Facebook Twitter
జలదృశ్యం

జలదృశ్యం

శ్రీమతి శారద అశోకవర్ధన్

నిండుపున్నమి. పండువెన్నెల. సముద్రం తెల్లని పాలపొంగులా  నురగలు కక్కుతూ  పిచ్చి ఆవేశంతో  ఉరకలు వేస్తోంది, ఎంతో ఆరాటంగా ఒడ్డు చేరుకోవాలని. తీరా ఒడ్డుకొచ్చేసరికి  నీరసపడిపోయినట్టు నీరుగారిపోయి  అంత ఎత్తునుంచీ ధబాల్న నేలకూలినట్టు కుంగిపోయి, అయినా పట్టువదలని  దానిలా పాకుతూనే ముందుకు రావాలని కొట్టుకువస్తూ, 'హమ్మయ్య, ఒడ్డు చేరుకున్నాను' అని నిట్టూర్చేలోగానే, గాలి తాకిడికి తట్టుకోలేక వెనక్కెళ్ళి  ఇసకలో కలిసిపోతోంది. ఈ పిచ్చి కెరటాలకి అలుపు లేదు. ఎవరైనా  తమని చూస్తున్నారేమోనన్న ఆలోచన లేదు. తమ చాతకానితనానికి సిగ్గులేదు. పసిపిల్లల్లోని  గట్టి నమ్మకంలా అతివేగంగా ముందుకు రావడం, వొట్టి నిరాశతో  అంత వేగంగానూ ఇసకలో కలిసిపోయి  తిరుగుముఖం పట్టడం; మళ్ళీ కొత్త కెరటంతో  కలిసి ముందుకు ప్రయాణం కట్టడం. ఎంత సామీప్యం సముద్రానికీ జీవితానికీ? మనిషి పుట్టి పెరిగి పెద్దవ్వగానే ఉరికే కెరటంలా ఏదో సాధించాలని ఏవేవో కలలు కని జీవితం గురించి ఎంతో సాధించాలనే ఉబలాటంతో వుంటాడు. తీరా ఏమీ సాధించకుండానే  కొన్ని చిన్న కెరటాలు మధ్యలో ఆగిపోయినట్టు అర్ధాంతరంగా ఆగిపోయి  మధ్యలోనే మట్టిలో కలిసిపోతాడు. మరికొందరు ఆవేశంతో ఉరకలు తీసే పెద్ద కెరటాలలా ఒడ్డుదాకా  ఒచ్చినా  ఒడ్డుకి  మాత్రం రాలేక, సాగుతూ పాకుతూ ఇసకలో కలిసిపోతారు. మళ్ళీ ఆ ఇసకలోంచే మరో జన్మెత్తి మళ్ళీ ఆ కెరటాలలే మామూలే! అందుకేనేమో అన్నారు పెద్దలు 'జీవితం ఒక కామా, ఫుల్ స్టాప్ కాదని'. 

    సముద్రాని కెదురుగా  రోడ్డుకి ఆవలివైపు, తెల్లని రెండతస్థుల మేడ. సముద్రపు కెరటాలు నురుగులోని  తెల్లదనం ఆ ఇంటిని కప్పేసినట్టు, తెల్లని నునుపైనగోడలు, తెల్లరంగు పులుముకున్న తలుపులూ  కిటికీలూ, పండు వెన్నెల రోజున  మరీ పాలరాయితో కట్టిన  భవనంలా కాంతులు చిందుతూ  ధగధగా మెరిసిపోతూ వుంటుంది. చందమామ సయితం, ఒక్కసారి అన్నీ మరచి ఆ యింటిని చూడాలన్న  అభిలాషతో, అక్కడే వుండిపోయాడేమో నన్నట్టు, సరిగ్గా పరిగెడితే పట్టుకోవచ్చునన్నంత దూరంలో వెండి కంచంలా  ధగధగా మెరిసిపోతూ  కనిపిస్తాడు. ఇల్లంతా  చూడాలని ఆశ కాబోలు, ఇంట్లో ఏ గదిలో వున్నా కనిపిస్తాడు. తనొచ్చినట్టు ముందుగానే అందరికీ తెలియాలని కాబోలు నెలరాజు, భటుల్లాంటి కిరణాలని ముందుగానే అన్ని గదుల్లోకీ  ప్రసరింపజేస్తాడు. తనరాక ఆ ఇంట్లో  ఏ మూలనున్నా  తెలియాలని. చంద్రుడు అంత ముచ్చట పడిచూస్తూ  ఆ యింటినీ, ఆ సంద్రాన్నీ, తమని మర్చిపోతాడేమోనని భయం కాబోలు అతని దృష్టి నాకర్షించదానికిం అప్పుడే మెరుగుపెట్టిన మేలిమి బంగరులా మరింత మెరుస్తూ వెలిగిపోతున్నాయి. కొబ్బరిబొండాలతో  నిండివున్న కొబ్బరిచెట్లూ, అరటి గెలలతో ఆకుపచ్చని చీరలో అందంగా అలంకరించుకున్న నిండుచూలాల్లా నిగనిగలాడుతూన్న  అరటిచెట్లూ, రకరకాల క్రోటన్లూ తీవెలూ ఆ యింటి అందాన్ని రెట్టింపు చేశాయి.

    అందంగా, అధునాతనంగా అలంకరింపబడిన  డ్రాయింగ్ రూము  పక్కనే అదే సైజులో  వున్న అతి సుందరమైన పడకగదిలో పాలరంగు సిల్కు పరదాలను  పక్కకునెట్టి, కిటికీ తలుపులు  తెరచి తలుపులు దభాల్న గాలికి పడిపోకుండా చిడతలు పెట్టి, కిటికీ ప్రక్కనే వున్నా సోఫాలో కూర్చుంది మాణిక్యవల్లి. అలా ఆమె ఎన్ని గంటలైనా  కూర్చోగలదు. ఆమె కట్టే మల్లెపువ్వులాంటి  తెల్లచీర వెన్నెలతో పోటీ పడుతుంది. ఆమె పసిడి మేను నక్షత్రాలకు పోటీ. ఆమెతో అంటిపెట్టుకున్న  పొడవాటి తెలుపు నలుపు కేశాలు నీలి గగనాన్ని  ఆక్రమించుకున్న మేఘాలకు  పోటీ! అవి గాలికి ఎగురుతూ అప్పుడప్పుడు చందమామనే కప్పేసే మబ్బుల్లా  ఆమె మొహాన్ని  కప్పేస్తున్నాయి! నుదుటన పావలా కాసంత మందార రంగు కుంకం తప్ప మరే ఆభరణాలు లేవు ఆమెకు. ఆ బొట్టు ఆమె ముఖానికి జ్యోతి, పువ్వొత్తిలా వెలిగే జ్యోతి. ఆమె ఎవరితోనూ మాట్లాడదు. ఏమీ అడగదు. ఆమెకి టైముకి స్నానం చేయించడం, ఏదో తినిపించడం, మళ్ళీ ఆ కిటికీ దగ్గరే కూర్చోబెట్టడం ప్రతి నిత్యం  వసంతమ్మ పని. బాగా నిద్దరొచ్చి  కళ్ళు  మూసుకుపోతూంటే  మాత్రం, కిటికీ తలుపులు మూసేసొచ్చి, మంచంమీద వాలిపోతుంది మాణిక్యవల్లి.

    ఆ ఊరు భీమిలి! ఎర్రకొండలు  నగరప్రాకారాల్లా  చుట్టూ  దట్టంగా వుంటే, పాలసముద్రంలా అక్కడ వెలసిన సముద్రం వొయ్యారాలొలికే నవయవ్వనవతియైన  సౌందర్యరాశిలా  హొయలొలికిస్తూ  స్వర్గమంటే  ఇదేనేమో ననిపిస్తుంది. నిజంగా అది భూతల స్వర్గమే. అందుకే ఎందరో  విదేశీయులనూ చిత్ర నిర్మాతలనూ  దర్శకులనూ  యాత్రికులకు ఆకర్షించింది. సముద్రంలో దొరకే రకరకాల శంఖాలు, రకరకాల రూపాల్లో ఆ వొడ్డున పేర్చి, వాటితో అనేక రకాల వస్తువులను తయారుచేసి  విక్రయిస్తూ వుంటారు కొందరు - సముద్రాన్ని చూసిన వాళ్ళంతా ఇవీచూసి ముచ్చటపడి  కొనుక్కుపోతుంటారు. ముఖ్యంగా విదేశీయులు మరీనూ. మరోవైపు సముద్రంలో దొరికే పెద్ద పెద్ద చేపలు! సొరచేపా, ఉప్పు చేపా మొదలైన ఎన్నోరకాలు.  లొట్టలేసుకుంటూ  వాటికేసి  చూస్తారు జనం. జాలరుకిది  స్వర్గధామం. సముద్రంతో ఆడుకుంటూ  పాడుకుంటూ  పడతారు చేపల్ని. వలనిండగానే  గుండె  నిండిపోతుంది  సంతోషంతో. ఒడ్డుకొచ్చేసరికి చేపల్ని  కొనేవారు ఎదురు చూస్తూంటారు  వీరికోసం. తాజా తాజా  చేపలు కొనుక్కుని డబ్బులిచ్చి వెళ్ళిపోతారు. ఆ చిల్లరతో  జేబులు  నింపుకుని  ఇళ్ళకెళ్ళిపోతారు జాలరులు. అదే వారికెంతో  తృప్తి. అదే వారి జీవనం. అదే వారికి ఆనందం. ప్రశాంతమైన  వాతావరణంలో  స్వచ్చమైన మనస్సులతో  ఇతర కృత్రిమ వాతావరణానికి  దూరంగా  బతికే  నిష్కల్మషమైన జీవులు  వాళ్ళు. దురాశ లేదు! దుఃఖం లేదు! గంగమ్మతల్లి  ఒడి వారి నిధి; అదే పరమావధి.

    కిటికీలోలోంచి  ఇవన్నీ  చూస్తూ, సముద్రాన్ని  చిరునవ్వుతో  పరిశీలిస్తూ  గంటలూ, రోజులూ, నెలలూ, ఏళ్ళూ గడిపేసింది మాణిక్యవల్లి. ఆ ఊరినీ ఆ సముద్రాన్ని చూడ్డానికొచ్చిన  ప్రతీవారూ  ఆ ఇంటినీ, ఆ యింట్లో రెండో అంతస్థులో వున్న పెద్దకిటికీ దగ్గర కూర్చున్న ఆమెనూ  చూడకుండా  వుండలేరు. పాలరాతి  ఫలకంమీద నల్లటి  అక్షరాలతో  'జలదృశ్యం' అని రాసి వుంటుంది వాకిటిగేటుపైన. ఆ పేరూ, ఆ ఇల్లూ  అందరికీ  వింతే! ఒక కొత్త పులకింత!

        *    *    *

    'హిందూదేశంలో  చూడదగ్గస్థలాలూ' అనే గ్రంథాన్ని  సమగ్రంగా  పరిశీలించి రాయాలని అనేక రాష్ట్రాలూ, ఊళ్ళూ తిరుగుతూన్న  అమెరికా నుంచి డేవిడ్ ఆంధ్రాలో అడుగుపెట్టి  విశాఖపట్నంమీదుగా  భీమిలి చేరుకున్నాడు. సముద్రతీరాన వున్న 'సాగర్ విశ్రాంతి గృహం'లో బసచేశాడు. పున్నమి నుంచి పున్నమివరకు  పదిహేనురోజులు  గడిచినా, అతనికి తనివి తీరడంలేదు. కలం కదలడంలేదు. తన్మయత్వంలో  తేలిపోతున్నాడు. అతని భార్య నిశ్చల విశాఖపట్నానికి  చెందిన తెలుగు యువతి కావడంతో  తరుచు ఆమె విశాఖ, భీమిలి సౌందర్యాలను  వర్ణిస్తూ  వుంటే  వినడమే తప్ప, అనుభవిస్తూన్న  ఆ అనుభూతి మాటల కందడం లేదు డేవిడ్ కి. అందుకే మరో పక్షం అక్కడే వుండడానికి నిశ్చయించుకున్నాడు. అతడు ఆ వూళ్ళోచూసిన  స్థలాలలో  అతడు మెచ్చిన - అతడికి నచ్చిన వాటిల్లో జలదృశ్యం బంగాళా, ఆ బంగాళాలో దక్షిణం వైపున్న పడక గదీ, ఆ గదికి అమర్చిన పెద్ద కిటికీ, ఆ కిటికీ దగ్గర కూర్చున్న మల్లెపూవు లాంటి ముగ్ధ సౌందర్యవతి  మాణిక్యవల్లి! ఆమె ప్రతి నిత్యం గంటల తరబడి  ఒక్కర్తే ఎందుకలా కూర్చుంటుందో, ఆ మౌనం ఒక తపస్సా, ఒక పరిశీలనా ఏమిటో తెలుసుకోవాలన్న  కుతూహలం అతనిలో కలిగింది కానీ ఆమె ఎవ్వరితోటీ మాట్లాడదట! అది విన్న డేవిడ్ కి ఏం చెయ్యాలో తేలీలేదు. అయితే వసంతమ్మ మాట్లాడుతుందని  చెప్పారు అందరూ. మెల్లగా  ఆమె దగ్గర సమయం తీసుకున్నాడు విషయసేకరణకి! డేవిడ్ ఉత్సాహంతో  ఊగిపోతూ  అడుగులో  అడుగు వేసుకుంటూ  జలదృశ్యం గేటు తీసి లోపలికెళ్ళాడు! ఎదురుగ్గా  నిల్చున్న  వసంతమ్మ  లోపలికి  రమ్మని  ఆహ్వానించింది. అత్యంత  పారవశ్యంతో ఒక్కొక్క అడుగే ముందుకు  వేస్తూ  ఆ ఇంటినీ ఇంట్లోవున్న వస్తువులనీ ఆశ్చర్యంతో ఆనందంతో తిలకిస్తూ  నడుస్తున్నాడు డేవిడ్.

    ఒక గదిలో ఫ్రేము కట్టబడి  గోడకి  అమర్చిన  ఫోటో దగ్గర రెప్ప వాల్చకుండా  చూస్తూ  ఆగిపోయాడు  డేవిడ్. బ్రహ్మదేముడు  ఎంతో తీరిగ్గా  కూర్చుని ప్రశాంతమైన  మనస్సుతో తీర్చిదిద్దిన కుందనపు  బొమ్మలా  వున్న  ఆమె పక్కన ఆజానుబాహుడు, స్పురద్రూపి అయిన ఒక అతను వున్నాడు. వారిరువురూ అందంలో ఒకరితో ఒకరు పోటీపడుతూ  ఒకరికోసం  ఒకరు పుట్టినట్లుగా  వున్నారు ఒకరి భుజాలమీద  ఒకరు చెయ్యివేసి తీయించుకున్న ఫోటోలో.

    "ఈమే కదూ ఆ కిటికీ దగ్గర కూర్చునే అందాలరాసి?" అన్నాడు అచ్చతెలుగులో  డేవిడ్. భార్య నిశ్చలవలన  అతనికి తెలుగు మాట్లాడడం బాగానే వొచ్చింది. కాకపోతే అదోరకమైన ఇంగ్లీషులాంటి యాస, కనబడుతూ వుంటుంది.

    "అవును."

    "అతను?...." ప్రశ్నార్ధకంగా చూశాడు డేవిడ్.

    "ఆమె భర్త ఉల్లాస్" అంది వసంతమ్మ.

    "ఏం చేస్తారతను?" అడిగాడు డేవిడ్.

    "అదొక పెద్ద కథ".... నిట్టూర్చింది వసంతమ్మ. ఈలోగా  వాళ్ళు మాణిక్యవల్లి కూర్చున్న గదిదాకా  వొచ్చారు. తెల్లటి పెద్దాపురం సిల్కుచీర, అదే తెలుపు సిల్కు బ్లౌజు, పిరుదుల వరకూ వ్రేలాడుతూన్న వెంట్రుకలూ__ఆ అందం ఎంత చూసినా  చూడాలనే అనిపిస్తోంది డేవిడ్ కి.

    "ఒక తపస్వినిలా  వుంది కదూ?" అన్నాడు డేవిడ్.

    "అవును" అన్నట్టు తలూపింది వసంతమ్మ.

    "మాట్లాడొచ్చా?" అడిగేడు డేవిడ్ వుండబట్టలేక.

    "వొద్దు....మరోసారి. ఈరోజు  శనివారం కదా! ఆమె నాతో కూడా మాట్లాడదు. ఆహారం కూడా ఏమీ తీసుకోదు."

    "ఎందుకని? వ్రతమా? పూజా?" ప్రశ్నించాడు డేవిడ్.

    "కాదు! అది ఆమె జీవితాన్ని తారుమారు చేసినరోజు. చెప్తా రండి. అలా బయట పచ్చికలో కూర్చుని మాట్లాడుకుందాం" అంటూ కిందకు  తీసుకెళ్ళింది వసంతమ్మ. ఇద్దరూ  వెళ్ళి పచ్చికమీద రెండు కుర్చీలు వేయించుకుని కూర్చున్నారు. వసంతమ్మ చెప్పడం మొదలెట్టింది:

    "మాణిక్యవల్లి  మా అక్క కూతురు. ఉల్లాస్ మా ఆడపడుచు కొడుకు. ఇద్దరూ వైజాగ్ లోని ఇంజనీరింగ్ కాలేజీలో  చదువుతూ వుండేవారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. మేమూ సంతోషించాం. రూపురేఖల్లోనూ, చదువు సంధ్యల్లోనూ  కూడా ఎవరికి ఎవరూ తీసిపోనంతగా వున్నారు. ఇద్దరి పెళ్ళి  విశాఖపట్నం  డాల్ఫిన్ హోటల్లో  ఘనంగా  జరిగింది. హనీమూన్ కి సింగపూర్ పంపించాడు బావ. బావగారు మెరీన్ ఇంజనీయరు. ఉల్లాస్ వాళ్ళ నాన్నగారు  విశాఖపట్నం కె.జి.హెచ్. లో డాక్టరు. పెళ్ళయిన సంవత్సరానికే అమ్మానాన్నలయ్యారు మాణిక్యవల్లి, ఉల్లాస్ లు. పండులాంటి  కొడుకు  పుట్టాడు. పేరు కౌశిక్."

    "ఓ....వండర్ ఫుల్....హౌ లక్కీ...." అన్నాడు డేవిడ్.

    "నా మొహం! ఏమి లక్కీ! కౌశిక్ మొదటి పుట్టిన రోజున అందరూ భీమిలీ వొచ్చారు.  ఈ జలదృశ్యం విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరించబడి  వెలిగిపోయింది. ఎందరో  అతిధుల సమక్షంలో కౌశిక్ కేక్ కట్ చేశాడు. అందరి ఆశీర్వచనాలతో కార్యక్రమం పూర్తయి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. బాబుకి 'దిష్టి' తీస్తానని అక్క లోపలికి వెళ్ళింది. మేమూ అక్కా కౌశిక్ లతో లోపలికి వెళ్ళాము. ఆరోజు నిండుపౌర్ణమి! పండువెన్నెల పిండారపోసినట్టుగా  వుంది. ఉల్లాస్ కీ మాణిక్యానికీ కూడా సముద్రమంటే  పిచ్చే. గంటలకొద్దీ ఇద్దరూ సముద్రతీరాన గడిపేవారు భీమిలీకొస్తే! అసలు మాణిక్యవల్లికి  మా ఇల్లు జలదృశ్యమంటే  మరీ ఇష్టం. ఏ గదిలో నుంచి చూసినా  సముద్రం పలకరిస్తూ  కనిపిస్తుంది.

    "నేనూ  ఉల్లాస్ బీచ్ కెళ్ళొస్తాం. కౌశిక్ జాగ్రత్త!" అని అరుస్తూనే అక్క సమాధానానికి  కూడా ఎదురుచూడకుండా   బీచ్ కి వెళ్ళిపోయారు మాణిక్యవల్లీ ఉల్లాస్ లు. కౌశిక్ కి అన్నం తినిపించి  నిద్రపుచ్చింది అక్క. అందరూ  ఆ రోజు జరిగిన పుట్టినరోజు కార్యక్రమంలోని  విశేషాలు  చెప్పుకుంటూ  కూర్చున్నాం." అంటూ ఇంకా ఏదో చెప్పబోయేలోపల  టెలిఫోన్ మ్రోగడంతో గబగబా వెళ్ళి ఫోను తీసింది వసంతమ్మ. ట్రంక్ కాల్ లా వుంది, గట్టిగా  అరిచి మాట్లాడుతోంది. "ఆ! సెలవులిచ్చారా? ఎన్నాళ్లు? వారంరోజులా? సరే....రా....ఆ!....అమ్మా....అమ్మ బాగానేవుంది. ఆ!....సముద్రమా? దానికేం?....బాగానేవుంది. రా! నువ్వురా....నీతోకూడా  ఎవరొస్తున్నారు? దివ్యకాంతి వస్తోందా? ఇంకా? పెద్ద వాళ్ళెవరూ  రావడంలేదా? డ్రైవర్ శంకరొస్తున్నాడా? ఓ....కే....బై...." ఫోను పెట్టేసింది వసంతమ్మ.

    'పైడితల్లీ' అని వంటవాణ్ణి  కేకేసి తనకీ డేవిడ్ కీ రెండు 'టీ'లు పంపించమంది. వసంతమ్మ  వెళ్ళి డేవిడ్ ఎదురుగ్గా కూర్చుంటూ "సారీ....బాబు ఫోను చేశాడు. ఎల్లుండి బయల్దేరి ఒస్తున్నాట్ట. సారీ....బాబు అంటే మా కౌశిక్. మాణిక్యవల్లి కొడుకు" అంది.

    "ఓ.... అయితే నేను బాబుని  చూడొచ్చన్న మాట!"

    "చూడొచ్చు...."

    "అది సరే....బాబెక్కడున్నాడు? వాళ్ళ నాన్నగారి సంగతీ...."

    "అదే.... చెప్తున్నా.... అలా పుట్టింరోజు కేక్ కట్ చెయ్యడం అయిపోగానే బీచ్ కెళ్ళిన మాణిక్యవల్లీ, ఉల్లాస్ లు, చీకటి పడుతోందీ అన్న విషయం కూడా మర్చిపోయి, పసి పిల్లల్లా చెట్టా పట్టా లేసుకుంటూ, నీళ్ళల్లోకి  నడిచారు. ఒడ్డుకి చేరే కెరటం భూమిమీద పాకుతూ  వున్నప్పుడూ, కాళ్ళ కింద ఇసక జారిపోతూ  మనిషి తూలి పోతూన్నట్టవుతుంది కదా. అందులో పౌర్ణమి రాత్రి.   సముద్రం పిచ్చి ఆవేశంతో గంతులు వేస్తూన్నట్టుంది. అప్పుడే జాలరులందరూ  కూడా ఇళ్లు చేరుకుంటున్నారు, గంగమ్మకు దణ్ణం పెట్టి సెలవు తీసుకుంటూ  బీచ్ కొచ్చిన వాళ్ళుకూడా  ఒక్కొక్కళ్ళే మెల్లగా  తిరుగు ముఖం పడుతున్నారు. అంతలోనే నల్ల ముసుగు వేసినట్టు ఆకాశాన్ని  కారుమబ్బులు  కప్పేశాయి. ఎక్కణ్ణుంచో తోసుకు వొస్తున్నట్టు  మేఘాలు  వర్షాన్ని మోసుకుంటూ వొచ్చి అక్కడ వొదిలేసినట్టు. ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. చిమ్మని చీకటి! పరుగులెత్తే సముద్రం! వర్షం! అందరూ గబగబా పరుగెత్తడం మొదలెట్టారు. పెద్ద పెద్ద ఉరుములూ, మెరుపులూ, మిన్ను విరిగి మీద పడేంత గాలి! ఆ ఫెళ ఫెళలోంచి ఏవో అరుపులు! ఒక పెద్ద  అల ఉల్లాస్ నీ మాణిక్యవల్లినీ ఒడ్డునుంచి లాగేసింది. మరో అల విసురుగా వొస్తూ, మాణిక్యవల్లిని మళ్ళీ వెనక్కి తోసేసింది. కానీ ఉల్లాస్ మాత్రం, ఎంత దూరం కొట్టుకుపోయాడో, ఎక్కడ చిక్కుకుపోయాడో ఇప్పటికీ తెలీదు." వసంతమ్మ  దుఃఖాన్నాపుకోలేక పోయింది. పమిట కొంగు మోహాని కడ్డం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. డేవిడ్ కూడా కన్నీళ్ళని కర్చీపుతో, తుడుచుకున్నాడు.

    పైడి తల్లి ట్రేలో బిస్కట్లూ, టీ పెట్టి పట్టుకొచ్చాడు. మౌనంగానే కప్పులని అందుకున్నారు వసంతమ్మా డేవిడ్ లు. వేడి వేడి టీ నలిగిపోతూన్న మనసులకు కాస్త ఉపశమనాన్నిచ్చింది. వసంతమ్మ మళ్ళీ చెప్పటం మొదలెట్టింది:

    "అపస్మారస్థితిలో మాణిక్యవల్లిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె ప్రాణాలని కాపాడ్డంకోసం విశాఖపట్నం నుంచి  డాక్టర్లని పిలిపించారు ఆమె తండ్రి. ఎందరు గజ ఈతగాళ్ళు దిగి సముద్రమంతా  గాలించినా, హెలీకాప్టరులో ప్రభుత్వమువారు ఉల్లాస్ జాడ కనుక్కోవడానికి వారంరోజులు శ్రమించినా  ఫలితం లేకపోయింది. కళ్ళు తెరిచిన మాణిక్యవల్లి నోట ఒకే మాట........ 'ఉల్లాస్.... ఉల్లాస్...ఒచ్చెయ్....పెద్ద కెరటం వొస్తోంది....' అని! ఆమెకి స్పృహవొచ్చినా....ఇంకా నీళ్ళలో వున్న అనుభూతి....కొట్టుకుపోతూన్నట్టు  భయం....ఉల్లాస్ వొచ్చేయ్ అని పిలుస్తూన్న ఆందోళన తప్ప మన ధ్యాస రాలేదు. క్షణంలో అందరి జీవితాల్లోనూ  అంతులేని చీకటి! చెప్పనలవికానంత  సముద్రమంతదుఃఖం. ఆకాశాన్ని  కమ్ముకున్నంత  మబ్బులంత దిగులు! డాక్టర్ల బృందం ఆమెకి ఇక్కడే వుండి  వైద్యం చేసింది! దాదాపు సంవత్సరం పట్టింది ఆమె వాస్తవంలోకి రావడానికి! అయితే విచారకరమైన విషయమేమిటంటే, ఇదంతా కౌశిక్ పుట్టినరోజునాడు జరగడం. ఆ రోజే ఉల్లాస్ పోవడంతో, కౌశిక్ అంటే మాణిక్యవల్లికి  ద్వేషం పట్టుకుంది.  కంచే చేనుమేసినట్టు కన్న తండ్రి కరువైపోయి, కన్నతల్లి ఆగ్రహానికి బలైపోయిన  కౌశిక్ ని వాళ్ళ బామ్మ, తాతయ్యలు కొన్నాళ్ళూ, మా అక్కాబావగారూ కొన్నాళ్ళూ పెంచారు. కొడుకు పోయాడన్న దిగులుతో ఈ దేశంలో వుండలేక ఏదో అవకాశం రావడంతో మా ఆడపడుతూ అన్నయ్యగారూ అమెరికా వెళ్ళిపోయారు. కౌశిక్ అమ్మమ్మగారి దగ్గరే విశాఖలో  చదువుతున్నాడు. ఇప్పుడు ఏదో క్లాసులో కొచ్చాడు."

    "ఇప్పటికీ కౌశిక్ ఒస్తే మాణిక్యవల్లిగారు మాట్లాడరా?" సందేహంగా, బాధగా అడిగాడు డేవిడ్.

    "లేదు ఊరికే వాడికేసి చూస్తోంది. ఆ చూపులో జాలి వుందో, కోపం వుందో, బాధ వుందో తెలీదు. అంతేకాదు, వాణ్ణి చూడగానే మళ్ళీ 'ఉల్లాస్' అంటూ సముద్రంవైపు  పరుగెడుతుంది. అందుకే  డాక్టర్లు  కొన్నాళ్ళు బాబుని ఆమెకి చూపించొద్దన్నారు."

    "పాపం!" డేవిడ్ మళ్ళీ కర్చీపుతో కళ్ళు తుడుచుకున్నాడు.

    "కౌశిక్ అచ్చు మా ఉల్లాస్ పోలికే అచ్చోసినట్టు! ఇంకా పెద్దయ్యాక వాడిలో ఉల్లాస్ పోలికలు పూర్తిగా  వొస్తాయని నా నమ్మకం. డాక్టర్లు అదే అంటారు. అప్పుడు వాడిలో ఉల్లాస్ ని చూసుకుంటూ  మాణిక్యవల్లి మామూలు మనిషి కావొచ్చు అంటారు" అంది వసంతమ్మ.

    "..........." డేవిడ్ నిట్టూర్చాడు.

    "ఆమెకి ఆ కిటికీయే సర్వస్వం. కేవలం నిద్రపోయినప్పుడూ  లేదా అత్యవసవరమైన  కార్యక్రమాలకు  లేచినప్పుడూ  తప్ప ఆమె ఆ కిటికీని వొదలదు."  దుఃఖాన్ని దిగమింగుతూ చెప్పింది వసంతమ్మ.

    "అవును. నేనీ వూరువొచ్చి, ఈ సముద్రపు వొడ్డున కూర్చున్నంత సేపూ  అటు సముద్రాన్నీ  ఇటు కిటికీలోంచి కనబడే ఆమెని ఇద్దరినీ రెండు కళ్ళతో  చూడడం నా కలవాటయిపోయింది" అన్నాడు.

    "ఈ రోజు శనివారం. ఆమె పచ్చి మంచినీళ్ళు  కూడా ముట్టుకోదు. శనివారమే తన జీవితాన్ని మార్చేసిన వారం. ఉల్లాస్ ని తనలో కలుపుకున్న వారం" అని ఆమెకి తెలుసా అంటే వారాలూ, తారీకులు ఆమెకి తెలుసన్న  మాటేగా!" అడిగేడు డేవిడ్ తన సందేహాన్ని  వెలిబుచ్చుతూ.

    "అవును మిస్టర్ డేవిడ్! ఒక శనివారం మేము మర్చిపోయాం. పైడితల్లి మామూలుగా పొద్దున్న  ఇడ్లీలు తీసుకెళ్ళాడు బ్రేక్ ఫాస్ట్ కి. ముట్టుకోలేదు. ఒకే మాట అంది. 'ఇవాళ శనివారం. నా ఉల్లాస్ కూడా వొస్తాడు. కలిసితింటాం. అందాకా ఆగుతాను.' అంతే. అప్పటినుంచి పొరపాటున ఎవరైనా తినడానికి ఏదైనా ఇచ్చినా మళ్ళీ అవే మాటలు. దీన్ని బట్టి  ఆమెకు పూర్తిగా మతిపోలేదు. కానీ, సముద్రం, ఉల్లాస్, జరిగిన సంఘటనా  ఇవి మాత్రమే గుర్తున్నాయనిపిస్తుంది. డాక్టర్లూ అదే అంటారు. ఇప్పటికీ ఎన్నో మందులు నిత్యం వాడుతూనే వున్నాం."

    ఇద్దరి మధ్యా మౌనం.

    "వెరీ శాడ్...." అన్నాడు డేవిడ్ బాధగా.

    మళ్ళీ మౌనం.

    కాస్సేపటికి డేవిడ్ అడిగాడు - "మేడమ్.... మీవారు...." అని.

    "ఓ.... అదా.... చెప్పడం మరిచా. మాకు టెక్స్ టైల్ బిజినెస్ వుంది. ఆ పనిమీద వారు జపాన్ వెళ్ళారు. నెలరోజులయింది. నెక్ట్స్ మంత్  వొచ్చేస్తారు. మాకు పిల్లలులేరు. మాణిక్యవల్లే  మా అమ్మాయి. ఈ బంగ్లా మా కౌశిక్ కే ఇస్తాం. వాడు నాకు మనవడే కదా...." అంది నవ్వుతూ.

    "ఇండియాలో ఈ బంధాలు చాలా అపురూపమైనవి మిసెస్ వసంతమ్మ గారూ! మీ ఫిలాసఫీ, మీ సిద్ధాంతాలూ చాలా గొప్పవి. మాలాగా మెకానికల్ లైఫ్ కాదూ, మెటీరియలిస్టిక్ లైఫూకాదు. వేదాంతధోరణీ, పునర్ జన్మ  గురించిన చింతనా  మీలో వుంది కాబట్టే, తప్పు చెయ్యడానికి మీరు వెనకాడుతారు.  ఐ....లైక్.... ఇట్.... అందుకే ఇండియన్ ని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. నిశ్చలను చేసుకున్నాను. ఆమె మీలాగే చాలా మంచిది" అన్నాడు ఇంక వెళ్ళడానికి సిద్ధపడుతూ.

    "థాంక్యూ.... ఫర్ ది కాంప్లిమెంట్ మిస్టర్ డేవిడ్!" అంది నమస్కారం పెడుతూ వసంతమ్మ.

    "మళ్ళీవొస్తాను. రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఒక వారం తరవాత  మళ్ళీ వొస్తాను. అప్పుడు మాణిక్యవల్లిగారిని  పలకరిస్తాను" అన్నాడు డేవిడ్ ప్రతినమస్కారం చేస్తూ.

    "అలాగే" అంది వసంతమ్మ.

    ఆ కిటికీవైపు  మరోసారి చూసి, వెళ్ళిపోయాడు డేవిడ్.


        *    *    *


    హైదరాబాద్ నుంచి తిరిగి రాగానే, బీచ్ కి వెళ్ళాడు డేవిడ్. అతనికళ్ళు అప్రయత్నంగా జలదృశ్యంలోని కిటికీవైపు  వెళ్ళాయి.డేవిడ్ మనసు చివుక్కుమంది. కిటికీ తలుపులు  మూసున్నాయి. మతిపోయినవాడిలా కిటికీనే చూస్తూ, ఉండబట్టలేక జలదృశ్యానికెళ్ళాడు. బెల్ కొట్టగానే పైడితల్లి  తలుపుతీశాడు. డేవిడ్ ని గుర్తుపట్టి లోపలికి  రమ్మని  ఆహ్వానించాడు.

    "వసంతమ్మగారు లేరా?" అడిగేడు డేవిడ్.

    "లేరుసార్! మాణిక్యవల్లి అమ్మగారికి గుండెనొప్పి వొచ్చింది మొన్న సాయంత్రం. హార్ట్ అటాక్ అని, మద్రాసు తీసుకెళ్ళారు. అక్కడ విజయా నర్సింగ్ హోంలో చేర్పించారు" అన్నాడు పైడితల్లి.

    డేవిడ్ కి పిచ్చెక్కినట్టయింది. ఒక్కసారి పైకెళ్ళి, కిటికీవైపు చూశాడు. ఆమె కుర్చీ అక్కడే వుంది కిటికీ తలుపులు  మూసున్నాయ్! ఆ మూసిన కిటికీనీ, ఆమె లేని ఆ కిటికీని చూడలేకపోయాడు డేవిడ్.

    పైడితల్లి  అందించిన టీ తాగేసి  వెళ్లిపోయాడు గబగబా. ఏదో బాధ, ఏదో అసంతృప్తి అతణ్ణి పిచ్చివాణ్ణి చేస్తోంది.

    ఆ సముద్రాన్ని మధించి ఉల్లాస్ ని వెలికి తెచ్చి, మాణిక్యవల్లికి అప్పగించాలన్న ఆశ!

    మాణిక్యవల్లి మామూలు మనిషైపోయి, కౌశిక్ తో ప్రేమగా వుండాలన్న కోరిక!

    ఆ కిటికీ తలుపులు అలా మూతపడుండక, తెరిచే వుంచాలన్న ఆకాంక్ష!

    వెర్రిగా సముద్రంవైపూ, కిటికీవైపూ చూస్తుండిపోయాడు డేవిడ్!

    ఆ మర్నాడు మళ్ళీ బీచ్ కొచ్చిన డేవిడ్ 'జలదృశ్యం' బంగళావైపూ ఆ కిటికీ వైపూ  చూశాడు. కిటికి తలుపులు  తెరిచివున్నాయ్ భగవంతుడు తన బాధ తెలుసుకున్నాడు కాబోలు, ఆ గది కిటికీలు మళ్ళీ  తెరుచుకున్నాయ్' అనుకుంటూ  మాణిక్యవల్లిని  కుసుకోవాలని  గబగబా లోపలికెళ్ళాడు. హాల్లో అడుగు పెట్టిన  డేవిడ్ అడుగు ముందుకు పడక అక్కడే ఆగిపోయాడు. అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఆ దృశ్యం అతనికి బాకులా గుచ్చుకుంది గుండెల్లో. మాణిక్యవల్లి శవం రకరకాల పూలమధ్య అమర్చినట్టుగా వుంది. ఆ పూలకన్న అందమైన ఆమెని శవమని  మరచి ఒక్కక్షణం ముద్దు పెట్టుకోవాలనిపించింది డేవిడ్ కి. వెళ్ళి నెమ్మదిగా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. కాళ్ళు నెమ్మదిగా ఆ కిటికీ దగ్గరకి లాక్కుపోయాయి. ఆశ్చర్యం! ఆ కిటికీ దగ్గర కూర్చుని తదేకంగా సముద్రాన్ని చూస్తున్న ఆ అబ్బాయి కనిపించాడు. అతడు అచ్చు ఉల్లాస్ లాగానే వున్నాడు. వెనక నుంచి వెళ్లి అతడి భుజాల మీద చెయ్యి వేశాడు డేవిడ్.

    "ఏం చూస్తున్నావు బాబూ....సముద్రాన్నా?...." అడిగేడు.

    'కాదు....' ఖచ్చితంగా జవాబు చెప్పేడు బాబు.

    'మరి?' ఆశ్చర్యంగా అడిగేడు డేవిడ్.

    'మా అమ్మనీ....నాన్ననీ...."

    డేవిడ్ గుండెల్లో సముద్రం పొంగినట్టయింది. గుండె పగిలిపోతుందేమో నన్నంత బాధ. రెండు చేతులూ ఎత్తి  ఎడమచెయ్యితో  గుండెని అదిమి పట్టుకుని, కుడిచేత్తో బాబు తల నిమిరాడు. కళ్ళు రెండూ  సముద్రాలయ్యాయి. అంతలో పైడితల్లి  ఇడ్లీప్లేటుతో అక్కడికొచ్చి 'బాబూ! పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళయినా  తాగలేదు. ఈ ఇడ్లీలు తినండి' అన్నాడు ప్లేటుని బాబు కందిస్తూ.

    'ఇవాళ శనివారం, నేనేమీ తినను.'

    ఆ మాటలకి పైడితల్లి గుండె అదిరిపోయింది. చేతిలోని ఇడ్లీపళ్ళెం జారిపోయింది. గుండె ఆగినట్టయిపోయింది. డేవిడ్ నోరుతెరిచి బాబుని చూస్తూండిపోయాడు.