Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 17వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 17వ భాగం

“కాంచీపురాధీశునితో సంధి ఏమిటి రాకుమారా? వారు మన దండయాత్రలకి చాలా దూరాన ఉన్నారు కదా? ఇప్పటికి గోదావరీ తీరం అయింది. కృష్ణా తీరం దాటాక కదా కావేరీ తీరం వచ్చేది. మధ్యలో విజయనగరం రాయలు ఉన్నారు. నెల్లూరు తీరం దాటాలి. నాకైతే అయోమయంగా ఉంది మిత్రమా!” మాధవుడు, కళ్యాణికి గుగ్గిళ్లు పెడుతూ అన్నాడు.

  పురుషోత్తమ దేవుడు తన గుర్రాన్ని కట్టేసి విశ్రమిస్తున్నాడు. అప్పటికే అతని గుర్రం మాలీషు చేయించుకుని, గుగ్గిళ్లు తినేసి, హాయిగా కునికి పాట్లు పడుతోంది.

  బ్రాహ్మీ ముహుర్తంలోనే బయలు దేరారు, ముందరి మజిలీ నుంచి. ఉషోదయం తొందరగానే వస్తుంది కనుక ధైర్యం చేశారు. దారంతా గ్రామాలు.. సస్య శ్యామలమైన ప్రదేశం.

  “ఒక్క ఘడియ మాత్రమే ఆగుతున్నాము మిత్రమా! త్వరగా బయలుదేరాలి మనం.” రాకుమారుడు వేగిర పెట్టాడు.

  గోదావరీ తీరం అది.

  మిత్రులిద్దరూ బయలుదేరి మూడు రోజులయింది. రాజమహేంద్రవరం చేరుకున్నారు. కోరుకొండ వరకూ వారి రాజ్యమే అయినా కూడా.. రాకుమారుడనని ఎవరికీ చెప్పలేదు. ఆ విధంగా ప్రజలేమనుకుంటున్నారో తమ పాలన గురించి తెలుసుకుందామని..

  వారి పరిపాలన అందరికీ సంతృప్తిగా ఉందని తెలుసుకుని, మరింత ఉత్సాహంతో పయనం సాగించారు.

  దారిలో రెడ్ల పాలన.. రాయల పాలనల గురించి తెలుసుకుంటూ వెళ్లాలని ప్రణాలిక రచించారు కపిలేంద్ర దేవుడు.

  ఆవిధంగా ఆయా రాజ్యాల ఆనుపానులు కూడా తెలుస్తాయని మహారాజు ఉద్దేశ్యం.

  చెప్పిన వెంటనే గౌతమి అభ్యంతర పెట్టినా నందుడు సర్ది చెప్పడంతో ఆనందంగానే పంపింది. “ఈడు వచ్చిన  కుర్రవాడిని ఇంట్లో కట్టి పడేస్తే ఏ విధంగా అభివృద్ధి సాధించగలడు? ఆ జగన్నాధుడే కాస్తాడు పుత్రుడిని.” సీతమ్మ కూడా అవునంటూ మద్దతిచ్చింది.

  “మిత్రమా! రాజమహేంద్ర వరం సమీపించగానే ఏదో తెలియని ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది మనసంతా! ఏదో చెప్పాలని ఉత్సుకత..” పురుషోత్తముడు పరవశంగా అన్నాడు.

  “నిజమే! ఈ పవిత్ర గోదావరీ తీర మహత్యమటువంటిది. రెడ్డిరాజుల పరిపాలన కూడా గజపతుల పరిపాలన వలెనే ప్రజల మన్నన పొందింది. మహాకవి శ్రీనాధుడు వీరి పాలన గురించి చక్కని పద్యం రాశారు వినిపించుదునా?”

  అడిగేశాడే కానీ మాధవునికి విపరీతమైన భయం కలిగింది.

  ఒక కాబోయే రాజు ముందు వేరొక రాజును పొగడడమా?

  బెదురుగా ఉన్నా బింకంగా నిలుచున్నాడు. క్షత్రియ రక్తం కదా!

  “అవశ్యం మిత్రమా.. వినిపించు. ఉత్తరోత్తరా మనకి ఉపయోగపడవచ్చును కదా!” పురుషోత్తముడు నవ్వుతూ అన్నాడు.

  మాధవుడు మొదలుపెట్టాడు, రాగయుక్తంగా..

 

                      “ సీ.   ధరియింప నేర్పిరి ధర్బ వెట్టెడు వ్రేళ్ల

                                     లీల మాణిక్యాంగుళీయకములు

                              కల్పింపనేర్చిరి గంగ మట్టియ మీద

                                     గస్తూరికా పుండ్రకములు నొసల

                              సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోల

                                     దార హారములు ముత్యాల సరులు

                              చెరువంగ నేర్చిరి శిఖల వెన్నడుములు

                                     గమ్మని క్రొత్త చెంగలువ విరులు

              

                   తే.గీ.   ధామమున వెండియును బైడి తడబడంగ

                             బ్రాహ్మణోత్తము లగ్రహారముల యందు

                             వేముభూపాలు డనుజన్ము వీరభద్రు

                             ధాత్రి ఏలింప గౌతమీ తటమునందు.”

 

  “ఎంత బాగా వ్రాశారు మిత్రమా! కళ్లకి కట్టినట్లుంది. మనం కూడా ఈ విధంగా పరిపాలన సాగించాలి భవిష్యత్తులో.” పురుషోత్తముని ప్రశంస విని అమ్మయ్య అనుకుని నిట్టూర్చాడు మాధవుడు.

  “రాకుమారా! శ్రీనాధులవారు ఎచటనున్నారో ఏమైనా తెలిసిందా? నాకు వారిని కలవాలని ఉంది మిత్రమా!”

  “రాజమహేంద్రవరంలో లేరని విన్నాను. హంపీ, కర్ణాటక దేశాలలో పర్యాటన చేస్తూ, అక్కడి రాజులకు, పండితులకు తమ పాండిత్య ప్రకర్షని చూపిస్తున్నారు. రాచకొండ సింగ భూపాలుని వద్ద నున్నారని విన్నాను. వారు దేశ సంచారులు. మనకి ఎక్కడైనా ఎదురు పడే అవకాశం ఉంది. ఇంక మన ప్రయాణం కొన సాగిద్దామా?” పురుషోత్తమదేవుడు, లేచి తన హయం వద్దకు నడిచాడు.

  “ఇంతకీ మన పయనోద్దేశ్యం చెప్పనేలేదు రాకుమారా? కాంచీపురం ఐతే, విజయనగర రాజుల సామంత రాజ్యం. దేవరాయలు అక్కడ గట్టి రక్షణ ఏర్పాటు చేశాడు. మనం సంధి ప్రయత్నాలేవో చేస్తే దేవరాయలితో చెయ్యాలి కానీ, కంచి రాజుతోనా? నాకు ఏమీ బోధపడుట లేదు.”

  “నీకు బోధపడదులే మిత్రమా!” పురుషోత్తముడు గుంభనగా నవ్వాడు.

  “అంటే..మీకు తెలుసునా?”

  “అదంతే! నాకు తెలియకుండా ప్రయాణం అవుతానా? తండ్రిగారికి అన్ని విషయాలూ తెలుసును. వారి చారులు వృత్తిలో నిష్ణాతులు. చారులు సేకరించని విషయాలు రాజ్యంలో లేవు.”

  రాకుమారుని మాటలు విని ఉలిక్కి పడ్డ మాధవుడు, పక్కనే హయాన్ని నడిపిస్తున్న మిత్రుని వంక చూశాడు. అయినచో.. తన గురించి కూడా..

  ఆ సమయంలో గుర్రాల వేగం తగ్గింది.. దారి క్లిష్టంగా ఉండడంతో. పైగా నదీతీరం అవడంతో.. నేల జారుతోంది కూడా.

  మాధవుని ఆందోళనని పట్టించుకోకుండా, జాగ్రత్తగా హయాన్ని నడుపుతున్నాడు పురుషోత్తముడు.

  “ఇంక మంచి దారి మొదలవబోతోంది.. మనం వేగాన్ని పెంచాలి. ఈ సాయంకాలానికి అర్ఘ్యం విడవడానికి కృష్ణా తీరం చేరాలి సుమా!”

  “అటులనే రాకుమారా! గుర్రాల అవసరాలకి మాత్రమే ఆగుదాము.”

  “ఇంకొక ముఖ్యమైన విషయం.. నన్ను ఇతరుల సమక్షంలో రాకుమారా అని సంబోధించ వద్దు. మనిద్దరం మిత్రులము.” పురుషోత్తముడు గుర్రాన్ని వేగిర పరచాడు.

  “అటులనే మిత్రమా!” మాధవుడు కళ్యాణి పక్కలు సున్నితంగా కాళ్లతో కొట్టాడు.

  రెండు గుర్రాల డెక్కల చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు అక్కడ.

                                      …………………

 

          

 

  “ఇదే సరైన ప్రదేశం మిత్రమా! ఇక్కడే సంధ్యా వందనం చేసుకుని, సమీపాన ఉన్న గ్రామంలో విశ్రమిద్దాము ఈ రాత్రికి.” కృష్ణ ఒడ్డుకు కాకపోయినా, బెజవాడ దగ్గర్లో ఉన్న గ్రామం వద్దకి చేరారు మిత్రులిద్దరూ.

  కృష్ణా నది నుండి తవ్విన కాలువ ఒకటి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తోంది. దట్టమైన వృక్షాలతో ఆ ప్రాంతం, నదీ తీరం కన్నులకింపుగా ఉన్నాయి.

  సంధ్య వార్చడానికింకా సమయం ఉన్నా, గుర్రాలు అలిసి పోయాయని ముందుగా ఆగి పోయారు. అక్కడి ప్రకృతిని తనివితీరా ఆస్వాదించడం ఒక కారణమైతే.. సమీపంలో మంచి గ్రామం ఉండుట మరొక కారణం.

  గుర్రాలని కట్టేసి, అక్కడున్న మఱ్ఱి చెట్టు దగ్గరికి పరుగెత్తాడు మాధవుడు.

  “అద్భుతం మిత్రమా! ఎంత రమణీయం ఈ ప్రకృతి.. రండి రండి.. సంధ్యకింకా సమయం ఉంది కదా! కొద్ది సేపు ఈ అందాలని ఆస్వాదిద్దాం..

                     

                          

 

                తురగవల్గన రగడ కళిక:

 

                   సంజ వెలుగు చూడ నల్ల చాల సంత సంబు నుండు

                  *కంజ తావు నంత గానె కాచు గాద చల్ల గుండు

 

                   గూడు వదలి వెళ్లె గాద గువ్వ లన్ని కూడు కొఱకు

                   గూడు లోని కూనలన్ని పాట పాడు నమ్మ కొఱకు

 

                   అస్త మించు భాను డదియె నలల పైన తేలియాడు

                   వస్త నంటు చందురూడు వగలు తెలిపె కలువ చూడు.

 

                   ఆలమంద మేత నాపి యవికి జేర పయనమయ్య

                   పాలు త్రావ దూడలన్ని పరుగు పరుగు గెంతు లెయ్య.

 

                    ఒడలు పులక రించె గాద ఊడలున్న మఱ్ఱి చెంత

                    బెడద లన్ని వదలి వేసి వెడల గాను మనము సుంత.”

 

(కంజ= అమృతం)

 

  రగడ పాడుతూ మాధవుడు నాట్యం చేయ సాగాడు. చెట్టుక్కట్టేసిన గుర్రాలు కూడా తలలూపుతూ తై అంటున్నాయి.

  పురుషోత్తముడు నవ్వుతూ వెళ్లి గుర్రాలని విప్పి, జీనులు తీసి నిమర సాగాడు. గుర్రాలు.. యజమానిని పక్కకు తప్పించి హాయిగా నాట్యం మొదలు పెట్టాయవి కూడా.

 

 

  ఆహ్లాదంగా ఉంది వాతావరణం.

  “ఏం మిత్రమా! ఆ పల్లె ప్రజల ప్రభావమా! రగడలందుకున్నావు? మీ గురువు గారేమంటారో?” మేలమాడాడు పురుషోత్తమ దేవుడు. మాధవునికి శ్రీనాధుని కవిత్వం ఇష్టమని ఆయన శిష్యునిగా సంబోధిస్తుంటాడు.

  “ఈ చల్లగాలిలో, సూర్యాస్తమయ కాంతులలో లయ ప్రాధాన్య కవిత రావడంలో వింతేముంది మిత్రమా! జానపదాలకి రగడలు, ద్విపదలే కదా సాధనాలు! ఇంక మా గురువుగారా.. వారు కూడా రగడలు వాడారు కదా? శివరాత్రి మహాత్యంలో, కాశీ ఖండంలో..” మాధవుడు తీసి పోలేదు. సమాధానాలు తయారుగా ఉంటాయి.

  “నిజమే మిత్రమా! అదుగో.. సంధ్యా సమయం ఆసన్న మౌతోంది. మనం ఆట పాటలు ఆపి కార్యక్రమం లోనికి ప్రవేశిద్దామా?”

  ఇరువురూ తమతమ అశ్వాలకు సాంత్వన చేకూర్చి, స్నాన సంధ్యాదులను పూర్తి చేసినంతలోగానే..

  ఇరువురు ఆగంతకులు సమీపించారు వారిని.

  “ప్రభూ! మీకు భోజన వసతులు ఈ కొండపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ రాత్రికి విశ్రమించి ప్రాతఃకాల మందే మీ ప్రయాణం కొన సాగించ వచ్చు.” ఇద్దరిలో అధికారిలా ఉన్నతను అన్నాడు.

  “మీరు..” మాధవుడు సందేహంగా అడిగాడు.

  “మేం.. కపిలేంద్రుల వారి సైనికులం. గజపతుల రాజ్య సరిహద్దులు దాటాక, మీకు తోడుగా, మమ్మల్ని ముందు వెనుకల వెడలమని మహారాజుగారి ఆనతి. కోరుకొండ దాటినప్పట్నుంచీ వస్తున్నాము. ఈ ప్రాంతం నుంచీ మీకు కొత్త కనుక బయటికి వచ్చి కనిపించాము. రెడ్డి రాజుల చారులు, విజయనగర రాజుల వేగులు అన్ని ప్రాంతాల కాచి ఉంటారు. జాగరూకతతో ఉండాలి.”

  “ఎంత మంది ఉన్నారు మీరు?”

  “నలుగురు మీకు ముందు, నలుగురు మీకు వెనుక. మీ వెనుక వారు కొద్ది సమయంలో కలుస్తారు.”

  “మీరు మా రాజ్యం వారని మాకు నమ్మకం ఎటుల?” మాధవుడు చేతిని కత్తి ఒర మీద నుంచి అడిగాడు.

  “ఇదిగో.. రాజుగారి ముద్రిక.” లో దుస్తుల్లోంచి జాగ్రత్తగా తీసి ఇచ్చాడు.

  పురుషోత్తముడు కొద్ది దూరం నుంచి అంతా గమనిస్తున్నాడు.

  మాధవుడు రాకుమారుని వంక తిరిగి తల ఊపాడు.. సరే అన్నట్లు.

  అశ్వాలకి అన్నీ అమర్చి, అధిరోహించి, సైనికులు దారి తియ్యగా ముందుకి నడిచారు, స్నేహితులిద్దరూ.

  కొండపల్లి గ్రామానికి వెళ్లే దారిలోనే ఉంది పూటకూళ్ల ఇల్లు. అక్కడ అరుగు మీద కూర్చుంటే కొండ మీద నున్న కోట కనిపిస్తుంది. మామూలు బాటసారుల వలెనే ఆహార్యం ఉంది కనుక, గజపతుల రాకుమారుడని.. కాబోయే చక్రవర్తి అనీ, ఎవరికీ అనుమానం రాలేదు. మాధవుడు, సైనికులు కూడా తమ తోటి ప్రయాణీకుని వలెనే పురుషోత్తముని చూడ సాగారు. అందరివీ ఒకే రకం తలపాగాలు, దుస్తులు.

  కోట వైభవం తగ్గినట్లు అనిపిస్తోంది. పెదకోమటి వేమారెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగింది.. కొండవీటి కోటకి పోటీగా.

  అంతఃకలహాలతో ప్రజాపాలన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రజలు కొత్త సుంకాలు కట్టలేక అసంతృప్తులై ఉన్నారు.

  “కొండవీటి రెడ్డిరాజుల వైభవం ఎందుకు పోయింది?” పురుషోత్తముడు సైనికాధికారిని అడిగాడు. అతడు గజపతుల చారుడు కూడా.

  “పెదకోమటి వేమారెడ్డి కొడుకు రాచవేమారెడ్డి అస్తవ్యస్త పాలన వల్ల.. అతడికి రాజమండ్రీ  రెడ్డిరాజులనెదుర్కోవడం సాధ్యం కాలేదు. పైగా కనీ వినీ ఎరుగని సుంకాలతో  ప్రజా కంటకుడిగా పేరు పొందాడు. చివరికి అనూహ్యమైన రీతిలో ఒక మామూలు బలిజ వాని చేతిలో చచ్చిపోయాడు.”

  “అదేవిధంగా?” మాధవుడు అడిగాడు కించిత్ ఆశ్చర్యంతో.

  “రాచవేముడు పురిటి మంచం మీద పన్ను వేశాడు. ఈ పురిటి పన్ను వసూలు చెయ్య బోతుంటే, సవరం ఎల్లయ్య అనే బలిజ నాయకుడు రాచవేముడిని పొడిచి చంపేశాడు. ఒక ప్రభువుని, సామాన్యుడు చంపాడంటే.. ఆ రాజ్యం ఏ విధంగా దిగజారి పోయిందో తెలుస్తుంది. అతడితోనే కొండవీటి రెడ్డి రాజ్యం అంతరించింది. ముక్క చెక్కలయి, అటు విజయనగరంలో కొంత, ఇటు రాజమండ్రీలో కొంత కలిసి పోయింది. కొంత తెలంగాణాలో.. దేవరకొండలో కలిసింది. ఇది పొరుగు రాజ్యాలకి ఒక పాఠం లాగ మిగిలింది.”

  “మరి ఆ రాజుని ఆశ్రయించుకుని ఉన్న పండితులు, మంత్రులు, సైన్యాధికారులు.. అందరూ ఏమయ్యారు?”

  “ఏమౌతారు సామీ.. ఇతర రాజుల ప్రాపుకై వెళ్తారు. అదంత సులభం కాదు. ఎక్కడైనా కొలువు దొరికే వరకూ నానా పాట్లు పడుతుంటారు.”

  “భోజనానికి రండి స్వామీ. కాళ్లూ చేతులూ ప్రక్షాళన కానియ్యండి..” పూటకూళ్ల ఇంటి వారి పిలుపు విని అందరూ లేచారు.

 

 

......మంథా భానుమతి