Facebook Twitter
శ్రీవారికి ప్రేమలేఖ

శ్రీవారికి ప్రేమలేఖ

- వసుంధర

          "మీ తొలిరాత్రి అనుభవాలు నాకు చెప్పాలి. ఎ సంకోచమూ లేకుండా జరిగింది జరిగినట్లు చెప్పాలి. మీ వివరాలు రహస్యంగా వుంచాబడతాయి. మీరు నిజాయితీ పాటిస్తే అందువల్ల ఎందరో యువతీయువకులకు ఎంతో ప్రయోజనం'' అంది కుసుమ. ఆ గదిలో వున్న ఆరుగురు ఆడవాళ్ళూ ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్ళక్కడ పోసుకోలు కబుర్లకు చేరారు. కబుర్ల మధ్యలో శృంగారం చోటు చేసుకోబోతే తనకి ఆసక్తిలేనట్టుగా ముఖం చిట్లించింది కూడా, వారిలో జయ అనబడే ఆమె. మిగతా అయిదుగురూ ఆ పేటవారే! జయ మాత్రం ఏదో పనిమీద పుట్టింటికి వచ్చి పదిరోజులైంది. ఇంకో రెండు వారాలుంటుంది.

జయకు వయసు 30-35 మధ్యలో వుంటుంది. పద్దెనిమిదో ఏట పెళ్ళై కాపురానికి వెళ్ళింది. ఇద్దరు పిల్లలు అయినా బయటివాళ్ళతో ఆ కబుర్లు ఎ సందర్భంలోనూ మాట్లాడలేదు. మనిషి కూడా గంబీరంగానూ, హుందాగానూ వుంటుంది. పుట్టింటికెప్పుడొచ్చినా అమ్మలక్కలామెను అభిమానంగా పిలుస్తుంటారు. అందరితోనూ మంచిగా వుంటూ అందరి గురించీ మంచే చెబుతుందని ఆమె అంటే వాళ్ళకు ఇష్టం. నిత్యం అక్కడే వుంటే ఏమో కానీ అప్పుడప్పుడు కలుస్తూండడంవల్లనేమో వారి స్నేహంలో ఏ మార్పూ లేదు. "నువ్వేమీ మారలేదు జయా!'' అన్నాడు అమ్మలక్కలు ఆమె ముఖం చిత్లింపు చూసి ముచ్చటపడుతూ. సరిగ్గా అప్పుడే తలుపులు తెరచివున్న గుమ్మంలో కుసుమ ప్రత్యక్షమైంది. క్రీమ్ కలర్ చుడీదార్లో, దేవకన్యలా ముఖసౌందర్యంతో వెలిగిపోతున్న ఆమెను చూసి ఆడవాళ్ళందరూ ఒక్కసారిగా అప్రభులయ్యారు. ఆమె వయసు 20-25 మధ్యలో వుండవచ్చు. ముఖంలో మాత్రం జ్ఞాననేత్రం స్పష్టంగా వెలుగుతోంది. ఆమె భుజానికో సంచీ వేలాడుతోంది.

కుసుమ రచయిత్రి. ఆమె రాసిన అయిదారు నవలలు విపరీతంగా అమ్ముడై పాఠకులపై ఆమె రచనా శక్తికున్న ఆకర్షణను నిరూపించాయి. ఇప్పుడామెకు వాటికి భిన్నంగా సాంఘిక ప్రయోజనమున్న పరిశోధనాత్మక రచనలు చేయాలని కోరిక పుట్టింది. వాటిలో భారతీయ మహిళల శృంగారజీవితం-ఇంతవరకూ ఎవరూ దర్శించని కోణాలనుంచి ప్రదర్శించాలన్నది ఆమె తొలి ప్రయత్నం. ఈమాత్రం తన గురించి చెప్పుకుని ఆమె భుజానికి వేలాడుతున్న సంచీలోంచి ఒక నోట్ బుక్ నూ, బాల్ పెన్నునూ తీసి వారిని తొలిరాత్రి అనుభవాలని చెప్పమనేసరికి అంత సూటిగా అడుగుతుందని తెలియక వాళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. "ఇందులో మొహమాటపడాల్సిందేమీ లేదు. సిగ్గుపడాల్సింది మొదలే లేదు.

శృంగార విశేషాలను దాచిపెట్టి మనం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాం. మన ఋషులు విజ్ఞాన విశేషాలు దాచిపెట్టి మానను మూఢాచారాల్లోంచి బయటపడకుండా చేశారు. మనం శృంగార విశేషాలు దాచిపెట్టి భావితరాలను పాశ్చాత్య సంస్కృతివైపు తరుముతున్నాం. ప్లీజ్-నాకు మీ సహకారం కావాలి!'' అంది కుసుమ వారినందరినీ హెచ్చరిస్తూ. తమలో తాము ఎంతో కొంత శృంగార విశేషాలు చర్చించడం ఆ మగువలకు అభ్యంతరంలేదు. వాటికి వాళ్ళు చిలవలూ పలవలూ అల్లుతారు. అబద్దాల్ని జోడిస్తారు. స్వాభిప్రయాల్ని అతికిస్తారు. అవి తర్కానికి అందవు కాబట్టి సాంఘిక ప్రయోజం కోరేవారి ప్రశ్నలకు తట్టుకోలేరు. వారందరూ ఇలా ఆలోచనలతో సతమతమావుతూంటే వారిలోంచి ముందుకు వచ్చి ముందడుగు వేసింది మరెవరో కాదు-జయ!

మిగతావాళ్ళందరూ ఈ పరిణామానికి తెల్లబోయి చూస్తుంటే జయ ఆమెతో "అమ్మాయ్ కుసుమా! నేను నీకు సహకరిస్తాను. కానీ ఇక్కడ కాదు. మా ఇంటికి రా. ఇప్పుడింట్లో ఎవ్వరూ లేరు. మనం ఏకాంతంగా మాట్లాడుకుందాం. నాకు తెలిసినవీ, గుర్తున్నవీ చెబుతాను. నువ్వేమడిగినా అందుకు బదులివ్వడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు టైము మూడయింది కదా- ఆరింటికల్లా మన సంభాషణ పూర్తవ్వాలి. అప్పటికి మావాళ్ళు తిరిగొచ్చేస్తారు'' అంది. అమ్మలక్కలు ముక్కున వేలేసుకుని - "జయ మారలేదనుకున్నాం. కానీ ఆమె చాలా మారిపోయింది'' అనుకున్నారు. జయ, కుసుమ వాళ్ళింటికి వెళ్ళారు. జయ తాళం తీస్తూనే "నేను నీకు సహకరిస్తాననడానికి ఒక్కటే కారణం. నాకు నీ సహాయం కావాలి'' అంది. కుసుమ ఆశ్చర్యంగా చూస్తూ "మీకు నేనేం సాయపడగలను?'' అంది. ఇద్దరూ ఇంట్లోకి ప్రవేశించారు. జయ తలుపులు మూసి గడియ వేస్తూ "నువ్వు రచయిత్రివికదా ... నాకోసం నా తరపున ఒక ప్రేమలేఖ రాసి పెట్టగలవా?'' అంది. కుసుమ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. "ప్రేమలేఖా! ఎవరికి?'' అంది. "మా వారికీ'' అంది జయ. ఇద్దరూ హాల్లో సోఫాలో కూర్చున్నారు. జయ ఆమెకు తన గోడు చెప్పుకుంది.

జయ భర్త కృష్ణమూర్తి. అతడు గొప్ప భావుకుడు. కాలేజీరోజుల్లో ఓ అందమైన అమ్మాయి నుంచి ప్రేమలేఖ అందుకున్న వ్యక్తిత్వం అతడిది. ఆ ప్రేమలేఖ ఎంత గొప్పగా వుందంటే అతడు దాన్నిప్పటికీ దాచుకున్నాడు. ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వాళ్ళు నిర్ణయించిన జయను పెళ్ళి చేసుకున్నాడు. జయకు భాపుకత్వం అర్థం కాదు. ఆమె ప్రాక్టికల్ మనిషి. భర్తకు ఏ వేళల్లో ఏంకావాలో చెప్పకుండా తెలుసుకుని అమర్చుతుంది. ఎన్నడూ అతడి మాటకు ఎదురుతిరగదు. తిడితే సహిస్తుంది. పొగిడితే సంబరపడుతుంది. పిల్లలు పుట్టక వాళ్ళ సంరక్షణ కూడా పూర్తిగా తనే చూసుకుంటోంది. ఇంట్లో ఎవరెవరి వస్తువులు ఏయే సమయాల్లో ఎక్కడెక్కడ వుంటాయో అమెకు తెలుసు. ఆమెవంటి భార్యవుండడం తన అదృష్టమని కృష్ణమూర్తి ఎందరికో చెపుతూ ఆమెతోనూ అంటాడు.

కృష్ణమూర్తికి భాపుకత్వం, భావావేశం ఎక్కువ. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. పొంగిపోతాడు. జయ మాత్రం నవ్వి ఊరుకుంటుంది. కుర్రాడికి స్కూల్లో ఫస్టుర్యాంక్ వస్తే అతడు సెలబ్రేషన్ అంటాడు. ఆమె 'ఇలాగే అన్నిమార్లూ రావాల'ని కొడుకుని ఓసారి హెచ్చరించి ఊరుకుంటుంది. అతడామెకు కొత్తచీర కొని, 'ఇందులో నిన్ను చూడాలనిపించి వెంటనే కొనితెచ్చాను. కట్టుకుని రా, బయటకు వెడదా'మంటే ఆమె తాపీగా, 'ఈవేళ ఏ అకేషనూ లేదు. పదిరోజుల్లో పండగొస్తోంది. ఆ వేల కట్టుకుంటాను' అంటుంది. ఆమెలో భాపుకత్వం లేదని అతడు తరచూ బాధపడతాడు. మంచి సినిమా చూసినా, పుస్తకం చదివినా, అనుభవం పొందినా అతడు భావోద్రేకం పొందుతాడు. ఆమె ముక్తసరిగా 'బాగుంది' అంటుంది. అలాంటప్పుడతడొకసారి రెచ్చిపోయి 'నా కర్మకొద్దీ మడ్డి మృగాన్ని కట్టుకునాను. అంతా నా దురదృష్టం' అంటాడు. ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుంది. 'ఇప్పుడు నేనేమన్నాననీ?' అని అతడు నొచ్చుకుంటాడు. 'నేను నిజంగానే మడ్డి మృగాన్ని, మీరు మీకు తగిన పిల్లని పెళ్ళి చేసుకోవలసింది. ఆ ప్రేమలేఖ పిల్లని పెళ్ళి చేసుకుంటే ఎంతో సుఖపడేవారేమో'' అంటుందామె.

కృష్ణమూర్తి కాసేపూరుకుని తిరిగి ఆమెతో అంటాడు 'ప్రేమలేఖ రాసిన అమ్మాయిని ఎప్పుడో మర్చిపోయాను. ఎందుకంటే అది తొలి చూపులోంచి పుట్టిన ప్రేమ. చూపులు కాస్త కరువు కాగానే ఆ ప్రేమ అంతరించిపోయింది. మనది సాహచర్యంలోంచి పుట్టిన ప్రేమ. ఇప్పుడు నిన్ను విడిచి క్షణం వుండగాలనా?' జయ అవునేమో అన్నట్లూరుకుంటుంది. తిరిగి క్రిష్ణమూర్తే ఒకసారి 'చెప్పాలంటే ఆ ప్రేమలేఖ అమ్మాయి ముఖం కూడా నాకిప్పుడు సరిగ్గా గుర్తులేదు. ఆ అమ్మాయిని నా స్మృతిపథంలో నిలబెడుతున్నది ఆ ప్రేకలేఖే. నువ్వు ఒక్కసారంటే ఒక్కసారి ఆ లేఖను మరిపించే అపురూపమైన ప్రేమలేఖను నా కోసం రాయగలవా?' అనడిగాడు. కృష్ణమూర్తి, జయు ఒకరినొకరు విదిచివున్న సందర్భాలే తక్కువ. ఆ సందర్భాల్లో పరస్పరం ఉత్తరాలు రాసుకుంటారు. కృష్ణమూర్తి రాసే ఉత్తరాల్లో ప్రేమ, విరహం, కవిత్వం పెల్లుబుతుంది. జయ మాత్రం "మీ ఉత్తరం చదువుతూంటే ఎవరైనా చూస్తారేమోనని సిగ్గేసింది. మనిద్దరమే వున్నప్పుడు వినడానికి కబుర్లు బాగుంటాయిగానీ ఉత్తరాల్లో ఇలాంటివి వద్దు. నాకూ వచ్చేయాలని వుంది ...'' అని మామూలు విశేషాలు రాస్తుంది. అందులో వాళ్ళమ్మ వడియాలు పెట్టడంనుంచి, తను బొబ్బట్లు వేయడంలో కొత్తగా నేర్చుకున్న చిట్కాలనుంచీ, ఇంటి పనిమనిషి కూతురికి విరేచనాలు వెళ్ళడంలాంటివి వుంటాయి.

జయను భర్త ప్రేమలేఖ గురించి ఒకటికి రెండుసార్లు అడిగేడు. కానీ ఉన్త్తరం ముందు కూర్చుంటే ఆమెకు రోటీన్ విషయాలు తప్ప స్ఫురించేవికాదు. భర్త కోర్కె తీర్చాలంటే ఏ రచయిత్రి సాయమో తీసుకోవాలని ఆమె గుర్తించింది. అయితే ఎవరిని, ఎలా అడగాలి ... అన్నదే సమస్య. అది ఇన్నాళ్ళకిలా తీరింది. కుసుమ ఈ కథను ఆశ్చర్యంగా విని, "ఈ విశేషాలే ఓకే గొప్ప కథ అవుతాయి. మీ వారికి ప్రేమలేఖ రాయడంకోసం మీవంటివారు నా రచనకు సహకరించే వివరాలివ్వడానికి సిద్ధపడడం అపూర్వం. మీము నేను తప్పక సాయపదతాను. ఎటొచ్చీ మీరు ఉత్తరం రాయండి. దానికి నేను కొన్ని ప్రేమ వాక్యాలతో కొసమెరుపు ఇస్తాను'' అంది. జయ తల అడ్డంగా ఊపి, "భోజరాజుని మెప్పించాలని కొందరు నాబోటివాళ్ళు భోజనం దేహి రాజేంద్ర, ఘ్రుత సూప సమన్వితం అని సామాన్యంగా రాస్తే దాన్ని కాళిదాసు మహిశశ్చ శరచ్చంద్ర, చంద్రికా ధవళం దధిః అని పూరిస్తే భోజరాజు చివరి రెండు పాదాలనూ వేరుగా గుర్తించి అక్షర లక్షలిచ్చేట్ట. మా వారిని మెప్పించే ప్రేమలేఖలో నా వాక్యాలు భోజనం దేహి అన్నట సామాన్యంగానూ వుంటాయి. మొత్తం ఉత్తరం నువ్వే రాసిపెట్టు'' అంది. కుసుమ అంగీకరించి జయను ఇంటర్వ్యూ చేయడం మొదలెట్టింది.

ఆమె జవాబుల్లో చిత్తశుద్ధికీ, ఆమె నుంచి లభించిన సమచారానికీ కుసుమ ఆశ్చర్యపడింది. చకచకా జయ బదులివ్వడంవల్ల నాలుగున్నరకల్లా ఇంటర్వ్యూ అయిపొయింది. అప్పుడు జయ, కుసుమను ప్రేమలేఖ రాసి పెట్టమనీ తను ఈలోగా కాఫీ టిఫిన్లు సిద్ధంచేస్తాననీ వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేసరికి ప్రేమలేఖ సిద్ధంగా వుంది. జయ ఆ ఉత్తరం చదివి "ఎంత బాగా రాశావో'' అని మెచ్చుకుంది. కుసుమ టిఫిన్ తింటూ, "మీలో భాపుకత వుందో లేదో కనీ మీ చేతివంట భాపుకతను పుట్టిసొంది'' అంది. కుసుమ వెళ్ళేక జయ ఆ ప్రేమలేఖను మరోసారి చదువుకుని వేరే కాగితం మీద ఫెయిర్ చేసి తన సంతకం కూడా పెట్టింది. అయితే కొన్ని విశేషాలు రాయలేదని ఆమెకు అసంతృప్తిగా తోచింది. అమ్మాయి గౌనుకి తను నేర్చుకున్న డిజైన్ కుట్టింది. పక్కింట్లో దొంగతనం జరిగింది. పాత పనిమనిషిని తీసేసి కొత్త పనిమనిషిని పెట్టారు. ఈమె తోమిన గిన్నెలు తళతళా మెరుస్తున్నాయి. ఇంకా ఎన్నో. మూడ్ను జయ ఇవన్నీ ఉత్తరంలో వున్న ఖాళీలో రాయాలనుకుంది. ఈ ఉత్తరాన్నా ఉత్తరంతో కలపడం ఇష్టంలేక అవన్నీ కలిపి వేరే కాగితం మీద రాసింది. పదిహేను పంక్తులు వచ్చాయి. రెండుత్తరాలనీ కవర్లో పెట్టి భర్తకు పోస్టు చేసింది.

                                                       ***************

కృష్ణమూర్తి కవరుచింపి ఉత్తరం తీశాడు. 'నా హృదయచోరునికి' అంటూ మొదలైన ఆ లేఖ చూసి తెల్లబోయాడు. ఎవరా అని కింద చూస్తే 'మీ హృదయచోరిణి జయ' అని వుంది. జయ ఈ ఉత్తరం రాసిందా అనుకుంటూ చదివాడు. ఉత్తరం నిండా ప్రేమానుభూతులు, కవిత్వం రసవత్తరంగా వుంది. చదువుకుందుకు బాగుంది కానీ అతడిలో ఏదో అసంతృప్తి .... ఉత్తరాన్నతడు మడిచి కవర్లో పెడుతూండగా ఇంకో కాగితం కనబడి బయటికి తీశాడు. 'ప్రియమైన మీకు ... ఉత్తరం పూర్తిచేశాక కొన్ని విశేషాలు మరిచేననిపించి మళ్ళీ ఈ ఉత్తరం రాస్తున్నాను. అమ్మాయి గౌనుకి నేను కొత్తగా నేర్చుకున్న డిజైన్ కుట్టాను ... కొత్త పనిమనిషి తోమిన గిన్నెలు తళతళా మెరుస్తున్నాయి ... మీ జయ' ఈ ఉత్తరం చదువుతూంటే క్రిష్ణమూర్త్గి పరవశించిపోయాడు. ఈ ఉత్తరానికే తానెందుకు పరవశించాడో అతడికి వెంటనే అర్థమైంది.

జయదీ, అతడిదీ తొలిచూపుల ప్రేమ కాదు. సాహచర్యంలో ఏర్పడిన ప్రేమ. అందుకే మొదటి ఉత్తరంలో అతడికి జయ కనపడలేదు. రెండో ఉత్తరంలో కనబడింది. ఆమె కనబదితేనే అతడికి పరవశం మరి! మనదేశంలో ప్రతి భర్తా భోజరాజు. ప్రతి భార్యా కాళిదాసు. వారి అనుబంధాల నుంచే జీవిత ప్రబంధాలు పుడతాయి. వారి మధ్యకు అసలు కాళిదాసు వచ్చినా అతడి ప్రబంధాలు వెలవెలబోక తప్పదు. అయితే ఈ వాస్తవాన్ని కృష్ణమూర్తి కాస్తంత ఆలస్యంగా తెలుసుకున్నాడు.