Facebook Twitter
పెరట్లో తాచుపాము

పెరట్లో తాచుపాము

- వసుంధర

ఉదయం ఆరుగంటల సమయం లక్ష్మి నిద్రలేచి పెరట్లోకి వచ్చింది. ఎందుకో ఆరోజింకా అప్పటికి కుళాయి రాలేదు. అందుకని నూతి దగ్గరకు వెళ్ళిందామె. బాల్చీతో నీళ్ళు తోడి పక్కనే వున్న బకెట్లో పోయబోయి ఆగిపోయింది.

 

ఆ బకెట్ పక్కనే పడగవిప్పి ఆడుతోందో పాము. పడగమీద కృష్ణపాదాలు స్పష్టంగా కనబడుతున్నాయి. పాము లక్ష్మిని చూసిదో లేదో తెలియదు కానీ వెంటనే పాడగముడిచి నేలవ్రాలి చరచరా పాక్కుంటూ అక్కణ్ణించి వెళ్ళిపోయింది. కాసేపు శిలాప్రతిమలా ఉండిపోయిన లక్ష్మి పామెటు వెళ్ళిందో గమనించలేదు.

అక్కడ పాము లేదని తెలియగానే చేతిలోని బాల్చీని క్రిందపెట్టి లోపలకు పరుగెత్తి ఇంకా నిద్రపోతున్న భర్తను తట్టి లేపింది. విసుక్కుంటూ బద్ధకంగా ఆవులించి "ఏమిటే?'' అన్నాడు లక్ష్మి భర్త చలపతి. అతడికి సమాధానం రాలేదు. కారణమేమిటా అని కళ్ళు నులుముకుని చూస్తే లక్ష్మి నిలువెల్లా గజగజ వణికిపోతోంది, "ఏమయిందే?'' అన్నాడు చలపతి.

లక్ష్మికి నోట మాట రావడానికి చాలాసేపు పట్టింది. ఆమె చెప్పింది విన్నాక చలపతికి ఒళ్ళు జలదరించింది. "ఇప్పుడెలా?'' అన్నాడతను. ఆ ప్రశ్నే ఒక తాచుపాములా ఆ యింట్లో బుసలు కొడుతోంది. చలపతిడి ప్రయివేటు కంపెనీలో మంచి ఉదోగం. అద్దె కంపెనీవాళ్ళే భారిస్తున్నారని ఉన్నదిద్దరే అయినా నాలుగు గదుల పెద్ద ఇల్లు తీసుకున్నాడు. ఇల్లే విశాలమైతే అంతకు రెట్టింపు విశాలం పెరడు.

అందులో నాలుగు రకాల పళ్ళ చెట్లున్నాయి. రెండేళ్ళ క్రితం చలపతికి పెళ్ళయింది. అప్పట్నుంచీ భార్యాభర్తలా యింట్లో ఉంటున్నారు. లక్ష్మికి కూరగాయలు పెంచే తోటపని అంటే యిష్టం. దొడ్లో వంగ, బెండ, టమేటా మొక్కలున్నాయి. పొట్ల, దొండ, కాకర పాదులున్నాయి. కనకాంబరం, మల్లి, సన్నజాజి, రాదామనోహారం వగైరా పూలున్నాయి. ఇంట్లో రెండు గదులకు బాత్రూం సదుపాయమున్నప్పటికీ ముఖప్రక్షాళనం పెరట్లోనే చేస్తుంది లక్ష్మి. పెరట్లో తొండలు, ఉడతలు లాంటివి తిరుగుతూనే ఉంటాయి.

ఏ నలికెలప్పాములో కనబడుతూంటాయి. పాము కనపడ్డం ఇదే మొదలు. ఇప్పుడా పెరట్లో ఎలా మసలడం? ఆ పాము పెరట్లోనే ఉంటుందని నమ్మకమేమిటి? విశాలమైన ఆ యింట్లోకి ప్రవేశించిందంటే ఎప్పుడెక్కడుంటుందో ఎలా చ్ప్పడం? భార్యాభర్తలా పూతకింక పెరట్లోకి వెళ్ళలేదు. ఇంట్లోకి ఏర్పాటు చేసుకున్న కుళాయిలను తరచుగా ఉపయోగించని లక్ష్మి ఆ పూత అన్నింటికీ వాటినే ఉపయోగించింది. చలోఅపతి ఆఫేసుకు వెడుతూ పెరట్లో మసలకు నేను నా స్నేహితులను సంప్రదించి ఏం చేయాలో చెబుతాను'' అన్నాడు.

సాయంత్రం మూడింటిదాకా లక్ష్మి ఇంట్లోనే ఉంది. అప్పుడామెకు తను కొత్తగా నాటిన చిట్టి చేమంతుల గురించి గుర్తువచ్చింది. పాపం దొడ్లో మొక్కలన్నీ తన చేతినీళ్ళకోసం ఎదురుచూస్తుంటాయి. ప్రతి స్త్రీలోనూ నిబిడీకృతమై ఉంటుంది మాతృప్రేమ. బిడ్డలు పుట్టేదాకా స్త్రీ ఆ ప్రేమనెవరికైనా పంచి పెట్టగలదు.

మగడు భార్యనుంచి పూర్తీ ప్రేమను పొందగాలిగేది ఆమె తల్లి అయ్యేవరకూ మాత్రమే! అన్ని భయాల్నీ జయించి లక్ష్మి పెరట్లోకి వెళ్ళి ముందు చిట్టి చేమతులను తడిపింది. ఆ తర్వాత వంగ, బెండ, టమేటాలావైపు వెళ్ళింది. వాటిని సగమైనా తడిపిందో లేదో బుస్సుమన్న శబ్దం వినపడింది. ఉలిక్కిపడి చూస్తే చరచర పాకిపోతున్న పాము కనబడింది. ఒక్క పరుగున ఇంట్లోకి చేరింది లక్ష్మి. అప్పుడే పలకరింపుగా వచ్చింది ఎదురింటావిడ.

లక్ష్మి హడావుడి చూసి కారణమడిగి తెలుసుకుని, "హమ్మో! తాచుపామే! ఇంకోసారి వస్తాన్లే'' అని వెళ్ళిపోయింది.

ఆవిడవార్తనెంతమందికి చేరవేసిందో ఏమోకానీ ఇంకెవ్వరూ అటుగా రాలేదు.. భర్త వచ్చేదాకా బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తోంది లక్ష్మి. సాయంత్రం ఆరింటికి వచ్చాడు చలపతి. లక్ష్మి అతడికి జరిగిన విశేషం చెప్పింది.

"భయపడకు అన్నింటికీ నేనేర్పాట్లు చేశాన్లే!'' అన్నాడతను. ఆఫీసులో సుందర్రావనే స్నేహితుడు "పెరట్లో తాచుపాముంటే చాలా అదృష్టం. నీకు సిరి రాబోతోంది. నీకేం భయంలేదు. హాయిగా ఉండు'' అన్నాట్ట.

"అయితే ఆ సిరి నువ్వే అనుభవిద్దువుగాని. తాచుపాముని పట్టి నీ పెరట్లోకి తీసుకుపో'' అని చలపతి బదులిచ్చాడు. మరో స్నేహితుడు భక్తిభావంతో పరవశించి నాగదేవత దొడ్లో వెలసిందన్నాడు. చలాప్తి అతడిక్కూడా నాగదేవతను ఆఫర్ చేశాడు. ఒక స్నేహితుడు మాత్రం మంత్రగాణ్ణి తీసుకుని వస్తానన్నాడు ఏడింటికల్లా అతగాడు రావచ్చు. చలపతి, లక్ష్మి మంత్రగాడి కోసం ఎదురుచూశారు.

"సరిగ్గా ఏడింటికి మంత్రగాడు వచ్చాడు. కూడా మంత్రించిన మిగులు తెచ్చాడు. పెరడంతా తిరిగి వాటిని చల్లాడు. ప్రతిఫలంగా నూటపదహార్లడిగి బేరంలో ముప్పై రూపాయల కొప్పుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడుదయం ఆరింటికి లక్ష్మి మళ్ళీ అదే దశలో తాచుపామును చూసింది. పాము పాక్కుంటూ వెళ్ళిపోయాక లక్ష్మి గమనిచిన విశేషం ... పాము ఆడింది మంత్రించిన మిగులపైనే! మంత్రానికి చింతకాయలు రాలవచ్చునేమో కానీ తాచుపాములు బెదరవని లక్ష్మికేకాదు, చలపతికీ అర్థమయింది.

"దాన్ని చంపడం మినహా మరోమార్గంలేదు'' అని యిద్దరూ నిర్ణయానికి వచ్చారు. కానీ ఎవరు చంపుతారు? అయితే ఆ రోజు మధ్యాహ్నం వెతుక్కుంటూ ఓ పాములు పట్టేవాడు వాళ్ళింటికి వచ్చాడు.

పాముకి యాభైరూపాయలిస్తే పెరడంతా గాలించి ఉన్న పాములన్నింటినీ పట్టేస్తానన్నాడు. వాణ్ణి మంత్రగాడు పంపేడట. లక్ష్మి భర్తకు ఫోన్ చేసింది. అతడుత్సాహంగా సరేనన్నాడు.. పాములు పట్టేవాడు పెరట్లో నాగస్వరాన్నూదాడు, మంత్రించిన వేరులను చేత్తో పట్టుకుని మూల మూలలకు తిరిగిగాడు. చివరికి వాడు ఒకటి కాదు, రెండు కాదు ... మొత్తం నాలుగు పాముల్ని పట్టాడు.

రెండువందలు తీసుకుని వెళ్ళిపోతూ వాడు "ఇక మీ పెరట్లో పామన్నది కనిపించదు'' అన్నాడు. మర్నాడే లక్ష్మికి నాగదేవత దర్శనమిచ్చింది. చలపతి మండిపడి ఆ పాముల్ని పట్టేవాదికోసం ఆరా తీస్తే వాడు మాత్రం కనబడలేదు. వాడు పట్టిన నలుగు పాములూ వాడి శిక్షణలో పెరిగిన వాడి స్వంత పాములయుండాలనీ అసలు పాము పెరట్లో అలాగే ఉండిపోయిందనీ లక్ష్మి, చలపతి అర్థం చేసుకున్నారు/ అర్థంచేసుకున్నంతమాత్రాన సమస్య తీరిపోదు.

చలపతికి పామును చంపే ధైర్యం లేదు. ఇంత అనుభవమయ్యాక మంత్రగాళ్ళని నమ్మే ఆవకాశం లేదు. సమస్యకు పరిష్కారం లభించలేదు. కానీ ఆ దంపతులకు సానుభూతిపరుల సంఖ్య పెరిగింది. అందులో పనికిరాని సలహాలిచ్చేవారి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. కొందరు ఫోన్లు చేస్తున్నారు, కొందరు పలకరించి ముళ్ళమీద నిలబడ్డట్లు హదావిడుగా ఏదో అనేసి పారిపోతున్నారు.

కొందరు స్వయంగా కసుకోవాడమిష్టంలేక ఉత్తరాలు కూడా రాస్తున్నారు. అలా వారం రోజులు గడిచాయి. లక్ష్మికి తాచుపాము అలవాటయింది. దాన్ని చూస్తే ఆమెకిప్పుడు భయంవేయడంలేదు. తన జోలికి వస్తే తప్ప అది ఎవర్నీ ఏమీ చేయదని ఆమెకు నమ్మకం కుదిరింది. పొరపాటున దాన్ని రెచ్చగొట్టకూడదని ఆమె పెరట్లో మసిలేటప్పుడెంతో జాగ్రత్తగా ఉంటోంది. పురికొస తాడునైనా, పుల్లముక్కనైనా ఒకటికి రెండుసార్లు చూసి నిర్థారణ చేసుకుని మరీ అడుగులేస్తోంది.

చలపతి మాత్రం పెరట్లోకి రావడం మానేశాడు. లక్ష్మిలో పెరిగే ధైర్యం అతన్ని మరింతగా కలవరపెడుతోంది. ప్రస్తుతానికి తాచుపాము లక్ష్మినేం చేయడంలేదు. కానీ పొరపాటున ఆమె కాలు దాని తోకను తొక్కితే! ధైర్యంగా తిరుగుతున్నాననుకుంటున్న లక్ష్మి కూడా అరచేతిలో ప్రాణాలుంచుకునే పెరట్లో తిరుగుతోంది.

అలాంటి పరిస్థితిలో చలపతికి జగ్గయ్య గురించి తెలిసింది. జగ్గయ్య అతడికి బాగా దూరపు బంధువు. వ్యవసాయంలో దిట్ట, పాముల్ని చంపడంలో చాంపియన్ అని చెప్పుకునేవారు. కాలం కలిసిరాక బాగా చితికిపోయి నికృష్టమైన జీవితం గడుపుతున్నాడు. అతణ్ణి సహాయమడిగితే? ఒకందుకు సంకోచిస్తున్నాడు, ఏడాది క్రితం జగ్గయ్య అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం నిమిత్తం మూడువందలు కావాలని తన వద్దకు వచ్చాడు. తను లేవని పంపేశాడు.

అదిప్పుడు చెబితే, "కన్నా కొడుకులే ఆయన్నాదుకోలేదు. మనం చేసిందేం తప్పుకాదు. వెళ్ళి ఆయన్ని పిలవండి. ఓ పంచెల చాపు పెట్టి చేతిలో నూటపదహార్లు పెడదాం'' అంది లక్ష్మి. ఈ ఉపాయం చలపతికి నచ్చింది. ఒకరోజు సాయంత్రం అతడు జగ్గయ్యను కలుసుకున్నాడు. అతుకుల పంచి, చిరుగుల చొక్కా, మాసిన గెడ్డం, చింపిరి జుట్టు ... చూడ్డానికి జగ్గయ్య బిచ్చగాడిలా ఉన్నాడు.

కావడానికది జగ్గయ్య ఇల్లేకానీ కొడుకు దాన్నెవరికో అద్దెకిచ్చేశాడు. పెరట్లో రేకుల షెడ్లో ఉంటున్నాడతను. అతడి జీవనాధారమేమిటో ఎవరికీ తెలియదు. కొడుకు నెలకు వందరూపాయలు పంపుతున్నాడంటారు కొందరు. ఇంట్లో ఉన్నవాళ్ళు చూసీచూడక తిండి పెడతారంటారు కొందరు. మనిషి మాత్రం చిక్కిశల్యమైవున్నాడు.

జగ్గయ్య, చలపతి చెప్పిందంతా విని, "పెరట్లో తాచుపాములు ఒక్కటేమిటి, వద్దన్నాసరే పట్టి చంపగలను, కానీ చంపను వెళ్ళు'' అన్నాడు. చలపతి తెల్లబోయి "ఎందుకు?'' అన్నాడు. "తాచుపాములా కలకాలం వర్థిల్లాలి. వీలుంటే ఒకదాన్ని పట్టి నా కొడుకింటి పెరట్లో కూడా వదిలిపెట్టాలనుంది'' అన్నాడు జగ్గయ్య.

చలపతికి అతడి మాటలు అర్థంకాలేదు. అది కనిపెట్టినవాడిలా "తాచుపాము నీ పెరట్లో చేరింది.నీ స్నేహితులు నీ యింటికి రావడం మానేశారు. నీకు సాయపదతామని మంత్రగాళ్ళు, పాములుపట్టేవాళ్ళు నీవల్ల ప్రయోజనం పొంది నిన్ను మోసం చేశారు. ఏం చేయాలో నెకెఉ చెప్పే సానుభూతిపరులు పెరిగారు. వాళ్ళు చెప్పింది నువ్వు చెయ్యగలవా అని ఆలోచించరు.అందుకు సాయమూపడరు.

కొందరైతే పెరట్లో తాచుపాము నీ అదృష్టమంటారు కానీ ఆ అదృష్టాన్ని తాము తీసుకోరు, కోరుకోరు. చివరి కేమవుతుందంటే నువ్వు తాచుపాముకి అలవాటు పడతావు. నీ స్నేహితులకంటే, అయినవాళ్ళకంటే అది ప్రమాదకరమైంది కాదని తెలుసుకుంటావు. తాచుపామే నీ స్నేహితుడవుతుంది.

అంతమాత్రాన నీ సమస్య తీరిపోదు.తాచు పాముతో సహజీవనమంటే నీ ప్రాణాలు నీకు దక్కినా అవెప్పుడూ అరచాతుల్లోనే ఉంటాయి. అర్థమయిందా?'' అన్నాడు జగ్గయ్య. "అర్థమయింది కానీ యిన్ని తెలిసికూడా నువ్వు నాకెందుకు సాయపడవు?'' అన్నాడు చలపతి. "ఓరి మూర్ఖుడా! ఇంకా నీకర్థం కాలేదా? మనిషికి దరిద్రం పెరట్లో తాచుపాములాంటిది. దరిద్రుణ్ణి అయినవాళ్ళు దూరంగా ఉంచుతారు.

మాయగాళ్ళు మోసంచేస్తారు. బాగా ఉన్నవాళ్ళు దరిద్రుడే సుఖపడుతున్నట్లు చెప్పి కవులు, రచయితలచేత పొగిడిస్తారు కూడా! ఏ దారీలేక దరిద్రంతో సహజీవనానికి సరిపెట్టుకుని అది నన్నేక్షణంలో కాటేస్తుందోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతికే దరిద్రుణ్ణి నేను. నాకు సాయపడాలని మీరేవ్వరైనా అనుకున్నారా? నా బాధ మీకు తెలియాలంటే మీ పెరట్లో ఆ తాచుపాముండితీరాలి. దాన్ని నేనెందుకు చాపుతాను? వెళ్ళు ...'' అంటూ గద్దించాడు జగ్గయ్య, అప్పుడు మొదటిసారిగా చలపతి జగ్గయ్య కేకకు భయపడ్డాడు.

క్షణం కూడా ఆగకుండా అక్కణ్నుంచి ఇల్లు చేరే సరికి గుమ్మంలోనే నవ్వుముఖంతో ఎదురయింది లక్ష్మి. "పాతికేళ్ళ కుర్రాడండీ ... మేకు తోచిందివ్వండి పామును చంపేసి పోతానన్నాడు. మోసగాడేమోననిపించినా ఏమో ఏ పుట్టలో ఏ పాముంటుందోనని సరేనన్నాను.

అతగాడు పెరట్లోకి వెళ్ళి అరగంటలో పామును వెతికి పట్టుకుని చంపేశాడు. మీరు కానీ బాబయ్యగారిని తీసుకొచ్చేస్తున్నారమోనని కంగారుపడి హడావిడిగా యిలా వచ్చాను. అతగాడు పెరట్లో స్నానం చేస్తున్నాడు నూతి దగ్గర'' అంది లక్ష్మి ఉత్సాహంగా. చలపతి వెళ్ళి ఆ కుర్రాణ్ణి చూశాడు.

అప్పటికతడి స్నానమైపోయింది. మళ్ళీ తనకున్న చింకి బట్టలు కట్టేసుకున్నాడు. చలపతి డబ్బు గురించడిగితే తోచిందివ్వమన్నాడు.

"తోచిందంటే అయిదు రూపాయలిస్తాను తీసుకుంటావా?'' అన్నాడు చలపతి. ఆ యువకుడు తలాడించాడు.

"వెర్రివాడా! ఇలా అయితే ఈ వృత్తిలో డబ్బులేం సంపాదించగలవు?'' అన్నాడు చలపతి జాలిగా.

"పాముల్ని చంపడం నా వృత్తికాదు. పాముని చంపడానికి నేను చేసిన తోలిప్రయట్నం ఇదే!'' అన్నాడాయువకుడు.

"అయితే మాత్రం, ఓ వృత్తి ప్రారంభించేక స్థిరమైన రేటంటూ ఉండాలి. ఈవేళ అయిదు రూపాలకొప్పుకుంటే రేపందరూ అంతే యిస్తామంటారు ...''

"ఇక ఈ వృత్తి చేయను ...'' అన్నాడా యువకుడు.

"ఎందుకని?'' "నాకు చదువులేదు. నా న్నవాళ్ళు లేరు. పనిచ్చేనాధులు లేరు. కాలూ చేయీ తిన్నగా ఉందని అడుక్కోవడం అచ్చిరావడం లేదు. దరిద్రం ... దరిద్రం ... నేను భరించలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకోవాలంటే మనస్కరించటంలేదు. చావు తప్ప నా సమస్యలకి పరిష్కారం లేదు.

మీ పెరట్లో తాచుపాముందని తెలిసింది. చేతకానిపనిచేస్తే చావు తప్పదుకదా అన్న ఆశతో ప్రాణం పోగొట్టుకోవాలని వచ్చాను. దరిద్రుణ్ణి పాము కూడా కాటేయడానికి భయపడింది. నేనింకేమైనా ప్రయత్నం చేయాలి ...'' అన్నాడా యువకుడు.

అటు జగ్గయ్యా ... ఇటు యువకుడు ... దరిద్రం ... పెరట్లో తాచుపాము ... చలపతి భార్యతో అన్నాడు "అయినవాళ్ళకు నామీద ఆధారపడాల్సిన అగత్యం లేదు. మన అవసరానికి మించిన సంపాదన నాది. అనుభవంమీద పెరట్లో తాచుపముంటే ఎలాగుంటుందో తెలుసుకున్నాం. దేశంలోని దరిద్రాన్ని పారద్రోలడం మనవల్ల కాదు. కానీ ఉడుతాభక్తిగా ఓ జగ్గయ్య, ఓ యువకుడు ... వీళ్ళకు మనమో దారి చూపిస్తే ఆ దారిలో మరెందరో నడిస్తే ... దేశంలోని దరిద్రాన్ని పారద్రోలడానికి నాయకులమీద ఆధారపడకుండా ప్రజలే ప్రజలకు దారులేర్పరుస్తారు. ఏమంటావు?'' లక్ష్మి ఏమంటుందో అతడికి తెలియదా?