Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 13వ భాగం

 

                   ‘అజ్ఞాత కులశీలశ్య….” 13వ భాగం

                                    కోటలో..                          

 

          ఉ.    జీవన యానమున్ కలుగు చేర్పులు తర్కము కందవే మరీ

                  ఏ విధి రాసెనో నుదుట యెవ్వరి కైనను నేర్వవచ్చునా

                  కావగ దైవమే యిలను కైనొసగేనుగ మోదమందగా

                  చేవగ కోటలో నడుగు చిక్కగ వేసెను మాధవుండదే.    

 

  కళింగ దేశం వచ్చినప్పటునుంచీ కోటలోపలికి వెళ్లాలనుకున్న మాధవుడు, అనుకోని విధంగా, రాకుమారుని వెంట కోటలో ప్రవేశించాడు.

  వంగదేశంలోని తమ కోట కంటే ఎంతో విశాలంగా ఉంది. తీరైన దారులు.. దారుల పక్కన పూల మొక్కలు.. స్వాగతిస్తున్నట్లు తలలూగిస్తున్న వృక్షాలు..

  ఎంతో శుభ్రంగా కన్నుల కింపుగా ఉంది.

  పురుషోత్తమ దేవుడు, గజాలని గజశాలలకి తరలించాడు.

  గజశాలలని చూసిన మాధవుడు అనుకున్నాడు.. కపిలేంద్ర దేవుని విజయాలకి ఆటంకం ఉండదని, వారి వంశానికి గజపతులనే పేరు నిలిచి పోతుందనీ, కనీసం మూడు తరాలు పాలన చేసి తీరుతారని!

  కోట వెనుక భాగాన ఎత్తైన ప్రాకారాలతో ఉంది గజశాల. అచటికి వెళ్లాలంటే కోటను దాటే వెళ్లాలి. ఏ చారులూ సులభంగా చేరలేరు.

  అదాటుగా చూసి ఏనుగులను లెక్కించడం అసాధ్యం.

  మొత్తం అంతా చూపించి, కొత్త గజాలన్నింటినీ, ఒక్క రోజులో నిర్మించిన విశాలమైన శాలల్లో ప్రవేశ పెట్టారు. ప్రతీ ఏనుగు వద్దా గుట్టల్లా పోసిన కొమ్మలు.

  

  మాధవుడు, పురుషోత్తమ దేవుడు.. శాలలన్నీ నడిచి చూస్తున్నారు.

  గజశాలలన్నీ పెద్ద అడవిలో ఉన్నట్లే ఉన్నాయి.

  రాజ్యాన్ని చేజిక్కించుకునే ముందే ఏనుగుల సంరక్షణ కేర్పాట్లు చేశాడు కపిలేంద్ర దేవుడు.

  ఒకటి రెండు రోజుల్లో జరిగిన ఆక్రమణ కాదది. దాదాపు ఐదారు సంవత్సరాల నుంచీ ప్రణాలిక వేసిందే.

  ప్రధాన సామంతుడిగా, సైన్యికాధికారిగా, కపిలేంద్రుడు అభివృద్ధి పనులని బాగా చేపట్టాడు.. తనే చేస్తున్నట్లు చల్లగా ప్రచార మిచ్చుకుంటూనే.

  ఏదేమైనా.. కళింగదేశం కళకళ్లాడుతోంది. ఆలయాల నిర్మాణం, పూరీ జగన్నాధుని ఆలయానికి అలంకరణలూ.. పాడి పంటల అభివృద్ధి బాగా సాగుతోంది. ప్రజలు మార్పుని మనస్ఫూర్తిగానే ఆహ్వానించారు.

  అయితే.. సైన్య సమీకరణ, అశ్వ, గజ శాలల అభివృద్ధి కూడా వేగంగా జరుగుతున్నాయి. అంతర్గత విప్లవాలని అణచి వేసినా, బలహీన పొరుగు దేశాలపై యుద్ధానికి సన్నిద్ధమౌతున్నాడు రాజు.

  గజ శాలలని చూసి అదే అనుకున్నాడు మాధవుడు.

  అతి త్వరలో యుద్ధానికి సమాయత్తమవ వలసి ఉంటుందని.

  

  “మాధవా!” రాకుమారుని పిలుపు విని తల తిప్పి చూశాడు

  “రోజూ కోటకి రాగలవా? అంటే.. కొద్ది సమయం ఇక్కడ గడపగలవా?”

  మాధవుని నోట మాట రాలేదు. రాకుమారుడు అడుగు తున్నాడంటే ఆజ్ఞాపిస్తున్నాడనే అర్దం. కాదనగలడా?

  “ఇది ఆజ్ఞ కాదు సుమా.. అభ్యర్ధన మాత్రమే.” మనసులో మాట తెలుసుకున్నట్లుగా అన్నాడు.

  “తల్లిదండ్రులకో మారు చెప్పి..” మాధవుని మాట పూర్తి అవకుండానే పురుషోత్తముడు చిరునవ్వు నవ్వాడు.

  “అవశ్యం మిత్రమా! వారి అనుమతి తీసుకునే! నంద మహాపాత్రులకి అభ్యంతరం ఉంటుందనుకోను. మీ అమ్మగారే భయ పడవచ్చును. కానీ సర్ది చెప్పగలవని నాకు నమ్మకమే.. అది నీకు ఇష్టమైతేనే సుమా..”

  రాకుమారుడు, మిత్రమా అని సంబోధించడమా? అదీ ఒక పూటకూళ్లఇల్లు నడిపే బ్రాహ్మణుల బాలుడిని.

  మాధవుడు సంశయాత్మకంగా చూశాడు.

  “మనం ఒకే గురువు వద్ద విద్యనభ్యసిస్తున్నాం. మరి మనం మిత్రులమేకదా మిత్రమా?” మాధవుని భుజం మీద చెయ్యివేసి అన్నాడు పురుషోత్తముడు.

  ఆ క్షణం నుంచీ మాధవ, పురుషోత్తములిరువురూ ప్రాణ స్నేహితులై పోయారు. జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచారు.

  ఇంటికి తేరుకుని, ఏవిధంగా కోట సంగతి చెప్పాలా అని మధన పడుతున్న మాధవునికి ఊరట కలిగింది, నందుని ఉత్సాహాన్ని చూసి.

  “కోటలో పాగా వెయ్యడమంటే ఇదే కుమారా? అవశ్యం వెళ్లు. మన రాజుగారికి సేవ చెయ్యడం కన్న కావలసినది ఏముంటుంది?”

  గౌతమికి మాత్రం ఆవేశం వచ్చింది.

  “ఇదేనా మీరు చెప్పవలసింది. కోటలోకి అడుగు పెడితే ఇంక కన్నయ్య మనకి దూరమైపోడా? వద్దని చెప్పక, ఇంకా ప్రోత్సహిస్తారా?”

  అప్పటికి నందుడు ఏమీ మాట్లాడకుండా వెళ్లి పోయాడు.

  “అమ్మా! మీరు వలదన్నచో నేను ఇల్లు కదలనే కదలను.” మాధవుడు మాత్రం అభయం ఇచ్చేశాడు.. తల్లిని మరపించిన తల్లికి.

  అంతా వింటున్న సీతమ్మ మౌనంగా ఉండి పోయింది. ఆవిడకి తెలుసు.. ఆ సమయం వస్తే ఎవ్వరూ ఏదీ  ఆపలేరని.

  “ఐనా.. రోజూ కొద్ది సేపే కదమ్మా రాకుమారుడు నన్ను రమ్మని అడిగింది. అంతలో నన్ను సైన్యంలో చేర్చుకున్నట్లు కాదు కదా!” మాధవుడు ఊరడించ బోయాడు.

  గౌతమి కళ్ల నీళ్లు పెట్టుకుంది.

  “ఇప్పుడలాగే అంటారు కన్నయ్యా! ఒక సారి అందులోకి వెళ్తే ఇంక వదలరు. అందులో ఇప్పుడు యువకులని యుద్ధాలకి తీసుకు పోతున్నారు. వాడ వాడంతా హడలి పోతున్నారు.”

  “నన్ను యుద్ధానికి తీసుకెళ్లరమ్మా! రాకుమారుని వెంటే ఉంటాను. ఐనా మీరు వద్దంటే వెళ్లనని చెప్పా కదా?” మాధవుడు తల్లి చీర కొంగుతోనే ఆమె కన్నులు తుడుచాడు.

                                      ………………..

 

  “రాకుమారుడు మాట వరుసకి అడిగారు కానీ, అది ఆజ్ఞే గౌతమీ. తప్పక వెళ్ల వలసిందే. మనం సంతోషంగా అనుమతి ఇవ్వాలి, ఆశీర్వదిస్తూ.” నందుడు ఏకాంతంలో గౌతమికి సర్ది చెప్పాడు.

  “ఒక సారి కోటలోకి వెళ్లే.. మనకి తెలియనిదేముంది?” కళ్లనిండా నీళ్లతో అంది గౌతమి.

  “అంతలాగ మాయా మోహంలో చిక్కుకో కూడదు గౌతమీ! అయినా ఐదారు సంవత్సరాల క్రితం మాధవుడెవరో మనమెవరో.. ఇప్పుడు ఈ అనుబంధం వచ్చింది కానీ.. నిమిత్త మాత్రంగానే ఉండాలి సుమా.”

  మరునాడు.. గౌతమి, ఆందోళన లోలోపలే దాచుకుని మాధవునికి అనుమతి ఇచ్చింది.

  కానీ ఆవిడ భయపడినట్లే అయింది.

  మాధవుడు గురుకులం నుండి కోటకే వెళ్తున్నాడు. వారానికి ఒక పరి మాత్రమే ఇంటికి వస్తున్నాడు.

  వచ్చినప్పుడు మాత్రం ఎప్పటి లాగానే అందరితో కలసి మెలసి, ఛలోక్తులు విసురుతూ అలరిస్తుంటాడు.

  కోటలో..

  గజశాల పర్యవేక్షణ మాధవుని ప్రధాన బాధ్యత. ప్రతీ ఏనుగుకీ ఒక మాలీ ఉన్నాడు. వారు పనిని బాగుగా చేస్తున్నారా, గజాలకి బాగా శిక్షణ ఇస్తున్నారా.. నమూనా యుద్ధరంగాలనేర్పరచి, అందులో ఏనుగులకి బాధ్యతగా ప్రవర్తించే విధానాలు నేర్పుతున్నారా..

  ఆహారం బాగా అందుతోందా..

  పశువుల ఆరోగ్యాలెలా ఉన్నాయి.. ఇటువంటి ముఖ్యమైన పనులన్నీ మాధవుని బాధ్యతలే. అవన్నీ అతడు ఇష్టంగా చేస్తున్నాడు.

  మధ్య మధ్యలో పురుషోత్తమ దేవునితో కలిసి సాహిత్య చర్చలు తప్పని సరి. అప్పటికి నాలుగు శతాబ్దాలుగా, సంస్కృతం నుంచి పురాణ గాధలని ప్రాంతీయ భాషల్లో, జన సామాన్యానికి అందుబాటులో ఉండేలాగా రచించడం వచ్చింది, రాజమహేంద్రవరం నుండి ప్రారంభమై.  

  కవిత్రయం ఆంద్ర మహా భారతం రచించడం, దేశంలోని అన్ని బాషల వారికీ మార్గ దర్శకం అయింది.

  కవులు కనీసం నాలుగు భాషల్లో ఆరితేరిన వారై ఉండే వారు.

  మాధవునికీ, పురుషోత్తమునికీ కూడా తెలుగు సాహిత్యం మీద అంతులేని మక్కువ.

   కపిలేంద్రదేవుడు, రాజమండ్రీ, కొండవీడు, తెలంగాణ, పాకనాడు మొదలైన రాజ్యాలని స్వాధీన పరచుకునే ప్రయత్నంలో.. తెలుగు వారితో రాక పోకలు అధిక మయ్యాయి.

  ప్రతీ రోజూ కనీసం నాలుగు ఘడియలైనా సాహిత్య చర్చ జరుగుతుంది.

 

  కపిలేంద్ర గజపతి కళింగని స్వాధీన పరచుకున్నప్పుడు, రాజమండ్రీ రాజధాని గా రాజ్యాన్నిఅల్లాడ వేమారెడ్డి తమ్ముడు వీరభద్రా రెడ్డి పాలిస్తుండే వాడు. కొండవీడు నేలిన పెదకోమటి వేమారెడ్డి రాజ్య పతనం అయ్యాక మహాకవి శ్రీనాధుడు రాజాస్థానంలో ప్రాపునకై రాజమండ్రీ వచ్చాడు.

  దాదాపుగా కపిలేంద్రుడు సిహాసనాన్ని చేజిక్కించుకున్న కాలం లోనే, శ్రీనాధుడు భీమఖండం అనే కావ్యాన్ని రచించాడు. కాశీ యాత్రకు వెళ్తున్న పండితులు కొందరు, మహాపాత్రుల కళింగంలో బస చేసినప్పుడు, మాధవుని ఆసక్తిని గమనించి ఆ ప్రతిని కానుకగా ఇచ్చారు.

  “మేము తిరుగు ప్రయాణంలో వచ్చే సరికి మీరు మరొక ప్రతిని చేసుకుని మాకు ఈ కావ్యాన్ని తిరిగి ఇచ్చెయ్యాలి సుమా!” పండితుడు హెచ్చరించాడు.

  “అంత గొప్ప గ్రంధమా స్వామీ?”

  “అవునయ్యా. కవిత్రయం వారి మహా భారతం సరసన నిలువగల రచనలు చేశారు, శ్రీనాధ కవి సార్వభౌములు. సులభంగా అర్ధమయే చాటువులు.. అందరి నోట తిరిగే పద్యాలు.. ఆసక్తిగా సాగే కథనం. చదివి చూడండి. మీకే తెలుస్తుంది కదా! మీ రాకుమారుడు కూడా సాహిత్య పిపాసి అని విన్నాం. వారికి కూడా చూపించండి అనుకూల మైనప్పుడు.”

  మాధవుడు భీమఖండం పఠనం ముగించగానే, శ్రీనాధ కవికి అభిమాని అయి పోయాడు.

  రాకుమారునికి చూపించాడు ఒక రోజు..

  “దేవా! ఈ కావ్యం చదివి తీరాలి మనం. అద్భుతంగా ఉంది.”

  “అవశ్యం మాధవా! నాకూ చాలా ఉత్సుకతగా ఉంది. చదువుతాను. చదివాక ఇద్దరం కలిసి చర్చిద్దాము.”

  మాధవునికి ఎనలేని సంతోషం కలిగింది. రాకుమారుని సాంగత్యం తన పూర్వజన్మ పుణ్యం అనుకున్నాడు.

  “ప్రస్తుతానికి, మహానదీ తీరానికి విహారం వెళ్దాము. చాలా రోజులయింది. అందులో సంధ్యా సమయంలో  నది అందాలు చూసి తీర వలసిందే కదా..” పురుషోత్తమదేవుడు అశ్వశాల కేసి దారి తీశాడు.

  ఇద్దరూ బయల్దేరారు, రెండు అశ్వాల మీద. నది ఒడ్డునే వెళ్తూ, కావ్య పఠనం సంగతి ప్రక్కన పెట్టి ప్రకృతి అందాలు చూస్తూ.. పరవశిస్తూ, నెమ్మదిగా వెడల సాగారు.

  చల్లని గాలి హాయిగా తనువు తాకుతుంటే, మనసు తేలిపోసాగింది. సంధ్య వెలుగులు పరిసరాలన్నింటినీ ఆక్రమించుకుని, అందుబాటైన చోటంతా పరావర్తనం చెందుతున్నాయి.

  మాధవుని నోట అసంకల్పితంగా వెలువడిందొక పద్యం. అప్పటికి తెలుగు భాష మీద మక్కువ మిక్కుటంగా ఏర్పడిందతడికి.

 

           కం.      “కెంజాయల మెరుపు నదిన

                       సంజాతము కలిగె గాద సంపూర్ణముగా

                       కంజజుడు గీసినటులనె

                       రంజనముగ మనసులే పరవశింపగనే.”

 

  పక్కనే ఉన్న రాకుమారుని చూసి మాధవుని మోము కెంజాయ దాల్చింది.. అచ్చు అక్కడున్న నింగీ, నదుల వలెనే.

   

 

  

            

 

  “మాధవా! ఇదంతా కవి సార్వభౌముని కావ్య సాంగత్యమే?” రాకుమారుడు ప్రశంసగా చూశాడు.

  “దేవా మీకు..” సంకోచంతో ఆపేశాడు మాధవుడు.

  “అవును మాధవా! సమకాలీన సాహిత్యంలో శ్రీనాధ మహాకవి ప్రతిభ తెలియని వారుండరు. పాఠ్యాంశాలు కూడా ఉన్నాయి. నీకు తెనుగు సౌరభం ఇప్పుడిప్పుడే తెలుస్తున్నట్లుంది. శ్రీనాధులవారే తెనుగు భాష గురించి ఈవిధంగా అన్నారు..

 

            ఆ.వె.  "జనని సంస్కృతంబు సకల భాషలకును

                       దేషభాషలందు దెనుగు లెస్స

                       జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద

                       మెచ్చుటాడుబిడ్డ మేలు కాదె?"

 

  ఇద్దరూ గుర్రాలు దిగి, అక్కడున్న చెట్టుకు కట్టేసి, కాసిని గుగ్గిళ్లని వాటి ముందు పెట్టి, మహానది ఒడ్డునే నడవ సాగారు.

  అప్పడే పక్షులన్నీ గూళ్లకి చేరుకుంటున్నాయి, తమ పిల్లల ఆకలి తీర్చడానికి. తల్లుల్ని చూడగానే నోళ్లని తెరిచి, రకరకాల అరుపులతో తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నాయి.. ఇరవైరెండు శృతుల్లోనూ.

 నది ఒడ్డునే ఉన్న ఒక తిన్నె మీద కూర్చున్నారు స్నేహితులిరువురూ.

  “అవును మిత్రమా! ఒక రకమైన పారవశ్యంలోఉండి పోయాను. కవిత్రయానికి దీటైన కవి ఎవరంటే శ్రీనాధులవారే అంటాను.”

  “ముమ్మాటికీ నిజమే మాధవా! జీవితాన్ని కాచి వడపోసిన మహానుభావులు. ఎక్కడున్నారో ఇప్పుడు?” కొద్ది విచారంగా అన్నాడు పురుషోత్తమ దేవుడు.

  “అదేమిటి దేవా? రాజమహేంద్రవరంలో ఉంటారు కదా? ఈ యుద్ధ వాతావరణం తగ్గాక వెళ్లి దర్శించుకుందామను కుంటున్నానుకూడా..” మాధవుడు ఆశ్చర్యపోయాడు.

  “వేగుల వార్తలను బట్టి..” ఆపేశాడు రాకుమారుడు.. బహిరంగంగా మాట్లాడవలసిన విషయాలు కావవి.

  “మరొకసారి చెప్పుకుందాం. నదిలో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి బయలుదేరుదాము. తండ్రిగారు ఎదురు చూస్తుంటారు.” పురుషోత్తమదేవుడు లేచాడు.

                                        ……………..

 

......మంథా భానుమతి