Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 19వ భాగం

                        ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 19వ భాగం

   “మాధవా! మనం వేగిరం ప్రాతః కాల సంధ్యాదులు పూర్తి చేసుకుని, చక్కని దుస్తులు, ఉత్తరీయం ధరించి తయారవాలి. ఇవేళ ఒక విశిష్ట వ్యక్తిని కలువ బోతున్నాము.” తొలి కోడి కూసిన వెను వెంటనే మాధవుడిని నిదుర లేపాడు పురుషోత్తముడు.

   మాధవుడు, తను చేయవలసిన పని రాకుమారుడు చేస్తున్నందుకు బిడియ పడుతూ లేచి మిత్రునికి అభివాదం చేసి, ఇరువురి పడక బట్టలనూ సరి చేసి, వసతి గృహంలో పెట్టి వచ్చాడు.

  బావి వద్దకేగి కాలకృత్యములు తీర్చుకుని ఏటి ఒడ్డునకేగారు మిత్రులిరువురూ.

  పచ్చపచ్చని వరిచేల అందాలనీ, భానోదయానికి స్వాగతం పలుకుతూ ఎర్రని తివాచీ పరచినట్లున్న ఆకాశాన్నీ చూస్తూ పరవశమౌతూ, ఆదిత్యహృదయం చదవసాగాడు మాధవుడు. అది గౌతమి నేర్పిన అలవాటు. స్నానం పూర్తి అవుతూనే అసంకల్పితంగా “రశ్మిమంతం సముద్యంతం..” అని మొదలు పెట్టేస్తాడు.

  పురుషోత్తముడు ధ్యానం చేస్తున్నాడు.

  సూర్యోదయం అవుతుండగానే ప్రత్యక్ష నారాయణ మూర్తికి అర్ఘ్యం అర్పణ చేసి, దుస్తులు మార్చుకుని, ఆలయానికి వెళ్లి, శ్రీరాముని దర్శనం చేసుకున్నారు.

  జగన్నాధుని భక్తుడైన పురుషోత్తముడు విష్ణు ఆలయం చూస్తే మైమరచి పోతాడు.

  ఆ దిప్యమంగళ విగ్రహాన్ని చూసి తరించి ఆలయం బయటికి రాగానే కనిపించిందొక సుందర దృశ్యం.

  చెట్ల ఆకుల మధ్యలోనుంచి సూర్యకిరణాలు ఆలయ ప్రాంగణ మంతా పరుచుకున్నాయి.

  ఆలయమంతా , తెల్లవారకుండానే భక్తురాళ్లు వచ్చి తీర్చిదిద్దిన రంగవల్లులతో కళకళలాడుతోంది.

  నేలరాలిన పొగడపూలని కూడా రంగవల్లుల్లాగ తీరుగా, అందంగా దిద్దారు వనితలు. వాటినుంచి వచ్చే తేలికైన పరిమళం ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.

  వసతి గృహ యజమాని చెప్పినట్లుగానే అక్కడ, చెట్టు కిందనున్న అరుగు మీద ఆసక్తి కరమైన సాహిత్య చర్చ సాగుతోంది.

 

                        సీ.   మబ్బు ల చాటున మఱుగున దాగిన

                                       వెలుగు ఱేడు యతడు వేగ రాగ

                               వేద పండితులంత వీధరుగున చేరి

                                       పఠనము సేయగ పనస లన్ని

                               కవిసార్వభౌముడు గంగాధరుడికిని

                                       యభిషేకము సలిపి యనువు నెంతొ

                               కొలువుతీరె నపుడె కోవెల నందున

                                       సాహిత్య చర్చలే సలుప గాను

 

                    తే.గీ.   చేరి కవులు, కోవిదులంత చేరికగను

                              మారు పలుకక కవిరాజు మాట లన్ని

                              కోరి వినుచు తామంతయు కూర్మి తోను

                              భూరి పదములే కదయని పొగుడు నంత.

 

   

  రాగయుక్తంగా వినవస్తున్న సీస పద్యాల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, పరిసరాలను పరికించడం మాని అటు పక్కగా చూశాడు మాధవుడు.

  సంభ్రమంగా కన్నులు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు ఐదు క్షణాలు.

 

  “మిత్రమా! శ్రీనాధుల వారు.” మాధవుడు చిన్నగా అరిచాడు ఉద్వేగంతో.

  “నీకెలా ఎరుక మిత్రమా?” ఆశ్చర్యపోతూ అడిగాడు పురుషోత్తముడు. తాను మిత్రుడిని తక్కువగా అంచనా వేశాడు.. అతడికి చాలా విషయాలు తెలుసును.

  “వారి చిత్రపటం నావద్ద ఉన్నది రాకుమారా! ఒక సారి కాశీ యాత్ర కేగుతున్న పండితులొకరు నాకు ఇచ్చారు. తేలికగా గుర్తుపట్టేశాను.”               

 

                         

 

  మిత్రునికి శ్రీనాధ కవీంద్రుని చూపించి ఆశ్చర్యాంబుధిలో ఓలలాడిద్దామని సంబర పడిన పురుషోత్తమునికి కించిత్ ఆశా భంగం కలిగినా, మాధవుని గ్రహణ శక్తికి ముచ్చట పడకుండా ఉండలేక పోయాడు.

  “కొద్దిగా చిక్కారు, చిత్రపటం కన్నా.. వయో భారంతో. అయినా ఆ ఠీవి, ఆ గాంభీర్యం వేరెవరికుంటాయి చెప్పండి. తారల మధ్య చంద్రునిలా వెలిగి పోతున్నారు పండితుల మధ్య. వీరినేనా చూపిస్తానన్నారు? అందుకేనా మనం ఇచ్చట మజిలీ చేశాము..” సంభ్రమానందాలతో ఏక బిగిన ముచ్చటిస్తున్న మాధవుని చిరునవ్వుతో వారించాడు పురుషత్తమ దేవుడు.

  “నాకు కూడా తెలియదు మిత్రమా! వారు దేశాటనలో ఉన్నారని మాత్రమే తెలుసు. గృహ యజమాని నిన్న రాత్రి చెప్పగానే నాకు కూడా విస్మయం కలిగింది. ఈరోజు వారిని కలవడానికనే ఇక్కడ ఆగుదామన్నాను. కలుసుకున్నాక నీ సంతోషాన్ని చూద్దామనుకున్నాను. ఈలోగానే..”

  “ధన్యుడిని మిత్రమా! ఇంత భాగ్యం కలిగించావు. ఎప్పుడెప్పుడు వారిని కలిసి నాలుగు మాటలు వారి నోట విందామా అని ఆతృతగా ఉంది.” మాధవుడు ముకుళిత హస్తాలతో అన్నాడు.

  “మనం కూడా వెళ్లి వెనుక వరుసలో కూర్చుని వీక్షిద్దాం.” పురుషోత్తముడు దారి తీశాడు.

  మాధవుడు ఏదో లోకంలో ఉన్నట్లుగా మిత్రుడిని అనుసరించాడు. అతడికి ఇంకా నమ్య శక్యంగా లేదు. తన చిరకాల వాంఛ నెరవేర బోతోందా? శ్రీనాధ మహాకవిని ప్రత్యక్షంగా చూస్తున్నాడా?

  కళ్లు మాటి మాటికి చెమరుస్తున్నాయి. తనతో మాట్లాడుతారో లేదో.. చూడగానే ఏమనాలి?

  వెనుక వరుసలో గురువుగారి మోము కనులకు బాగా ఆనేలాగ కూర్చున్నారు. తన్మయత్వంతో వీక్షిస్తూ కూర్చున్నాడు మాధవుడు. కలలో లాగ వినిపిస్తున్నాయి వారి పలుకులు.

  “ప్రౌఢ దేవ రాయల కొలువులో, డిండిమభట్టుతో వాదన చేయు సమయంలో మీకు ఏమనిపించింది మహా కవీ?” ఒక పండితుడు కుతూహలం తో అడిగాడు.

  “శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా తెలిసి నప్పడు, రచించిన కావ్యాలలో ఏ దోషమూ లేదన్న ధీమా ఉన్నపుడు ధైర్యంగా ఉంటుంది పండిత వర్యా! మన కున్నది అంతా సరస్వతీ కటాక్షం, ఆ పరమేశ్వరుని అనుగ్రహం అనుకున్నపుడు ఏ ఆందోళనా ఉండదు. గౌడ డిండిమభట్టులవారు ఉద్దండ పండితులు. వారితో వాదించ గలిగే అవకాశం దొరకడమే నాకు అపురూపం.” శ్రీనాధుని పలుకులలో ఎంతో వినయం.

  “సెలవు కవీశ్వరా! మరల రేపు సమావేశ మవుదాము.” ఒకాయన సైగ అందుకుని, పండితులు లేచారు.

  “చెప్పలేను పండితులారా! రేపే శ్రీశైలం పయనమవుదామనుకుంటున్నాము, ఆ మల్లిఖార్జునుని ఆనతి కలుగుతే..” శ్రీనాధుని మాటలకు విచారంగా చూశారందరూ. ఒక్కొక్కరే వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, భారమైన హృదయాలతో అక్కడి నుంచి కదిలారు.

  అందరూ కదలి వెళ్లాక, వెనుక వరుసలో కూర్చున్న మిత్రులిరువురూ లేచారు.

  ఇద్దరినీ దగ్గరగా రమ్మని సైగ చేశాడు శ్రీనాధుడు. దగ్గరగా వెళ్లి పాదాభివందనం చేశారు. చెరో పక్కనా కూర్చోమని చెప్పి, పరీక్షగా మొహాల్లోకి చూశాడు కవీంద్రుడు.

  “ఇంతవరకూ మిమ్ములను ఇక్కడ చూడలేదు. ఎవరు నాయనా?” కొద్దిగా వణుకుతున్నట్లున్న కంఠం.. అయినా ఝంకారం తగ్గ లేదు.

  “బాటసారులం కవి సార్వభౌమా! కళింగ నుంచి కాంచీపురం వెళ్తూ మధ్యలో మజిలీ చేశాము.” పురుషోత్తముడు జవాబిచ్చాడు.

  “కళింగ దేశమా? మీరు బాట సారుల వలె లేరే? కార్యార్ధులై సాగుతున్నట్లున్నారు. మోముల్లో రాచకళ ఉట్టి పడుతోంది. ఈ కుర్రవాడు వంగ దేశస్తుని వలే ఉన్నాడు. గజపతులు రాజమహేంద్రవరం స్వాధీన పరచుకున్నారా?” శ్రీనాధులవారు ఇంకా ఏదో అడుగుతుంటే..

  అప్పుడని పించింది పురుషోత్తమ దేవ, మాధవులిద్దరికీ..

  అనవసరంగా ఈ మహానుభావుని కదిలించామా అని.. తమ పర్యాటన రహస్యం బట్ట బయలైపోతుందేమో అని..

  మ్లాన వదనాలతో సమాధానాలు ఇవ్వ బోయారు.

  కానీ.. ఆ మహాకవి..అర్ధ శతాబ్దంగా రాజకీయానుభవాలతో తలపండిన వాడు.. ఆ మాత్రం గ్రహించలేడా! మాట మార్చేశాడు.

  “ఎవరైతేనేమిలే నాయనలారా! తెలుగు సాహిత్యం మీద మీ అభిరుచి శ్లాఘనీయం. పరాయి భాష వారై ఉండీ తెలుగు కవిని గుర్తు పెట్టుకున్నారంటే, నన్ను చూడడానికి వచ్చారంటే.. అభినందనలు అంజేయాలిసిందే. రాజకీయాలకీ, సాహిత్యానికీ ముడి వెయ్య కూడదు. గజపతులకీ, రెడ్డి రాజులకీ, విజయనగర రాజులకీ, రాచకొండ వారికీ, బహమనీ సుల్తానులకూ జరిగే నిరంతర పోరులకూ మన తెలుగు సాహితీ మాతకీ  సంబంధం లేదు..” ఆయాసంతో ఆగి, పక్కనున్న రాగి పాత్రతో నీరు కంఠంలో పోసుకుని గడగడా తాగారు శ్రీనాధ కవి.

  “స్వామీ!” కంగారుగా లేవబోయాడు మాధవుడు.

  ఆందోళన వలదన్నట్లు చెయ్యి అడ్డంగా ఊపి గంభీర కంఠంతో చెప్ప సాగాడు శ్రీనాధుడు.

  “నేనొక సారి కొండవీటి ప్రభువు రాయబారిగా రాచకొండకు బయలు దేరాను. ఆ సమయంలో రెండు రాజ్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. నేను విజయనగరంలో ఉన్నాను. మా ప్రభువు అస్వస్థులై ఉన్నారు కూడాను. కృష్ణలంకలో, నది ఒడ్డునకు మా కోమటి వేమ ప్రభువు కులదైవం కటారిని (కత్తి) తీసుకు వెళ్లారు మా సైనికులు, ప్రక్షాళన చేయుటకు.. ఆ కటారిని, మా సైనికులనోడించి,  రాచకొండ సైనికులు తీసుకొని పోయారు. సింగభూపాలుని మెప్పించి ఆ కటారిని తిరిగి తేవలసిన బాధ్యత నాకు ఇచ్చారు ప్రభువు. ” శ్రీనాధుని గొంతు గద్గదమయింది..

  పాత జ్ఞాపకాలు ముసురు కోగా!

  ఈ విషయాలు శ్రోతలిద్దరికీ తెలియనివే.. అవి జరిగినప్పుడు చిన్న పిల్లలు వారు. గురుకులంలో విద్యాభ్యాసం జరుగుతున్న కాలం. రాజకీయాలు పట్టించుకునే సమయం లేదు. అర్ధం చేసుకునే వయసు కూడా లేదు.

  “నేను తిరిగి రాగానే, విషయం తెలిసింది. అమాత్యుల వారికి చెప్పి బయలు దేరాము.. నేనూ, దుగ్గనా. దుగ్గన అంటే మా బావమరిది. మంచి కవి కూడా. ఆ సమయంలో రాచకొండనేలే సింగ భూపాలుడేమన్నారో తెలుసా?

 

            ‘వైరం సమరమందే. సాహిత్యమందు సామరస్యమే.’

 

  ఈ వాక్యమే నేను అనుక్షణం మననం చేసుకుంటూ ఉంటాను. రాజమండ్రీ రెడ్డి రాజుల ప్రాపు కేగినపుడు, విజయనగరం ప్రౌఢరాయల సహాయం అర్ధించినపుడు, రాచకొండ వారి వద్ద, కన్నడ దేశంలో ఎక్కడైనా నాకు ఆకలి తీర్చేది, చేపట్టిన కార్యం సానుకూలమయేట్లుగా చూసిందీ సాహిత్యమే. అందుకే నేను మరణ సమయంలో కూడా కవిత్వం వదల కూడదని నిశ్చయించుకున్నాను.”

  శ్రీనాధుల వారి పలుకులనూ వింటూ, వారిని చూస్తుంటే మాధవునికి ఒక పక్క సంతోషమూ, ఇంకొక పక్క విచారమూ కలిగాయి.

  చేతులకి కంకణాలతో, మెడనిండా ముత్యాల, బంగరు మాలలతో, జరీ పట్టు పంచలతో వెలుగొందిన కవీంద్రులు.. దిన వెచ్చాలతో కాలం గడపటమా! పైకి కనిపించడం లేదు కానీ, దుస్తులు శిధిలావస్థలో ఉన్నాయి.

  “ధన్యులు మహాకవీ తమరు. కవిత్వానికి తనువు, మనసు అర్పించగలగడం ఎందరికి సాధ్యమవుతుంది?” సంభాషణ అంతా పురుషోత్తమ దేవుడే కొన సాగిస్తున్నాడు.

  “నా సంగతి సరే.. మీ విషయం ఏమిటి? నేను మీ రాజకీయాల గురించి అడగటం లేదు. తెలుగు భాష, అందులో కవిత్వం, పద్యాలు.. మీ వరకూ ఏ విధంగా చేరేయా అని. పైగా మీ మాతృభాష కూడా కాదు. ఇదే నిజమైతే నిజంగా ఆనందించవలసిందే!”

  “నూటికి నూరు పాళ్లు నిజం గురువుగారూ! మాతృభాష కాదు కానీ, అక్షరాలు దిద్దాక, మేము నేర్చుకునే నాలుగు భాషల్లోనూ తెనుగు తప్పకుండా ఉంటుంది. మా మాధవుడికి మీ కావ్యాలలో చాలా పద్యాలు కంఠస్తం. మా కళింగ దేశంలో మీ శృంగారనైషధం పండితుల చర్చల్లో ముఖ్యాంశమైతే.. భీమఖండం, క్రీడాభిరామం పద్యాలు, ద్విపదలు, రగడలు పాటకజనం నోళ్లలో నిత్యం నానుతూంటాయి.”

  పురుషోత్తముని మాటలకి శ్రీనాధ మహాకవి పరమ సంతోషంతో ఉప్పొంగి పోయారు.

  ఏ కవికయినా అంత కంటే కావలసినది ఏముంటుంది? వంద కనకాభిషేకాల పెట్టు పాఠకాదరణ.

  “ఏముంది నాయనా! కావ్యాల పేర్లు ఉచ్ఛరించడం ఏమంత కష్టమయిన పని?” బింకంగా అన్నారు శ్రీనాధుడు.

  మనసులో సంతోషపడుతూనే..

  పురుషోత్తమునికి అర్ధమవుట లేదు.. ఏ విధంగా కవి సార్వభౌములని నమ్మించగలమా అని మాధవుని వంక చూశాడు.

  మాధవుడు ఇంకా సంభ్రమం నుంచి తేరుకోనట్లుగా తేర పారి చూస్తున్నాడు, శ్రీనాధుడిని.

  “మాధవా! గురువుగారేదో అంటున్నారు వింటున్నావా? వారి కావ్యాలేమి చదివావూ? చాటువులు ఏం విన్నావు అని అడుగుతున్నారు.” మాధవుని భుజం తట్టి అన్నాడు పురుషోత్తముడు.

  అంతే..

  ఒక్క సారిగా కంఠం సవరించి.. గొంతెత్తి రాగయుక్తంగా అందుకున్నాడు మాధవుడు. అతని గొంతులోనుండి రాగఝరి ప్రవహించ సాగింది.

  ఆలయ ప్రాంగణంలో మనుషులు, పక్షులు, ఉడతలతో సహా నిలిచి విన సాగారు.

  

               “చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు

                           రచియించితి మరుత్తరాట్చరిత్ర

                నూనూగు మీసాల నూత్న యవ్వనమున

                           శాలివాహన సప్తశతి నుడివితి

                సంతసించితి నిండు జవ్వనమునను

                            హర్షనైషధ కావ్యమాంధ్ర భాష

                బ్రౌఢ నిర్భరవయః పరిపాకమున గొని

                            యాడితి భీమనాయకుని మహిమ

 

                బ్రాయ మెంతయు మిగుల గైవ్రాలకుండ

                గాశికా ఖండమను మహా గ్రంధమేను

                దెనుగుజేసెద గర్ణాట దేవకటక

                పద్మనవహేళి శ్రీనాధ భట్ట సుకవి.”

 

  అక్కడితో ఆప లేదు మాధవుడు. శృంగార నైషధము నుండి, భీమ ఖండం నుంచి.. వరుసగా సీస పద్యాలు, రాగాలు మార్చి వినిపిస్తూనే ఉన్నాడు.

  చివరికి శ్రీనాధుల వారే నవ్వుతూ ఆపమని, మాధవుని చెయ్యి పట్టుకునే వరకూ సాగింది కవితా ఝరి.

  “గురువుగారూ, మీ కాశీ ఖండం నుంచి కూడా..”

  “ఇంక చాలు నాయనా. అపరాహ్ణం సమీపిస్తోంది. భోజన సమయం.. పద్యాలను మించి నీ గానం అలరిస్తోంది. కానీ వీనులతో పాటుగా, జఠరాగ్నిని కూడా శాంత పరచాలి కదా! మిమ్ములను కలిసి నందుకు చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. మీరు కార్యార్ధులు. మేము దేశాటన చేయు వారం. ఇరువురి మార్గాలు వేర్వేరు. మరల ఎప్పటికైనా కలువ గలమో లేదో.. ఆ పరమేశ్వర కృప.” శ్రీనాధుల వారు లేచారు.

  పక్కనే ఉన్న అనుచరుడు చెయ్యందించాడు.

  “గురుదేవా!” మాధవుని పిలుపు విని వెను తిరిగారు.

  చెయ్యి పట్టుకుని వారిని అక్కడున్న అరుగు మీద కూర్చుండ బెట్టారు మిత్రులిరువురూ.

  “మా చిరు కానుకను స్వీకరించ వలసినదిగా కోరుతున్నాము. అన్యధా భావించ వలదని మనవి.” పురుషోత్తమ దేవుడు నూరు బంగారు నాణాలు, పట్టు వస్త్రములు కల ఒక సంచీని, కొన్ని ఫలములతో, ఒక పళ్లెరమున పెట్టి సమర్పించి, సాష్టాంగ నమస్కారము చేశాడు.

  మాధవుడు కూడా కొన్ని నాణములు, వస్త్రములు ఇచ్చాడు.

  దూర ప్రయాణం చేయునపుడు రాకుమారుని పరివారం ఆ మాత్రం ధనం, వస్తువులు తెచ్చుకోవడం సాధారణమే.

  శ్రీనాధుడు సంతసించి, యువకులనిద్దరినీ ఆశీర్వదించి ఉత్సాహంగా తమ నెలవునకేగారు.

  ప్రతిభకి పట్టం కట్టినపుడు, ఏ కవికైనా బహు సంతసమే కదా!

                                         ………………

 

......మంథా భానుమతి