Facebook Twitter
" ఏడు రోజులు " 9వ భాగం

" ఏడు రోజులు " 9వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 


 

ఇంటికి వచ్చాక గౌసియావాళ్ళ ఇంటివైపు చూస్తుంటే బాధకి తోడుగా ఆవేశం పుట్టుకొచ్చింది అతడికి. నేరుగా వాళ్ల ఇంట్లోకి చొచ్చుకుపోయి, అందర్నీ చెడమడా తిట్టీ కొట్టీ, గౌసియాను తెచ్చుకోవాలన్పించింది.

ఊహల్ని, కలల్ని అనుకున్న తక్షణమే నిజం చేసుకోవడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అక్కడలేదు కాబట్టి, అసహాయంగా ఇంట్లోకి నడిచాడు.

అప్పటికి చింతకాయ చెట్నీ తయారుగా పెట్టి ఉంచింది తల్లి లక్ష్మీ దేవమ్మ. పులకాలు తిన్నాడు అతడు.

" ఏంట్రా అదోలా ఉన్నావు?" అడిగింది లక్ష్మీ దేవమ్మ.

" ఏంలేదు" అన్నాడు శంకర్.

" సరేగాని, నేను గిర్నీకి వెళ్లొస్తాను. ఇల్లు జాగ్రత్త" చెప్పి జొన్నల డబ్బాని నడుముకి ఎత్తుకుని ఒయటకి నడిచింది లక్ష్మీ దేవమ్మ.

" పోలీస్ స్టేషన్ కి ధైర్యం చేసుకుని ఎలా వెళ్లాలి?" ఆలోచిస్తూ ఇంట్లోనే అటూ ఇటూ తిరగసాగాడు భవానీశంకర్.

కాసేపటి తర్వాత అతడి మిత్రుడు గోపాల్ వచ్చాడు. మిత్రుడ్ని చూడగానే తనకేదో అండ దొరికినట్లుగా తోచింది అతడికి. వెంటనే సమస్య గురించి మిత్రుడితో చెప్పుకున్నాడు.

" నేను నీకు మొదట్నుండీ చెప్తూనే ఉన్నాను. ముస్లీం పిల్లతో ప్రేమాధోమా అని తిరగవద్దురా అని! ఇప్పుడు చూడూ ఎంత పెద్ద సమస్య ఎదురయ్యిందో ?" అంతా విన్నాక అన్నాడు గోపాల్.

" మొత్తానికి ఏం చేద్దామంటావురా?"

" నీకు ఆ సిరాజ్ తప్ప, మన ఫ్రెండ్స్ ఎవ్వరూ సహాయం చేయరు. ఇప్పుడా సిరాజ్ కూడా సహాయం చేయడు అంటున్నావు. కాబట్టి ఆ పిల్లను మర్చిపో"

" అదేంట్రా?"

" లేకపోతే ఏంట్రా? ప్రేమించడానికి నీకు ఆ పిల్లే దొరికిందా? మేము వద్దన్న పనిచేశావు కాబట్టి, నీకు మంచి శాస్తి జరిగింది. జరిగిందేదో జరిగిపోయిందికాని మనం కృష్ణానగర్ వెళ్దాంరారా. మనిద్దరమే కాదు మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు అన్నాడు గోపాల్.

" కృష్ణానగర్ ఎందుకు?" అడిగాడు భవానీ శంకర్.

" రజకీకాంత్ షూటింగ్ జరుగుతుందట. మన అభిమాన హీరోని చూడబోతున్నాం. లక్ అంటే మనదే" సంబర పడిపోయాడు గోపాల్.

" నేను రాలేను" అన్నాడు భవానీశంకర్.

" రారా" గట్టిగా పిలిచాడు గోపాల్.

" నన్ను అర్ధం చేసుకో"

" అర్ధం చేసుకున్నాను, అందుకే రమ్మంటున్నాను"

అర్ధం కానట్టుగా చూశాడు భవానీశంకర్

" ఎంతయినా స్నేహితుడివి కాబట్టి వద్దన్న పని చేసినా సహాయం చేయక తప్పదు. పోతే రెండ్రోజులు ఆగాలి. ఎందుకంటే మా పోలీసు మామ ఎల్లుండి వరంగల్ నుండి వస్తున్నాడు. మా మామకి ధైర్యం బాగా ఎక్కువ. నక్సలైట్ ఏరియాలో ఉన్నాడు కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకొని కూడగట్టుకొని కరడుగట్టిన సింహంలా మారిపోయాడు. ఎవ్వరికీ భయపడడు. ఆయనతో నీ సమస్య చెప్పుకుంటే తప్పకుండా నీకు మేలు జరుగుతుంది" చెప్పాడు గోపాల్.

" అంతలోపే.." భవానీశంకర్ మాట్లాడబోయాడు.

" ఇంకేం మాట్లాడవద్దురా! నువ్వు ఆగాల్సింది రెండు నెలలు కాదు రెండ్రోజులు. ఆ రెండ్రోజుల్లో కొంపలేం అంటుకుపోవుకాని, మా వెంట కృష్ణానగర్ వచ్చేసేయ్"

అయిష్టంగా నిలబడిపోయాడు భవానీ శంకర్.

" నువ్వు రాకపోతే నేను సహాయం చేయను" అన్నాడు గోపాల్.

" వస్తాలేరా" అన్నాడు భవానీశంకర్ అన్నాడే కాని వెళ్లడం అతడికి ఏమాత్రం ఇష్టంలేదు.
గిర్నీ నుండి తల్లి వచ్చాక చెప్పేసి గోపాల్ వెంట బయలుదేరి కృష్ణానగర్ వెళ్లాడు భవానీ శంకర్. షిరాజ్ తప్ప మిగతా ఫ్రెండ్స్ అంతా వచ్చారు. షిరాజ్ కూడా వచ్చేవాడే కానీ తమ అమ్మానాన్నలు వచ్చినందుకు రాలేదు. అందుకే అమ్మకూచిగాడు అంటూ అందరూ వెక్కిరించి నవ్వారు.

భవానీ శంకర్ మాత్రం స్తబ్దుగా ఉండిపోయాడు. అభిమాన నటుడ్ని చూస్తూనే అభిమాన బాంధవి గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టే స్నేహితులతో కలిసి ఎప్పట్లా ఆనందాన్ని పంచుకోలేకపోతున్నాడు.

 
చూస్తుం
డగానే చీకటయింది ఇంటికి రావాలనుకున్నాడు భవానీశంకర్. కానీ ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉండిపోతూ అతడ్ని కూడా కదలనివ్వలేదు.

బుధవారం.........
 
వేకువజామున ఐదుగంటలు కావొస్తోంది.

దూరంగా ఉన్న కేశవస్వామి గుడిలోంచి వెంకటేశ్వర సుప్రభాతం సుమధురంగా వినబడుతోంది.

పబ్లిక్ పార్క్ లో పచ్చిక తివాసీమీద పడుకుని ఉన్న భవానీశంకర్ ఆవులిస్తూ నిద్రలేచి కూర్చున్నాడు. మిత్రులు ఇంకా నిద్రలేవలేదు.

" లేవండ్రా" ఒళ్లు విరుస్తూ లేచి నిల్చున్నాడు భవానీశంకర్.

ఒక్కడూ పలకలేదు.

" మొద్దునాకొడుకులు" అనుకుంటూ ఫౌంటేన్ దగ్గరికి వెళ్లి ముఖం కడుక్కొని వచ్చి, ఎక్కర్ సైజ్ మొదలెట్టాడు.

పార్క్ పక్కగా ఉన్న రోడ్డు వెంబడి కొంత మంది రన్నింగ్ చేస్తూ వెళ్తున్నారు. మరికొంతమంది వాకింగ్ చేస్తున్నారు.

" ఉన్న మహారాజులు కాసేపు వ్యాయామం చేస్తారు. ఆ తర్వాత  కార్లల్లో వెళ్లిపోతారు. వాళ్లనే చూస్తూ మనసులో అనుకుని, ఆతర్వాత చుట్టూ ఉన్న బంగళాలవైపు చూస్తూ భూజాలు ష్రగ్ చేస్కున్నాడు.

పదిహేను నిముషాల్లో వ్యాయామం పూర్తిచేసి మిత్రులవైపు చూశాడు భవానీశంకర్. వాళ్లు ఇంకా నిద్రలేచినట్టు లేరు.

" రేయ్! లేవండ్రా! బిచ్చగాళ్లమైపోయాం... " అంటూ మిత్రులవైపు నడిచాడు అతడు.

మిత్రుల్లో చలనం లేదు.

" ప్చ్! ఈ బంగళా మనుషులం కాకపోయినా ఈ పార్క్ మనుషులం మాత్రం కాదురా మనం! లేవండి.. ఇంక వెళ్ళి పోదాం " అన్నాడు.
షరామామూలే ఒక్కడూ కదల్లేదు.

" మీ సినిమా పిచ్చి పాడుగానూ, నన్ను చంపుతున్నారేంట్రా?" విసుగ్గా అన్నాడు.

" హే... ఎంట్రా?"


" నీదో జోరీగ రొద అయ్యింది ఏంట్రా?"

" నీ కంటే ఆ బాలస్వామి... సాయిబులు నయ్యం"

" వీడి దవడ పగలగొట్టండి"

మిత్రులు ఒకరితర్వాత ఒకరు విరుచుకుపడ్డారు. భవానీశంకర్ కు చిర్రెత్తుకొచ్చింది.

"నిద్రను జయించండిరా! జీవితాన్నే జయిస్తారు" అన్నాడు.

" ఆ! ముందు నీ ప్రేమను మా ప్రమేయం లేకుండా జయించు " నిద్రమబ్బుతో అన్నాడు ఒక మిత్రుడు.

" ఎవడ్రా?" మిత్రులవైపు చూసాడు భవానీశంకర్.

అందుకు ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. తమలో తామే గుణుక్కుంటూ అలాగే పడుకుండిపోయారు.

చేసేదిలేక భవానీ శంకర్ మిత్రుల మధ్య కూర్చుని, పాలుపోక అటూఇటూ చూడసాగాడు. తమకు కాసింత దూరంలో బిచ్చగాళ్లు ఐదారుగురు పడుకుని ఉన్నారు. ఎడంగా చూస్తే ఓ పిచ్చోడు నిద్రపోతూ నిద్రలోనే ఏదో గుణుక్కుంటున్నాడు.

" అయ్ బాబోయ్" అనుకుంటూ వెనక్కి చూస్తే కాసింత దూరంలో ఒక బిచ్చెగత్తే నగ్నంగా పడుకుని ఉంది.

" అబ్బా! ఈ సన్యాసి వెధవలు బతుకును ఫుట్ పాత్ చేసేశారు" అనుకుంటూ తలపట్టుకున్నాడు భవానీశంకర్.

 

....... ఇంకా వుంది .........