Facebook Twitter
లేని దయ్యాలు (కథ)

లేని దయ్యాలు (కథ)

రచన: కె. నాగలక్ష్మి, 9వ తరగతి, అరవిందాహైస్కూల్, కుంచనపల్లి, గుంటూరుజిల్లా.

 


హైదరాబాదులో డిగ్రీ చదువుతున్న నవ్య, సుమ ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళు. ఇద్దరికీ పుస్తకాలంటే ఇష్టం; టి.వి.చూడటం అంటే చాలా ఇష్టం. వాళ్ళు చదివే పుస్తకాలు, చూసే టి.వి.కార్యక్రమాలు అన్నీ మామూలువి కావు- దయ్యాలవి.

నవ్యకి, సుమకి ఇద్దరికీ దయ్యాలంటే ఆసక్తి. దయ్యాల కథలు చదవడం అంటేనూ, దయ్యాల గురించి తెలుసుకోవడం అంటేనూ వాళ్లకి చాలా ఇష్టం. అట్లా విని విని కొత్తగా కథలు రాయడం కూడా నేర్చుకున్నారు వాళ్ళు. అట్లా ఎన్ని కథలు వ్రాస్తూన్నారంటే, చివరికి వాళ్ళ చదువును కూడా పట్టించుకోలేదు వాళ్ళు. ఇంటి నిండా అట్లాంటి పుస్తకాలే పెట్టుకున్నారు ఇద్దరూనూ. వాళ్ళ అమ్మానాన్నలు వాళ్ళకు చాలా రకాలుగా చెప్పి చూశారు- "తల్లీ! ఎందుకమ్మా, ఇంత పిచ్చి? కథలే రాయాలంటే మంచి మంచి విషయాలు ఎన్ని లేవు? ఎప్పుడూ దయ్యాలేనా?" అని. అయినా గాని వాళ్ళు వింటేగా?

ఎనిమిదో తరగతికి వచ్చేసరికి, ఇద్దరూ హాస్టలులో‌ఉండి చదువుకోవాల్సి వచ్చింది. హాస్టలులో ఇద్దరిదీ ఒకటే గది.

ఇంకేముంది?-ఇద్దరూ తమ గదిని దయ్యాల కథలతో నింపేశారు.

 

ఒక రోజు రాత్రి నవ్య, సుమ నిద్రపోతున్నప్పుడు నవ్యకు ఒక దయ్యం కల వచ్చింది. మనకుండే ఆసక్తులే మన కలలకు ప్రేరణనిస్తుంటాయి కదా. మనం ఎప్పుడూ దయ్యాలగురించే ఆలోచిస్తూంటే మనకొచ్చే కలలు కూడా దయ్యాలవే వస్తుంటాయి. అట్లా నవ్యకు వచ్చిన ఆ కలలో- నవ్య, ఆమె భర్త ఇద్దరూ నిద్రపోతున్నారు. అంతలో ఒక దయ్యం సుమ వేషం వేసుకొని వచ్చి నవ్య భర్తను చంపేసింది. అప్పుడు లేచి చూసిన నవ్య దయ్యాన్ని గుర్తుపట్టి, తన చేతిలో ఉన్న చాకుతో దాన్ని పొడిచేసింది-

పెద్దగా అరుస్తూ నిద్రలేచింది నవ్య. ప్రక్కనే ఆపిల్ కోసుకునే కత్తి ఒకటి ఉంటే దాన్ని చేత పట్టుకున్నది. ఆ అరుపులకు నిద్రలేచింది సుమ- "ఏమైంది ఏమైంది?" అంటూ నవ్యను పట్టుకొని కుదిపింది. కానీ నవ్యకు అక్కడ సుమ కనిపిస్తేనేగా, ఆమె బదులు దయ్యమే కనబడుతున్నదాయె! దయ్యం తనను పట్టుకుంటున్నదన్న భ్రమలో స్నేహితురాలినే కత్తితో పొడిచేసింది నవ్య!

అందరూ పరుగున వచ్చి, సుమను ఆసుపత్రిలో చేర్పించారు. నవ్య ను పోలీసులకు అప్పగించారు. ఆమె తన అమాయకత్వాన్ని నిరూపించుకునేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది.

వెనక్కి వచ్చాక సుమ, నవ్య ఇద్దరూ క్రొత్త మనుష్యులయిపోయారు- ఇప్పుడు వాళ్ళ గదిలో ఒకటంటే ఒక్క దయ్యం కథ కూడా లేదు.

గదిలోనే కాదు- వాళ్ల ఆలోచనల్లోనూ లేవు, దయ్యాలు!

 

Courtesy..
kottapalli.in