Facebook Twitter
" ఏడు రోజులు " 33వ భాగం

" ఏడు రోజులు " 33వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

   


    ఆయా ఎవరో ఇన్ పేషెంట్ తో మాట్లాడుతోంది. నెమ్మదిగా ఆమెవైపు నడిచాడు అతడు.

    "పెద్ద డాక్టరు ఇప్పుడు దొరకడు అని చెప్పాను కదా" అతడ్ని చూడగానే అంది ఆయా.

    "చిన్న డాక్టర్ వస్తాడు కదా" అన్నాడు యువకుడు.

    "ఇద్దరూ ఆపరేషన్ థియేటర్ లోనే వున్నారు"

    "ఇదేం హాస్పిటల్? ఈ సమయంలో ఇన్ పేషెంట్ ఎవ్వరికైనా సీరియస్ అయితే?"

    "లోపలికి నంబరుంది. సీరియస్ అనుకుంటే కలుపుతాను" అంది ఆయా.

    "మంచిది" అని కాసేపాగి, "అవునూ, ఉదయాన్నే ఎవరైనా టైఫాయిడ్ పేషెంట్ వచ్చారా ఇక్కడికి?" అడిగాడు అతడు.

    "ఎవ్వరూ రాలేదే" అంది ఆయా.

    "ఇప్పుడు వస్తాడు" అంటూ వెళ్ళి అక్కడున్న విజిటర్ చెయిర్స్ వరసలో కూర్చున్నాడు అతడు.

    పదిహేను నిముషాలు గడిచిపోయాయి. ఆపరేషన్ థియేటర్ లోంచి కాంపౌండర్ వెలుపలికివచ్చి, ఆయాకు మందుల చీటి ఇస్తూ, "ఈ మందులు మన మెడికల్ హాల్లో లేవు. అవతలి వీధిలో వున్న మెడికల్ హాల్లో ఈ మందులు దొరుకుతాయి. వెంటనే వెళ్ళి తీసుకురాపో" అని చెప్పి, ఆ వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు.

    ఆయా వడివడిగా బయటకు నడిచింది. అట్లాంటి అవకాశంకోసమే ఎదురుచూస్తున్న అతగాడు, ఆయా అలా బయటకు వెళ్ళగానే ఇలా గౌసియా దగ్గరకి నడిచాడు.

    "ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు?" అడిగింది గౌసియా.

    "ఫోన్లో అన్నయ్యతో మాట్లాడాను. తను ఎమర్జెన్సీ కేసులో వున్నాడు కాబట్టి నామీద తీవ్రంగా కోప్పడ్డాడు. ఆ కోపంలోనే 'ఆ అమ్మాయి ఇక్కడే వుండాలి. ఎక్కడికీ వెళ్ళడానికి వీల్లేదు' అని చెప్పాడు" అన్నాడు అతడు.

    "మరి ఇప్పుడెలా?"

    "ఇంకేం ఆలోచించేది లేదు, వెళ్దాం"

    "సరే"

    "నేను ఆటో తీసుకువస్తాను" అంటూ మెరుపు వేగంతో బయటకు నడిచి, రోడ్డెంబడి వెళ్తున్న ఆటోని చప్పట్లు చరుస్తూ "ఆటో" పిలిచాడు.

    ఆటో ఇటు తిరిగింది. అతడు వెంటనే లోపలికి నడిచాడు.

    "ఆయాకు చెప్పాలా?" అడిగింది గౌసియా.

    "చెప్పాను. తీసుకువెళ్ళమంది"

    "నాకు నడవడం చేతకాదు. పట్టుకుని మెల్లగా నడిపించు"

    "ఎత్తుకు వెళ్తాలే" అంటూనే గౌసియాని తన రెండుచేతులమీదకు గబుక్కున ఎత్తుకున్నాడు అతడు.

    అతడి ఓ చేయి నడుందగ్గరి ఆమె గాయంమీద ఒత్తిడిని పెంచింది. ఆమె భరించలేకపోయింది.

    "అ...మ్మా..." బాధగా అరిచింది.

    "ఏమయ్యింది?" గాభరాపడ్డాడు.

    "ఈ చేయి తీయండి..." బాధపడుతూనే అతడి చేతిని దూరం జరుపుకుంది.

    అప్పుడు గమనించాడు అతడు ఆమె గాయాన్ని. "ఓ సారీ! చూళ్ళేదు" అంటూ తనచేయిని దూరం జరిపి, ఆ వెంటనే డోర్ దాకా నడిచి, అటూఇటూ చూసి, ఎవ్వరూ తమని గమనించడం లేదు. ఆయా కూడా రావడంలేదు అని నిర్ధారించుకున్నాక, పరుగున వెలుపలికి నడిచాడు.

            *    *    *

    మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళాడు ముంతాజ్.

    "ఏమంటోందిరా నీ లవ్వర్?" ముంతాజ్ రాగానే, తన చేతిలోని ఏదో మేగజైన్ ను పక్కకు పెడుతూ అడిగాడు భవానీశంకర్.

    "ప్చ్... డిస్చార్జి అయ్యింది" నిరాశగా చెప్పాడు ముంతాజ్.

    "భగ్న ప్రేమికుడివి అన్నమాట" టీజ్ చేసాడు భవానీశంకర్.

    "ఏదోగాని, గోపాల్ గాడు ఫోన్ చేసాడు" చెప్పాడు ముంతాజ్.

    "ఏమన్నాడు?" ఆత్రంగా చెయిర్ లోంచి లేచి ముంతాజ్ చేతుల్ని పట్టుకున్నాడు భవానీశంకర్.

    "గౌసియా ఇంకా హైద్రాబాద్ కు రాలేదట"

    "అదేం?"

    "నాకేం తెల్సురా?"

    "ఇంకా ఏం చెప్పాడు?"

    "మీ అమ్మా, నాన్నలకు నీ గురించి చెప్పగానే చాలా సంతోషించారట! నిన్ను ఇప్పుడే ఇంటికి రావొద్దని చెప్పారంట! గౌసియా వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దీనంగా ఉందట! వాళ్ళ తండ్రి మరణం వాళ్ళను విపరీతంగా కృంగదీస్తుంటే మనుషులు కాలేకపోతున్నారంట"

    "బిడ్డను అమ్ముకుని మాత్రం ధైర్యంగా ఉండగలిగారా?" వెంటనే కసిగా అన్నాడు భవానీశంకర్.

    "అదే నాకు అర్థంకాలేదు" అన్నాడు ముంతాజ్.

    "మొత్తానికి గౌసియా ఇంకా బాంబేలోనే వుందేమో?" అన్నాడు భవానీశంకర్.

    "ఇంక అక్కడే వుంటుంది కదా" అంటూ చొక్కా గుండీలు తీసుకోసాగాడు ముంతాజ్.

    "ఇంకా ఏమేం మాట్లాడాడు?" భవానీశంకర్ లో ఆసక్తి.

    "ఇంకేం మాట్లాడలేదు. మళ్ళీ రేపు ఫోన్ చేస్తానన్నాడు. మరి కనీసం రేపైనా దవఖానకు వస్తే బాగుంటుంది" అంటూ చొక్కా వదిలి హ్యాంగర్ కు తగిలించాడు ముంతాజ్.

    "రావాలనే వుంది. కాని భయంగా వుందిరా! అయినా రావడానికి ప్రయత్నిస్తాను! కాపోతే ఇప్పుడు ఒక నంబరు ఇస్తాను. ఆ నంబరుకు ఒకసారి ట్రై చేసి వివరంగా మాట్లాడు. అక్కడ సిరాజ్ అని నా ఫ్రెండు వుంటాడు. వాడు లేకపోతే వాడి అక్క పర్వీనా వుంటుంది. ఇద్దరిలో ఎవరు వున్నా అక్కడి పరిస్థితి గురించి పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళు వుండేది మాకు దగ్గరే, పైగా వాళ్ళు గౌసియా వాళ్ళకు బాగా తెలుసు" చెప్పాడు భవానీశంకర్.

    "వాళ్ళు ముస్లింలు కదా?" అన్నాడు ముంతాజ్.

    "నీలాగే వాళ్ళకు కూడా హిందూముస్లీం తేడాలులేవు. మంచి మనసే మతం, కలిసి వుండటమే కులం అని అనుకుంటారు. ఇంకో విషయం తెల్సా? మా ప్రేమలో సహాయపడింది కూడా వాళ్ళే" చెప్తూనే అదే హ్యాంగర్ కు తగిలించి వున్న తన ప్యాంటు జేబులోని పర్సును ఫోన్ నంబర్ కోసం బయటకు తీయబోయాడు భవానీశంకర్ కాగా, పర్సు పొరపాటున జారి కిందపడిపోయింది.

    "నీ పర్స్ బాగుందిరా" అంటూ వంగి కిందబడిన పర్సును చేతుల్లోకి తీసుకుని తెరిచి చూసిన ముంతాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.

    "ఏమయ్యిందిరా?" కలవరపడ్డాడు భవానీశంకర్.

    "ఈ... ఈ... మె...?" ముంతాజ్ తడబడ్డాడు.

    "గౌసియా" చెప్పాడు భవానీశంకర్.

    "సారీరా" వెంటనే స్నేహితుడి చేతుల్ని పట్టుకున్నాడు ముంతాజ్.

    అర్థంకానట్టుగా చూశాడు భవానీశంకర్.

    "దవఖానాకు వచ్చింది ఈ అమ్మాయేరా" ఆయాసపడినట్లుగా చెప్పాడు ముంతాజ్.

    "ఆ?" నమ్మలేకపోయాడు భవానీశంకర్.

    "నిజం! ఈ అమ్మాయే! నేను బాగా గుర్తుపట్టగలను"

    "బాంబేలో వున్న గౌసియా ఇక్కడికి ఎలా వస్తుంది?"

    "అదంతా నాకు తెలీదు. నేను చూసింది ఈ అమ్మాయినే, పొరపాటున మనసు పారేసుకున్నదీ ఈ అమ్మాయిపైనే! నీకు నమ్మకం కుదరకపోతే స్వయంగా వెళ్ళి చూసాకే నమ్ము"

    "డిస్చార్జి అయ్యింది అన్నావు కదా"

    "ఇదే వూర్లో వేరే దవాఖానలో వుంటుంది. ఇప్పుడే వెళ్దాం" అంటూనే తిరిగి చొక్కా వేసుకున్నాడు ముంతాజ్.

    "ఏంచేస్తుంది అక్కడ?" అడిగాడు భవానీశంకర్.

    "ఏంచేయదు. అక్కడ కూడా తను పేషెంటే" చెప్పాడు ముంతాజ్.

    అర్థంకానట్టుగా చూశాడు భవానీశంకర్.

    "ఆలస్యం అమృతం...విషం... పదరా" అంటూనే బయటకు నడిచాడు ముంతాజ్.

    వెనకే నడిచాడు భవానీశంకర్.

            *    *    *