Facebook Twitter
జీవిత సహచరి

 

జీవిత సహచరి

 

 

విశాఖపట్నం లోని బీచ్ రోడ్ లోంచి, భీమిలీ వైపు దూసుకుపోతోంది, శ్రీహరి ఎక్కిన టాక్సీ... పదిరోజుల క్రితమే సింగపూర్ నుండి వచ్చిన శ్రీహరి, ముంబయి లో బిజినెస్ పన్లు చూసుకొని, తన మిత్రుడు అమర్ ను కలవటం కోసం వైజాగ్ వచ్చాడు. అమర్ ది విశాఖపట్నం పక్కనే ఉన్న భీమిలి. చెన్నైలో ఉద్యోగ విరమణ చేసిన తరువాత తన ఊరిలోనే స్థిరపడిపోయాడు. ఏడాది క్రితం అతని భార్య పోయిందన్న సంగతి ఇటీవలే తెలిసిన శ్రీహరి చాలా బాధ పడ్డాడు. అందుకే, రెండు రోజుల క్రితమే సింగపూర్ కి వెళ్ళిపోదామని అనుకున్నవాడు కాస్తా, అమర్ ను కలవటానికని తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు.

అకస్మాత్తుగా కారు వేగం తగ్గటంతో, “ఏమైంది?” డ్రైవర్ ను ఉద్దేశించి అడిగాడు, శ్రీహరి.   “ఏటైనాదోనండి మరి, చూడాలి...” అంటూనే రోడ్ పక్కగా కారాపి, దిగి చూసి, “సారీ సార్, టైర్ పంచర్ అయిపోనాది... స్టెప్నీ ఉన్నాదిలెండి...మీరు కారు దిగమాకండి బాబూ, పావుగంటలో పనైపోతాది...” అంటూనే కావలసిన సామాన్లు డిక్కీ లోనుంచి తీసుకొని పనిలోకి దిగాడతను. ఏమీ తోచక తాను కూడా కారు దిగి నిలబడ్డాడు, శ్రీహరి.    సాయం సంధ్య తన నీరెండ చీర కొంగును నీలి సముద్రం మీద అలవోకగా కప్పేసిందేమో, నారింజ రంగులు సంతరించుకుంటున్న సాగరం వింతసొగసులతో మెరిసిపోతోంది. రెండు నిమిషాలకో సారి, ఏదో ఒక వాహనం రివ్వున దూసుకుపోతోందా దారిలో...

సాగర సౌందర్యాలు గమనిస్తూ, టీ తాగాలనిపించి, అక్కడికి దగ్గర్లోనే ఉన్న బడ్డీ కొట్టు వైపుగా నడిచాడు, శ్రీహరి. అతను కొంచెం ఇటుగా రావటంతో, అప్పటికి ఏకాంతం దొరికిన డ్రైవర్ సింహాచలం తన జేబులోంచి సెల్ ఫోన్ తీసి, భార్యకు ఫోన్ చేసాడు. గాలివాటుకు అతని మాటలు శ్రీహరికి అస్పష్టంగా వినిపించసాగాయి...

“ఏటే బంగారమా, ఫోను సెయ్యలేదని కోపమొచ్చీసినాదేటి? మజ్జానం నుంచీ, టయిం దొరకనేదే... బండి నడుపుతానే ఉండిపోనాను.... ఇదిగో, ఈ అయ్ గార్ని బీమిలిలో ఒగ్గేసి, రేత్తిరి తొమ్మిదయ్యేతలికి ఇంటికొచ్చేత్తానుగా... దూరమేలేయే... దూరం దూరమని బేరాలొదిలీసుకుంతే డబ్బులెలాగొత్తాయి? నువ్వు నాకోసం తెలివేసి కూచోకుండా, మాయమ్మ ఇంత ముద్దెడితే తినేసి నిద్దరపో... అసలే ఉట్టి మడిసివి కూడా కాదు...” మాట్లాడుతూనే చకచకా టైర్ మార్చి, శ్రీహరి వైపు అయిపోయిందన్నట్టు సైగ చేసాడు. చేయి ఊపి టీ తాగటానికి రమ్మని పిలిచాడు, శ్రీహరి. అతను టీ తాగుతుంటే, “ఎవరితోనోయ్ మాట్లాడుతున్నావ్, మీ ఆవిడా?” అనడిగాడు, నవ్వుతూ...

“అవునండి, దానికి ఊళ్ళో బేరాలు కాకండా, ఇలా దూరం ఎల్తే నచ్చదండి...సాయంత్రమయ్యేతలికి ఇంటికి ఎల్లకపోతే ఊరుకోదు. జట్టీ యెట్టేస్తది. నేనంటే పేణం దానికి...” ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు, సింహాచలం.

“పెళ్ళాలంతా అంతేలే, వట్టి సెంటిమెంటల్ ఫూల్స్...” తనూ నవ్వాడు, శ్రీహరి.
భీమిలీ ఊరి చివరనున్న అమర్ బంగ్లా దగ్గరకు చేరేసరికే బాగా చీకటి పడిపోయింది. గేటు దగ్గర ఉన్న గూర్ఖాకు తానెవ్వరో చెబితే, అతను ఇంటర్ కమ్ లో అమర్ తో మాట్లాడి, గేటు తెరిచాడు. ఇంటి ముందు కారు ఆగగానే, ఇద్దరు నౌకర్లు పరుగుపరుగున వచ్చి, శ్రీహరి చేతిలోని సూట్ కేసును అందుకున్నారు. వరండాలో నిలబడి, ఆత్రంగా ఎదురు చూస్తున్న అమర్, శ్రీహరి క్యాబ్ లోంచి దిగగానే ఒక్క ఉదుటున ముందుకు వచ్చి, సజల నేత్రాలతో అతన్ని కౌగలించుకున్నాడు. ఆ పరిష్వంగం లోని ఆత్మీయానురాగాలను ఆస్వాదిస్తూ, “అమర్...అమర్...” అన్నాడు, ఆర్తిగా శ్రీహరి. ఏదో తెలియని ఉద్వేగంతో భారమైపోయింది అతని గొంతు.

క్యాబ్ ను పంపించేసి, మిత్రుడి భుజాల చుట్టూరా చేయివేసి, ఆప్యాయంగా నడిపిస్తూ, ఇంటిలోపలికి తీసుకు వెళ్ళాడు, అమర్. ఇద్దరూ హాల్లో సోఫా మీద పక్కపక్కనే కూర్చున్నారు. అమర్, శ్రీహరి చేయిని వదలకుండానే...పనిమనిషిని పిలిచి మంచి నీళ్ళు తెప్పించాడు. హాలంతా కలయజూస్తున్న శ్రీహరి చూపులు ఎదురుగా కనిపిస్తున్న ఫోటో మీద ఆగిపోయాయి. లైఫ్ సైజ్ లో ఎదురుగా సజీవంగా నిలబడినట్టే ఉంది, భవానీ రూపం. నుదుట గుండ్రంగా తీర్చిదిద్దిన ఉదయ భానుడి లాంటి కుంకుమ బొట్టుతో, కళకళ లాడే పూర్ణ చంద్రబింబం వంటి ప్రసన్న వదనంతో, లక్ష్మీదేవిలా చిరునవ్వుతో చూస్తోందామె. ఆ ఫోటోకి వేసి ఉన్న గుబాళించే గులాబీల దండ, నిశ్చలంగా స్టాండ్ లో వెలుగుతున్న దీపకళిక, సుగంధ ధూపాలు వెదజల్లుతున్న అగరు వత్తులు మాత్రం, ఆమె స్వర్గస్థురాలైందని అన్యాపదేశంగా చెబుతున్నట్టున్నాయి.

“చూడరా... చూడు...హరీ... నా భవానీ నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది...” శ్రీహరి భుజమ్మీద తలపెట్టుకొని ఒక్కసారిగా భోరుమన్నాడు, అమర్.  చెట్టంత మనిషీ అలా కుదేలైపోయి కుమిలిపోతుంటే, శ్రీహరి గుండె చెరువైపోయింది...

“ఛ! ఊరుకోరా... ఇదేమిటీ చిన్నపిల్లాడివా? పుణ్యాత్మురాలురా... పిలుపు వచ్చింది, వెళ్ళిపోయింది... ఇవ్వాళ తను, రేపు మనమైనా అంతే కదరా?” మెత్తని మాటలతో మిత్రుణ్ణి ఓదార్చసాగాడు, శ్రీహరి.
“ఒరేయ్ హరీ, రాక రాక నా దగ్గరకు వచ్చావు... ఒక్క రెండురోజులు నాతోనే ఉండి వెళ్ళవూ, నేను నీతో చెప్పుకోవలసినవి చాలా ఉన్నాయి...” దిగులుగా అడుగుతున్న మిత్రుడిని చూస్తూంటే మనసు మూగవోయింది, శ్రీహరికి. అప్రయత్నంగా తలూపాడు, అంగీకార సూచకంగా.

“రారా, భోజనం చేద్దాం... ఎప్పుడనగా తిన్నావో, ఏమిటో... ఆ...పైడమ్మా, వంటంతా పూర్తయిందా? త్వరగా ఏదైనా స్వీట్ చెయ్యి...” అంటూ హడావుడి పడుతున్న అమర్ ను పరిశీలనగా చూసాడు శ్రీహరి.  అధికారిక హోదా తెచ్చిన ఠీవితో, నిండుగా, ఆరోగ్యంగా ఉండే ఆజానుబాహుడైన అమర్, ఈనాడు ఒరుగులా ఎండిపోయినట్టైపోయాడు. ప్రతిరోజూ మద్యం సేవిస్తున్న సూచనగా, కంటి కింద నల్లని వలయాలు, ‘ఉబ్బు సంచులు’ ఏర్పడ్డాయి. ముఖంలో జీవకళ అసలే లేదు. ‘భవానీ మరణం వీడిలో ఇంత శూన్యాన్ని సృష్టించిందా?’ బాధగా అనుకున్నాడు, శ్రీహరి.

భోజనాలు పూర్తయ్యాక, బాల్కనీలో కూర్చున్నారు మిత్రులిద్దరూ... ఎదురుగా అనంత జలరాశి... అమావాస్య దగ్గర పడుతున్నదేమో, సాయంత్రం అంతగా మనసును అలరించిన సింధువే, ఇప్పుడు చిమ్మ చీకట్లో నల్లని భూతంలాగా కనిపిస్తూ, భయోత్పాతాన్ని కలిగించేలా ఉంది. ఆ కెరటాల హోరు ఓ ఉన్మాదపు స్త్రీ దుఃఖంతో చేస్తున్న హాహాకారాల్లా వినిపిస్తోంది.

    “ఏరా, అమర్ ఏమిటిలా అయిపోయావు? భవానీ మీద బాగా బెంగ పెట్టుకున్నావు కదూ?” లాలనగా అడిగాడు, శ్రీహరి.

    “అవునురా, హరీ... భవానీ విలువ తను ఉన్నప్పటికన్నా, వెళ్ళిపోయాకే నాకు బాగా తెలిసింది. ‘పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు’ అన్నారు ఆత్రేయ గారు. కానీ బ్రతికున్నప్పుడు కూడా భవానీ మంచిదే. ఆ మంచితనాన్ని గుర్తించలేని గుడ్డివాణ్ణయ్యాను నేను. నిజానికి భవానీ అనారోగ్యంతో మరణించిందని అనే కన్నా, నిర్లక్ష్యంతో హత్య చేయబడిందని అనటమే మేలు... ఆ హంతకుడిని నేనే...” అపరాధిలా తలదించుకున్నాడు, అమర్.

“ఏమిట్రా, నీ పిచ్చికాని...కాలం తీరిపోయింది, చెల్లాయి వెళ్ళిపోయింది... అంతే! ప్రతీదీ నీకు ఆపాదించుకొని,  మానసికంగా క్రుంగిపోతే ఎలారా? గుండె దిటవు చేసుకొని, ఆ విషాదం లోంచి బయటపడకపోతే చాలా కష్టం కదరా?” అనునయించాడు, శ్రీహరి.

    “హరీ... నా మనసును చాలా కాలంగా కొండంత బరువు అదిమివేస్తోంది. అది ఎవ్వరి దగ్గరా విప్పి చెప్పేది కాదు. నీకు మాత్రం చెప్పాలని అనిపిస్తోందిరా... వింటావా?”

“అమర్, నిన్ను ఈ దుఃఖ భారం లోంచి లాగేందుకు ఏమైనా చేస్తానురా, చెప్పు... వింటాను...”
***
“హరీ, భవానీకి కాన్సర్ అని, త్వరలో ఆమె నాకు దూరమైపోబోతుందన్న విషయం తెలిసిన క్షణాన నేను మంచులా ఘనీభవించిన సముద్రాన్నే అయిపోయానురా...నా మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది. తనకు చికిత్స చేస్తున్నా, అది కేవలం తాత్కాలిక ఉపశమనం కోసమేనని, చివరి రోజుల్లో తను ఎంతో ప్రశాంతంగా ఉండాలని డాక్టర్లు చెప్పారు. అది విన్నాక నా మనసులో భరించలేని ‘అసహనం’... ఏమీ చేయలేని ‘అసహాయత’...అసలే నాకు కోపం చాలా ఎక్కువ అని నీకు తెలుసుగా? పిల్లలు ఇద్దరూ మన దేశంలో లేరు... ఇక్కడ మేము ఇద్దరమే... ఇంకొన్నాళ్ళు పోతే...నేను ఒక్కడినే... ఇలా చేయటం ఆ దేవుడికి న్యాయమేనా? ఏదో తెలియని ఉక్రోషంతో దేవుడి గదిలోకి వెళ్ళి, ఆయనపై గట్టిగా అరిచాను... నిలదీసాను... ఏడ్చాను... భవానీ తన ఆరోగ్య పరిస్థితి తనకు తెలిసి కూడా ధైర్యంగానే ఉంది కాని, నేను మాత్రం అలా ఉండలేకపోయాను.

    ఉదయం కాసేపు, సాయంత్రం కాసేపు...భవానీ గదిలో తన దగ్గరే పెద్ద విషాద పర్వతాన్ని మోస్తూ కూర్చునే వాడిని. భవానీయే ఏవో కబుర్లు చెబుతూ ఉండేది కానీ అవి నా మనసుకు ఏ మాత్రం ఉల్లాసాన్ని కలిగించేవి కాదు... ఒక రోజు రాత్రి భవానీకి ‘గుడ్ నైట్’ చెప్పి, ఆమెను చూసుకునే పైడమ్మకు జాగ్రత్తలు చెప్పి, నా గదిలోకి రాబోతుంటే, నన్ను వెనక్కి పిలిచిన భవానీ నాకు ఓ కేసెట్ ఇన్ సర్ట్ చేసిన తన పాకెట్ టేప్ రికార్డర్ నా చేతికిచ్చి, వినమని కోరింది.

    భవానీ దగ్గర ఎప్పటెప్పటివో ‘ఆడియో కేసెట్స్’ ఉండేవి. వాటిని ఎప్పుడూ తన మినీ టేప్ రికార్డర్ లో పెట్టుకొని వింటూ ఉండేది. ఎంపీత్రీ లు, డీవీడీ ప్లేయర్లు వచ్చిన తర్వాత కూడా వెనుకటి కాలం లో లాగ ఈ కేసెట్లేమిటని ఆమె మీద విసుక్కునే వాడిని.

‘ఇప్పుడు ఈ కేసెట్ లో ఏముందో?’ అనుకుంటూ, ‘ప్లే’ బటన్ నొక్కాను.
నిశ్శబ్దంగా తిరుగుతోంది టేప్... రెండు నిమిషాలు గడిచాయి... ఏం రావటం లేదు... అసహనంగా ఆఫ్ బటన్ నొక్కబోతుండగా భవాని గొంతు వినిపించింది.

‘అమ్మూ!’ మృదు మధురంగా వినిపించిన ఆ పిలుపుకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను నేను.
“అమ్మూ... అబ్బ, ఎంతకాలమైంది అమ్మూ, నిన్నిలా పిలిచి? నన్ను మనసారా ప్రేమించి, నన్ను స్వంతం చేసుకోవటం కోసం తన అమ్మానాన్నల్ని సైతం ఎదిరించిన నా ప్రేమికుడిని నేను ముద్దుగా పిలుచుకొనే పేరిది.  చాలా కాలంగా నా మనసులో పేరుకుపోయి, నోరు తెరిచి ఇప్పటివరకూ నీకు చెప్పలేకపోయిన విషయాలను ఇప్పుడు చెప్పుకోవాలని అనిపిస్తోంది. దయచేసి, ఈ టేప్ చివరివరకూ వింటావు కదూ?

    ఎంత బాగుండేవి అమ్మూ, ఆ రోజులు? ఒకరి కళ్ళలోకి మరొకరం చూసుకుంటూ, ఒకరి కోసం మరొకరమై బ్రతికిన ఆ బంగారు రోజులు... పిల్లలు పుట్టే వరకూ మన అనురాగం అలా అపురూపంగానే ఉన్నది.  నాకోసం నువ్వు అల్లాడిపోయిన ఆ రోజులను తలచుకుంటే, ఇప్పటికీ అదే ఇష్టం తో నా మనసు పులకరిస్తోంది.  ఆ రోజులలో అలా రెప్పవేయకుండా నీవు నా వైపే చూస్తూంటే, నీ కళ్ళలోంచి ప్రేమ సుధాధార ఉవ్వెత్తున పొంగి, పొరలి నన్ను తడిపివేసేది.

    వింటావు తర్వాత నీ ఉద్యోగంలో నువ్వు మెల్లగా ఎదగటం మొదలైంది. పదోన్నతులకోసమని ఎప్పుడూ పరీక్షలకు చదువుకోవటం, ఇంటర్ వ్యూలకు తయారవటం... వీటితో చాలా శ్రమ పడుతూ ఉండేవాడివి. నువ్వు చదువుకొనేటప్పుడు నీతో కలిసి నేనూ మేలుకొని ఉండటం, నీకు నిద్ర రాకుండా ఉండేందుకు ‘టీ” కాచి ఇవ్వటం లాంటి పనుల్లో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేదాన్ని. నీ నిరంతర కృషి ఫలితంగా వరుసపెట్టి నీకు ప్రమోషన్లు రావటం మొదలైంది.

    నీ హోదా, అధికారం పెరిగే కొద్దీ, నువ్వు నాకు మెల్లమెల్లగా దూరమవటమనేది ఆరంభమైంది. అసలు నీ ప్రమేయమంటూ ఏమీ లేకుండానే అలా జరిగిపోయింది. నువ్వు నీ సిబ్బందిపై చూపించే ‘అధికారం’ ఇంట్లో కూడా ఆరంభమై, ‘మమకారం’ మరుగున పడిపోవటం మొదలైంది. ఇంట్లో నువ్వున్నంతసేపూ, నేను నీ చుట్టూనే తిరుగుతూ, నీకు కావలసినవన్నీ అమర్చుతూ, నీకు ఇష్టమైన వంటకాలు వండి, కొసరి కొసరి తినిపిస్తూ ఉండేదాన్ని. నీ పనుల వత్తిడికి, ఆఫీసులోని సమస్యలకూ నీలో కోపం, అసహనం బాగా పెరిగిపోయేవి. ఏ విషయంలోనైనా సరే, అడిగినది వెంటనే చేయకపోయినా, కావలసినది తక్షణమే అందించకపోయినా కోపంగా గట్టి గట్టిగా అరిచేయటం, చేతిలోని వస్తువులను విసిరికొట్టటం మొదలుపెట్టావు... ఒళ్ళు తెలియని కోపంలో ఒక్కోసారి నా మీద చేయి చేసుకోవటం కూడా...

    సారీ అమ్మూ! నేను నిన్ను నిందించటం లేదు... నా ఆవేదన చెబుతున్నానంతే... అప్పట్నుండీ నాకు నీ మీద ఉన్న ప్రేమ, ఆరాధనలతో పాటుగా వాటిని అధిగమించేంత అధికమైన భయం, బెంగ కూడా మొదలయ్యాయి.

    మన పిల్లలను నువ్వు క్రమశిక్షణ పేరుతో, ఏనాడూ నీ దగ్గరకు రానీయలేదు. అందుకే, ఇప్పుడు వాళ్ళిద్దరూ విదేశాల్లో స్థిరపడిపోయి, మనలను తలవటం కూడా మానేసారు... అయితే, నీ కాఠిన్యం వల్ల మాలో చనువు తగ్గిపోయి, భయం మొదలైంది.  నీ చుట్టూ, నువ్వొక ‘వలయం’ గీసుకొని అది దాటి బయటకు నువ్వు రాకుండా, మమ్మల్ని లోపలికి రానీయకుండా ఉంచటం... ‘కూడనిది’ అని చెప్పాలని నేను ఎంత ప్రయత్నించినా నువ్వా అవకాశం సైతం ఇచ్చేవాడివి కాదు.

    అసలు మన అలవాట్లేమో పరస్పర విరుద్ధాలు... నాకేమో రాత్రి పదిగంటలకల్లా పడుకొని, తెల్లవారు ఝామునే లేవటమంటే చాలా ఇష్టం, అలవాటు. నీకేమో రాత్రంతా కంప్యూటర్ లో పని చేసుకొని, ఉదయం ఆలస్యంగా లేచి హడావుడిగా ఆఫీసుకు పరుగు తీయటం అలవాటు. ఇంటి పనులయ్యాక, కాస్త సమయమంటూ దొరికితే, ఏదైనా పుస్తకం చదవటమో, లేక పాటలు వినటమో నాకు అలవాటు... నీకైతే సమయం దొరకటమే అపురూపం, దొరికినా టీవీకి అతుక్కుపోవటమంటే చాలా ఇష్టం.

    నీకు విపరీతమైన కోపం... కోపమంటే కేవలం అరవటమే కాదు... ఆ పనైపోయాక, రోజుల తరబడి మాటలు మానేస్తావు. అసలు నువ్వు ఎందుకు ముభావంగా ఉన్నావో, నా అపరాధమేమిటో తెలియదు, తెలియనీయవు. ఆ ముభావత ఎన్నిరోజులు కొనసాగుతుందో కూడా తెలియదు. మాటకలపబోతే కసిరి కొడతావు. జన్మ జన్మల తరబడి మన మధ్య ఏదో బద్ధ శత్రుత్వం ఉన్నట్టే ప్రవర్తిస్తావు. ప్రసన్నంగా పలకరించబోతే, ‘ఒంటరిగా ఉండనీ’ అంటూ కస్సుమంటావు... నా మనసు ముడుచుకుపోతుంది, దుఃఖం ముంచుకొస్తుంది. అసలు నీ మూడ్ ఎందుకు పాడైందో, ఆఫీసులో ఏదైనా సమస్య వచ్చిందో ఏమీ చెప్పవు, నాకు తెలియనీయవు. మళ్ళీ నీ అంతట నీవు అందులోంచి బయటకు వచ్చి, మామూలుగా మారవలసిందే తప్ప, అందులోంచి నిన్ను లాగటం మాత్రం నా తరం కానే కాదు.

    ఆలుమగల మధ్యన ఉండవలసింది, ‘పరస్పర స్నేహం’ అమ్మూ... ప్రేమించి, పెళ్ళాడిన నీకు అది తెలియదా? ఉహు, తెలియక కాదు కానీ, ‘ఆగ్రహం’ అనే నీ పెద్ద బలహీనతను నీవు జయించలేకపోతున్నావు...అంతే...

    అలాగే, నేనెప్పుడూ నవ్వుతూ ఉంటాననీ, ఇంట్లో ఉండి రిలాక్స్ అయిపోతున్నాననీ, నువ్వేమో ఆఫీసులో ఉంది చాలా భారం మోసేస్తున్నావని నీకో పెద్ద ఫీలింగ్. నీకున్న వత్తిడి నాకు లేదని నా మీద ‘అసూయ’. నువ్వు ఆఫీసులో కష్టపడి జీతం సంపాదించి తెస్తున్నావు. నేను పిల్లల్ని పెంచుతూ, ఇల్లు చూసుకుంటూ, మీకు కావలసినవి అమరుస్తూ... నేను... నేను కూడా కష్టపడుతున్నాను అమ్మూ... ‘మనమిద్దరమూ ఒక్కటే...’ అన్న భావన నీకెందుకు కలగదు?

    నేను జడలో పూలు పెట్టుకుంటే పల్లెటూరి బైతునని ఎగతాళి చేస్తావు... చేనేత చీర కట్టుకుంటే పనిమనిషిలా ఉన్నానని వెక్కిరిస్తావు... కారణం అవి నీకు నచ్చవు కాబట్టి... పెళ్ళికి ముందు, నేను ఓ ‘అక్షరం’ వ్రాసినా అదో గొప్ప వాక్యమని నన్ను ఆకాశానికి ఎత్తేసిన నువ్వే...ఈ మధ్య నా కవిత ఒకటి పత్రికలో పడిందని చూపించబోతే చదవలేదు సరికదా, ‘తెలుగు పత్రికలకు ఎంత గ్రహచారం పట్టింది?’ అని వెటకారంగా ఓ నవ్వు నవ్వి, అక్కడినుంచి వెళ్ళిపోయావు... నీకు తెలుసా, ఆ క్షణం నేనెంత నరకయాతనతో విలవిలలాడిపోయానో... కాలం నీలో ఎంతటి రాక్షసుడిని పెంచింది?


    అసలు, అకారణంగా నువ్వు నన్ను తిట్టినా నీ దగ్గర సాధ్యమైనంత మౌనంగానే ఉంటాను... కోపం చల్లబడితే నువ్వే మామూలుగా అయిపోతావని... కానీ ఆ శాంతం కూడా నీకు నా బలహీనతలాగానే కనబడి, అదో ‘నిర్లక్ష్య ధోరణి’ అనుకునే స్థితికి వచ్చి, మాటల ఈటెలతో మరింతగా నన్ను బాధిస్తున్నావు. నిజానికి అపర దూర్వాసుడి లాంటి వాడి పెళ్ళాం కన్నా, పచ్చి తాగుబోతువాడి పెళ్ళామే ఒకింత అదృష్టవంతురాలు... ఎందుకంటే, తాగుడు వల్ల వచ్చే విపరీత ప్రవర్తన ఆ ‘మత్తు’ దిగేదాకానే... కోపిష్టివాడి వాచాలతో? అది నిత్యాగ్నిహోత్రం...మమ్మల్ని దహించేందుకు.

    నీ ఆఫీసు టూర్లు, మీటింగులు, సుపీరియర్లు, సబార్డినేట్లు... క్రమంగా నువ్వు ఎక్కే మెట్లు... ఈ ‘విజయపరంపర’ లో పయనిస్తూనే ఉన్నావు... నన్నూ నీతో ఉండనిచ్చావు... అయితే అది నీ సంతోషాన్ని నాతో పంచుకోవటం కోసం మాత్రం కాదు. నీ అవసరం కోసం.... నువ్వు క్యాంప్ కి వెళ్ళాలంటే, నేనే నీ సూట్ కేసును సర్దాలి... నీ ఆఫీసు ఫంక్షన్స్ లో నీ భార్యగా పక్కనే ఉండాలి... నీ స్టాఫ్ తో పిక్నిక్కులకు నేను కూడా రావాలి... అందరికోసం, పెదవులపై ప్లాస్టిక్ చిరునవ్వులు అతికించుకొని నటించాలి... ఇవన్నీ నీకోసం నేను చేయాలి...

    కానీ, నాతో గుడికి రమ్మంటే నీకు తీరిక దొరకదు. ఏదైనా ఊరు ఇద్దరం కలిసి వెళదామంటే నీకది బోర్ అంటావు. నా ఇష్టాలను మన్నించటమనేది నీకెప్పుడూ అయిష్టమే...

    ఎన్నెన్ని ఉదయాలు? చెన్నై లోని మన ఇంటి బాల్కనీలో కూర్చుని, పొగలు కక్కే కాఫీ రుచిని ఆస్వాదిస్తూ, సముద్రగర్భంలోంచి ఉదయించే బాలభానుడి సౌందర్యాన్ని  ఇద్దరం కలిసి చూడాలని, ఆ మధుర క్షణాలను హృదయంలో పదిలపరచుకోవాలని ఎంతగా తపించిపోయేదాన్నో తెలుసా నీకు? కానీ, ఆ ఆస్వాదన ఎప్పుడూ నే ఒంటరిగానే...

    ఇష్తమైన పాటను వినాలన్నా, నేనొక్కదాన్నే... మంచి పుస్తకం చదవాలన్నా, నేనొక్కదాన్నే... పిల్లలకు ఆరోగ్యం బాగుండకపోతే... హాస్పిటల్ కి వాళ్ళతో నేనొక్కదాన్నే... స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కీ నేనొక్కదాన్నే... చివరికి మన పుట్టినరోజులకూ, పెళ్ళిరోజులకూ ఇద్దరం కలిసి, ఏ అనాథశరణాలయానికో, వృద్ధాశ్రమానికో వెళ్ళి వాళ్ళకేమైనా ఇవ్వాలని నాకు అనిపిస్తే, అలాంటి ప్రదేశాలకి రావటం నీకు చికాకు కాబట్టి, నీ ఔదార్యం కొద్దీ నన్ను మాత్రం అభ్యంతరపరచవు కనుక అక్కడికీ, నేనొక్కదాన్నే...

    అసలు నేనంటే నీకు ప్రేమ లేదు... అదిగో వచ్చేసింది నీకు...కోపం... ఎదురుగా ఉంటే అనేవాడివి... ‘అదేమిటి భవానీ, నువ్వంటే ప్రేమ లేదా నాకు? నేనసలు నిన్ను ప్రేమించనే లేదా? ఎన్ని సార్లు నిన్ను డిన్నర్లకు బయటకు తీసుకు పోలేదు? ఎంతెంత విలువైన డైమండ్ నగలను కొనివ్వలేదు?’ అని. నిజమే, నీకు నేనంటే చాలా ప్రేమ.. చాలా చాలా ప్రేమ! నాకు బ్యాంక్ లో ఓ పదిలక్షల రూపాయల డిపాజిట్ ఉండి, ఏం లాభం చెప్పు, నా చేతిలో పదిరూపాయలు లేకపోయాక? నీ మనసులో నామీద ఎంత ‘ప్రేమ’ ఉండీ ఉపయోగమేమిటీ, దాన్ని నీవు ‘వ్యక్తపరచలేకపోయాక’? పదిమందితో పాటుగా నీ హోదాలో నన్ను స్టార్ హోటల్స్ కి తీసుకుపోయి తిండి తినిపిస్తే నాకు కలిగే ఆనందం కన్నా, ఇదిగో, ఈ బాల్కనీలో కూర్చుని పెరుగన్నంలో పచ్చడి నంజుకుంటూ ఇద్దరం ‘కలిసి’ తినటమే నాకు ఎనలేని తృప్తిని ఇస్తుంది.

    అసలు నిజానికి నువ్వో అద్భుత ప్రేమికుడివి. కాని, నువ్వు ప్రేమించేది నన్ను కాదు... ‘నిన్ను’! అవును నిన్ను నీవు ప్రేమించుకోవటమనేది నీకు చాలా ఇష్టమైన వ్యాపకం... నన్ను నీతో బయటకు తీసుకువెళ్ళాలని నీకు బలంగా అనిపిస్తే, ఆ సమయంలో నాకు ఇష్టం లేకున్నా, తీరిక లేకున్నా, అలసటగా అనిపించినా సరే... అది నీకిష్టమైన పని కనుక తీసుకెళ్ళి తీరతావు. అలా... ‘నన్ను నీవు ప్రేమిస్తున్నావు...’ అనే భావనను నువ్వు మరింతగా మనసారా ప్రేమిస్తున్నావు... నీ అంతరంగాన్ని సంతుష్టి పరచేందుకు మాత్రమే కాని నీ ఎదుటనున్న నాకోసం మాత్రం కాదు.

    ఇప్పుడు నీకు కోపం, బాధ కలుగుతున్నాయి... నాకు తెలుసు.... కాని... కాని ఒక్కసారి నీ మనిషిని అయిన నాగురించి, మనసుతో ఆలోచించు... అప్పుడు నీకు నా మీద అంతులేని ప్రేమ, ఆప్యాయత, కరుణలు కల్గుతాయి.. ఇన్నాళ్ళు నేనేం కోల్పోయానో అర్థమౌతుంది... నీ పదవీవిరమణ కోసం వేయి కళ్ళతో ఎదురుచూసాను. ఇన్నాళ్ళు నీ పని వత్తిళ్ళ వల్ల, ఊపిరాడని నీ దినచర్య వల్ల నాతో కలసి గడపలేకపోయావు.... ఇక ఫరవాలేదు... మనమిద్దరం, ఈ జీవనసంధ్యలో హాయిగా మళ్ళీ పాత రోజులను పొందవచ్చనీ, హాయిగా గడపవచ్చనీ ఎన్నెన్నో కలలు కన్నాను... ఆ ‘అదృష్టం’ ఎక్కడిదీ నాకు? నేను శాపగ్రస్తను అమ్మూ... అల్పాయుష్కురాలిని... ఏ జన్మలో ఏ పాతకానికి ఒడిగట్టానో మరి, ఆ మహా పాపం ఈ జన్మలో ఇలా కాన్సర్ రూపంలో నా ప్రాణాలు లాక్కెళ్ళిపోతోంది... నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను నాకు దూరం చేసేస్తోంది... భగవంతుడు ఒక్క అవకాశమిచ్చి, ఒక్క రెండేళ్ళైనా నన్ను నీతో ఉండనీయకూడదు? ఉహు, అది జరగదని సుస్పష్టంగా తెలిసినా ఏదో ఒక పిచ్చి ఆశ!

    ఒక ప్రార్థన అమ్మూ... ఒకరకంగా చివరికోరికని అనుకో... చంద్రుడిలోని మచ్చల్లా నీలో ఆ ‘ఆగ్రహం’, ‘అసహనం’... వీటిని సాధ్యమైనంతవరకూ నీలోనుంచి తొలగించుకోవటానికి ప్రయత్నించు... ‘ధ్యానాభ్యాసం’, నిరంతర సాధన చేయటం ద్వారా అది సాధ్యమే.. ఇప్పటివరకూ నా మాట వినకపోయినా, ఇప్పుడైనా దయచేసి మొదలుపెట్టు... ఎందుకంటే, రేపు నేను వెళ్ళిపోయాక, నిన్ను చూసుకోవటానికి మన బంధువులు కాని, నౌకర్లు కాని నిన్ను తిట్టుకుంటూ కాకుండా, నీ మంచితనం గుర్తించి, మనస్ఫూర్తిగా ముందుకు రావాలి... ‘నోరు’ మంచిదైతేనే కదా ఊరు మనదయేది? నీ కోపాన్ని భరించే శక్తి నీ ఇల్లాల్నైనందుకు నాకు మాత్రమే ఉంటుంది, కాని అందరికీ ఎందుకుంటుంది? అదొక్కటి గమనించుకో...

    చివరగా ఒక విన్నపం... ఈ అస్తమయ సమయంలో... నన్ను నొప్పించే విధంగా కాకుండా, కొంచెం సౌమ్యంగా, శాంతంగా ఉంటూ, సాధ్యమైనంత ఎక్కువ సమయం నాతో గడపవూ? అది నాకు ఎంతో సాంత్వన ను కలిగిస్తుంది అమ్మూ... నీ మెడ చుట్టూ నా చేతుల్ని హారం లాగా వేసి, నీ భుజమ్మీద తలవాల్చి, నీ చెవిలో గుసగుసగా చెప్పాలని ఉంది... ఐ లవ్ యూ! యస్... ఐ లవ్...యూ...” టేప్ లో మాటలు ఆగిపోయి, సన్నగా వెక్కిళ్ళు వినబడసాగాయి... భవానీ ఏడుస్తోంది... నా భవానీ దుఃఖిస్తోంది. ఆ తర్వాత టేప్ ఆగిపోయింది.

    అప్పుడు మొదలైందిరా హరీ, నాలో పశ్చాత్తాపం...నాలోని బలహీనతలను జయించి తీరాలన్న పట్టుదల కూడా... కాలాన్ని ఒక్కసారి ‘రీవైండ్’ చేయగలిగే వరాన్ని భగవంతుడు నాకు అనుగ్రహిస్తే, భవానీకి నాతో కలిసి నడిచిన దారంతా పూలబాటను చేయగలను... నాతో గడపిన జీవితమంతా ఆనంద లహరి చేయగలను... కాని... కానీ... ఇటీజ్ లేట్... టూలేట్!

    ఆ తర్వాత నేను ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయలేదురా హరీ... ప్రతీ క్షణం ఆమెతో ఆనందంగా గడిపాను... భవానీకి ఆనందం కలిగించే పనులన్నింటిలోను భాగాన్ని పంచుకున్నాను... ఆమె ఎప్పటినుండో వెళ్ళాలని అనుకుంటున్న ‘కన్యాకుమారి’ కి తీసుకు వెళ్ళాను... అక్కడినుంచి వచ్చిన వారం రోజుల తరువాత నిద్రలోనే ప్రశాంతంగా వెళ్ళిపోయిందిరా నా భవానీ...” సజల నేత్రాలతో చెప్పటం ముగించాడు, అమర్.

    వింటున్న  శ్రీహరి హృదయం ఎంతో ఆవేదనకు లోనయింది. ఆ విషాదగాథ వింటూ ఉంటే, అప్రయత్నంగా తన భార్య రమణి మనసులో మెదిలింది... తను మాత్రం, అమర్ కన్నా ఏ విధంగా మెరుగని? రమణి అభిరుచులన్నీ తనకు ‘సిల్లీ’గానే అనిపిస్తాయి...ఆమె ఇంటర్నెట్ లో పాత ‘చందమామ’లు చదువుకొంటూ ఉంటే అది తనకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది... చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటుంటే మూర్ఖత్వమనిపిస్తుంది... ఓహ్... ‘భార్యలు’ కూడా తమలాంటి వారేనన్న సత్యం భర్తలకు ఎందుకు తోచదు? తనలోనికి తాను తరచి చూసుకుంటూ, తల విదిలించాడు శ్రీహరి.

    “ఏమిట్రా హరీ, నీ స్నేహితుడి మీద నీకు చాలా అసహ్యంగా ఉంది కదూ?” పేలవంగా నవ్వుతూ అడిగాడు, అమర్. “ఛ! అదేంటి అమర్... ఆ మాటకొస్తే నూటికి డెబ్భయ్ శాతం భర్తలం అలాగే ఉంటాము... మన నాన్నల కాలం నుండీ అంతే... ఏది ఏమైనా, చివరికి నీ తప్పు నీవు తెలుసుకున్నావు... చివరి రోజుల్లో భవానీ మనసును ఆహ్లాదపరచావు... కానీ, జరిగినదానికి నీవు బాధపడుతూ, తాగుడుకు బానిస కావటమే నాకేమీ నచ్చటం లేదు... నువ్వు వ్యసనానికి లోనవటం భవానీకి నచ్చే విషయమా?” కించిత్ మందలింపుగా అన్నాడు, శ్రీహరి.

    “కాదులేరా, నా భవానీని మర్చిపోలేక, ఆమె లేదన్న బాధను తట్టుకోలేక తాగుతున్నానంతే... మానెయ్యటానికి ప్రయత్నిస్తానురా.. అయినా, ఇప్పటివరకూ నాలో  ఉండి, నన్ను తొలిచివేస్తున్న నా ‘అపరాధభావన’ అంతా నీతో చెప్పేసాక మనసు చాలా తేలికైపోయినట్టుందిరా... నేను ఇక్కడే మా పొలాలున్న స్థలంలో ఒక వార్థక్య ఆశ్రమాన్ని నిర్మిస్తున్నాను. అది పూర్తి అయ్యాక, అక్కడికే తరలి వెళ్ళిపోయి, నాలాంటి వారి మధ్యే, ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించాలని అనుకుంటున్నానురా...” చెప్పాడు, అమర్. మిత్రుడి నిర్ణయానికి ఎంతో సంతోషించాడు, శ్రీహరి.
***
    శ్రీహరి ప్రయాణిస్తున్న విమానం సింగపూర్ లోని ‘ఛాంగీ అంతర్జాతీయ విమానాశ్రయం’ లో ల్యాండ్ అవబోతోంది. త్వరగా ఇంటికి చేరుకోవాలనీ, తాను భారతదేశం నుండి తెచ్చిన ‘కానుక’ ను భార్యకు అందించి, దాన్ని చూడగానే ఆమె కళ్ళల్లో దేదీప్యమానంగా వెలిగే దీపావళి కాంతుల్ని తనివితీరా చూసి, మురిసిపోవాలని ఆరాటంగా ఉందతనికి... తన ఒడిలో ఉన్న హ్యాండ్ బ్యాగేజ్ లోని ‘శరత్ సమగ్ర సాహిత్యం’ పుస్తకాల బంగీని ఆప్యాయంగా తడుముకున్నాడు శ్రీహరి, తన రమణిని  ప్రేమగా తలచుకొంటూ...

 - నండూరి సుందరీ నాగమణి