Facebook Twitter
చతురస్రం (కథ)



చతురస్రం (కథ)

 

- నెల్లూరి కేశవస్వామి

         తెలంగాణ తొలితరం రచయితల్లో నెల్లూరి కేశవస్వామి ఒకరు. 1920లో హైదరాబాదులో జన్మించారు. ఇంజినీరు అయినా తెలుగు కథలు, వెలుతురులో చీకటి పేరుతో ఒక నవల రాశారు. అలాగే కొన్ని నాటికలు, ప్రేమ్ చంద్ కథలను తెలుగులోకి అనువాదం చేశారు. వీరు రాసిన చార్మినార్ కథల సంపుటి అప్పటి హైదరాబాదు నగర ప్రజల జీవన విధానాన్ని తెలియజేస్తుంది. పైగా ఈ కథల సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది.
         చతురస్రం కథలో వెంకట్రావు కథానాయకుడు. అతను జీవితంపై విరక్తి చెంది ఉంటాడు. మానవ సంబంధాలపై విసుగుతో ఉంటాడు. ఒక గదిలో ఒంటరిగా ఉంటుంటాడు. ఒకసారి రైల్లో ప్రయాణిస్తూ ఉంటే హఠాత్తుగా ఎవరో కొరడాతో కొట్టినట్లు మెలుకువ వస్తుంది. లేచేసరికి అతని ఎదురు బర్త్ లో ఉన్న అతను యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని అరుస్తూ ఉఁటాడు. వెంకట్రావుకు అరుపులు, కేకలు, ఏడ్పులుస బొబ్బలూ వినిపిస్తూ ఉంటాయి. వెంకట్రావుకు విషయం అర్థమయ్యి బోగీ తలుపులు తెరిచి బయటకు చూస్తాడు. ఎత్తయిన కట్టపై కంపార్టుమెంటు నిలబడి ఉంటుంది. యాక్సిడెంట్ జరిగిందని నిర్దారణకు వస్తాడు. కొంతమంది అప్పటికే యాక్సిడెంట్ అయిన బోగీల దగ్గరకు వెళ్లి సహాయం చేస్తుంటారు. పైగా యాక్సిడెంట్ అయినది స్త్రీల బోగీలకు అని తెలుస్తుంది వెంకట్రావుకు.
          కానీ వెంకట్రావు సహాయం చేయడానికి వెళ్లడు. వాళ్లకు సాయం చేయడానికి  నేనెందుకు వెళ్లాలి అనుకుంటాడు. స్త్రీలందరూ కాళ్లు విరిగి, పసిపిల్లలు తలలు బ్రద్దలై, శనవాలుగా మారిన వాళ్లను చూసి మిగిలిన వాళ్లు రోధిస్తుంటే... వాళ్లను చూసి నేనెందుకు బాధపడాలి. నేనెందుకు సానుభూతి చూపించాలి అనుకుంటాడు. తన జీవితాన్ని గుర్తు చేసుకుంటాడు. బి.ఎ. పరీక్ష రాయకుండా వచ్చినందుకు బంధువులు తనను ఎంతగా బాధపెట్టింది.... ఆ తర్వాత తను బాగా సంపాదిస్తే, ఆ సంపాదన కోసం తన వెంటపడింది, చివరకు లక్ష రూపాయలు ఇచ్చి వాళ్లతో తెగతెంపులు చేసుకుంది... అన్నీ గుర్తుచేసుకుంటాడు. చివరకు ఆ లక్షరూపాయలు పంచుకోడానికి బంధువుల పడిన గొడవలు అన్నీ వెంకట్రావుకు ఆ క్షణాన గుర్తుకు వస్తాయి. రిలాక్స్ కోసం సిగరెట్ తాగుతాడు. ఒంటరి జీవితం నిజంగా హాయి అనుకుంటాడు. ఎదురుగా బోగీలో ఉన్న మనిషి నువ్వు హాయిగా ఉన్నావా... అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోడానికే వెంకట్రావు ప్రయత్నిస్తూ ఉంటాడు.
            వెంకట్రావుకు మొండిగోడల మధ్య, గుర్రపు పందాల్లో, క్లబ్బుల్లో, బార్లల్లో, హెలెన్, టెరెసా కౌగిళ్లలో హాయి దొరకదు. చివరకు దేశాటన మొదలు పెట్టి ఎక్కడన్నా హాయి దొరుకుతుందేమోనని వెతుకుతుంటాడు. అలా దేశాటన చెస్తూనే ఇప్పుడు రైలు ప్రమాధాన్ని చూస్తాడు. ఓ పెద్ద మనిషి అంత ప్రమాదం జరిగితే...నువ్వు ఇలా కూర్చున్నావే... అని అడుగుతాడు.  అందుకు వెంకట్రావు నేనేెం చెయ్యాలి... అని అడుగుతాడు. అందుకు అతను-- ఛీ.. ఏం మనుషులో... అని విరక్తిగా వెళ్లిపోతాడు.అసలు ఆ యాక్సిడెంట్ తనున్న బోగీకి అయితే హాయిగా చనిపోయి ఉండేవాడిని అనుకుంటాడు. తన జీవితంలో పద్మ తనను వెంటాడిది, హెలెన్ చనిపోయింది తన కోసమే కదా... అనుకొంటాజడు. అంతలో అక్కడకు పోలీసులు, డాక్టర్లు, నర్సులు వస్తారు. వాళ్లు యాక్సిడెంట్ అయిన వాళ్లందరికీ సాయం చేస్తూ...స్ట్రెచర్ల మీద శవాలను, గాయాలైన వారిని ట్రైన్ ఎక్కిస్తుంటారు. వారిలో ఒకామెను చూడగానే వెంకట్రావుకు ప్రాణం పోయినంత పనవుతుంది. సీతా... సీతా... అని అరుస్తూ వెంటపడతాడు. నర్సులు డాక్టర్లు గాయపడిన ఆమెను రైల్లోకి ఎక్కించి పక్క స్టేషన్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుస్తారు. వెంకట్రావు కూడా ఆమెకోసం అక్కడకు వెళ్తాడు.
         డాక్టర్లను ఎలాగైనా కాపాడమని ప్రాధేయపడతాడు. వెయ్యి రూపాయలు ఇవ్వబోతాడు. కానీ డాక్టరు తీసుకోడు. ఆసుపత్రిలో కంగారుగా అటు ఇటూ తిరుగుతాడు. క్షణమొక యుగంగా గడుపుతాడు. ఒకప్పుడు రాసిన కథను గుర్తుకు తెచ్చుకుంటాడు. అంతలో డాక్టరు వచ్చి వెంకట్రావును లోపలకు తీసుకెళ్తాడు. సీత కళ్లు తెరిచి వెంకట్రావును చూస్తుంది. ఆమె ముఖంలో విషాధరేఖలు కనిపిస్తాయి. కానీ సీత కళ్లు తెరిచి వెంకట్రావును చూసి, అప్రయత్నంగా కళ్లు మూసుకుంటుంది. నర్స్ ఆమె చనిపోయిందని నిర్దారణకు వచ్చి, ముఖంపై తెల్లటి బట్ట కప్పేస్తుంది. వెంకట్రావు పిచ్చిగా, శూన్యంగా రోడ్లంతా తిరిగి, పన్నెండు గంటల తర్వాత శ్మశానానికి వెళ్తాడు. అక్కడ  ఇద్దరు పిల్లలు, ఒక ముసలాయన ఆమె చితి దగ్గర ఏడుస్తూ కనిపిస్తారు. వెంకట్రావు తన జేబులో ఉన్న ప్రేమలేఖను తీసి చితిమంటల్లో వేస్తాడు. వాళ్లిద్దరూ సీత పిల్లలని, సీత భర్త చనిపోయాడని తెలుసుకుంటాడు. తన ఆస్తిని ఆ పిల్లల పేరు మీద రాస్తాడు. రాసిన తర్వాత పూర్తిగా అంతర్ధానమై పోతాడు. ఇక ఎప్పటికీ తిరిగిరాడు.
       ఈ కథ సంఘటనాత్మకమైనది. అక్కడక్కడా కవితాత్మకంగా సాగుతుంది. కథంతా వెంకట్రావు పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఫిలసాఫికల్ టచ్ కనిపిస్తుంది. మనిషికి హాయి అనేది డబ్బులో, హోదాలో, బార్లలో, గుర్రపు పందాలలో... దొరకదని చెప్తుంది. ప్రేమలో, ఇతరులకు సాయం చేయడంలోనే ఉందని రచయిత చివరకు చెప్తాడు. కథలో వచ్చే ప్లాష్ బ్యాక్ కథనం చదివేవాళ్లకు ఆసక్తిని కలిగిస్తుంది. మానవ సంబంధాలపై విసుగు చెందిన మనిషికి, ఆ మానవ సంబంధాల్లోనే హాయి ఉందని చెప్పడం ఈ కథా వస్తువులోని ప్రత్యేకత.                                                            

- డా. ఎ. రవీంద్రబాబు