Facebook Twitter
కథ కంచికి

కథ కంచికి

-శారద అశోకవర్ధన్

ఉన్నట్టుండి  వేదగిరిరావుకి  కథలు రాయాలనే యావ పట్టుకుంది. దానికి కారణం అతని భార్యామణి భానుమతి రోజు అతణ్ణి కథలు రాయమని పోరు పెట్టడమే అంతే! ఆ ఆలోచన రావడంతో మనసు ఆలోచించడం మొదలుపెట్టింది. ఎంత ఆలోచించినా అసలు ఎలా రాయాలో, దేన్ని గురించి రాయాలో తోచి చావడం లేదు. వెంటనే ఎప్పుడో, ఎక్కడో చదువుకున్నట్టు  గుర్తొచ్చాయి శ్రీశ్రీ మహాకవిగారి మాటలు 'అగ్గిపుల్లా కుక్కపిల్లా అన్నీ కవితా వస్తువులే' అని. కుక్కపిల్ల గురించి  రాద్దామంటే  వాళ్ళింట్లో కుక్కల్లేవు. అందుకని తనకి తెలిసినవాళ్ళు ఎవరెవరిళ్ళలో కుక్కలున్నాయా అని ఆలోచించి  చివరకి తన కొలీగు రామబ్రహ్మం గుర్తుకొచ్చి  వాళ్ళింటి కెళ్ళాడు. వాళ్ళింట్లో  చక్కగా, బొద్దుగా పెరిగిన ముద్దొచ్చే  పామరేనియన్ కుక్కపిల్ల ఉంది. పామరేనియన్ కి ఒళ్ళంతా  తెల్లటి జూలు  ఉంటుంది. రామబ్రహ్మంగారి భార్య ఆ కుక్కని ఎప్పుడూ  ఒళ్ళో కూర్చోబెట్టుకునుంటుంది, చంటిపిల్ల  నెత్తుకున్నట్టుగా, నోరు తెరచి బిస్కట్లు నోట్లో  పెడుతుంది. పసిపిల్లలకి పెట్టినట్టు. వేదగిరిరావు వెళ్ళేటప్పటికి రామబ్రహ్మంగారి భార్య వసుంధర మిక్కీని (కుక్కపిల్లని) ఒళ్ళో కూర్చోబెట్టుకుని, జూలు దువ్వుతోంది  దువ్వెనతో. 'ఆహా వసుంధరగారూ! మీ మిక్కీ జూలు మెత్తటి నూలు! దాని నోరు స్టారు హోటల్లోని  బారు! అది పడుకునే మీ ఒడి నాకు సైతం పడుకోవాలనిపించే గుడి" అన్నాడు సంతోషంగా పళ్ళికిలించుకుంటూ  నవ్వుతూ  నాలుగు పాదాలూ చక్కగా  అంత్యప్రాసలతో  చెప్పానని గర్వంగా చూస్తూ.

    అప్పుడే అతిథికి కాఫీతేవడానికి లేచిన వసుంధర వేదగిరిరావు కేసి కొరకొరా చూసింది. ఆ చూపులకి తట్టుకోలేక సిగ్గుతో తలవంచుకున్నాడు వేదగిరిరావు. కాఫీ సంగతి దేముడుకి తెలుసు - కళ్ళు తిరిగినంత పనై తను చేసిన తప్పు తెలుసుకొని  క్షమాపణ చెప్పుకుంటూ  ఇంటిమొహం పట్టాడు వేదగిరిరావు, వేదగిరిరావు మర్నాడు చెంపలు వాయించాలని ఉద్రేకంగా  బయలుదేరిన రామబ్రహ్మం సంగతంతా విని 'నీ కవిత్వం పిచ్చి తగలడ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

    కొన్నాళ్ళు గడిచిపోయాయి. వేదగిరిరావులో రాయాలన్న పట్టుదల మాత్రం తగ్గలేదు. దానికితోడు భార్యామణి భానుమతి "ఏమండీ! ఇంకా ఎప్పుడు మొదలెడతారు రాయడం?" అంటూ  మాటిమాటికీ అడగడం, "మంచి ప్లాటు తగులుతోంది. కొంచెం ఆగవే" అని వేదగిరిరావు చెప్పడం, దాంతో 'ఏమండీ, ఈ వేడి వేడి కాఫీ తాగండి మంచి ఆలోచనలు వస్తాయి" అంటూ వేడిగా కాఫీ చేసి ఇవ్వడం పరిపాటయిపోయింది. భార్య ముందు పరువుపోతుందేమో అన్న బాధతో వేదగిరిరావు ఆఫీసుపన్లకన్నా  సీరియస్ గా కథల గురించీ, కవితల గురించీ ఆలోచించడం మొదలెట్టాడు. 

    ఒక రోజు ఉన్నట్టుండి  ఒక ఆలోచన కలిగి కాగితం, కలంతీసి రాయడం మొదలెట్టాడు. కాస్సేపటికి దాన్ని ఎవరికైనా చదివి వినిపించాలన్న  కోరిక కలిగి అందరిలోకీ కాస్త రస హృదయం గలది అనుకున్న టైపిస్టు కనకదుర్గకి చూపించాడు. అంతే! ఆవిడ అపర మహిషాసురమర్దనిలా  వేదగిరిరావుమీదికి  దూసుకుపడింది. "నీకు సిగ్గుందా? నువ్వు మనిషివేనా? ఒక కన్నెపిల్లకి ఇల్లాటి చీట్లా రాయటం? పెళ్లై పిల్లలు పుట్టి, వాళ్ళు  పెళ్ళీడుకొస్తున్నారే!  ఇదేం బుద్ధి?" అంటూ చీటీని వేదగిరిరావు మొహాన విసిరికొట్టి  విసురుగా వెళ్ళిపోయింది. అనుకోని ఈ తుఫానుకి మతిపోయింది వేదగిరిరావుకి. చుట్టూ కొలీగ్స్ మూగారు. సోంబాబు ఆ కాగితాన్ని  తీసి చదివాడు బిగ్గరగా: "తెల్లని మేను చివర నల్లని టోపీ! రాసుకుంటే మంటలు రేపి వేడి తగ్గగానే చల్లారుతుంది క్రమేపీ క్రమేపీ.... దీన్లో ఏముందసలు? వీడు రాసిందేమిటో అర్ధం కాలేదు. ఆమెకి కోపం ఎందుకొచ్చిందో అసలే అర్ధం కాలేదు" అన్నాడు. "ఒరేయ్, వేదగిరీ! దీని భావ మేమిటో నువ్వే చెప్పరా!" అన్నాడు చంద్రమౌళి - తోటి సూపరింటెండెంటూ, సదరు స్నేహితుడూ వేదగిరిరావుకి. "అగ్గిపుల్లరా! శ్రీశ్రీ చెప్పినట్లు అగ్గిపుల్ల మీద కవిత్వం రాద్దామని మొదలెట్టాను. సమయానికి మీరెవ్వరూ దగ్గర లేకపోవడంవల్ల ఆమెకి చూపించాను. నన్ను అపార్ధం చేసుకుంది" అన్నాడు. అందరూ ఘొల్లున నవ్వేశారు. "నీ కవిత్వం మండ! ఇది కవితలా లేకుండా  పొడుపుకథలా ఉందేమిటిరా?" అన్నాడు చంద్రమౌళి.  

    "గురూ! నువ్వు కవిత్వం జోలికి పోకు. గురూ! కావాలంటే కథలు రాయి! నువ్వు కవిత్వం రాయడంలో అప్పుడే రెండుసార్లు పప్పులో కాలేసేవు" అన్నాడు నవ్వుతూ శాస్త్రి. నిజమే అనిపించింది వేదగిరిరావుకి. అసలు శ్రీశ్రీమీదే కోపమొచ్చింది, 'అగ్గిపుల్లా, కుక్కపిల్లా దేనిగురించైనా  రాయొచ్చునట - ఎట్లా?" అని!

    మరో వారం రోజులు గడిచాయి. ఒక రోజు సాయంత్రం ఆఫీసు నుంచి వేదగిరిరావు ఇంటికి వెళ్ళేసరికి అతని భార్యామణి రిక్షాడు పుస్తకాలతో రిక్షా దిగుతూ కనిపించింది. "ఏమిటా భానూ, ఇదంతా?" అయోమయంగా అడిగాడు వేదగిరిరావు.

    "మీకోసమేనండీ! అలా బజారుకెళ్ళి  పాత పుస్తకాలమ్మే  దుకాణానికెళ్ళి  పాత పత్రికలూ, బోలెడు కథల పుస్తకాలూ కొనుక్కొచ్చాను. ఎందుకంటే, ఇవన్నీ చదివితే మీకు కథలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. అందులోని ఐడియాలను, అవే భావాలను తీసుకుని మీరూ కథలు రాసెయ్యొచ్చు!" అంది పుస్తకాలన్నీ  కిందకు దించిపెట్టిన  రిక్షావాడికి డబ్బిస్తూ భానుమతి.

    "భానూ! నీకింత బుర్రుందనీ, అంతకన్నా  మించి నన్నొక  రచయితగా చూడాలని నువ్వంత తహతాహలాడిపోతున్నావో! నిన్ను చూస్తూ ఉంటే సిసలైన ధర్మపత్నివనిపిస్తూన్నావు" అంటూ ఆప్యాయంగా ఆమె కళ్ళలోకి  చూశాడు వేదగిరిరావు.

    ఆ చూపులకి మెలికలు తిరిగిపోతూ తల వంచుకుంది సిగ్గు నభినయిస్తూ భానుమతి.

    "భానూ! మనిద్దరం సినిమా హీరో, హీరోయిన్లలా లేమూ?" అన్నాడు వేదగిరిరావు.

    "ఛీ పొండీ!" అంటూ వెంటనే "ఏమండీ! ఈ డైలాగులన్నీ మీ కథల్లో రాయండీ! అవన్ని చదివి నా స్నేహితులూ, మన బంధువులూ  గిజగిజలాడిపోతుంటే  నాకు చాలా సంతోషంగా ఉంటుంది" అంది స్మిత వదనంతో.

    "అబ్బా!" అన్నాడు బాధగా వేదగిరిరావు.

    "ఏమైందండీ?" కంగారుగా దగ్గరకొచ్చింది భానుమతి.

    "ఏం లేదు. తల నొప్పి. హఠాత్తుగా కొట్టినట్టొచ్చింది." 

    "అదా? ఏం లేదు, మీరు కథల థీమ్ కోసం  ఆలోచిస్తున్నారు కదూ! అందుకని  వచ్చుంటుంది. మేధావులకి తలనొప్పి, కంటిజబ్బూ  కామనండీ! ఉండండి కాఫీ తెస్తాను" అంటూ  పుస్తకాలని పక్కన పెట్టి  వంటింట్లో కెళ్ళింది.

    వేదగిరిరావు  పాత కథల పుస్తకాలనీ, పత్రికలనీ తిరగెయ్యడం మొదలెట్టాడు. నిమిషాలు, గంటలూ గడిచిపోయాయి. రాత్రి పది దాటినా  అలా చదువుతూనే ఉన్నాడు. "పొద్దుపోయింది.  అన్నం తినండీ!" అని భానుమతి పిలిచేవరకు ఏకధాటిగా అన్ని కథలు చదివాడేమో, మనసంతా గజిబిజిగా ఉంది. శరీరం, మెదడూ కూడా అలిసిపోయి  ఆవలింతలు  రావడం మొదలుపెట్టాయి. నాలుగు మెతుకులు గతికి గుర్రుపెట్టి  నిద్దరపోయాడు వేదగిరిరావు, ఐ.ఎ.ఎస్. పరీక్షకు చదివినంతగా  చదివి!

    అన్ని కథలూ కలిసి మెదడులో ఎక్కడో దాక్కున్నాయేమో, అర్దరాత్రి కల్లా  అవి గొడవ చేస్తున్నట్లు  వేదగిరిరావు గట్టిగా  అరవడం మొదలెట్టాడు. భానుమతి కంగారుపడుతూ  "ఏమండీ! లేవండీ! ఏమయిందీ?" అంటూ కుదుపుతూ లేపింది. కాస్సేపటికి కళ్ళు తెరిచిన వేదగిరిరావు "ఎక్కడా? వాళ్ళంతా ఏరీ?" అంటూ అరవడం మొదలెట్టాడు.

    "ఏమండీ! కలొచ్చిందా? పీడకలై ఉంటుంది. ఉండండి, మంచినీళ్ళిస్తాను" అంటూ  వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. సమాధానం చెప్పకుండానే  మంచినీళ్ళు  తాగేసి మళ్ళీ నిద్రలో మునిగిపోయాడు వేదగిరిరావు.

    కలత నిద్ర కావటంవల్ల కాస్త లేటుగానే  లేచాడు వేదగిరిరావు. భానుమతి అందించిన కాఫీ కప్పు అందుకుంటూ "కలొచ్చింది రాత్రి, పెద్ద కల" అన్నాడు. వెంటనే భానుమతికి మెరుపులాంటి  ఆలోచనొచ్చింది. "ఏమండీ! ఏమండీ! ఆ కలనే కథగా రాసేయకూడదూ?" అంది. భార్యామణి ఇచ్చిన బంగారంలాంటి సలహాతో వేదగిరిరావుకి గుండె మీద భారం తొలగినట్టయింది. వెంటనే ఆ రోజు సి. ఎల్. పెట్టి కాగితాలు ముందేసుకుని, మధ్య మధ్య శ్రీమతి అందిస్తున్న కాఫీ తాగుతూ  'కలలో కల్లోలం' అంటూ కథ రాసేశాడు. సాయంత్రానికల్లా 'ఏ పత్రిక కి  పంపుదాము?' అని ఆలోచిస్తూంటే  మళ్ళీ శ్రీమతిగారే  ఓ చక్కటి సలహా ఇచ్చింది - "కాపీలు తీయించి అన్ని పత్రికలకూ పంపిస్తే సరి.... ఎవరో ఒకరు వేస్తారు" అని!

    "భానుమతీ! నీ బుర్రే బుర్ర, మీ నాన్న నిన్ను చదివించి ఉంటే లాయరయిపోయేదానివి" అన్నాడు సంతోషంగా.

    "పోనీ, ఇప్పుడు నేను 'లా' చదవనా? పిల్లలు హోమ్ వర్కు చేసుకుంటూ ఉంటారు. మీరు కథలు రాసుకుంటూ  ఉంటారు. నాకు బోరు కొట్టకుండా  నేను 'లా' చదువుతాను. రేపే పుస్తకాలు తెప్పించండి" అంది, అప్పుడే తనని తాను లాయరుగా ఊహించుకుంటూ!

    వేదగిరి నాలుగు కాపీలు తీయించి, నాలుగు పత్రికలకు పంపాడు అదే కథని. ప్రతిరోజూ పోస్టు కోసం ఎదురు చూడడం, వారం వారం పత్రికలన్నీ తిరగవేయడం భార్యాభర్తలిద్దరికీ అలవాటైపోయింది. ఒక నెల్లాళ్ళు తిరిగేసరికి మూడు పత్రికల దగ్గర్నుంచి పంపిన కథ తిరిగొచ్చింది. వేదగిరిరావు నిరుత్సాహంతో నీరుకారిపోయాడు. కాని, వారం తిరక్కుండానే నాలుగో పత్రికలో పడ్డ  తన కథని చూసి ఎగిరి గంతేశాడు. భానుమతిని గట్టిగా పట్టుకొని ముద్దుల వర్షం కురిపించేశాడు. "నా కెంతో గర్వంగా ఉందండీ! నేనొక రైటర్ భార్యని" అంది ఉక్కిరిబిక్కిరై పోతూ. 

    "భానూ! నీలాంటి భార్య దొరకడం నాకు మామూలు 'లక్' కాదు. సూపర్ లక్....బంపర్ లాటరీలాగా  అనుకో! ఇక నుంచి నీ డ్యూటీ ఏమిటో తెలుసా?" అడిగాడు వేదగిరి.

    "చెప్పండి!"

    "పుస్తకాలన్నీ  తెప్పించి, వాటిని చదివి, ఆ కథలు నాకు నువ్వు చెప్పాలి. దాన్నిబట్టి  ఆలోచించి, నేను వేరే కథలు రాస్తాను! సరేనా?"

    "ఓ....!" అంది సంతోషంగా భానుమతి.

    ఆఫీసు నుంచి  అందరికీ ఫోన్లు  చేసి చెప్పేశాడు వేదగిరిరావు. తన కథ చదవమని. ఇరుగుపొరుగు వారందరికీ, బంధువులకీ భానుమతి స్వయంగా వెళ్ళి చెప్పొచ్చింది 'మావారు రాసిన కథ చదవ'మని.

    ఆ రోజునుంచి భానుమతి ఎవరింటికొచ్చినా సరే, అందరూ మాట్లాడుతూంటే తనో మూల ఏ పత్రికో పట్టుకుని కూర్చునేది. చివరికి పేరంటాని కొచ్చినా, నలుగురూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే, తనొక పుస్తకం పట్టుకుని పరీక్ష కెళ్ళేంత సీరియస్ గా ఫోజు పెట్టి  చదువుతూ  కూర్చునేది. అలా చేస్తే చుట్టూ ఉన్న వారికి చిరాగ్గా ఉంటుందని కాని, నలుగురితో కలవకుండా ఉండడం సభ్యత కాదనీ కానీ ఆమె గుర్తించదూ, వేదగిరిరావు చెప్పడూ. రెండూ లేదు. పై పెచ్చు అదొక గొప్పగా  భావిస్తారు వాళ్ళిద్దరూ.

    ఎలాగో అలాగ వేదగిరిరావు మరో రెండు కథలు రాశాడు. ఆ రెండూ అదివరకు అచ్చయిన పత్రికకే పంపించాడు. కానీ, ఈసారి ఆ రెండూ  తిరిగొచ్చాయి. కారణం ఏమిటంటే, ఆ కథలు ఇదివరకు అచ్చయిన కథలకు పోలికలు కలిగి ఉన్నాయని. భానుమతికీ, వేదగిరిరావుకీ మతి పోయినట్లయింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు.

    కానీ, వారం తిరక్కుండానే  భానుమతికి మరో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. "ఏమండీ! మీ కెవ్వరూ సినిమా ప్రొడ్యూసర్లు తెలీదూ?" అంది సీరియస్ గా. ఈ ప్రశ్నకి వేదగిరిరావు తెల్లబోయాడు. సమాధానం వెతుక్కునే లోపల ఆమే అంది - "పోనీలెండి. అదివరకు తెలీకపోయినా ఇప్పుడు తెలుసుకోండి. ఒకరిద్దరు ప్రొడ్యూసర్లని కలుసుకోండి! నా దగ్గర మంచి సబ్జెక్టు ఉందని చెప్పండి. టైమిస్తే వచ్చి కథ చెబుతానని చెప్పండి! స్క్రిప్టు నవలగా  అచ్చులో ఉందని చెప్పండి! ఈలోగా మనం రోజుకో సినిమా చేసేద్దాం. ఏముందీ - నాలుగు సినిమాల కథ కలిపేస్తే ఒక కొత్త కథ తయారవుతుంది" అంది.

    "భానూ! నీ బుర్ర...."

    "లాయరు బుర్ర!" పకపకా నవ్వింది.

    రోజుకో సినిమా చూసేస్తున్నారు వేదగిరిరావు, భానుమతి - మార్నింగ్ షో పాత సినిమాల దగ్గర నుంచి నైట్ షో సరికొత్త సినిమాల వరకూ! నెల జీతం రాగానే మూడొందలు సినిమాల కోసం, రెండొందలు ఆటోలకీ, రిక్షాలకీ....ఆ తరువాతనే బియ్యం, పప్పు, ఉప్పు అన్నీ!

    అనుకోకుండా  ఒకరోజు  ఒక సినిమాహాల్లో  ఒక ప్రొడ్యూసరు కనిపించాడు. అంతే! తనని తాను పరిచయం చేసుకొని, తన దగ్గరొక మంచి కథ ఉందని, ఆ ప్రొడ్యూసర్ ని భోజనానికి పిలిచాడు వేదగిరిరావు. భానుమతి పిండి వంటలతో విందు భోజనం తయారుచేసింది స్వయంగా భర్తకీ, ఆయనకీ వడ్డించింది. ఆ తరువాత వేదగిరిరావు ఆయనకీ కథ వినిపించాడు.

    "బాగుంది కానండీ.... హీరోకి అక్కినేని దేవదాసు లాంటిదీ, 'యమగోల'లో ఎన్. టి. రామారావు లాంటిదీ కలిసిన పాత్ర కావాలి. హీరోయినుకి 'మల్లీశ్వరి'లో భానుమతిలాంటి  ప్రాత్రయితే బాగుంటుంది. ఇహపోతే కామెడీ మన రేలంగీ, గిరిజా జంట ఉంది చూశారూ - ఆ టైపులో ఉండాలి. విలన్ ఇప్పటిలా కాక మన ఆర్. నాగేశ్వరరావులా ఉండాలి. పోతే, జ్యోతిలక్ష్మి డాన్స్....సారీ! ఇప్పుడు మన 'సిల్కు' స్మితకి పనికొచ్చే ఒక డాన్సుండాలి. ఇవన్నీ కలిపి మీరు చెప్పిన కథని, నేను చెప్పిన విధంగా ఊహించుకొని రాసి. నాకు కబురు చెయ్యండి. మన పిక్చరు వంద రోజులు గ్యారంటీ!" మొదటి మాటలకి నీరు కారినా, చివరి మాటలకి ఊహల్లో తేలిపోయారు వేదగిరిరావూ, భానుమతీ దంపతులు.

    పదిహేను రోజులు నిద్రాహారాలు మాని అతను చెప్పినట్లు  రాశాడు వేదగిరిరావు. కానీ, అతను అయిపు లేదు. ఉత్తరాలు రాశాడు, టెలిఫోన్లు చేశాడు. 'ఇదిగో, అదిగో' అనేవాడే తప్ప తిరిగిరాలేదు.

    పట్టువదలని విక్రమార్కుడిలా  వేదగిరిరావు "సినిమా ప్రొడ్యూసర్ల ఇళ్ళ చుట్టూ  తిగురుతూనే ఉన్నాడు. పత్రికల వాళ్ళ చుట్టూ కూడా తిరుగుతూనే ఉన్నాడు. అయినా, కాలం కలిసి రాలేదు. కలలు ఫలించలేదు.

    ఒక రోజున మొదట కథ విన్న ప్రొడ్యూసర్ దగ్గరనుంచి  ఒక ఉత్తరం వచ్చింది. దాంతోపాటు  మరో రెండు ఉత్తరాలూ వచ్చాయి! ముందుగా ప్రొడ్యూసర్ ఉత్తరాన్నే  చింపబోయాడు వేదగిరిరావు. "ఆగండి! మీ కథని సినిమా తీస్తున్నామని రాస్తే వెంటనే నాకు పట్టుచీర కొనివ్వాలి" అంది భానుమతి పొంగిపోతూ.

    "ఓ!....మరి నాకేమిస్తావు?" చిలిపిగా అడిగాడు వేదగిరిరావు.

    "ఏమండీ! మీరు కొత్తవారు కాబట్టి  వెండితెరకి కనీసం పదివేలయినా ఇవ్వరా? మీకు స్కూటర్ కొనిస్తాను. మనం సినిమాలు చూడటానికి కనీసం ఆటో ఖర్చులయినా తగ్గుతాయి. ఏదీ కవరు చింపండీ!" అంది ఇంక ఆగలేనట్లు గొంతు పెద్దది చేసి దీర్ఘం చేసి దీర్ఘం తీస్తూ.

    వేదగిరిరావు కవరు చింపాడు. కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అక్షరాలు మసక మసకగా కనబడుతుంటే ఉత్తరాన్ని పైకి చదివాడు.

    "డియర్ వేదగిరిరావుగారూ, శ్రీమతి భానుమతిగారూ!"

    మీతో మాట్లాడి వెళ్ళాక నాకో చక్కని కథ దొరికింది. దాదాపు సినిమా తియ్యడం పూర్తయింది. విడుదలవరకూ  పబ్లిసిటీ ఇవ్వకూడదనే  ఈ సంగతి ఎక్కడా చెప్పలేదు. మా అమ్మాయీ, అల్లుడూ రేపు హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ చేరుకుంటున్నారు. మీ అడ్రసిచ్చాను. మీరు చూపిన ఆప్యాయతా, ఆదరణా, పెట్టిన భోజనం ఎన్నటికీ మరిచిపోను. ఒక్కపూటే గనక అల్లుణ్ణీ, అమ్మాయినీ మీ దగ్గరే దిగమన్నాను. అన్యథా భావించరని తలుస్తాను."

    ఆ మాటలు వింటూంటే  మూర్చొచ్చినట్టయింది భానుమతికి. వేదగిరిరావు వెర్రెత్తినట్టయింది. ఏదో కోపం....ఒక రకమైన తాపం....మతిభ్రమించి నట్టనిపించింది. వెంటనే మూడ్ మార్చుకుని వేదగిరిరావు మరో ఉత్తరం చింపాడు. అది పిల్లల స్కూలు నుంచి ప్రిన్సిపాల్ రాసిన ఉత్తరం.

    "డియర్ పేరెంట్స్!"

    మీరు అదివరకులా పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదనుకుంటాను. ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకునే మీ పిల్లలు ఈ మధ్య ఫెయిలవడమేమిటీ ఒకసారి స్కూలు కొచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను."

    తల దిమ్మెత్తినట్టయింది ఇద్దరికీ! కాళ్ళు పాతాళానికి పోతున్నట్టూ, నరాల బిగువు తగ్గినట్టూ అనిపించింది. 

    మూడో ఉత్తరం చింపాడు కంగారుగా వేదగిరిరావు.  అది వాళ్ళ ఆఫీసు నుంచి వచ్చిన ఉత్తరం. ఆఫీసు భాషలో చెప్పాలంటే 'మెమో.'

    "మీరీ మధ్యన సెలవులు తెగ పెడుతున్నారు, ఆఫీసు పనిలో తగిన శ్రద్ధ వహించక నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ వైఖరి ఇలాగే ఉంటే మీ మీద తగు చర్య తీసుకోబడుతుంది."

    ఈసారి వేదగిరిరావుకి నిజంగానే పెచ్చెక్కినట్టయి  జుట్టు  పీక్కుంటూ మంచం మీద కూర్చున్నాడు.

    "ఆ మూడో ఉత్తరం ఎవరిదండీ? సినిమావాళ్ళ దగ్గర్నుంచేనా?" అంది భానుమతి.  

    "భానుమతీ!" అరిచాడు వేదగిరిరావు.

    హడలిపోయి  బెదురుచూపులు చూసింది శ్రీమతి భానుమతి.

    "ఏదీ, నువ్విందాకా రాసిన బడ్జెట్ లిస్టు?"

    వెంటనే అందించింది.

    "మూడిందలు  సినిమాకి రెండొందలు ఆటోలకి" అని ఉన్న చోట గుండ్రంగా సున్నా చుట్టి "పిల్లల  ట్యూషన్ ఫీజుకి" అని రాశాడు.

    పాత పత్రికలూ, పుస్తకాలూ కాగితాలవాళ్ళకమ్మేసింది భానుమతి.

    వేదగిరిరావు ఆఫీసులో హాయిగా పనిచేసుకుంటున్నాడు యథాప్రకారంగా.

    "ఆడమంటే ఆడేది ఆట కాదు, పాడమంటే పాడేది పాట కాదు"....రేడియోలో  పాట విని శ్రుతి కలిపింది భానుమతి...." రాయమంటే రాసేది కవిత కాదు - అది కథ కాదు" అని.

    వేదగిరిరావు "అవతలి గదిలో చదువుకుంటున్న  పిల్లలకి  రేడియో డిస్టర్ బెన్స్" అని రేడియో కట్టేస్తూ నవ్వాడు.