Facebook Twitter
" ఏడు రోజులు " 31వ భాగం

" ఏడు రోజులు " 31వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

   "నీకు ఎవ్వరూ సహాయం చేయకపోయినా నేను సహాయం చేస్తాన్రా" అన్నాడు ముంతాజ్.

    "గోపాల్ గాడు ఒకవేళ ఫోన్ చేయకపోతే నువ్వొకసారి హైదరాబాద్ వెళ్లిరావాలి"

    "ఎలాగూ రేపు పనిమీద వెళ్తున్నాను. మీ అమ్మావాళ్లను కూడా కల్సివస్తాను"

    "గోపాల్ గాడిని కూడా కలిసి నా గురించి ఎక్కడా చెప్పవద్దని చెప్పు. ఈ మాట మా అమ్మవాళ్లకు కూడా చెప్పు"

    "వాళ్లకు అంతా తెల్సులే" ముంతాజ్ అంటుంటేనే "బేటా! కాళ్లు కడుక్కోండి. నాస్టా చేద్దురుగానీ" పిలుస్తూ వచ్చింది ముంతాజ్ తల్లి హుస్సేన్ బీ.

    భవానీశంకర్, ముంతాజ్ ఇద్దరూ లేచి లోపలికి నడిచారు. హుస్సేన్ బీ బోటీ కలిపిన గోంగూర కూరను, చపాతీల్ని, చాపపై సర్దసాగింది. చేతులు కడుక్కుని వచ్చి చాపపై అభిముఖంగా కూర్చుని తినడం ఆరంభించారు మిత్రులు ఇద్దరూ.

    "రాత్రి ఒక సంఘటన జరిగింది. ఎవరో హైదరాబాద్ కు చెందిన అమ్మాయి మా దవాఖానాకు వచ్చింది. పాపం.. ఆ పోరిది చాలా చిన్న వయసు. నిన్న హైదరాబాద్ లో జరిగిన మతకలహాల్లో గాయపడిందంట. ఆ పోరి పరిస్థితి చూస్తుంటే నిజంగా మస్తు జాలి అన్పిస్తుంది" తింటూ చెప్పాడు ముంతాజ్.

    "..." తింటూ తలాడించాడు భవానీశంకర్.

    "అట్లాంటి పరిస్థితి శతృవులకు కూడా రాకూడదురా! ఎందుకంటే ఒకవైపు గాయాలు, మరోవైపు కడుపునొప్పి. నిజంగా చాలా ఘోరం!" అన్నాడు ముంతాజ్.

    "ఒక్కొక్కరిది ఒక్కో బాధ" అన్నాడు భవానీశంకర్.

    "మా కులం పోరీనే! మస్తుగ వుంది. కాపోతే గొప్పింటి దానిలా వుంది. అందుకే బాధ" కూర వేసుకుంటూ అన్నాడు ముంతాజ్.

    "అదేంట్రా?" నవ్వాడు భవానీశంకర్.

    "నాకు సరిపోయే కుంటుంబం అయివుంటే షాది చేసుకునేవాడ్ని"

    "అంత నచ్చిందా?"

    "నిజంరా! నాకైతే బాగా నచ్చింది.

    "నచ్చితే ఒక లవ్ లెటర్ రాసి ఇచ్చేసుకోగాని ముందు నా గురించి ఆలోచించురా! నేను ఇప్పుడు అగ్గికణికలమీద నిలబడి వున్నాను. నా పరిస్థితి ఒక కొలిక్కి వచ్చేలా చూడు"

    "చెప్పాను కదా నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను"

    "థాంక్స్ రా" అని కాసేపాగి, "అవున్రా నీ ఉద్యోగం పర్మనెంటు అయినట్లేనా?" అడిగాడు భవానీశంకర్.

    "అది మా నాన్న ఉద్యోగం కదా పర్మనెంటు అయినట్టే లెక్క" చెప్పాడు ముంతాజ్.

    "జీతం ఎంత?"

    "మానాన్నకు రెండు వేలు వచ్చేవి. నాకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. మున్ముందు పెంచుతారంట" అంటూ చేయి కడుక్కున్నాడు ముంతాజ్.

    భవానీశంకర్ కూడా చేయి కడుక్కున్నాడు.  

    ఇద్దరూ లేచి బయటి గదిలోకి నడిచారు.

    "దవాఖానకు వెళ్దామా?" అడిగాడు ముంతాజ్.

    "వద్దు" అన్నాడు భవానీశంకర్.

    "ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు?"

    "నేను బయటకి వెళ్లడం అంతమంచిది కాదు"

    "దవాఖాన ఇక్కడికి దగ్గరే. ఈ పక్క గల్లీలోంచి వెళ్దాం. నిన్ను ఎవ్వరూ పోల్చుకోరు"

    "వద్దురా! నువ్వెళ్లు"

    "రారా"

    "ఏం నీ లవ్వర్ ను చూపిస్తావా?"

    "పోరా" ముంతాజ్ లో కొద్దిగా సిగ్గు.

    "పిచ్చోడా! నిన్ననేగా ఆ పిల్లను చూసింది అప్పుడే మనసు పారేసుకున్నావా?" నవ్వాడు భవానీశంకర్.

    "ఆ సంగతి వదిలిపెట్టుగాని నువ్వు ముందు వస్తావా? రావా?" అడిగాడు ముంతాజ్.

    "నన్ను అర్థం చేసుకోరా" అన్నాడు భవానీశంకర్.

    "అయితే నీ ఇష్టం నాకు డ్యూటీ టైమ్ అయింది వెళ్లొస్తాను" అంటూ బయటకు నడిచాడు ముంతాజ్.

    "గోపాల్ గాడు ఫోన్ చేస్తే చేయొచ్చు. అన్ని విషయాలు వివరంగా మాట్లాడి తెలుసుకో" గుమ్మందాకా వచ్చి చెప్పాడు భవానీశంకర్.

    "సరే" అంటూ లూనా స్టార్టు చేసుకుని ఎక్కి కూర్చుని "బోర్ అన్పిస్తే అమ్మను అడిగి పక్కింటివాళ్ల దగ్గర్నుండి పుస్తకాలు తెప్పించుకో" చెప్పి వెళ్లిపోయాడు ముంతాజ్.

    భవానీశంకర్ లోపలికి నడిచాడు.

            *    *    *

    "గౌసియా! ఎలా వుంది ఆరోగ్యం?" హాస్పిటల్ కు రాగానే అడిగాడు కమలాకర్.

    "బాగుంది" చెప్పింది గౌసియా.

    "మరి వెళ్దామా?" అడిగాడు.

    "వెళ్దాం"

    "ముంతాజ్" ఆ వెంటనే ముంతాజ్ కోసం చూశాడు కమలాకర్.

    "అన్నా" అంటూ వచ్చాడు ముంతాజ్.

    "ఏమీ అనుకోకుండా ఆటో తీసుకువస్తావా?"

    "ఆటో ఎందుకు అన్నా?"

    "మేము ఇక వెళ్ళద్దా?"

    "అప్పుడే వెళ్తున్నారా?" కొద్దిగా బాధనిపించింది ముంతాజ్ కు.

    "మా డాక్టర్ సాబ్ ఇప్పటికే నాపై కోప్పడ్తున్నాడు" చెప్పాడు కమలాకర్.

    "మీ డాక్టర్ బుద్ధిమంతుడైతే ఇలా బాధ పడాల్సిన అవసరమేలేదు" అంటూ బయటకు నడిచాడు ముంతాజ్.

    పది నిముషాల్లో ఆటో వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది. కమలాకర్ గౌసియాను జాగ్రత్తగా తీసుకువెళ్లి ఆటోలో కూర్చోబెట్టాడు.

    "డాక్టర్ సాబ్ వస్తే అమ్మాయిని తీసుకువెళ్లానని చెప్పు" ముంతాజ్ కు చెప్పాడు కమలాకర్.

    సరే అన్నట్టుగా తలాడించాడు ముంతాజ్. ఆ తర్వాత ఆటో ముందుకు కదిలింది.

            *    *    *    

    "అమ్మాయీ నీకు వస్తాను అనే చెప్పాను కదా? చెప్పినా కూడా ఆ కమలాకర్ వెంట వెళ్లడం ఏంటీ? దిసీజ్ టూమచ్" కమలాకర్ రౌండ్స్ కు వెళ్లగానే గౌసియాపై కోప్పడ్డాడు డాక్టర్ దినేష్.

    "బాధ ఎక్కువైతే" చెప్పుకోబోయింది గౌసియా.

    "డోంట్ టాక్ ఐసే" కఠినంగా అన్నాడు డాక్టర్.

    గౌసియా కిమ్మనలేదు. గొణుక్కుంటూ వెళ్లిపోయాడు డాక్టర్. తన మీద తనకే జాలికలుగుతుంటే గౌసియా గుడ్లనిండా నీళ్లు తిరిగాయి.

    'అంతా నా ఖర్మ' మనసులో అనుకుంటూ కళ్లనీళ్లు తుడ్చుకుంది. అదే సమయంలో హాస్పిటల్ కు సీరియస్ కేసు ఒకటి రావడం, డాక్టర్ తోపాటుగా కాంపౌండర్, నర్సులు, అందరూ అప్రమత్తులు కావడం జరిగిపోయింది.

    బాధపడుతూ మౌనంగా పడుకున్న గౌసియాను పిలుస్తూ వచ్చింది ఆయా.

    "గౌసియా"

    "ఏంటన్నట్లుగా చూసింది గౌసియా.

    "నీకు బొంబాయి నుండి ఫోను" అంటూ కార్డులెస్ అందించింది ఆయా. కార్డ్ లెస్ అందుకుని ఆతృతగా మాట్లాడింది గౌసియా. ఫోన్ చేసింది ఆమెను హాస్పిటల్లో చేర్పించిన మోహన్. అతడు ఎవరో అయినప్పటికీ మళ్లీ ఫోన్ చేసి ఆమె యోగక్షేమాల్ని తెల్సుకోవడం ఆయాను విస్మయ పరిచింది.

    "నిజంగా ఆ మనిషి ఎంతో పుణ్యాత్ముడు అనుకోవాలి" గౌసియా మాట్లాడ్డం పూర్తయ్యాక అంది ఆయా.

    "ఇది సరేగాని నాకో సహాయం చేస్తావా ఆయా?" అడిగింది గౌసియా.

    "ఏం సహాయం?"

    "నువ్వు చేస్తానంటేనే చెప్తాను"

    "నావల్ల అయ్యేది వుంటే తప్పకుండా చేస్తాను"

    "డాక్టరుకి చెప్పి నన్ను హైద్రాబాద్ హాస్పిటల్ కు పంపించే ఏర్పాటు చేయి"

    "ఇక్కడ బాగానే వుంది కదా? ఇప్పుడే హైద్రాబాదు ఎందుకు?"

    "అలా అని కాదు, నన్ను ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళాడే మోహన్ భయ్యా, వాళ్ళ అన్నయ్య కూడా హైద్రాబాద్ లో డాక్టరుగా పనిచేస్తున్నాడంట. నాకు ఇక్కడ ఇబ్బంది వుంటే ఈ డాక్టరును అడిగి అక్కడికి వెళ్ళమన్నాడు. అందుకు అయ్యే ఖర్చుల్ని ఆ డాక్టరే భరించుకుంటాడంట.

    "మోహన్ భయ్యా చాలా మంచివాడు. నా గురించి వాళ్ళ ఇంటివాళ్ళకు ఇంతక్రితమే ఫోన్ చేసి చెప్పాడంట కూడా! నాకు అక్కడికే వెళ్ళాలని వుంది. దయచేసి ఈ సహాయం చేసి పెట్టవా?" అభ్యర్థనగా అడిగింది గౌసియా.

    "చిరునామా వుందా?" అడిగింది ఆయా.

    "నాకు కార్డు ఇచ్చివెళ్ళాడు కదా...అదే చిరునామా"

    "ఏం కార్డు ఇచ్చివెళ్ళాడో ఏమో!? ఇక్కడ ఏం తక్కువయ్యిందని అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు?" గొణిగినట్లు అంది ఆయా.

    "నాకు ఈ డాక్టరును చూస్తుంటే భయమనిపిస్తుంది" అంది గౌసియా.

    "ఎందుకు భయం? డాక్టరుసాబు చాలా మంచివాడు" అంది ఆయా.

    "వద్దు! నేను ఇక్కడ వుండను"

    "అయితే ఆ విషయం నువ్వే అడగరాదూ? నాతో ఎందుకు?"

    "డాక్టరు నన్ను ఇంతక్రితమే తిట్టాడు. అందుకే అడిగేందుకు భయం"

    "డాక్టరు ఆపరేషన్ రూములో వున్నాడు. బయటకి వచ్చేవరకు చాలా సమయం పడుతుంది. వచ్చాక చూద్దాంలే" అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది ఆయా.

    ఆమె అలా వెళ్ళిపోయిందో లేదో ఒక యువకుడు గౌసియా బెడ్ దగ్గరకు వచ్చాడు. అతడు ఔట్ పేషెంట్.

    "నీకు ఇక్కడ ఎవ్వరూ లేరా?" అడిగాడు ఆ యువకుడు.

    "లేరు" చెప్పింది గౌసియా.

    "నేను హైద్రాబాద్ వెళ్తున్నాను. వీళ్ళు నిన్ను తీసుకువెళ్ళకపోతే నేను తీసుకువెళ్తాను" అన్నాడు యువకుడు.

    "నువ్వెవరు?"

    "నాపేరు శ్యామ్. నేను డాక్టరు తమ్ముడ్ని"

    "అలాగా! మరి మీరెప్పుడు వెళ్తున్నారు"

    "ఈ సాయంత్రం వెళ్తాను"

    "అయితే నన్ను తీసుకువెళ్ళవా?"

    "అన్నయ్య కోప్పడ్తాడేమో అని భయంగా వుంది? అయినా అన్నయ్యకు సర్దిచెప్పుకుంటాను"

    "అంటే మీ అన్నయ్యకు చెప్పకుండా తీసుకువెళ్తావా?"

    "ముందే చెప్పాను కదా! వీళ్ళు ఒప్పుకుంటే సరి, లేదంటే నా వెంట తీసుకెళ్ళిపోతాను. అయినా అన్నయ్య చాలా స్ట్రిక్టు. కాబట్టి ఒప్పుకోరేమో అనిపిస్తుంది! అందుకే అన్నయ్యకు చెప్పకుండా అయితేనే నీవు ఇక్కడ్నుంచి బయటపడగలవు. ముందు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు"

    "నాకోసం నువ్వెందుకు ఇబ్బందిని ఎదుర్కోవడం?"

    "నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి అన్పిస్తోంది. నీలాంటి వాళ్ళకు సహాయం చేస్తేనే ఆ దేవుడు నన్నూ, మా అన్నయ్యను చల్లగా చూస్తాడు అని కూడా అన్పిస్తోంది" అని.

    "ఇప్పుడే వస్తాను" అంటూ అక్కడ్నుంచి బయటకు నడిచాడు.