Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 36వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 36వ భాగం

  వంగ దేశంలో కొలువు తీరి ఉన్నాడు కపిలేంద్ర దేవుడు.

  హృదయం ఉప్పొంగుతుండగా.. మాధవుడు అన్నిటా తానై నిలిచి నిర్వహిస్తున్నాడు. గణేశుల పాలన అనంతరం హిందూ రాజు రాజ్యం చేపట్ట బోతున్నాడు.

  కొలువులో అత్యధిక శాతం ముస్లిములే..

  చాలా మంది బలవంతంగా మత మార్పిడి గావింప బడ్డవారే. అందుకే వారికి ముసల్మాను రాజైనా, హిందూ రాజైనా ఒకటే. రాజు నిర్దేశించినట్లు నడుచుకోవలసిందే.

  ఒక్క సారి సభంతా కలయజూశాడు మాధవుడు.

  ఇరుపక్కలా వరుసగా అమర్చి ఉన్న ఆసనాలలో.. నాల్గవ వ్యక్తి మీద అతడి దృష్టి నిలిచింది.

  తన తండ్రిగారి పోలికలు చాలా కనిపించాయి.

  చిన్నాన్న.. నరసింహ గణేశ్. ఇప్పుడే పేరుతో పిలుస్తున్నారో!

  కళ్లలో చమరుస్తున్న నీటిని వెనక్కి తోసేశాడు. దేశం వదిలి వెళ్లినప్పుడు మాధవుని వయసు పది సంవత్సరాలకి అటూ ఇటూ ఐనా.. అనుభవాలు అతడికి అంతకంటే ఎక్కువ ఏళ్లని ఇచ్చాయి, మానసికంగా.

  అతడు ఎక్కడ గుర్తుపడ్తాడో అని వెంటనే తల తిప్పి సభలో మిగిలిన వారిని పరికించాడు.

  సగం మంది పైగా తన తండ్రికి తెలిసిన వారే.

  కానీ.. ఎవరూ తనని గుర్తించినట్లు లేదు.

  చనిపోయాడని అనుకుంటున్నారు. పైగా వేష భాషలు ఓఢ్ర యువకుని వలెనే ఉన్నాయి.

  కానీ.. సభలో ఉన్నవారి అహార్యాదులన్నీ ముసల్మానులవే.

  వాళ్లందరూ స్వచ్ఛందంగానే ఆవిధంగా తయారయ్యారా?

  సందేహమే.. ముమ్మాటికీ కాదు.

  అందరి మొహాల్లో ఒక రకమైన విరక్తి భావం. ఇప్పుడు కొత్త రాజెలా ఉంటాడో అనే ఆసక్తి కూడా కనిపించలేదు.

  ఏదేమైనా.. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు నిలుస్తుందో తెలియదు.. కానీ, హిందూ రాజ్యం ఏర్పడింది వంగ దేశంలో.

  ఢిల్లీ సుల్తానులెలాగా కాచుకునుంటారు.. వంగ దేశాన్ని కబళించడానికి.

  అందరూ కలుస్తే ఒక్క హిందూ రాజుని తరమడం ఏమంత కష్టం?

  అదంతా తరువాత..

  ప్రస్తుతం వరించిన విజయాన్ని.. సంబరాలతో జరుపుకోవడమే సమంజసం.

  ఎంతగా సర్ది చెప్పుకుందామనుకున్నా.. కన్నీరు ఆపుకో లేక పోయాడు మాధవుడు. కళ్లలో చిప్పిల్లుతున్న నీటిని, చూపుడు వేలితో విదిల్చాడు, తన పక్కకి తిప్పి.

  ఎవరూ చూడలేదనే అనుకున్నాడు.

  కానీ చూడ కూడని వారే చూశారు..

  “ఏమది మాధవ మంత్రీ! ఎందుకా ఆందోళన?” సింహాసనం మీద ఆసీనుడైన కపిలేంద్రుడు అడిగాడు.

  “ఏం లేదు ప్రభూ.. ఇవి ఆనంద భాష్పాలు. ఇంతటి వైభవం చూస్తుంటే సంతోషంతో..” నదరక బెదరక, ధీమాగా అన్నాడు, చిరు నవ్వుతో.

  మహారాజు కూడా మందహాసం చేశాడు.

  సభనంతా మాధవుడే నిర్వహిస్తున్నాడు. వంగ భాష వచ్చీరానట్లుగా మాట్లాడుతూ.. మధ్యలో సంస్కృత పదాలని ఉపయోగిస్తూ.. వంగ భాషలోనే మాట్లాడాలనే ఉత్సాహాన్ని అదిమి పట్టి.

  

                         

 

  పాండువా, జానుపూర్ సుల్తానుల వద్ద నుంచి సామంతులుగా ఉంటామని అంగీకార పత్రాలు తీసుకున్నాడు.

  అంతే కాదు..

  కప్పం కట్టించుకుని, ప్రతీ వత్సరమూ శ్రావణ మాసం లోగా కప్పం కట్టాలనీ, అది, ఆరు నూర్ల అశ్వాలతో పంపాలనీ ఒప్పందం చేసుకున్నాడు.. అది ఎంత కాలం సాగుతుందో అని మనసులో చింతిస్తూనే..

  వెంటనే ఒక శాసనం తయారు చేయించాడు..

  వంగ దేశాన్ని గౌడ దేశం అని కూడా అంటారు.

  గౌడ దేశాన్ని జయించిన మహారాజు కపిలేంద్ర వర్మకి “గౌడేశ్వర” అనే బిరుదునిచ్చినట్లుగా ఆ శాసనంలో రాయించాడు మాధవుడు.

  సభంతా కరతాళ ధ్వనులతో మారు మోగి పోయింది.

  సభికులంతా ఒక్కొక్కరే వచ్చి తమ పరిచయం చేసుకుని, మహారాజు గారికి అభివాదం చేసి వెళ్తున్నారు.

  మాధవుని పినతండ్రి వచ్చాడు. కుతూహలంగా చూశాడు మాధవుడు. అప్పటికి తన భావ కల్లోలాన్ని అదిమి పట్టగలిగాడు.

  “నా పేరు ‘నయీమ్ హస్సేన్’ సాబ్. ఇక్కడ కొత్వాల్ గా పనిచేస్తున్నాను.” ఉర్దూలో పరిచయం చేసుకుని.. మాధవుని వంక కూడా చూసి చిరునవ్వు నవ్వి వెళ్లిపోయాడు నయీమ్ గా మారిన నరసింహుడు.

  మహరాజు తరువాత వచ్చిన కోశాధికారితో మాట్లాడుతుండగా, పక్కకి తిరిగి పై వస్త్రంతో మొహం తుడుచుకున్నట్లుగా ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకున్నాడు మాధవుడు.

  చిన్నా భిన్నమై పోయిన తన కుటుంబం..

  చిన్నాన్న గారి పిల్లలు ఎలా ఉన్నారో.. ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు ఉండాలి.

  నయీమ్ మాత్రం మాధవుని గుర్తించలేదని తెలుస్తోంది.

 

             సీ.    చిందర వందరై చెదరి పోయినవయ్య

                            చక్కనైన కుటుంబ సంవిధములు

                     కొందరి మత మౌఢ్య కుత్సిస యుక్తిచే

                             కొందరి యత్యాశ కోరికలకు

                     నలిగి నాశనమైన నామరూపము లేని

                             నడిచేటి శవములై నలుగు వారు

                     ఎందరెందరిచట ఈ సభ యందున

                             కలరో యెవరయిన కనుగొనగను

 

            తే.గీ.  మానవుని మనుగడ కేమి మనన కేమి

                     కొఱత లేకుండుటకు నేమి కోర వలెను

                     మారణములేలనో మరి మతములేల

                     శాంతి సౌఖ్యము కల్గిన చాలు గాద.

     (సంవిధము= జీవిక, బ్రతుకు తెరువు, మనన= ఆయువు)

 

  మాధవుని ఆలోచనలు, మనసులో ఛెళ్లుమని కొట్టిన చర్నాకోల దెబ్బకి ఆగిపోయాయి.

  మరి తాము చేస్తున్నదేమిటి?

  మారణ హోమమే కదా!

  ఎంతమందిని చంపాడో లెక్కేమైనా ఉందా?

  కానీ.. తన చేతిలో ఏముంది? రాజు సేవకునికి వేరే దారి ఉండునా? చెప్పిన పని చేయుటే కదా! రాజు అనుగ్రహం ఉన్నంత కాలము ఏ సమస్యా రాదు. ఆగ్రహం వస్తే ఏమగునో తెలియదు.

  యాంత్రికంగా ఒక్కొక్కరినీ మహరాజు వద్దకు తీసుకొచ్చి పరిచయమయ్యాక వారి ఆసనమునకు పంపుతున్నాడు.

  చిన్నాన్నని కలిసి మాట్లాడుదునా.. అనేదే అతడి సమస్య.

  కలిసి తమవారి యోగక్షేమాలు అడగాలని ఉంది. అయితే.. చారులు అందరి కదలికల మీద కన్నేసి ఉంచుతారు. తాను ఏదో కుట్ర పన్నుతున్నాడని అనుమానం వచ్చినా ఆశ్చర్యము లేదు.

  మౌనంగా ఉండుటయే ఉత్తమం.

  మనసు చిక్క బర్చుకుని నిర్వికారంగా అచ్చటి నుండి కదిలాడు మాధవుడు సభ అయిన పిదప.

 

  కపిలేంద్రుడు తిరుగు ప్రయాణమునకు ఆనతి నిచ్చాడు.

  వంగదేశ విజయం.. అందులోని సామంతరాజులనీ, ఉద్యోగులనీ కలవడం మొదలైన పనులన్నీ సమాప్త మయ్యాయి.

  ఒక పక్షం రోజులయ్యాయి. అచ్చటి సుల్తానుకే రాజ్యం వప్పజెప్పి కదిలారు ఓఢ్ర సైనికులందరూ కళింగ రాజ్యానికి.

  పదిహేను రోజులు.. వ్యవధి దొరికినప్పుడు తను బాల్యంలో తిరుగాడిన ప్రదేశాలన్నీ తిరిగాడు మాధవుడు. ఆ సెలయేళ్లు, ఆ వనాలు, భవనాలు, తటాకాలు.. ఎచ్చటి కేగినా, చేయి పట్టుకుని నడిపించిన కన్న తల్లే కనిపించింది.

  

                        

 

   పల్లె పల్లె తిరిగాడు. అచ్చటి నావల్లో బాల బాలికలతో కలిసి కేరింతలు కొడుతూ విహరించాడు. సస్య శ్యామలమైన దేశం వంగ దేశం.

  చెరువుల్లో చేపలు పట్టాడు. తను పట్టిన చేపల్ని పల్లె వనితల చేత వండించుకుని కడుపార తిన్నాడు. వంటలోని అచ్చమైన వంగ రుచులు చిన్నప్పటి కోటలోని చవులను జ్ఞప్తికి తెచ్చాయి.

                

               ఆ.వె.    ఎక్కడెక్కడైన ఎంత తిరిగిననూ

                          నిక్కము కనడుగ మనిషి యునికినె

                          తనదు మాతృ దేశ దర్శనమ్మొసగుగా

                          ఎంత తృప్తి నైన ఎన్న గాను.

 

  ఎక్కడ తిరుగుతున్నా తన బంధువుల కోసం వెదకుతూనే ఉన్నాడు.

  ఏమో.. దాయాది అన్నదమ్ములు కనిపిస్తారేమో!

  కనిపించినా గుర్తు పట్టగలడా? వారి ఆహార్యమంతా ముసల్మానుల వలే ఉంటుంది కదా! అయినా.. ఎక్కడో చిరు ఆశ..

  అదే నిజమయింది..

  ఒకరోజు.. తాము చిన్నప్పుడు తరచుగా విహరించే వనానికి వెళ్లాడు మాధవుడు. అది తమ కుటుంబానికే పరిమిత మయింది ఒకప్పుడు. మారిన పరిస్థితులలో ఆ వనం రాజుగారి కోటలోకి చేరి పోయింది.

  ఆ వనంలోని తటాకంలో కొద్ది సేపు ఈత కొట్టి, తాను చిన్నప్పుడు సేద తీర్చుకునే వటవృక్షం నీడని కూర్చున్నాడు మాధవుడు.

  అనుకోకుండా నోటివెంట పలికిందొక విషాద కవిత.

 

                సీ.     ఇచ్చోటనే గద ఏ యరమరికలు

                               లేక చిట్టి చిలకలె దరి చేరె

                        తరుముతు తరుముచూ దాగుడు మూతలు

                               యాడిన పొదలన్ని యవియె కాద

                         చిన్నారి పొన్నారి చిరుత కథలు యెన్నొ

                               పాడిగ యత్తలు పలుకగాను

                         ఈ నీడ నిదురించి ఎన్నగా నెన్నెన్ని

                               కనిన కలలు యన్ని కల్లలాయె

 

              ఆ.వె.  అమ్మ యొడిన నిచట యలసి నిదురపోగ

                        అన్నదమ్ములదిగొ యాట లేప

                        సోదరి యిట కేగి సొలసినఁ దమ్ముని

                        యొడిని చేర్చు కొనగ యూరడిల్లె.

 

  చాటువు చెవిని పడగానే, అటుపక్క గుర్రంమీద వెళ్తూ ఆగి విన్న ఒక యువకుడు మాధవుని చెంతకు వచ్చాడు.

  అతడే తన చిన్నాన్న నరసింహుని సుతుడే అయుండచ్చు నని అనిపించింది మాధవునికి. మాధవుని కన్న రెండు సంవత్సరాలు పెద్ద వాడు.

  “చాలా బాగా చెప్పారే.. మీకు ఈ పరిసరాలు తెలుసా మంత్రీ?”

  అక్కడ ఎవరికీ తెలుగు రాదులే అని తన ప్రజ్ఞ చూపబోయిన మాధవుడు ఆశ్చర్యంగా చూశాడు.

  “మీరు..”

  “కొత్వాల్ నయీమ్ హుస్సేన్ గారి కొడుకును, ఆజమ్ హుస్సేన్. నాలుగు వత్సరములు బీజాపూర్ బహమనీ సుల్తాను వద్ద సైన్యంలో ఉన్నాను, మా రాజు గారి ఆజ్ఞతో. అందుకే తెలుగు వచ్చు బాగా. మీ భావం అర్ధమయింది. ఈ ప్రాంతాన మీరు బాగుగా తిరిగినట్లున్నారే..”

  మాధవుని మనసులో వేవేల ధ్వనులు.. ఒక్కసారి అన్నని ఆలింగనం చేసుకో గలుగుతే.. ముందుకు రాబోయాడు..

  అమ్మ మాట గుర్తుకొచ్చింది.. ‘అజ్ఞాత కుల శీలస్య వాసో దేయో న కస్యచిత్’ ఎవరికీ నీ పుట్టు పూర్వోత్తరాలు తెలియ నియ్యకు..”

  బుద్ధి, మనసు వివాదంలో పడ్డాయి, మాధవునిలో..

                                     …………………….

......మంథా భానుమతి