Facebook Twitter
" ఏడు రోజులు " 11వ భాగం

" ఏడు రోజులు " 11వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 


 

బిచ్చగాడు పార్క్ దాటుకుని వెళ్ళిపోసాగాడు. ఇంకా అతడ్నే చూస్తున్న జోసెఫ్ మళ్ళీ అన్నాడు.
    
    "బిచ్చగాళ్ళు అందరూ బికార్లు కాదురా! అప్పులు కూడా ఇస్తూ అడుక్కుతినేవాళ్ళు వుంటారు"
    
    అవును అన్నట్టుగా చిన్నగా నవ్వారు మిత్రులు.
    
    "ఒరే అరవిందస్వామీ! మనీషాకొయిరాల నీ స్వంతం కావాలంటే ఒక్కటే ఒక్క మార్గం" వెంటనే టాపిక్ మార్చాడు జోసెఫ్.
    
    "ఏంట్రా?" జోసెఫ్ కు దగ్గరగా జరిగాడు భవానీశంకర్.
    
    "నేను చెప్పిన మార్గాన్ని నువ్వు  అనుసరించాలి అంటే నీకు హీరో లెవెల్లో గేట్స్ వుండాలి"
    
    "ముందు మార్గం చెప్పరా?"
    
    "ఓరి పిచ్చోడా! నేను చెప్పబోయేది అల్లా ఉద్దీన్ ఉపాయదీపం"
    
    "టెన్షన్ పెట్టొద్దు వెంటనే చెప్పేసేయ్" అని భవానీశంకర్ అనగానే.
    
    "చెప్పరా వెధవా" మిగతా ఫ్రెండ్స్ తొందరపెట్టారు.
    
    జోసెఫ్ మిత్రులు అందరివైపూ ఒక మారు బిల్డప్ ఇస్తూ చూసి.
    
    "మరేం లేదురా! మన అరవిందస్వామి, మనీషాకొయిరాలను పెళ్ళి చేసుకుంటే అటు గొడవలు రాకూడదు. ఇటు మనస్పర్ధలు పెరగకూడదు అందరూ ఏకాభిప్రాయంతో వుండాలంటే..." అని కాసేపాగి, "ఆ... ఏం చేయాలంటే గౌసియాను రంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకో! ఆ పెళ్ళి ఎక్కడ జరగాలో తెల్సా? క...ల...లో" తాపీగా అన్నాడు.
    
    మిత్రులంతా జోసెఫ్ మాటలకు హాయిగా నవ్వారు భవానీశంకర్ మాత్రం జోసెఫ్ వైపు కొరకొరా చూశాడు.
    
    అంతలో అటుగా ఒకావిడ వచ్చింది. ఓ చంకలో పిల్లాడ్ని ఎత్తుకుని మరో చంకలో జోలె తగిలించుకుని మాసిన బట్టలతో తైల సంస్కారం లేని జుట్టుతో దీనంగా వుందామె.
    
    "జాతకం బాపతే కావొచ్చు" ఆమె రాగానే అన్నాడు జోసెఫ్.
    
    "తమరిది ఏ ఊరు?" నమ్రతగా అడిగడు జోసెఫ్.
    
    "సిత్తూరు"
    
    "పచ్చబొట్టు పొడవడంలో బాగా ప్రాక్టీస్ ఉందా?"
    
    "బాగా పేక్టీసు వుంది. ఇది మాకు కూడుబెట్టే యిద్య గదా బాబూ! చిన్నప్పుడే ఈ యిద్య నేర్చుకున్నాను"
    
    "అయితే నువ్వు వెంటనే అమెరికా వెళ్ళిపో"
    
    "ఎందుకు బాబూ?"
    
    "అక్కడివాళ్ళకు పచ్చబొట్లు పొడిపించుకోవాలంటే మహా వెర్రి! అక్కడయితే నువ్వు లక్షలకి లక్షలు సంపాయించుకోవచ్చు"
    
    "అక్కడికి ఎళ్ళడానికి సార్జి ఎంతవుతుంది?"
    
    ఆ మాటకు అందరికి నవ్వొచ్చింది.
    
    "నూర్రూపాయలు" నవ్వుతూనే చెప్పాడు జోసెఫ్.
    
    "గా నూర్రూపాయలు వుంటే మా తాగుబోతోడు వుండనివ్వడు" విచారంగా అని, "పచ్చబొట్టు తమరు పొడిపించుకోరా బాబూ?" అందర్నీ చూస్తూ అడిగింది.
    
    "వద్దు పోమ్మా" అందరి తరుపునా తనే సమాధానం చెప్పాడు జోసెఫ్.
    
    "అగ్గువకు కొడతాను బాబూ" ఆమె గొంతులో అభ్యర్ధన.
    
    "అగ్గువ అంటే పదిపైసలకా? "ఆ దుడ్లు సెల్లవుబాబూ"
    
    "మావద్ద అంతకంటే ఎక్కువలేవు"
    
    "వున్న మారాజులు అట్లా మాట్లాడగూడదు బాబూ"
    
    "మరి ఎంత అడుగుతావు?"
    
    "పేరుకు ఐద్రూపాయలు"
    
    "రూపాయి ఇస్తాం"
    
    "అన్నేయం బాబూ! సంటిపిల్లోడికి ఆకలైంది. రేత్రినుండి ఏం లేదు" ఆమె గొంతు లోనే కాదు ముఖంలోనూ దీనత్వం.
    
    బిచ్చగాళ్ళ గురించి సరదాగా హాస్యం చేస్తున్నాడు కాని, ఆమె ఆ మాట మాట్లాడగానే జోసెఫ్ మనసు నిజంగానే కరిగింది. అందుకుతోడుగా ఆమె చంకలో కూర్చున్న పిల్లాడు ఆమె కొంగు పట్టిలాగుతూ ఆమె రొమ్ముకోసం వెదుకుతున్నాడు.
    
    "శంకర్! నువ్వు పొడిపించుకోరా" చెప్పాడు జోసెఫ్.
    
    "నాకు భయం"
    
    "భయం దేనికి? నీకు వున్న సీన్ మాకే వుండివుంటే ఈపాటికి పచ్చబొట్లతో నిలువునా మునిగిపోయేవాళ్ళం" జోసెఫ్ అంటుంటేనే తన ప్రాణసఖి గౌసియా పేరును తన చేతిమీద శాశ్వతంగా ముద్రించుకోవాలన్న తలంపు వచ్చింది భవానీశంకర్ కు.
    
    "పచ్చబొట్టు పొడిపించుకోవాలనే వుంది. కాని ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంకేమైనా వుందా?" వచ్చి ఆమె ముందు కూర్చుంటూనే అన్నాడు భవానీశంకర్.
    
    "ఆ భయం వుంది కాబట్టి సింపుల్ గా 'జి' అని పొడిపించుకో చాలు" చెప్పాడు జోసెఫ్.
    
    "సరే" అన్నాడు భవానీశంకర్.
    
    మరో మిత్రుడు భవానీశంకర్ మణికట్టు మీద పెన్నుతో 'జి' అని రాసాడు.
    
    "కాస్త మెల్లగా పొడవాలి" ఆమెకు ముందుగానే చెప్పాడు జోసెఫ్.
    
    "అట్లాగే బాబూ" అంటూ తీరిగ్గా బాసింపట్టు వేస్కుని కూర్చుని, పిల్లాడిని తన వీపుకి తగిలించుకుని వున్న మరో జోలెలో కూర్చోబెట్టుకుని, ఇంకో జోలెలో వున్న పచ్చబొట్టు తాలూకు సామాగ్రిని వెలుపలికి తీసింది.
    
    మునదేలివున్న ఆ సామాగ్రిని చూడగానే భవానీశంకర్ కాళ్ళూ చేతులు వణకనారంభించాయి. అయినప్పటికీ గౌసియా పేరును పొడిపించుకోబోతున్నాను అనే ఆనందం, తృప్తి అతడి భయాన్ని డామినేట్ చేస్తున్నాయి.
    
    "బాబూ కళ్ళుమూసుకో" భవానీశంకర్ కు చెప్పిందామె.
    
    "ఓ దేవుడా! నొప్పి కాకుండా చూడు తండ్రీ!" మనసులో అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు భవానీశంకర్.
    
    ఆమె తమ కొండదేవరలకు ఒకసారి పేరుపేరునా దండంపెట్టుకుని, ఆ తర్వాత నెమ్మదిగా భవానీశంకర్ చేతిమీద పచ్చబొట్టు పొడవనారంభించింది.
    
    "అ....మ్మా..." మొదటి పొడుపుకే అతడి బాధ వర్ణనాతీతం అయిపోయింది.
    
    అతడి బాధ తమక్కూడా బాధే అన్నట్టుగా మిత్రుల ముఖాల్లోనూ బాధావీచికలు ప్రస్ఫుటం అవ్వసాగాయి. ప్రతి పొడుపుకీ భవానీశంకర్ కుదించుకుపోతుంటే, అతడి చేయి పట్టుకుంటూ, అతడి భుజాల్ని పట్టుకుంటూ "అయిపోతుంది లేరా" అంటూ అనునయిస్తున్నారు మిత్రులు.
    
    పచ్చబొట్టు పొడవడం పూర్తయ్యేసరికి భవానీశంకర్ చేయి రక్తసిక్తం అయిపోయింది పొడవడం పూర్తయినప్పుటికీ ఇంకా పొడుస్తున్న బాధే గుండెను పిండసాగింది.
    
    "గాయం ఎన్నిరోజుల్లో తగ్గుతుంది" తన షర్టుజేబులోంచి ఐదురూపాయలనోటు తీసి ఆమెకు అందివ్వబోతూ అడిగాడు జోసెఫ్.
    
    "వారం పదిరోజుల్లో మానిపోతుంది" అంటూ తనే గాయానికి కట్టుకడుతూ, ఐదు రూపాయల నోటును అందుకోబోయిందామె.
    
    "వద్దు, నేనే ఇస్తాను" అంటూ జోసెఫ్ ను వారించి, తన స్వంత డబ్బుల్ని ఆమెకు ఇచ్చాడు భవానీశంకర్.
    
    "ఏం? నేనివ్వకూడదా?" అడిగాడు జోసెఫ్.
    
    "ఇట్లాంటివాటిని స్వంత ఖర్చుతో గావించాలి" అన్నాడు భవానీశంకర్.
    
    "సెంటిమెంటా?" అన్నాడు జోసెఫ్.
    
    "అఫ్ కోర్స్" అన్నట్టుగా చిన్నగా నవ్వాడు భవానీశంకర్.
    
    అతడి మనసునిండా ఇప్పుడు ఏ ఆతృతో నిండిపోయివుంది. తన పచ్చబొట్లను గౌసియాకు చూపించాలని, అప్పుడు ఆమె కళ్ళల్లో కదలాడే అపురూప భావాల్ని మౌనంగా ఆస్వాదించాలని ఎంతో ఆరాటంగా వుంది. అందుకే బాధలోనూ నవ్వగలుగుతున్నాడు.
    
    "ఇంకెవరైనా పొడిపించుకుంటారా బాబూ?" అడిగిందామె.
    
    "ఎవ్వరికీ వద్దు" చెప్పాడు జోసెఫ్.
    
    "సల్లంగ బతకండయ్యా" అందర్నీ ఒక మారు చూసి అని, ఐదురూపాయల్ని కళ్ళకు అద్దుకుంటూ అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయిందామె.
    
    "అమరప్రేమికుడివి అయిపోయావు" భవానీశంకర్ గాయాన్ని మృదువుగా స్ప్రుశిస్తూ అన్నాడు జోసెఫ్.
    
    అందుకు చిన్నగా నవ్వి "పచ్చబొట్టు చెదిరిపోనట్టే మా ప్రేమ కూడా చెదరకూడదు" అన్నాడు భవానీశంకర్.

....... ఇంకా వుంది .........