Facebook Twitter
" ఏడు రోజులు " 35వ భాగం

" ఏడు రోజులు " 35వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి


       ముఖ్యంగా గౌసియా "ఎవరు?" అనే విషయం ఆ దంపతులు పోలీసులకు చెప్పలేదు. కాగా డాక్టర్ దినేష్ గౌసియా గురించి పోలీస్ స్టేషన్ కు "కనబడటంలేదు" అని రిపోర్టు ఇచ్చాడు. ఆ రిపోర్టు ఆధారంగా అనుమానం వచ్చిన పోలీసులు, ఆ తర్వాత గంటసేపటికే తిరిగి గౌసియా వున్న ఇంటికి వచ్చారు. వాళ్ళ అనుమానం నిజమయింది. కాని గౌసియా హాస్పిటల్ కెళ్ళడానికి విముఖత చూపించింది. అందుకు ఆమెను ఎవ్వరూ బలవంతపెట్టలేదు. ఆమె వెళ్ళాలనుకున్న మోహన్ వాళ్ళ అన్నయ్య హాస్పిటల్ కే పంపించాలనుకున్నారు.

    అదే సమయంలో వాళ్ళ ఇంటికి ఫోన్ వచ్చింది. ఫోన్ ప్రకారం ఆ ఇంటి యజమాని తండ్రి విజయవాడలో గుండెనొప్పితో మరణించాడు. దీంతో వాళ్ళు అప్పటికప్పుడే విజయవాడ వెళ్ళేందుకు సిద్ధం కావడం, తప్పనిసరి పరిస్థితిలో గౌసియా హాస్పిటల్ కే వెళ్ళడం, అంతా అరగంటలో జరిగిపోయింది.

    హాస్పిటల్ కు వెళ్ళాక డాక్టర్ తనమీద మళ్ళీ కోప్పడతాడేమోనని గౌసియాకు భయమనిపించింది. కాని డాక్టర్ ఎంత మాత్రం కోప్పడలేదు. ప్రేమగా మాట్లాడాడు.

    "హమ్మయ్య" అన్పించింది గౌసియాకు. కాగా కాంపౌండర్ కమలాకర్ ద్వారా తన కోసం "ఒక కుర్రాడు" వచ్చి వెళ్ళాడని తెలిసి, ఎవరా... అని ఆలోచించసాగింది గౌసియా.

    "పేరు తెలీదుకాని, ఎత్తుగా... దృఢంగా... చామనచాయ రంగులో వుంటాడు"

    చిన్నవయసులోనే భారీ పర్సనాలిటి కలిగిన తన భవానీశంకర్ వివరాలు అవి!

    మంచి ఎత్తు, దృఢమైన శరీరం, చామన ఛాయరంగు, మొనదేలిన ముక్కు, చురుకైన చూపు, ఒత్తయిన జుట్టు, తీరైన మీసకట్టు, నిజంగా తన భవానీశంకర్ ఎంత బాగుంటాడో! ఆ అందగాడు తనను వెదుక్కుంటూ వచ్చాడా?

    ఆ ఆలోచనకే ఆమె మనసు పులకించిపోయింది. "అతడు ఎక్కడ వున్నాడు?" ఆరాటపడిపోయింది.

    "ముంతాజ్ అని తెల్సిన కుర్రాడివెంట వచ్చాడు. వుంటే వాళ్ళ ఇంట్లోనే వుండొచ్చు" అన్నాడు కమలాకర్.

    "దయచేసి అతడ్ని పిలిపిస్తావా?' అభ్యర్థనగా అడిగింది గౌసియా.

    "ఎందుకు అంత ఆదుర్దా? ఆ కుర్రాడిలో కూడా ఇదే ఆదుర్దా కనబడింది" అన్నాడు కమలాకర్.

    "తనూ... భవానీశంకర్" చెప్పింది గౌసియా.

    అపనమ్మకంగా చూశాడు కమలాకర్.

    "కావొచ్చు అనుకుంటున్నాను" అంతలోనే ఆమెలోనూ అపనమ్మకం.

    "అతడు నీవు ప్రేమించిన కుర్రాడే అయితే మీ ఇద్దరు కల్సుకుంటున్నందుకు సంతోషం! కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో...ఆ కుర్రాడిదీ ప్రేమించే వయసు కాదు, నీదీ ప్రేమించే వయసు కాదు. మీ ఇద్దరూ ఇప్పుడు చదువుకోవాలి. మీ భవిష్యత్తుకో దారి వెదుక్కోవాలి" అన్నాడు కమలాకర్.

    "నిజమే కావొచ్చు సార్! కాని ఇప్పుడు మాత్రం మేం ఇద్దరం... ఒకర్ని విడిచి ఒకరం వుండలేం. ప్రేమలో పడటం మా పొరపాటు అయినప్పటికీ మేం విడిపోయి బతకలేం!" అంది గౌసియా.

    "మిమ్మల్ని విడిపొమ్మని నేను చెప్పడం లేదు. మీ ఇద్దరూ కల్సి బతకాలన్నదే నా ఆశ! కాపోతే సందర్భం వచ్చింది కాబట్టి వాస్తవం చెప్పాను" అని కాసేపాగి, "రేపు ఉదయాన్నే ఆ కుర్రాడ్ని ఇక్కడికి పిలిపిస్తాను సరేనా?" అన్నాడు అతడు.

    "మీరు ఈ సహాయం చేస్తాను అంటుంటేనే, భవానీశంకర్ నా కళ్లముందు నిల్చున్న ఆనందం కలుగుతోంది కాని అతడు భవానీశంకర్ కాకపోతే నేను ఎలా తట్టుకోవాలి? అని భయం అన్పిస్తోంది కూడా" అంది గౌసియా.

    "చూడమ్మాయీ! ముందే ఆశలు పెంచుకుని నిలువెత్తున ఆనందంలో కూరుకుపోకూడదు. ఒక విషయం గురించి గెలుపు ఓటములు రెండింటిని ఊహించుకోవాలి. వాటి ఫలితాన్ని ఎదుర్కోడానికి నిన్ను నీవు సిద్ధం చేసుకోవాలి" చెప్పాడు అతడు.

    "అట్లాగే" బుద్ధిగా తలాడించిందామె.


  


    హాస్పిటల్లో గౌసియా లేకపోవడం అనేది "డిస్చార్జి" అయితే భవానీశంకర్ అంతగా బాధపడకపోయేవాడు కాని ఆమె ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయిందని తెల్సి... కారణం ఊహించుకోలేక కలవరపడిపోసాగాడు.

    మొదట "తన గౌసియా ఇక్కడికెలా వస్తుందని? ఆమె ఉనికిని ఆ వూర్లో నమ్మలేకపోయాడు. కానీ హాస్పిటల్లో తెల్సుకున్న వివరాల ప్రకారం ఆమె తన గౌసియానే అని నిర్ధారణ చేసుకున్న తర్వాత మనిషి కాలేకపోతున్నాడు కూడా! ఇలాగని హాస్పిటల్లోనే అతడు తన బాధను వ్యక్తం చేసుకోలేదు. తను ఎవరో ఎవ్వరికీ తెలీకూడదు అనుకున్నాడు కాబట్టి, హాస్పిటల్లో వున్నంతసేపూ బాధను అదిమి పట్టుకున్నాడు.

    ఇంటికి వచ్చాక ఇక ఒక్కక్షణం కూడా అక్కడ వుండాలనిపించలేదు భవానీశంకర్ కు. గౌసియను వెదుక్కుంటూ వెళ్ళిపోవాలనిపించింది. ఆ విషయాన్ని ముంతాజ్ తో చెప్తే వెళ్ళనివ్వడు కాబట్టి అతడికి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవాలనుకున్నాడు. కాని వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ్నుంచి వెళ్ళిపోతే తనది గమ్యం తెలియని పయనం అవుతుంది. అలాగని ఆ వూర్లో వుండడానికి అతడి మనసు ఒప్పుకోవడం లేదు.

    వింతగా ఆడుకుంటున్న పరిస్థితులు మనసును చిత్రవధ చేస్తుంటే ఆలోచిస్తూ పడుకునివున్నాడు భవానీశంకర్.

    "ఏంట్రా? దవాఖానకు వెళ్ళివచ్చినప్పటి నుండి ఇలా తయారైపోయావు?" వచ్చి పక్కలో కూర్చున్నాడు ముంతాజ్.

    "గౌసియా గుర్తొస్తోందిరా" చెప్పాడు భవానీశంకర్.

    "నాకు తెల్సు" అని కాసేపాగి, "అదృష్టం వుంటే ఇద్దరూ కల్సుకుంటారు. అనవసరంగా బాధపడొద్దు" చెప్పాడు ముంతాజ్.

    భవానీశంకర్ ఏంమాట్లాడలేదు. ముంతాజ్ కూడా ఇంకేం అనలేదు. కొన్ని క్షణాల మౌనం తర్వాత భవానీశంకరే మెల్లగా నోరు విప్పాడు.

    "ముంతాజ్"

    "ఊఁ?"

    "రేపు హైదరాబాద్ వెళ్ళిపోతాను"

    "నీకు దమాక్ గాని కరాబ్ అయ్యిందా?"

    "నాకు ఇక్కడ ఉండాలనిపించడంలేదు. అందుకే రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను"

    "వెళ్ళి ఎక్కడ వుంటావు?"

    ఏం చెప్పలేకపోయాడు భవానీశంకర్.

    "పరిస్థితులు కుదుటపడేవరకు ఇక్కడే వుండు. గౌసియా ఆచూకీ కూడా ఈ రెండుమూడు రోజుల్లో తెల్సిపోతుంది" ముంతాజ్ అన్నాడు.

    "...."

    "నీవు గనుక ఇక్కడ్నుంచి కాలు తీశావనుకో, నీ కష్టాలు నువ్వే కొనితెచ్చుకున్నవాడివి అవుతావు. కాబట్టి మరేం ఆలోచించకుండా హాయిగా పడుకో" చెప్తూనే స్నేహితుడి పక్కలో పడుకుండిపోయాడు ముంతాజ్.

    భవానీశంకర్ మాత్రం అలాగే ఆలోచిస్తూ... "ఇంతకూ గౌసియా ఎక్కడికి వెళ్ళినట్టు? తనను ఎవరైనా తీసుకువెళ్ళారా? లేక తనే వెళ్ళిందా? తను ఎలా వెళ్ళినా సరే... తనకు ఏమీ జరగకుండా క్షేమంగా వుండాలి" అని మనసులో అనుకున్నాడు.