Facebook Twitter
" ఏడు రోజులు " 36వ భాగం

" ఏడు రోజులు " 36వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి


      


            ఆదివారం

    ఉదయం పదిన్నరకు భవానీశంకర్ విషయమై ముంతాజ్ ని కల్సేందుకు గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళాడు కమలాకర్!

    "గౌసియా వచ్చింది. నీ పక్కన వున్న కుర్రాడు ఎక్కడ వున్నాడు?" అడిగాడు కమలాకర్.

    ముంతాజ్ కమలాకర్ వైపు అర్థం కానట్టుగా చూశాడు.

    "అదేం ముంతాజ్ అలా చూస్తున్నావు? గౌసియా దొరికింది. నిన్న నీ వెంట వచ్చిన కుర్రాడు ఆ పిల్ల లవ్వర్ అంటకదా?" అన్నాడు.

    "ఆ విషయం నీకెవరు చెప్పారు?" అడిగాడు ముంతాజ్.

    "గౌసియానే చెప్పింది"

    ముంతాజ్ కు అనుమానం వచ్చింది. "నిన్న గౌసియా కోసం తాము మామూలుగా వెళ్ళారు. ఏమాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించారు. ఒకవేళ గౌసియా నిజంగానే తిరిగివచ్చినా, భవానీశంకర్ అక్కడికి వెళ్ళినట్టు ఆమెకు ఎలా తెలుస్తుంది?"

    ఈ అనుమానం రాగానే... "వాడు నిన్ననే వెళ్ళిపోయాడు" చెప్పాడు ముంతాజ్.

    "అయ్యో! అనవసరంగా ఆ పిల్లలో ఆశలు పెంచానా ఏంటీ" మనసులో అనుకుని, "ఆ కుర్రాడి పేరేమిటి?" అడిగాడు కమలాకర్.

    "గోపాల్" చెప్పాడు ముంతాజ్.

    "అలాగా!" అంటూ తలాడించి "అలవాటులో పొరపాటు..." తనలో తను గొణుక్కుని, "వెళ్తాను ముంతాజ్... నాకు టైమ్ అయ్యింది" అని చెప్పి అక్కడ్నుంచి బయటపడ్డాడు కమలాకర్.

    అతడు అలా వెళ్ళిపోగానే ఇలా రెండవదారి వెంబడి, తన లూనామీద ఇంటికి బయలుదేరి వెళ్ళాడు ముంతాజ్.

    ఇంటిదగ్గర భవానీశంకర్ టీవీ చూస్తూ కూర్చుని వున్నాడు. అతడి ముఖంలో నిరాసక్తత స్పష్టంగా కనబడుతోంది.

    "అరే శంకర్... నువ్వు వెంటనే ఇక్కడ్నుంచి తప్పుకోవాలిరా" వెళ్ళగానే హడావిడిగా చెప్పాడు ముంతాజ్.

    "ఎందుకు?" భవానీశంకర్ లోనూ హడావిడి.

    "నువ్వు ఇక్కడ వున్నావని పోలీసులకు తెల్సినట్టుంది. నిన్న మనం వెళ్ళామే ఆ దవాఖానా కాంపౌండర్ ఇంతక్రితం నా దగ్గరికి వచ్చాడు. నీ గురించి ఆరా తీశాడు" చెప్పాడు ముంతాజ్.

    "అయితే ఇప్పుడెలా?" కంగారుపడిపోయాడు భవానీశంకర్.

    "నీవు అస్సలు ఈ వూర్లోనే వుండొద్దు. హైద్రాబాద్ వెళ్ళిపో! నేను నీ వెంటే వస్తాను. అక్కడ మా మేనత్త వాళ్ళ ఇంట్లో వుందువుగాని" అన్నాడు ముంతాజ్.

    "ఇప్పటికిప్పుడు హైద్రాబాద్ వెళ్ళొద్దు. వెళ్తుంటే మిమ్మల్ని ఇక్కడే మధ్యలోనే పట్టుకోవచ్చు. కాబట్టి ముందు నీ స్నేహితుడు నజీర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. అక్కడ మధ్యాహ్నం దాకా వుంటే, పరిస్థితి కొద్దిగా కుదుటపడవచ్చు" కల్పించుకుంది ముంతాజ్ తల్లి హుస్సేన్ బీ.

    "ఆ పనిచేద్దాం... రారా" అంటూనే బయటకు నడిచాడు ముంతాజ్. వెనకే నడిచాడు భవానీశంకర్.

    పది నిముషాల్లో నజీర్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు మిత్రులు ఇద్దరూ. నజీర్ వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. అంత పెద్ద ఇంట్లో మొత్తం ఇరవైఐదు మందిదాకా వుంటారు. వాళ్ళందరికీ మతచాదస్తం కూడా ఎక్కువ! కాబట్టి ముంతాజ్ చెప్పిన ప్రకారం భవానీశంకర్ అక్కడ ముస్లిం యువకుడిగా మారాడు.

    "వీడు నా దోస్త్... సయ్యద్ పాషా! హైద్రాబాద్ నుండి వచ్చాడు. మా ఇంట్లో అమ్మ తప్పిస్తే ఎవ్వరూ వుండరు కాబట్టి వాడికి బోర్ గా వుంటుందని ఇక్కడికి తీసుకువచ్చాను" ఉర్దూలో నజీర్ తో చెప్పాడు ముంతాజ్.  

    "దవాఖానా దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు కదరా" అన్నాడు నజీర్.

    "నేను మర్డర్ కేసు విషయమై పక్క పల్లెకు వెళ్తున్నాను" చెప్పాడు ముంతాజ్. అదే సమయంలో ముంతాజ్ కు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని వెంటనే చెప్పాడు.

    "వీడికి నీ టోపి, షార్వాణీ ఇవ్వరా? వచ్చేప్పుడు అట్లాగే వచ్చాడు గానీ, మాసిపోయాయని ఇక్కడికి వచ్చాక మార్చుకున్నాడు. ఇది నా డ్రెస్సే" నజీర్ చెప్తూ భవానీశంకర్ డ్రెస్సును చూపించాడు ముంతాజ్.

    స్నేహితుడు ఎందుకు అలా చెప్తున్నాడో అర్థంకాలేదు భవానీశంకర్ కు. అయినప్పటికీ మౌనంగా వుండిపోయాడు. అదే సమయంలో నజీర్ కు వాళ్ళమ్మ దగ్గర్నుంచి పిలుపువచ్చింది. నజీర్ వెంటనే వెళ్ళిపోయాడు.

    "ఏంట్రా?" నజీర్ వెళ్ళిపోగానే అడిగాడు భవానీశంకర్.

    "నీకు వీళ్ళ సంగతి తెలీదురా! వీళ్ళ ముస్లిం పిచ్చి సామాన్యమైనది కాదు. ఇలా ప్యాంట్, షర్టూ వేసుకునేవాళ్ళను వీళ్ళు అసలు సిసలైన ముస్లిం కాదనుకుంటారు. మా ఇంటిదగ్గరే నీకు షార్వాణి తొడిగించుకు వద్దామనుకుంటే, ఆలస్యం ఎంత మాత్రం మంచిది కాదు అన్పించింది. అందుకే ఇక్కడ ఇలా చెప్పాను.

    "నీవు ఇక్కడ పొరపాటున కూడా తెలుగులో మాట్లాడొద్దు. ఇంకో విషయం ఏంటంటే జ్వరం వచ్చినట్లుగా నటించు. లేదంటే వాళ్ళతో పాటుగా నమాజ్ చేయమంటారు" భుజం తడుతూ చెప్పి, "నీవు ఈ గెటప్ లోనే బయటకు వెళ్ళావనుకో. నిన్ను ఎవ్వరూ గుర్తుపట్టరు..." అన్నాడు ముంతాజ్.

    "ఏంటోరా. అన్నీ అవస్థలే" అన్నాడు భవానీశంకర్.

    "బాధపడొద్దు. అల్లా వున్నాడు. ణీ కష్టాలు అన్నీ గట్టెక్కుతాయి" ధైర్యం చెప్పాడు ముంతాజ్.

    చిరునవ్వుతో తల పంకించాడు భవానీశంకర్. మరో పదినిముషాల తర్వాత ముంతాజ్ వెళ్ళిపోయాడు. నజీర్ భవానీశంకర్ తో బాగా కలిసిపోయాడు. ముభావంగా వుంటాడేమోనని భయపడ్డ భవానీశంకర్, నజీర్ తనతో స్నేహంగా కలిసిపోయినందుకు ఆనందపడ్డాడు. తనుకూడా నజీర్ తో స్నేహంగా మెలుగుతూ, నజీర్ వాళ్ళ ఇంటినుండే షిరాజ్ కోసం నంబరు కలిపాడు.

    ఆ సమయంలో నజీర్ సమాజ్ కోసమని కింది హాల్లోకి వెళ్ళాడు. అతడి కుటుంబసభ్యులు అందరూ ఆ హాల్లోనే నమాజ్ చేస్తారు. భవానీశంకర్ కు అదే అవకాశం అన్పించింది. కానీ కొద్దిసేపువరకు ఎంగేజ్ వచ్చింది. అయినప్పటికీ ప్రయత్నిస్తూ పోయాడు. కాసేపటికి నంబర్ కల్సింది. అవతల షిరాజే లైన్లోకి వచ్చాడు.

    "హలో..."

    "సిరాజ్... నేను" అన్నాడు భవానీశంకర్.

    "భవానీశంకర్?" అన్నాడు సిరాజ్.

    "అవున్రా! అక్కడ పరిస్థితి ఎలా వుంది?" అడిగాడు భవానీశంకర్.

    "పరిస్థితులు చాలా కటువుగా వున్నాయి. నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావద్దు. నీవు గౌసియా వాళ్ళ నాన్నను చంపేసినందుకు, మరెవ్వరినైనా హిందువును చంపెయ్యాలన్నంత కసిగా వున్నారు మా ముస్లింలు. కానీ అంత సాహసం ఎవ్వరూ చేయరు. ఎందుకంటే, ఇప్పటికే ఇక్కడ హిందూ ముస్లిం గొడవలు తారాస్థాయికి చేరుకుని వున్నాయి. కాబట్టి ఆవేశపడినా కూడా హద్దులలోనే వుంటారు. మీ అమ్మానాన్నలకు పోలీసులు రక్షణగా వున్నారు. ఇక నువ్వు ఎక్కడ వున్నావో ఏమోగానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దు" అవతల షిరాజ్ మాట్లాడుతూ పోతున్నాడు.

    ఇవతల భవానీశంకర్ కు టెన్షన్ పెరిగిపోతుంటే... "నా గురించి పొరపాటున కూడా ఎవ్వరితో మాట్లాడవద్దొరేయ్" మధ్యలోనే అందుకున్నాడు.

    "నాకు అన్నీ తెల్సు" అన్నాడు సిరాజ్.

    "ముంతాజ్ గాడు ఫోన్ చేశాడా?" అడిగాడు భవానీశంకర్.

    "చేయలేదు. నువ్వు ఎక్కడ వున్నావు?"

    "ముంతాజ్ గాడి స్నేహితుడి ఇంట్లో వున్నాను. ఇక్కడ భవానీశంకర్ గా కాదు, సయ్యద్ పాషాగా వున్నాను"

    "అదేంట్రా?"

    "అదో పెద్ద కథ" భవానీశంకర్ అంటుంటేనే ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది.

    "తర్వాత మాట్లాడదాం" అంటూ చప్పున ఫోన్ పెట్టేశాడు భవానీశంకర్. నజీర్ వచ్చి జానీమా తీసుకుని వెళ్ళాడు. నిజానికి నజీర్ ఎదురుగా కూడా తను ఫోన్ చేయగలడు. కానీ మాట్లాడే విషయాలు సీక్రెట్ కాబట్టి దొంగచాటుగా మాట్లాడాల్సి వచ్చింది. అదే అతడు చేసిన పొరపాటు అయ్యింది.

    పది నిముషాల తర్వాత మేడమీదకు వచ్చి సూటిగా అడిగాడు నజీర్.

    "నువ్వెవరు?"

    అదిరిపడి చూశాడు భవానీశంకర్.

    "నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు" నజీర్ గొంతులో కాఠిన్యం.

    అంతా అర్థమైంది భవానీశంకర్ కి. చాటునుండి తన మాటల్ని నజీర్ విన్నాడని అనుకుంటున్నాడు అతడు. కానీ చాటునుండి భవానీశంకర్ మాటలు వినలేదు నజీర్. వాళ్ళది ప్యారలల్ ఫోన్. భవానీశంకర్ మాట్లాడే సమయంలోనే ఎవ్వరికో అత్యవసరమై ఫోన్ చేయబోయి, అంతా వినేశాడు. అంతేకాదు, పేపర్ ద్వారా గౌసియా సంగతి తెలుసు కాబట్టి... ఆ వెంటనే పోలీస్ స్టేషన్ కు కూడా ఫోన్ చేసి మేడమీదకు వచ్చాడు. ఆ సంగతి భవానీశంకర్ కు తెలియకపోయినా, తన బండారం బయటపడింది కాబట్టి వెంటనే అక్కడ్నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ అందుకు అవకాశమే లేకుండా పోయింది.

    "ఇప్పుడేం చేయాలి?" భయంగా మన నిస్సహాయంగా నిలబడిపోయిన భవానీశంకర్ కు చప్పున ఒక ఆలోచన వచ్చింది. అతడు ఆలస్యం చేయలేదు. మెరుపువేగంతో ముందుకు దూకి, అక్కడ గోడకు తగిలించి వున్న తుపాకీ చేతుల్లోకి తీసుకున్నాడు.