్కలన్నీ రధం క్రింద పడి చచ్చిపోయాయి.

రాజు క్రిందికి దిగి చూసే సరికి, వాటిలో ఒక్క కుక్క పిల్ల మాత్రం బ్రతికి ఉన్నది. ముద్దుగా ఉన్న ఆ కుక్క పిల్లను చూస్తే రాజుకు జాలి వేసింది. ఆయన ఆ కుక్కపిల్లను ఇంటికి తీసుకొని పోయాడు.

రాజ్యంలోని వాళ్లెవరికీ ఆ కుక్క నచ్చలేదు. ముఖ్యంగా మంత్రి, మంత్రి భార్యలకు ఆ కుక్కను చూస్తే అసహ్యంగా ఉండేది. రాజుగారు దాన్ని ముద్దు చేసినప్పుడల్లా వాళ్ళిద్దరూ ఉడుక్కునేవాళ్ళు. చివరికి ఒకరోజున మంత్రి కుక్కపిల్ల తోకమీద ఉన్న మచ్చను రాజుకు చూపెడుతూ- "మహారాజా! ఈ కుక్క చాలా దురదృష్టపు కుక్క. ఏ కుక్కకైతే తోక దగ్గర ఇలాంటి మచ్చ ఉంటుందో ఆ కుక్కవల్ల యజమానికి కీడు వాటిల్లుతుంది. కాబట్టి ఈ కుక్కను ఎలాగైనా వదిలించుకోండి" అన్నాడు.

కానీ ముద్దుగా ఉన్న కుక్కపిల్లను చూస్తే రాజుకు దాన్ని వదల బుద్ధికాలేదు. "చూడండి మంత్రి వర్యా! ఈ కుక్క ఎక్కడో అడవిలో ఉండవలసినది, తన అదృష్టం కొద్దీ రాజ మహలులోకి రాగలిగింది. ఇంత అదృష్టవంతురాలైన కుక్క వల్ల ఎవరికైనా నష్టం కలుగుతుందంటే నాకు నమ్మ బుద్ధికావటంలేదు. దీన్ని మనతోటే ఉంచుకొని, ఏమేమి నష్టాలు వస్తాయో చూద్దాం!" అన్నాడు రాజు. మంత్రి ఏమీ అనలేక ఊరుకున్నాడు, కానీ ఆ కుక్క పిల్లను చూసినప్పుడల్లా అతనికి చికాకుగా ఉండేది.

ఒకరోజు మంత్రి రాచకార్యాలలో మునిగి ఉన్న సమయంలో ఆయన గదిలోకి ఒక త్రాచు పాము దూరింది. మంత్రి దాన్ని గమనించలేదు. పని ముగించుకొని తన గదిలోకి వెళ్ళబోయిన మంత్రికి కుక్క అడ్డు వచ్చింది. మంత్రి దాన్ని ఎంత తిట్టినా, భయపెట్టినా అది అతని కాళ్లను చుట్టుకొని 'కుయ్ కుయ్ ' అంటున్నది తప్ప, అతన్ని లోనికి పోనివ్వలేదు. పని తొందరలో ఉన్న మంత్రి కుక్కను చావబాది లోనికి అడుగు పెట్టగానే 'బుస్'మంటూ త్రాచుపాము పడగ విప్పి కనబడ్డది. మంత్రి నిశ్చేష్టుడైపోయాడు గానీ, కుక్క పిల్ల అతన్ని దాటుకొని వచ్చి పాముపైన పడింది. చాలాసేపు యుద్ధం చేసి, చివరికి ఆ పామును చంపేసింది కుక్క.

అటుపైన మంత్రికి కూడా ఆ కుక్క పట్ల ఆదరం కలిగింది. క్రమంగా అది పెద్దదై, రాజుకు మంత్రికి చాలా విశ్వాసపాత్రంగా తయారైంది.

ఆ సమయంలో రాజ్యానికి ఒక ఋషి వచ్చి, రాజుగారిని సందర్శించాడు. ఆ సమయంలో కుక్క రాజు ప్రక్కనే కూర్చొని ఉన్నది. దాన్ని చూసిన ఋషి కొంచెం సేపు కళ్ళు మూసుకొని, ధ్యానించి, "రాజా! ఈ జంతువు నీవద్ద ఉన్నదేమా, అని మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇది నిజానికి కుక్క కాదు. చంద్రహాస మహారాజు కుమార్తే ఈమె. సదాచార మహర్షి శాపం వల్ల ఈమెకు ఈ రూపు వచ్చింది. ఈమె పాపం నేటితో నశించింది. త్వరలో ఈమెకు తన పూర్వరూపం రాగలదు. అయితే ఈమె మనిషిగా మారాలంటే కాకులు దూరని కారడవిలో ఉన్న 'అమృతవల్లి' మూలికను తెచ్చి, దాని రసాన్ని పూయవలసి ఉంటుంది. ఏ మహావీరుడు ఆ పని చేస్తాడో అతడే ఈమెకు భర్తై, మీ తదుపరి ఈ రాజ్య సింహాసనాన్ని అధిష్టించగలడు" అని చెప్పి, వెళ్ళిపోయాడు.

రాజుగారికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. తన ఇంటిలో చేరిన కుక్క నిజానికి చంద్రహాస మహారాజు కుమార్తె అని తెలిసి ఆయనకు చాలా సంతోషం కలిగింది. అయితే 'కాకులు దూరని కారడవిలోకి వెళ్ళి 'అమృతవల్లి'ని తేగల వీరుడెవరు? మా పట్టిని చేపట్టగల యోధుడెవ్వడు?'అని ఆయన రాజ్యం అంతటా దండోరా వేయించాడు.

అనేక దేశాలనుండి గొప్ప గొప్ప యోధులు వచ్చి ప్రయత్నించారు గానీ కాకులు దూరని కారడవిలోకి వెళ్లి అమృతవల్లిని ఎవ్వరూ తేలేకపోయారు. చాలామంది జాడ తెలీకుండా పోయారుకూడా.

చివరికి సింహపురి రాజ్యం నుండి విక్రముడు అనే సామాన్య వ్యక్తి ఒకడు వచ్చి తానూ ప్రయత్నిస్తానని రాజును అడిగాడు. "గొప్ప గొప్ప యువరాజులే అమృతవల్లిని కనుక్కోలేక పోయారు. సామాన్య వ్యక్తివి, నీవల్ల ఏమౌతుంది?" అన్నాడు రాజు.

"మహారాజా! ఇన్నాళ్లుగా ప్రయత్నించిన వీరయోధులందరూ తమ ధైర్య సాహసాలపై ఆధారపడ్డారు. నేను నా ధైర్యాన్నీ. శౌర్యాన్నీ ఎలాగూ‌ ప్రయోగిస్తాను. అయితే నాకున్న నిజమైన శక్తులు కరుణ, జాలి. అవే నాకు విజయం కలిగిస్తాయని నా విశ్వాసం" అన్నాడు విక్రముడు, కాకులు దూరని కారడవికి బయలుదేరుతూ.

అడవిలో ప్రవేశించగానే అతనికి ఒక సింహం ఎదురైంది. దానికి ఒళ్లంతా కురుపులు ఉన్నాయి. "నువ్వు అమృతవల్లి కోసం వచ్చావని నాకు తెలుసు. అయితే ఈ అడవిలో మూలిక ఒక్కరికి మాత్రమే సరిపోయేటంత ఉన్నది. నా శరీరం చూస్తున్నావు కదా, పుళ్ళు పడి నాశనమౌతున్నది. నేను బాగుపడాలంటే ఆ మూలిక నాకు అవసరం. కానీ అది నాకు అందదు. నువ్వు చెట్టెక్కి దాన్ని కోసి ఇచ్చావంటే, నాకు మేలు చేసినవాడివౌతావు" అన్నదది విక్రముడితో. "మరి నేను వచ్చిందీ దానికోసమే కదా, నీకు కోసి ఇచ్చేస్తే, మరి రాకుమారికెలా?" అన్నాడు విక్రముడు. "అదే సమస్య. నీ ముందు వచ్చినవాళ్లంతా నన్ను మోసం చేసి మూలికను తీసుకుపోదామని ప్రయత్నించి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. నీ పనీ అలాగే అవ్వాలంటే సరే, కానివ్వు" అన్నది సింహం, కళ్లనీళ్ళ పర్యంతమౌతూ.

దాన్ని చూసిన విక్రముడికి జాలి వేసింది. "నాకు కావలసిన మూలికను మళ్ళీ వెతుక్కుంటానులే. ముందు నీ కష్టాన్ని తీరుస్తాను. మూలిక ఎక్కడుందో చూపించు" అన్నాడతను సింహంతో. " మూలికను చూసిన తరువాత నన్ను మోసం చెయ్యవు గద! మోసం చేసిన వాళ్ళకు మూలిక పని చెయ్యదు!" అన్నది సింహం.
"మూలిక నీకోసమే" అని విక్రముడు ప్రమాణం చేసిన మీదట, అది విక్రముడిని వెంటబెట్టుకొని కారడవి లోపలికి తీసుకుపోయింది.

అక్కడ అమృతవల్లి మిల మిల మెరుస్తూ ఒక చెట్టుపైన కనిపించింది. అయితే అ చెట్టు మొదట్లో అనేక పాములూ, తేళ్ళూ కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి! విక్రముడు చేతులు మోడ్చి "ఈ సింహం కష్టాన్ని నివారించటం కోసం నేను ఈ మూలికను తీసుకు రాబోతున్నాను. నా భావన నిజమైతే, ఈ విష జంతువులు నన్నేమీ చేయకుండు గాక" అని ప్రార్థించి, ధైర్యంగా చెట్టు ఎక్కటం మొదలు పెట్టాడు. ఆశ్చర్యం! పాములు-తేళ్ళు అతన్ని ఏమీ చేయలేదు!

చెట్టెక్కిన విక్రముడు మూలికను కోసుకొని క్రిందికొచ్చి, దాన్ని నలగగొట్టి, రసాన్ని సింహం శరీరం అంతటా పూసాడు. "అయ్యో! నీకు కావలసిన మూలికను నాకోసమే వాడేస్తావా?" అని సింహం బాధ పడుతూనే ఒళ్లంతా ఆ రసాన్ని రాయించుకున్నది. మరుక్షణంలో దాని కురుపులన్నీ‌పోయి, ఒక దివ్య రూపం ఏర్పడింది. "విక్రమా, నిజంగా జాలి, దయగల వ్యక్తులకోసమే నేను ఇన్నాళ్ళూ ఎదురు చూస్తున్నాను. నీకు కనిపించింది అసలు అమృతవల్లి కాదు- అమృతవల్లిని కాపాడేందుకు నియోగింపబడ్డ నేను కల్పించిన భ్రాంతే అదంతా. ఇదిగో, నీకు అవసరమైన మూలిక నేనే నీకు ఇస్తున్నాను. దీనితో రాకుమారికి పూర్వరూపం వస్తుంది. వెళ్ళు. నీ కరుణతో రాజ్యానికి సరైన దిశా నిర్దేశం చెయ్యి" అని, ఆ దివ్యసింహం విక్రమునికి అమృతవల్లినిచ్చి మాయమైంది.

విక్రముడు ఆ మూలికను తెచ్చి రాయగానే, కుక్కకాస్తా అందమైన యువరాణిగా మారిపోయింది. రాజుగారు ఆమెను విక్రముడికి ఇచ్చి వైభవంగా వివాహం చేశారు . అందరూ చాలా సంతోషించారు. కాలక్రమంలో విక్రముడు రాజై, రాజ్యమంతటా దయా ధర్మాల్ని పెంపొందింపజేశాడు.

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో