Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 15వ భాగం

ఆజ్ఞాత కులశీలస్య.. 15వ భాగం

 

 

    హయ ప్రచార రగడ:      “నల్ల సామి వచ్చి యుండు
                                    అల్ల కోట నందు యుండు
                                    మల్ల సామి మంచి గుండు
                                     కొల్ల జేసె కోతి దండు”

   ముందుగా లేచిన పెద్దాయన గట్టిగా పాడుతూ నాట్యం చెయ్యడం మొదలు పెట్టాడు. మిగిలిన వాళ్లు గుండ్రంగా అతని చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ, పాడుతూ, ఆడుతూ సందడి చేస్తున్నారు.
   పురుషోత్తమ దేవుడు, మాధవుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
   ఎక్కడ్నుంచి తెచ్చారో డప్పులు.. ఇద్దరు మోగిస్తున్నారు.
   పల్లె పదాలు.. స్వచ్ఛమైన భావాలు.
   నిష్కళ్మషమైన మందహాసాలు..
   ఒకరినొకరు కవ్వించుకుంటూ ఆడుతున్నారు.
   పెద్దాయన అన్నది, మిగిలిన వాళ్లు తిరిగి తిరిగి పలుకుతున్నారు.

 

 

               తురగవల్గన రగడ-

                 “మడిసి బ్రోవ నిలకు వచ్చి మనుపు నొసగు సామి నీకు
                  ఒడిసి పట్టి గట్టి గాను నొదలు సేయు దేవ నీకు
 
                  వెన్న తిన్న మన్ను తిన్న వేడి వేడి బువ్వ నీకు
                  అన్ను మిన్న కంట పడ్డ యయ్యవంట కన్న నీకు

                   కుంతి మాత మధ్య సుతుని కోరి రధము నడుపు నీకు
                   ఇంతి కృష్ణ మాన మెంతొ కృపను నిజము నిల్ప నీకు

                   కఱకు కంసు దునిమి నట్టి కడిమి దొరకు వందనాలు
                   పెఱిమ గల్గు దేవ నీకు వేల వేల వందనాలు.”

   పాటలు, ఆటలు అయ్యాక సాష్టాంగ దణ్ణం పెట్టి అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు.
   రాకుమారుడు మాధవుని వంక చూశాడు. తనకి కూడా ఏమీ తెలియట్లేదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు మాధవుడు.
   ముందుగా పాట మొదలు పెట్టిన పెద్దాయన్ని లేపాడు పురుషోత్తముడు.
   “ఏమిటి పెద్దాయనా ఈ హడావుడి? పూరీ జగన్నాధుడి సంబరాలేమైనా ఉన్నాయా? అందుకోసం నాట్యం తయారయి చూపిస్తున్నారా? పూరీ వెళ్తున్నారా? ధనము కావలెనా?”
   “అదేంది దొరా! ఆ జగన్నాధుడే ఇక్కడుండగా ఇంక పూరీ వెళ్లే పనే ముంది.”
   “జగన్నాధుడు ఇక్కడున్నాడా?” ఆశ్చర్యంగా అడిగాడు మాధవుడు.
   “వీరు పురుషోత్తమ రాకుమారుడే కదా?”
   “అవును.”
   “పురుషోత్తమ దేవుడు పూరీ జగన్నాధుని అంశ. ఆ సంగతి ఓఢ్ర ప్రజలందరికీ తెలుసు. వారి చిత్ర పటాలు మా అందరిళ్లకీ వచ్చాయి.”
   “ఎవరు చెప్పారు? చిత్రపటాలు ఎవరిచ్చారు?” మాధవుడికి నమ్మ శక్యం కావట్లేదు.
   “పూరీ సాములోరయ్యా! ఊరూరా తిరిగి చెప్తున్నారు. అప్పుడు అడవిలో ఏనుగులన్నీ తోకలూపుకుంటూ ఆరి వెంట వచ్చినయ్యంట కదా! అన్నట్లు, మీరు మాధవుల వారు కదా? కృష్ణులవారి హితుడైనోరే.. అర్జనుడే మీరని కూడా మాకు తెల్సు దొరా!”
   ఈ సారి మరీ సంభ్రమానికి లోనయ్యారు మిత్రులిరువురూ.
   ఏమీ చెప్పడానికి లేదు. చెప్పినా వినేట్లు లేరు.సాక్షాత్తూ పూరీ జగన్నాధునే చూసినంత ఆనందం లో ఉన్నారందరూ.
   చీకట్లు దట్టంగా ముసురుకుంటున్నాయి.
   పురుషోత్తముడు లేచి నిలుచున్నాడు. మాధవుని తో కలిసి అడుగులు వేశాడు..
   “దణ్ణాలయ్యా! మమ్ముల్ని చల్లగా చూడాల తమరు.” పెద్దాయన తో సహా అందరూ వంగి వంగి దండాలు పెడుతుండగా ముందుకి నడిచి వారి గుర్రాలని అధిరోహించారు మిత్రులిద్దరూ.
   మౌనంగా రాకుమారుడితో కోటలోపల, అంతఃపురంలో వారి అమ్మగారి భవనం వరకూ వెళ్లి, అక్కడ సేవకుడు గుర్రాన్ని తీసుకుని వెళ్లే వరకూ ఆగి,  రాకుమారుడు లోపలికి వెళ్లాక వెను తిరిగాడు మాధవుడు.
   మహానది ఒడ్డున జరిగిందంతా కలలో అయినట్లు అనిపిస్తోంది.
   ఈ రకంగా ప్రజల మధ్యకు వార్తలెలా వెళ్లాయో! ఎందుకు వెళ్లాయో.. ఏమీ బోధ పడలేదు.

   “ఏమయింది కన్నయ్యా?” మౌనంగా భోజనం చేస్తున్న మాధవుడిని అడిగింది గౌతమి.
   మాధవుడు ఇంటికి వచ్చి, స్నానం చేసి, భోజనానికి కూర్చున్నప్పుడు.. ఆ రోజు జరిగిన విశేషాలన్నింటినీ వివరిస్తాడు. నందుడు, గౌతమి ఎదురుగా మరునాటికి కావలసిన వస్తువులని ఒక దగ్గర పేరుస్తూ, ఆసక్తిగా వింటుంటారు.
   ఆకుకూరలు బాగు చేసుకుంటూనో, పచ్చి మిరపకాయల తొడిమలు తీస్తూనో, విస్తళ్లు కుడుతూనో.. ఏదో ఒక పని. వారిరువురూ ఖాళీగా ఉండటం గడచిన పది సంవత్సరాలలోనూ మాధవుడు చూడ లేదు.
   సీతమ్మ ఎదురుగా పీట వేసుకుని కూర్చుని కావలసినవి వడ్డిస్తుంది, కొసరి కొసరి.
   “ఈ రోజు ఒక వింత జరిగిందమ్మా! ఆ విషయమే ఆలోచిస్తున్నాను.” నది ఒడ్డున జరిగిందంతా వివరించాడు మాధవుడు.
   “ఇందులో వింతే ముంది మాధవా? ఈ సంగతి రెండు మూడు సంవత్సరాలుగా నడుస్తున్నదే. రాజు గారి ప్రోద్బలం తోనే ఇదంతా నడుస్తోందేమో నని కొందరు అనుకుంటున్నారు కూడా.” సీతమ్మ తేలిగ్గా అంది.
   ఏటి ఒడ్డున వార్తలు సేకరించడంలో దిట్ట సీతమ్మ.
   “కాకపోతే.. నువ్వు అర్జునుడి అవతారం అన్నది మాత్రం కొత్త వార్తే.” చిరునవ్వు నవ్వింది సీతమ్మ.
   “మరి ఈ సంగతి ఎవరూ చెప్పలేదేమ్మా ఇన్ని రోజులూ? రాకుమారునికి కూడా ఇది ఆశ్చర్యం కలిగించిన సమాచారమే!”
   “ఏ వార్తైనా అసలు వాళ్లకి ఆఖరున తెలుస్తుందన్న సామెత ఉందిగా.. చాలా మంది ప్రజలకి రాకుమారుడు పురుషోత్తముడంటే ఆరాధన. అదంతా నెమ్మదిగా, ఒక ప్రణాలికలో జరిగినట్లు అనిపిస్తుంది. ఏదేమైనా, రాకుమారులందరిలోకీ పురుషోత్తముడే సౌమ్యుడు, సమర్ధుడు అంటారు.” నందుడు నెమ్మదిగా అన్నాడు.
   “రాకుమారుడు ఏ విధంగా స్పందిస్తున్నాడో..” సాలోచనగా అన్నాడు మాధవుడు.

   అదే సమయానికి పురుషోత్తమ దేవుడు తల్లిదండ్రుల ఎదురుగా కూర్చుని, తండ్రి చెపుతున్న విషయాలను వింటున్నాడు. బుగ్గలు కందగడ్డల్లా ఉన్నాయి. చాలా అసౌకర్యంగా ఉంది.
   వ్యాహ్యాళి నుంచి రాగానే, స్నానం, భోజనం చేసి, తల్లి మందిరానికి వచ్చాడు. కానీ.. ఏమీ చెప్ప లేకపోయాడు. తల్లిని చూస్తే యేమీ మాట్లాడ లేడతను.
   వాతావరణం ఆహ్లాదంగా ఉంది. గవాక్షాల తలుపులన్నీ తీసి ఉంచారు. మలయ మారుతం మందంగా వీస్తోంది. వెన్నెల కాంతి ప్రాసాదమంతా పరచుకొని ఉంది.
   రాకుమారుడు అస్థిమితంగా పచార్లు చేస్తున్నాడు.
   మహారాజుగారు వస్తున్నారనే వార్త పట్టుకుని వచ్చింది పరిచారిక.
   పురుషోత్తముని తల్లి ఆనందంగా లేచి ఎదురు వెళ్లింది. రాజుగారు అంతే ఆనందంగా లోనికి వచ్చి ఆసనం మీద కూర్చున్నారు.
   “కుమారులు కూడా ఇచ్చటనే ఉన్నారే? సంతోషం.” దగ్గరగా పిలిచి మనసారా ఆలింగనం చేసుకున్నారు కపిలేంద్రుడు.
   “కుమారుడు ఎందుకో చింతా క్రాంతుడై ఉన్నాడు.” రాణి అంది, రాజుగారి పక్కన కూర్చుని.
   పురుషోత్తముని ప్రశ్నార్ధకంగా చూశారు రాజుగారు.
   జరిగింది చెప్పాడు రాకుమారుడు.
   ఏకాంత మందిరంలోకి దారితీశాడు రాజు, భార్యతో.. పురుషోత్తముని రమ్మని సైగ చేస్తూ. ఆ మందిరంలో ఇతరులెవరికీ ప్రవేశం లేదు. పురుషోత్తముడే రెండు మూడు సార్ల కంటే వెళ్లలేదు.
   రాజుగారు చెప్పిందంతా విన్నాడు పురుషోత్తముడు.
   “ఇదీ సంగతి కుమారా! మీ సహోదరులందరూ యుద్ధాలలో పోల్గొని రాజ్య విస్తరణకు పాటు పడ్డారు.. నిజమే. కానీ వారిలో ఎవరికీ పరిపాలనా దక్షత లేదు. రణం వేరు, రాజ్య పాలన వేరు. చిన్ననాటి నుంచీ నిన్నే నాకు వారసునిగా అనుకుని నీకు ఈ విధంగా శిక్షణ నిప్పించాను. మిగిలిన పుత్రులని వేర్వేరు రాజ్యాలకు ‘పరీక్ష’ (ప్రతినిధి)లుగా నియమించడానికి నిశ్చయించాను.”
   రాణి మోము వికసించి వేవేల కాంతులతో వెలిగి పోతోంది. ఆవిడ పట్టుదలే పురుషోత్తముని వారసునిగా ఎన్నుకొనడానికి కారణం. రాజుని తన ప్రేమతో తెలివితో ఆకట్టుకున్న రాణి ఆవిడ.
   “కానీ అన్నల ఆగ్రహానికి బలైపోతానేమో తండ్రీ!”
   “సందేహం లేదు కుమారా! తప్పక వారు ఆగ్రహిస్తారు. ముఖ్యంగా హంవీర కుమారుడు. దక్షిణాన అతనికి మంచి పట్టు ఉంది. నాకు కుడి భుజంలాగే ఉండి పోరు సలిపాడు. ఇంకా సలుపుతున్నాడు. కృష్ణా తీరం, హంపీ విజయనగరం స్వాధీనం చేసుకోవాలి. తెలంగాణా కూడా మన రాజ్యంలో కలుపుకోవాలి. త్వరలో జైత్రయాత్రకి వెళ్తున్నాము. వంగదేశ సుల్తానులని ఓడించడ మయింది. కానీ అనుక్షణం అప్రమత్తతతో నుండాలి. మేమంతా దండయాత్రలు చేస్తుంటే నువ్వు రాజ్యాన్ని ప్రజల బాగోగుల్నీ చూడాలి.”
   “దానికేమీ అభ్యంతరం లేదు తండ్రీ.. కానీ, ప్రజలు నన్నేదో జగన్నాధుడి అవతారం అనుకుంటుంటే.. అంటుంటే ఇబ్బందిగా ఉంది. వారితో ఏ విధంగా మాట్లాడాలో అర్ధమవుట లేదు.” పురుషోత్తముడు సన్నగా అన్నాడు. అతని బుగ్గల ఎరుపు ఇంకా తగ్గలేదు. అసలే పచ్చని పసిమి ఛాయేమో.. దీపాల కాంతిలో ఎరుపు రంగు ప్రతిబింబిస్తూ.. అక్కడక్కడ కెంపులు పొదిగిన బంగారంలా మెరిసి పోతున్నాయి.
   “అవును.. నేనే ఆ విధంగా ప్రచారం చేయించాను. మున్ముందు ప్రజల అండ నీకుంటుందని. కళింగ దేశంలో జగన్నాధుడే కదా ఆరాధ్య దైవం.”
   “మీరా!” ఆశ్చర్యంగా అడిగాడు పురుషోత్తముడు.
   “నేనే.. ఒక పధకం ప్రకారం కొన్ని ఏళ్లుగా చేస్తున్నాను. ఇప్పుడు అందరూ నమ్ముతున్నారని నువ్వు చెప్తుంటే తెలిసింది. చాలా ఆనందంగా ఉంది.” గర్వంగా అన్నాడు కపిలేంద్ర వర్మ.
   “ఇదంతా రాజకీయంలో ఒక భాగం కుమారా! నాకు నీ మీద నమ్మకం ఉంది. ఇంత శ్రమ పడి నేను విస్తరించిన ఈ సామ్రాజ్యాన్ని కాపాడుతావని. అందుకే.. కొందరు నమ్మకస్తులైన ఆంతరంగికుల సహాయంతో, నెమ్మదిగా.. ఎవరికీ అనుమానం రాకుండా చేయించాను.”
   ఇంకా పురుషోత్తముడు ఒప్పుకోనట్లు కనిపించాడు.. స్తబ్దుగా.
   ఇదే సమయం.. కుమారుని సందేహాలు తీర్చవలసిందే. భౌతికంగా, మానసికంగా పురుషోత్తమ కుమారుని తయారుచెయ్య వలసిన సమయం ఆసన్న మయింది.
   “నువ్వీ శ్లోకం ఎప్పుడూ వినలేదా? ఇది ప్రసిద్ధి చెందిన సామెత లాంటి సూక్తి..

                   “నానృషిః కురుతే కావ్యం, నా గంధర్వః సురూపభ్రుత్
                    నా దేవాంశో దదాత్యన్నం నా విష్ణుః పృధివీ పతి”
      
   ఋషి కానివాడు కావ్యం రాయలేడు. గంధర్వాంశ లేనివాడు అందంగా ఉండడు. దేవతాంశ లేనివాడు అన్నదానం చేయలేడు. విష్ణ్వంశ లేనివాడు రాజు కాలేడు. నీలో ఆ జగన్నాధుని అంశ ఉంది నాయనా! అందుకే నా కుమారులందరిలోనూ నిన్నే ఎన్నుకున్నాను నా వారసునిగా.” మహారాజు నచ్చ చెప్పారు కుమారునికి.
                                       ………………

ఒక మాసం తిరగ కుండానే, పురుషోత్తముడు జగన్నాధుని అంశ అని ప్రజలు నమ్మే సంఘటన జరిగింది.

గంగా తీరం నుంచీ కోరుకొండ వరకూ రాజ్యాన్ని విస్తరించిన కపిలేంద్ర దేవుడు రాజమండ్రీని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆ తరువాత, కృష్ణా తీరం.. దైవం అనుకూలిస్తే కావేరి వరకూ గజపతుల తళ్లు (దండయాత్రలు) సాగాలనేది అతని కోరిక.. ఆశయం.

పురుషోత్తముడు తక్క మిగిలిన కుమారులందరూ, నాలుగు దిక్కులా సామంత రాజుల వద్ద నుంచి కప్పాలు వసూలుకై వెళ్లారు. అధికారులకి ఏమైనా సమస్యలెదురైతే పరిష్కరించడానికి.

హం వీర కుమారుడు, తన భార్యా పిల్లలతో దక్షిణాన, కోరుకొండ దగ్గరే ఉంటున్నాడు.. రెడ్డి రాజుల నుంచి దాడి రాకుండా చూస్తూ.. వీలైతే వారిని ఓడించి, రాజ్యాన్ని కబళించడానికి యత్నాలు చేస్తూ..

ఒక రోజు.. తూరుపు తీరం నుంచి విపరీతమైన గాలులు వీచ సాగాయి. కటకం లో ప్రజలంతా తలుపులు వేసుకుని ఇళ్లల్లో కూర్చున్నారు. పశువులు భీకరంగా అరవ సాగాయి. కొట్టాల్లో కప్పిన ఆకులన్నీ ఎగిరి విష్ణు చక్రాల్లా ఎగర సాగాయి గాల్లో.

పొలాల్లో, అడవుల్లో పనిచేసే వారు ఆఘ మేఘాల మీద తమ నెలవులకి వెళ్లిపోయారు. బేహారీలు తమ కొట్లు కట్టేసి పరుగు పరుగున తమ భవనాలు చేరుకున్నారు.

బట్టలు, సామాన్లు..  సరుకులన్నీ తడిసి ముద్దవడం ఖాయం.. తగిన రక్షణ కల్పించక పోతే.

ఆకాశం అంతా నల్లని కారు మబ్బుతో కమ్ముకు పోయింది.


పట్టపగలే చీకటి ప్రవేశించింది. పశువులకి తగిన ఆహారం సమకూర్చి, కొట్టాలలో కట్టేశారు. అన్నీ అస్థిమితంగా రకరకాలుగా అరుస్తున్నాయి. పక్షులన్నీ.. ఎక్కడికెళ్లి పోయాయో... మాయం అయిపోయాయి.

ప్రకృతి విలయ తాండవానికి సమస్త ప్రాణులూ తయారయినట్లుంది.

పూరి గుడిసెల్లో ఉండే పాటక జనం.. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని, ఇంట్లో ఉండాలో, బైటికెళ్లాలో తెలియక అల్లాడి పోతున్నారు.

అనుకున్నట్లుగానే.. కొద్ది ఘడియల్లో తుఫాను, ప్రారంభం అయింది. గాలులతో పాటుగా కుండపోత వర్షం..

కన్ను మూసి తెరిచే లోగా, వేళ్లతో సహా చెట్లు లేచి వాలి పోయాయి.

మూడు రోజులు ఆగకుండా కురుస్తూనే ఉంది. గాలుల వడి తగ్గినా, ఆ జడి వానకి కటకం చుట్టూ ఐదారు కోసుల దూరం వరకూ.. అన్ని పల్లెలూ ఊడ్చి పెట్టుకు పోయాయి.

పంటలన్నీ కోతలై పోయి, కుప్పలు పోశారు. అన్నీ .. ధాన్యాలు, కందులు, పెసలు.. అన్నీ కొట్టుకు పోయాయి. ఇంకా కంకులు కోసిన చెట్లు అలాగే ఉన్నాయి.

తుఫాను తగ్గాక ప్రజలు ఇళ్లలోంచి బైటికొచ్చి చూస్తే ఏముంది? విధ్వంసం..

పొయ్యిలు వెలిగిన వాళ్ల ఇళ్లల్లో వెలిగాయి.. లేని వాళ్లు గంజి కూడా తాగలేని స్థితి.

పశువులు కొట్టుకుపోయాయి, కొట్టాలతో సహా! నది ఒడ్డున ఉన్న పూరి గుడిసెలన్నీ తేలి పోయాయి. అందులో ఉన్న మనుషుల సంగతి అనుకునేదేముంది? సర్వ నాశనం.
పోయిన వారు పోగా ఉన్న వారి సంగతేమిటి?
తుఫాను సమయంలో పిట్ట కూడా బైటి కొచ్చే అవకాశం లేదు.
ఆ తరువాత పరిస్థితేమిటి? ఆ జగన్నాధుడే ఆదుకోవాలి..

 

 

 

 

                                                                                                                ......మంథాభానుమతి