Facebook Twitter
నలిగిన పసి రెక్కలు

నలిగిన పసి రెక్కలు

శశి

ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఆఫీస్ లో. అంతా పది మంది స్టాఫ్ అటెండర్ లతో కలిపి. చిన్నగా కలకలం, నవ్వులు. లేచి మేనేజర్ టేబుల్ దగ్గరకు వెళ్లాను. అందరు అప్పటికే అక్కడకు చేరి నవ్వుకుంటూ స్వీట్ తింటూ, మాట్లాడుతూ ఉన్నారు. రికార్డ్ అసెస్టెంట్ నన్ను చూడగానే నవ్వుతూ’ ‘స్వీట్ తీసుకోండి మేడం’ ఇచ్చింది.

“ఏమిటి సంగతి?” కొంత కుతూహలంగా అడిగాను.

భర్త చనిపోయిన తరువాత ఒక్క కూతురిని సాకుతూ లేమితనం బయట పడకుండా గోర్వంగా ఉంటుంది.

“పాపకి పెళ్లి కుదిరింది” చెప్పింది.

“పెళ్ళా” ఉలిక్కిపడ్డాను.

ఇంకా సీనియర్ ఇంటర్ కదా....దాచుకుందాము అన్నా దాగని కోపం. ఎందుకు వీళ్ళు ఇలాగ చిన్న పిల్లలకు పెళ్లి చేసేస్తారు. ‘లేదు మేడం అబ్బాయి ఇక్కడ మెకానిక్. బాగానే సంపాదిస్తాడు. వాళ్ళ అమ్మ ఈ మధ్య చనిపోయింది. ఆడ దిక్కు లేని సంసారం. ఎక్కడో పాపని చూసి ఇష్టపడ్డాడు అంట. అసలు పాపని ఇష్టపడని వాళ్ళు ఎవరు చెప్పండి? కట్నం ఉన్నంతే ఇమ్మనండి చేసుకుంటాను.

పెళ్లి త్వరగా చేయాలి అని చెప్పి పంపించాడు. ఇంకోవారం లోనే పెళ్లి. పెళ్లి ఖర్చు కూడా అతనే పెట్టుకున్నాడు. అమ్మాయిది ఏమి అదృష్టమో చూడండి.” సంతోషంగా గుక్క తిప్పుకోకుండా చెప్పింది. మనసులో ఏమి అదృష్టం బొమ్మల పెళ్లి లాగా ఇంతచిన్న పిల్లని కట్టబెడుతూ అనిపించినా ఆమె సంతోషాన్ని తుంచలేక నవ్వాన్. కాని వాడిపోయిన పూవు మీద పడిన చంద్రకాంతి లాగా దానిలో కళ లేదు. మేడం మీరు తప్పకుండా రావాలి” బ్రతిమలాడింది విజయ.

పదో క్లాస్ లో వాళ్ళ పాపకి ఇంగ్లీష్ కష్టం అంటే కొన్ని రోజులు చెప్పాను. ఆ కృతజ్ఞత. “సరేలే” అన్నాను. ఆ మాత్రానికే తన కళ్ళు ఒక్కసారి వెలిగాయి. చక్కగా షామియాన వేసి మధ్యలో స్టేజ్ మీద పెళ్లి ఏర్పాట్లు చేసారు. ఇంటి పక్కన ఖాళీ జాగాలో పెళ్లి ఏర్పాటు చేసి షామియాన గుంజలకు మామిడి తోరణాలు వాసన మనసుని పచ్చన చేస్తూ, గలసిన ఉప్మా వాసన. నన్ను చూడగానే విరిసిన నవ్వులు స్వాగతం చెపుతూ ఉంటే మనసుకు హాయిగా అనిపించింది.

ఈ మధ్య బయట ఆహ్వానించే వాళ్ళని కూడా అద్దెకు మాట్లాడుతున్నారు. అసలు దగ్గరి వాళ్ళ పెళ్ళికి వెళ్ళినా దూరపు పెళ్ళికి పోయినట్లే ఉంటుంది. మెల్లిగా లోపలికి వెళ్లాను. ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వి కుర్చీ వేసింది. పచ్చటి చీరకు గులాబి రంగు బార్డర్, లేని నడుముకు అతకక జారిపోతున్న వడ్డాణం, వంకీలు బ్యూటీపార్లర్ రంగులు లేక స్వచ్చంగా విరిసిన తామర పువ్వులాగా ఉంది.

కాని నాకు మాత్రం బొమ్మల పెళ్లి చూస్తున్నట్లే ఉంది. అబ్బాయి ఈడు జోడు బాగానే ఉన్నాడు. ఎవరిని పరిచయం చేసినా కలివిడిగా నవ్వుతూ పలకరించాడు. తాళి కట్టిన తరువాత అక్షితలు వేసి స్టాఫ్ అందరి తరుపున ప్రెషర్ కుక్కర్ ఇచ్చి వచ్చేసాను. అందరు గుమ్మం బయటి దాకా వీడుకోలు చెప్పారు. మళ్ళా స్వీట్ వాసన తీపి కబురుతో పాటు.... అమ్మమ్మ అవుతున్నాను అనే ఆనందం ఇంత బాగుంటుందా?”

“అంత చిన్న పిల్లకి అప్పుడే పిల్లలా?” ఉండబట్టలేక అడిగేసాను.

“అయ్యో అలా అనకండి మేడం. ఆ బాబు మా అమ్మ పుడుతుంది అని ఎంత సంతోషంగా ఉన్నాడో. మా అమ్మాయిని నెత్తిన బెట్టుకొని చూసుకుంటున్నాడు.” ఎందుకో తన సంతోషం చూస్తే నాకు కూడా సంతోషం వేసింది.

నిజమే చిన్న పిల్ల అనేది తప్పిస్తే ణా మనసులో కూడా ఏ అడ్డంకి లేదు. ఏ ఆడపిల్లకైనా కావాల్సింది భర్త, పిల్లలతో సుఖంగా ఉండటమే కదా...రోజులు గిర్రున తిరుగుతున్నాయి. రంగుల రాట్నంలో పిల్లలు లాగా మనం కూడా కాలంతో.... అబ్బాయి పుట్టాడు. బారసాల కు పిలుపు వచ్చింది. వెళ్లాను మళ్లా అదే షామియానా.

లోపలికి వెళితే బాబుకు పాలు ఇస్తూ ఉంది. ఆ తృప్తి కోసం తన మొహంలో వెదికాను. కాని ఏదో లోపం. పెదాల మీద పాలిపోయిన నవ్వు, వానలో తడిసి వెలిసిపోయిన రంగుకాగితాల్లాగా. “ఏమైంది?” అడగ పోయేసరికి వాళ్ళ ఆయన వచ్చి చేతిలో కాఫీ పెట్టాడు. మగవాళ్ళ చేత మర్యాదలు చేయించు కుంటున్నందుకు నోచుకున్నాను.

“పర్వాలేదు మేడం, కావ్య లేవలేదు. అత్తమ్మ బయట పనిలో ఉంది.నాకు మాత్రం ఎవరు ఉన్నారు వీళ్ళే కదా” ఎంత చక్కని సంస్కారం.

నిజంగా కావ్య అదృష్టవంతురాలు. చిన్నగా నవ్వింది కావ్య. బాబుకు “చేతన్” అని పేరు పెట్టారు. తీసుకెళ్ళిన బట్టలు, ఉంగరం ఇచ్చి ఆశీర్వదించి వచ్చాను. బాబు చక్కగా ముద్దుగా ఉన్నాడు. పర్వాలేదు విజయకు ఇంక కష్టాలు లేవు అనుకున్నాను. కష్టాలు లేకపోతే తనను తలుచుకోరని దేవునికి అనుమానం. అందుకే ఏదో ఒకటి సమస్యను తెస్తూనే ఉంటాడు. కావ్య భర్త కి ఆక్సిడెంట్. అక్కడే మరణించాడు.

విషయం వినగానే విజయ స్పృహ తప్పి పడిపోయింది. అందరం కష్టపడి మెలుకువ వచ్చినాక ఇంటికి తీసుకెళ్ళాము. ఎవరు మాత్రం చేసేది ఏముంది..... ఒక పక్క వాలిపోయి కావ్య, అసలు ఆ ఇంటిలోని దైన్యం చూస్తే పగ వాళ్లకు కూడా వద్దు ఈ శాపం. అదిగో అన్ని క్రతువులు అయిపోయాయి. భోతిక శరీరం అగ్నిలో కలిసిపోయింది. ఇక మిగిలింది ఒకే క్రతువు. అమ్మాయికి మాంగల్యం, బొట్టు, గాజులు తీసెయ్యడం. దాని తరువాత కావ్య మొహం.... చిన్న పిల్ల నీటిలో తళుక్కు మనే నక్షత్రం లాగా నవ్వే పిల్ల, ముద్దబంతి పూవు లాంటి ముచ్చటైన మొహం అన్నీ తీసేసి దైన్యంగా...ఛా..... ఊహించుకోలేకపోయాను.

ముందు మాంగల్యం తీసేసారు. విజయ బోరు మంటూ శోక సముద్రంలో విలవిల లాడుతూ... కావ్య మాత్రం నిర్లిప్తంగా ఉంది. నన్ను కాదు చేసేది అన్నట్లు. బాబుని దూరంగా ఎవరో ఎత్తుకొని ఉన్నారు. పూలు కూడా తీసేసారు ఇక బొట్టు... ‘వద్దులే, పసి బిడ్డ.... అనీ తియ్యవాకండి.’ ఎవరో అన్నారు. మానవత్వం మిగిలే ఉంది...చిన్నగా గుస, గుస లోకం తెలిసిన వాళ్ళు చెప్పుకుంటూ “పసిబిడ్డ. మళ్ళీ పెళ్లి చేస్తారు. ఎందుకులే ఉండనియ్యండి.

మాంగల్యం తీసేస్తే చాలు పర్వాలేదు. ఆడవాళ్ళు మరీ మూర్ఖంగా లేరు. అంతే ఆరోజు వచ్చేసాను తరువాత ఇక వెళ్ళలేదు. ఎప్పుడైనా బాబుని విజయ ఆఫీస్ కి తీసుకొని వస్తూ ఉండేది. లంచ్ టైం లో విజయ వచ్చి ణా టేబుల్ దగ్గర కూర్చుంది. గంబీరపు నీడలు విషయ సాంద్రతను సూచిస్తూ.... ఏమి అయి ఉంటుంది? చెప్పు విజయా....సూటిగా విషయం కి వచ్చేస్తూ. “ఏమి లేదు మేడం, కావ్య కి మళ్ళా పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాను.

ఎదిగిన అరటిగెల లాంటి పిల్ల మోడుగా జీవితాన్ని గడుపుతుంటే మనసు తరుక్కొని పోతుంది. బాబుని కావాలంటే నేను సాకుతాను”

“మరి చెయ్యి దానిలో ప్రాబ్లెం ఏమిటి? సంబంధాలు చూడాలా?” అడిగాను.

“లేదమ్మా, ఆడి ఏదో మనసులో పెట్టుకుంది. చెప్పమంటే చెప్పదు. పెల్లిమాట ఎత్తితే చచ్చిపోతాను అంటుంది. నాకు మాత్రం చనిపోయిన పిల్లాడి మీద అభిమానం లేదా చెప్పండి. కాని పోయిన వాళ్ళతో మనం పోలేము కదా. మొగ దిక్కులేని సంసారం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు, మీరు అయినా దానితో మాట్లాడండి అమ్మ” చెప్పింది.

“సరే రేపు సాయంత్రం నేను పిలుస్తున్నాను అని చెప్పి ఇంటికి పంపు. పనిలో సహాయం చేయడానికి అని చెప్పు” చెప్పి పంపేసాను, ఏమై ఉంటుంది అని ఆలోచన. కాలింగ్ బెల్ మోగితే తీశాను. కావ్య....”రాకావ్య” లోపలి వచ్చింది. మునుపటి హుషారు లేదు.

ఏదో దిగులు లోపలి నీడలను ముఖంపై ప్రస్పుటిస్తూ...కాఫీ పెట్టుకొని వచ్చి ఇచ్చాను. తాగుతూ ఉంది. ఇంతకు ముందు మాట్లాడే గల గల సందడి మూగపోయి నిలుచుంటే గుండె కోసేసినట్లు, లేత పక్షి రెక్కలు తెంపి వేసినట్లు. “చేతన్” ఎలా వున్నాడు?” ముభావంగా చెప్పింది.

లాభం లేదు విషయంలోకి రావాల్సిందే. “కావ్య ఒక విషయం చెపుతాను అర్థం చేసుకో” అన్నాను. “పెళ్లి విషయమే కదా? అనుకున్నాను అమ్మ మీ దగ్గరకు వెళ్ళమన్నప్పుడే” తల వంచుకొని ఉంది.

“అయితే చెప్పు కావ్య. ఊరకే ఉంటే మనసులో మాట ఎలా తెలుస్తుంది? “లేదు ఏమీ లేదు..... చేసుకోను అంతే” గొంతులో స్థిరత్వం...కాని ఎందుకో ఆ పదాల వెనుక ఏదో నీలి నీడ మెరుస్తూ... దగ్గరకు వెళ్లాను. కావ్యా నిన్ను చాలా ఏళ్ల నుండి చూస్తున్నాను. ఇంత మొండి మనస్తత్వం నీకు ఎప్పుడు లేదు.

ఏమైందమ్మా” లాలనగా తల మీద చేయి వేసి నిమురుతూ అడిగాను.

అప్పుడు బద్దలు అయింది గడ్డ కట్టిన మౌనం....కన్నీళ్ళుగా జల జలా కారుతూ, మౌనపు రేకులు ఒక్కొక్కటిగా విప్పుతుంటే గుప్పుమన్న కన్నీటి వాసన....ఒక్కో దృశ్యాన్ని నా కాళ్ళ ముందు నిలుపుతూ....

“ఏమిటి కావ్య ఏమి మాట్లాడవు? సిగ్గా?” మొదటి మాట భర్త నుండి మొదటి రాత్రి విన్నప్పుడు సిగ్గు ఇంకా రెట్టింపు అవుతూ.... “అవును ఇంత అందగత్తేవి, ఎవరూ నీకు లైన్ వెయ్యలేదా?” ఉలిక్కిపడి తల ఎత్తింది.

“ఏమిటి పెద్ద రోషం...ఇవాళ రేపు ఎవర్నీ నమ్మేట్లు లేదు” సన్నగా నువ్వు వెనుక కనపడే తోడేలు నీడ. అసహ్యంతో నిండిన శరీరం ప్రాణం చచ్చిపోయి అర్పిస్తూ... ఆడి మొదలు...క్షణం క్షణం చచ్చి బ్రతకడమే. పాలోడి తో మాట్లాడితే తప్పు, కూరలు వాడితో మాట్లాడితే నేరం....

ఎవరో ఒకరితో వరుసలు కలుపుతూ సూదులు గుచ్చిన క్షణాలు మౌనంగా రెప్పల వెనుక దాచుకుంటూ, అమ్మని బాధ పెట్టకూడదని మోసం చేస్తూ, .....వేకిల్లు చూపించాయి కాలిన గాయాలు, సున్నితంగా విచ్చి వెలుగును చూసి సుతారంగా తల ఊపి నవ్వాల్సిన మొగ్గ రాక్షసుడి వికృత విన్యాసాల పాదం కింద రేకులుగా నలిగి....

కన్నీటి చుక్కలుగా. మనసు ఆపుకోలేక “నా తల్లి ఎంత బాధను అదుముకున్నావే” అని దగ్గరకు తీసుకొని ఘోల్లుమన్నాను. కౌగిట్లో ఒదిగిపోయి మనసులోని బాధను దాచిన దుఖాన్ని బయటకు పంపించింది. “ఇప్పుడేమి చేస్తావు చెప్పు? నేను నీకు తోడూ ఉంటాను” చెప్పాను.

“లేదాంటి ఆడవాళ్ళు ఏమి అంత కొవ్వు పట్టి లేరు. నాకు ఈ జీవితం మీద విరక్తి వచ్చేసింది. కాకుంటే బాబు కోసం నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను. కంప్యూటర్స్ నేర్చుకుందాము అనుకుంటున్నాను” చెప్పింది.

“సరే చేర్పిస్తాను. మీ అమ్మతో నేను మాట్లాడుతాను” చెప్పాను తన నుదుట కుంకం దిద్ది...ఎందుకు ఉదయించే సూర్యుడి లాగా ఉన్న తన నుదుటన అది ఉండాలి అనిపించింది.