Facebook Twitter
“అజ్ఞాత కులశీలశ్య….” 10వ భాగం

“అజ్ఞాత కులశీలశ్య….” 10వ భాగం

 

 

సీ.      నిలువ గలదనేది నే కాలమందైన

యుండనే యుండదు యుర్వి లోన

చెట్లు చేమలు పొదలు, చేరియున్న క్రిములు

చెదరక మానవు, సెంక వలదు

కళ్లు జిగేల్మనే కనకపు కాంతులు

కదలి పోవునెపుడో కనుల ముందె

సడలని కోటలే శత్రు భేద్యము లయిన

కూలక మానవు గుంజ కదల

             

                       ఆ.వె.     నేలనంత కూడ నేలేటి వారైన

                                    కూల బడ వలయుగ నేల కింద

                                    కాల మహిమ నెవరు కాదన గలరుగా

                                    వేల వేల యేళ్లు వేడు కొనిన.

 

  క్రీ.శ. 1435-- ఫాల్గుణ మాసం.

            

  కోట చుట్టూ తిరిగి, ముఖ ద్వారం చూస్తూ మాధవుడు వెను తిరిగాడు. మాధవుడు తిరిగిన బాటకీ, కోటకీ మధ్య అగడ్త ఉంది. అందులో నీళ్లు అడుక్కి ఉన్నాయి.

  అదే సమయంలో కోట సింహ ద్వారం వైపుగా ఒక మేనా వెళ్తోంది. మేనాకి తెరలు కట్టి ఉన్నాయి. గాలి వాలుకి తెర తొలగింది. ఒక మెరుపు మెరిసినట్లయింది మాధవుని కనుల ముందు.

  జరీ చీనాంబరాలు కట్టుకుని, నగలతో అలంకరించుకున్న బాలిక మోము.. చిరునవ్వు, నగలని మించిన మెరుపు నిచ్చింది. సోగ కన్నులతో.. అందిన అవకాశం జార కూడదన్నట్లు, బాలిక కన్నులు విప్పార్చి అంతా పరికిస్తోంది.

  తీర్చి దిద్దినట్లున్న కను ముక్కు తీరు.. ప్రతీ కదలికలో కనిపిస్తున్న రాచ ఠీవి..

  కళ్యాణిని అటు పరుగెత్తించి, గుట్టమీద చేతికందిన చెంగల్వ పూవును కోసి బాలిక చేతి కందించి, వేగంగా మాయ మయ్యాడు మాధవుడు.

  బిత్తర పోయిన బాలిక, ఎదురుగా కూర్చుని ఉన్న తల్లిని చూసింది గాభరాగా..

  ఆదృష్టం.. ఆవిడ అటు పక్కనున్న తెర కొద్దిగా తొలగించి ప్రకృతిని పరిశీలిస్తోంది.

  చెంగల్వ పూవు చేత పెట్టినప్పుడు, ఆ బాలుని కళ్లలో కనిపించిన ఆరాధన.. అతడి మోమున విరిసిన వెలుగు.. బాలిక మనసులో నిలిచి పోయాయి.

  ఆ బాలిక కపిలేంద్ర దేవుని కూతురు. కాదంబరీ దేవి. కాబోవు రాకుమారి..

  కపిలేంద్రునికి బహు భార్యలు.. పలు సంతానం. పద్ధెనిమిది మంది కుమారులని కళింగంలో ప్రచారంలో ఉన్న వార్తలు. కుమార్తెలెందరో ఊహ లేదు ప్రజలకి.

                                          …………..

 

  చడీ చప్పుడు లేకుండా కళ్యాణిని కట్టేసి ఇంట్లోకి వచ్చాడు.

  “ఇంత వేగిరం వచ్చేశావేం కన్నయ్యా?” వెన్న చిలుకుతున్న గౌతమి అడిగింది.

  సాధారణంగా గుర్రం మీద స్వారీకి వెళ్తే మాధవుడు ఐదారు ఘడియల్లోపుగా రాడు. ఆ రోజు గురువు గారి వద్ద పాఠాలు కూడా లేవు.

  మౌనంగా తండ్రి పక్కకి వెళ్లి కూర్చున్నాడు.

  ఆ రోజు వంటకి వలసిన సరుకులని సరుదుతున్న నందుడు తలతిప్పి చూశాడు. మాధవుడి మొహంలో ఏదో ఆరాటం, ఆందోళన.

  “ఏమయింది?” నందుని కంఠంలో ఆదుర్దా..

  “కోటలో ఏదో జరుగుతోంది తండ్రీ! అంతఃపురంలోని వారందరినీ కోట వెనుక ప్రాకారం లో కొత్తగా ఏర్పరచిన ద్వారం గుండా తరలించేస్తున్నారు. మేనాలు, అశ్వాలు దక్షిణ దిక్కుగా వెళ్తున్నాయి. నేను విన్న దేమంటే..”

  మాట్లాడ వద్దన్నట్లు సైగ చేశాడు నందుడు. అదే సమయంలో రాజ భటులు కొందరు ఇంటిలోనికి ప్రవేశించారు.

  “మూడుపదుల మందికి రెండు ఘడియల్లోగా వంట సెయ్యాలి పూటకూళ్లయ్యా! రాజుగారు చెప్పమన్నారు.” వారిలో అధికారిలా ఉన్నవాడు చెప్పాడు. అది ఆజ్ఞే..

  “రాజుగారు యుద్ధం నుంచి..”

  “ఆ రాజుగారు రారు ఇంక. ఇప్పుడు కళింగాన్నేలే మహారాజు కపిలేంద్ర దేవులవారు.ఇక నుండీ వారి ఆజ్ఞలే పాటించాలి అందరూ.”

  ఊహించినదే ఆయినా.. అదే వాస్తవానికొచ్చినప్పుడు తట్టుకోవడం అంత సులభం కాదు. ఒక ఒరవడికి అలవాటు పడినవారు.. మరలా కొత్త పాలన, కొత్త పరిధులు..

  ఒక్కసారిగా లేచి నిలుచున్నాడు నందుడు.

  అసంకల్పితంగా గౌతమి కూడా లేచింది.

  అదేం పట్టించుకోకుండా, వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోయారు భటులు.

  “ఇదే నేను విన్నది నాన్నగారూ! అంతఃపుర స్రీలని పంపించేస్తున్నారు కోటలోనుంచి. దక్షిణాన ఉన్న శ్రీముఖలింగం వద్ద ఉంచుతారట. కొత్త రాజుగారు వారి బాగోగులన్నీ చూస్తారుట.” మాధవుడి మాటలకి తలూపాడు నందుడు.

  కొత్త రాజుగారి పరివారం కోటలోకి ప్రవేశిస్తున్నారు.

  “అవును.. గత కొద్దినెలలుగా పురంలో అట్టుడుకిపోతోంది. పుకార్లని తోసి పడేశారు. నాకు అనుమానంగానే ఉంది. మనకి సైనికుల తాకిడి కూడా బాగా ఎక్కువయింది.”

  “ఇక్కడ రాజ్యం, హిందూ రాజే ఆక్రమించుకున్నాడు కనుక ఆడవారికి ఏ అవమానం జరుగ లేదు. అదే వంగ దేశంలో.. సుల్తానులు మగవారిని నరికేసి, ఆడవారిని వారి బీబీలుగా చేసేసుకుంటారు. అందుకే నేను, జానూపూర్ సుల్తాన్ గురించి అడుగుతున్నాను. పాపం.. ఆ భానుదేవుడు రాజుగారేమైపోయారో..” మాధవుడు విచారంగా అన్నాడు.

  “ఏమీ చెప్పలేం. ప్రజల యోగక్షేమాలు పట్టించుకోకుండా, సుంకాలు వసూలు చేస్తారని వారి పాలన మీద అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు. కపిలేంద్రుల వారికి రహస్యంగా ప్రజలు చేసిన విన్నపాలే ఈ ఫలితాలకి కారణం. ఏది ఏమైనా.. జన నష్టం లేకుండా గాంగేయుల యుగం అంతరించి పోయినందుకు ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పవలసిందే.” నందుడు, చకచకా శాకములు తరుగుతూ అన్నాడు.

  మాధవుడు కూడా సీతమ్మకి కావలసిన సహాయం చేస్తున్నాడు. కళింగం వచ్చి కొద్ది నెలలే అయినా, ప్రేమ, ఆప్యాయతలు.. నిశ్చింతగా సాగుతున్న జీవితం మాధవుని ఎదుగుదలకి దోహదం చేశాయి. కండ పట్టి పొడుగు కూడా అయ్యాడు.

  “కపిలేంద్ర దేవుల కుమారుడు పురుషోత్తమదేవుడు నా సహాధ్యాయి గురువుగారి వద్ద. నాకన్నా రెండు వత్సరములు పెద్దయి ఉంటారు. నేనంటే చాలా ఇష్టం వారికి.” మాధవుడు, అమ్మమ్మకి సహాయంగా మిరియం నూరుతూ అన్నాడు.

  చేస్తున్న పనాపి ఆందోళనగా మాధవుని వద్దకు వచ్చింది గౌతమి.

  “నీకు రాకుమారులతో స్నేహమెందుకు కన్నయ్యా? వారికి అనుగ్రహం వచ్చినా, ఆగ్రహం వచ్చినా పట్టలేము.”

  “తప్పదమ్మా! మరి గురువుల వద్దకు వెళ్లి విద్యలు నేర్వాలంటే సహాధ్యాయులతో మెలగాలి కదా! ఆది రాజకుమారుడైనా, బికారైనా..”

  “నిజమే..” నిట్టూరుస్తూ వెళ్లి పోయింది గౌతమి.

  “కొత్త పాలన ఏ విధంగా ఉంటుందో.. మళ్లీ కొత్త సుంకాలు, కొత్త యుద్ధాలు.” నందుడు గుసగుసగా అన్నాడు.

  “యుద్ధాలు తప్పవు తండ్రీ”

  ఉలిక్కి పడ్డాడు నందుడు. ఈ బాలుడికి ఇంతింత రాజకీయాలే విధంగా తెలుసునో!

  “రాజులు మారినప్పుడు ప్రజలకీ, సామంతులకీ ఒప్పుకోవడానికి సమయం పడుతుంది. అందరినీ అధీనంలోకి తీసుకొని రావలె కదా.” మాధవుడు వెనుక వాకిలి లోకి వెళ్లాడు.. పశువులకి మేత వెయ్యడానికి.

  వెంటనే రకరకాల అరుపులు.. మాధవుడిని చూడగానే ఆనందంతో గెంతులేసుకుంటూ వస్తాయి.. శ్వేత, శార్వరి. ఆవు మాత్రం చిద్విలాసంగా నెమరేస్తోంది.

                                     …………….

 

   చైత్రం, వైశాఖం వెళ్ల పోయాయి. జ్యేష్టం ప్రవేశించింది. వానలు కూడా ఆరంభమయ్యాయి.

  మూడు మాసాలు కటక ప్రజలకీ, సామంత రాజులకీ సమయం ఇచ్చి, వారందరి సహాయ సహకారాలతో.. ఒక రకంగా సమ్మతితో, కపిలేంద్ర దేవుడు సింహాసనం అధిష్టించాడు.

  రాజ్యం చేజిక్కించుకున్నాడే కానీ క్షణ క్షణం అప్రమత్తతతో ఉండాల్సిందే.. ఏమరుపాటు ఏ మాత్రం పనికి రాదు.

  మొదటగా తన సామంతుల విప్లవాన్ని అణచాలి. వారిలో ముఖ్యులు, నందపురం శీలవంశీయులు, ఒడ్డాది మత్స్య రాజులు,  పంచధారల విష్ణు వర్ధనులు.

  గాంగేయుల రాజ్యం అంతరించిందని వార్త వినగానే సామంత రాజులు పన్నులు కట్టడం మానేశారు. సుశిక్షతులైన తన సైనికులతో వారినందరినీ ఒక త్రాటి మీదికి తీసుకొచ్చాడు కపిలేంద్ర దేవుడు..

   రాజులందరికీ పరాక్రమ వంతుడైన కపలేంద్రుని ఎదిరించడానికి సాధ్యం అవలేదు.

   కళింగలో సూర్య వంశీయులైన ‘గజపతు’ల పాలన మొదలయింది.

   మాధవుడు చెప్పినట్లే అవుతోంది.

  మహాపాత్రులు వండి వారుస్తున్న వారు వారుస్తున్నట్లే ఉన్నారు. కోటలో వంటశాల వచ్చే పోయే సైనికుల అవసరాలు తీర్చలేక పోతోంది.

  ఆ రోజు ప్రవాహంలా వస్తూనే ఉన్నారు..

  “ఏమయింది బాబూ?” సీతమ్మ ఆయాస పడుతూ అడిగింది ఒక సైనికుడిని.

  నంద, గౌతమిలు కూరగాయలు తరిగేస్తున్నారు చకచకా..

  అరటి వంటి వాటికి తప్ప, కొన్నింటికి తొక్కలు తియ్యడానికి సమయం సరి పోక, రుద్ది రుద్ది కడిగి అలాగే వండేస్తున్నారు.

  కొందరు సైనికులు వీరి కష్టం గమనించి వారికి తోచిన సహాయం వారు చేస్తున్నారు. అయినా.. రాత్రి ఎప్పుడో ఏడెనిమిది ఘడియలు తప్ప విశ్రాంతి దొరకడం లేదు.

  “ఉత్తరాన జానుపురం, వంగ దేశాల నుంచి ఎప్పటి కప్పుడు బెదిరింపులు.. అవి చాలనట్లు ఢిల్లీ సుల్తాను కూడా ఓఢ్రం మీద కన్నేశాడని చారుల వార్త. అందువలనే సైన్యాన్ని పటిష్ఠం చేసుకోవలసిన అవసరం వచ్చింది మహా రాజుగారికి.” పెద్ద గుండిగ నిండుగా ఎసరు పెట్టి గాడి పొయ్యి మీరికి ఎక్కించడానికి సహాయ పడుతున్న ఒక సైనికుడు చెప్తున్నాడు.

  “ఈ విధంగా ఎంత కాలం?” నీరసంగా అడిగింది గౌతమి.

  “రెండు మూడు సంవత్సరాలుండ వచ్చమ్మా. కొత్త వారిని తీసుకుంటున్నారు సైన్యం లోకి. సామ్రాజ్యాన్ని విస్తరింప జేశాక దాన్ని కాపాడుకోవాలి కదా! గాంగేయుల వలే గంగ నుండి గోదావరి వరకూ జయించాలని మహారాజుగారి కోరిక.”

  నందుడు ఇద్దరిని సహాయకులుగా పెట్టుకున్నాడు.

  అయినా.. అంతా చూసుకుంటూ పర్యవేక్షించాలంటే గౌతమి, సీతమ్మలే కావాలి. అందుకే బాగా అలిసి పోతున్నారు. ధనం మాటెలా ఉన్నా.. రాజాజ్ఞ పాటించి తీరాలి. తప్పదు.

  పప్పులు, ఉప్పులు పెట్టుకోవడానికి ఒక గది, ధాన్యం నిలవకి ఒక గాదె, కాయగూరలు కుళ్లి పోకుండా ఆర బెట్టి ఉంచడానికొక కటకటాల పంచ.. ఇవన్నీ కాకుండా, పాతిక మందికి ఒకే సారి వడ్డించడానికి అనువయిన పొడుగాటి వసారా.. ఇంటికి కలిపారు.

  రాజుగారి ఆంతరంగికులలో ఒకరైన గోపీనాధ మహాపాత్రులు నందుడికి పినతండ్రి వరసౌతారు.. దాయాదులు. వారి సహాయంతో ఇంటికి కావలసిన మార్పులు చేయించగలిగారు. కోటలో ధనాగారం నుంచి ధన సహాయం లభించింది.

  బాటసారులు రాత్రి ఉండి పోయి విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా నాలుగు గదులు కూడా వేశారు.

  పాడి కూడా పెరిగింది.. మరో రెండు గోవులు తువ్వాయిలతో సహా కలవడంతో.

  చిన్న పూటకూళ్ల ఇంటి స్థాయి నుంచి ఓ మాదిరి వసతిగృహం గా మారింది మహాపాత్రుల ‘కళింగం’.

  “మన కన్నయ్య వచ్చినప్పట్నుంచే మన ఇంట సిరులు విరిసాయమ్మాయ్..” సీతమ్మ రోజుకొక సారైనా అనక మానదు.

  మాధవుడు అల్లారు ముద్దుగా పెరుగు తున్నాడు.

  ఇంట నుంటే వద్దన్నా పనులలో జోక్యం చేసుకుంటాడు. అందువలననే, కళ్యాణితో సహా అతడిని గురుకులానికి పంపారు నందుడూ, గౌతమీ.. బాగా ఆలోచించుకుని.

  కపిలేంద్ర గజపతి అంతర్గత విప్లవాలని అణచి వేసి సామ్రాజ్యాన్ని సుస్థిరం చేశారు.

                                       ……………..

 

 కీ.శ. 1439:  

  మాధవునికి పదహారు సంవత్సరాలు నిండాయి. గురుకులంలో విద్యలన్నింటిలో రాణిస్తున్నాడు. స్వతసిద్ధంగా కత్తి యుద్దంలో, గుర్రపు స్వారీ లో అతనికున్న ఆసక్తితో ఆ విద్యలలో నైపుణ్యం సంపాదిస్తున్నాడు. గురువుగారి సమ్మతి తీసుకుని, రోజూ ఇంటి వద్దనుండే వెళ్లి వస్తున్నాడు.  

  కళ్యాణిని గుర్రపు స్వారీకి అనుకూలంగా తయారు చేసి, మాధవుడు కొత్తగా చేరిన వారికి తనే నేర్పిస్తున్నాడు. గురువుగారు సదానందులవారు మాధవుని ఆసక్తికి ప్రసన్ను లయ్యారు.

  స్వభావ సిద్ధంగా మాధవునికి సాహిత్యం మీద అభిరుచి మెండు. సంస్కృతాంధ్ర, వంగ, ఓఢ్ర బాషల్లో మంచి పట్టు వచ్చింది.

  ఆంధ్ర దేశం నుంచి పండితులెందరో కాశీ యాత్రకి తరచుగా వెళ్తుంటారు. దారిలోనే ఉన్న నందుని పూటఇంటిలో బస చేసే వెళ్తారు. ఒక్కొక్క సారి మధ్యదారిలో ఉన్నందు వల్ల రెండు మూడు రోజులు ఆగి, అలసట తగ్గాక వెళ్లటం కూడా కద్దు. ఆ సమయంలో మాధవుడు, ఇంటి వద్ద ఉంటే..  వారి వద్ద కవితా గానాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు.

  మాధవుని నాణాలు కొన్ని మాత్రమే ఖర్చు పెట్టాడు నందుడు. మిగిలినవి భద్రంగా ఇనుప పెట్టిలో దాచాడు.

  కవిత్రయం రాసిన ఆంధ్ర మహాబారతం మాధవునికి అత్యంత ప్రియమైనది. కొండవీడు నుండి, రాజమహేంద్రవరం నుండి వచ్చిన కవుల వద్దనుండి కొన్ని కొన్ని పద్యాలను రాసుకుని తన వద్ద భద్ర పరచుతుంటాడు.

 

  కోట వద్ద రద్దీ పెరిగింది.  

  ప్రకృతి ఆరాధన మాధవునికి ప్రియమైన విషయాల్లో ఒకటి.

  సూర్యోదయాత్పూర్వమే మహానది ఒడ్డుకు వెళ్లి అర్ఘ్యపాదాదులు అర్పిస్తూ ఉంటాడు. అతని, యుద్ధవిద్యల  ఆసక్తిని గమనించిన నందుడు, మాధవుని కేశములను కూడా పూర్తిగా తియ్యకుండా, మధ్యలో పిలక ఉంచుకునేట్లు అనుమతి ఇచ్చాడు.

  చల్లని ప్రాతః కాలమున మాధవుడు కదలి వెళ్తుంటే పశుపక్ష్యాదులు వెనువెంటే గుంపులుగా ఉంటాయి.

 

 చం.  తెలతెల వారకుండగనె తేకువతో వెడలేటి మాధవున్

         కలకలల ధ్వనిన్ కనగ, కామిత మానసుడైన శ్రీహరే

         నిల కగుదెంచె నేమొయని నివ్వెర పోయిన గువ్వలన్నియున్

         మెలకువఁ దెచ్చు కొమ్మనుచు మేల్కొలుపుల్ పలికేనుమోదమున్.  

 

  ఇంటివద్దనున్నపుడు, గురుకులంలోనూ కూడా మాధవుని నిత్య కృత్యమదే.

 

   ఒకరోజు.. మాధవుడు, ఉషః కాల సంధ్యావందనం పూర్తి అయాక, నది ఒడ్డునే ఉండిపోయాడు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ.

   రస హృదయులకి, పిట్ట ఎగిరినా, తువ్వాయి గెంతినా హృదయం స్పందిస్తుంది కదా!   

                                         

  

   

  కపిలేంద్ర దేవుడు రాజ్యానికి వచ్చినప్పట్నుండీ పాడి పంటల మీద దృష్టి కేంద్రీకరించాడు. తిరుగుబాట్లని అణచడంలో ఎంతటి సమర్ధత చూపించాడో.. రాజ్యంలో చెరువులు పునరుద్ధరించడంలో, చెట్లు నాటించడంలో అంతే చూపించాడు.

  రాజ్యం సుభిక్షంగా ఉంది.

  తడి వస్త్రములు మార్చుకుని, మంచి చోటు చూసుకుని, పద్మాసనం వేసి కూర్చున్నాడు. ప్రాణాయామం చేస్తూ.

  పులుగులన్నీ ఆహార సేకరణకై వెడలినట్లున్నాయి.. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది.

  ప్రాణాయామం అయ్యాక నెమ్మదిగా ధ్యానంలోకి వెళ్లాడు.

  ఒక ఘడియ గడిచిందేమో..

  “మాధవా.. మాధవా..” గట్టిగా పిలుస్తున్నారు ఎవరో..

  కన్నులు తెరిచి చూశాడు.

  గురుకులంలో సహ విద్యార్ధి.. రొప్పుతున్నాడు ఆయాసంతో.

  “గురువుగారు నిన్ను త్వరితగతిని పిలుచుకు రమ్మన్నారు. గురుకులం లోనికి ఏనుగుల మంద వచ్చింది. పంటంతా నాశనం చేస్తున్నాయి. ఇంక ఇళ్ల మీద కూడా పడ బోతున్నాయి. వాటిని వెళ్లగొట్టాలి. నీకు కొన్ని మెళకువలు తెలుసునట కదా?

  మాధవుడు వెంటనే స్పందించాడు.

  ఇంటికి వెళ్లి అమ్మతో చెప్పి, వెను వెంటనే సహాధ్యాయిని తీసుకుని, కళ్యాణి మీద బయలుదేరాడు, గురుకులానికి.

   యజమాని స్థితిని అర్దం చేసుకున్న హయం వేగంగా పయనం సాగించింది.

 

 

 

......మంథా భానుమతి