Facebook Twitter
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 18 వ భాగం

 

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 18 వ భాగం

  
  ఎర్రాప్రగడ చెప్పసాగాడు.
   "యమధర్మరాజు సావిత్రికి ప్రసాదించిన వరం వల్ల ద్యుమత్సేనునికి చూపు వచ్చింది. వెంటనే కుమారుడైన సత్యవంతుని చూడాలనిపించింది.
   భార్య శైబ్యతో కలిసి వనంలో గాలించాడు. సావిత్రీ సత్యవంతుల జాడ తెలియలేదు.
   అంధుడైన ద్యుమత్సేనునికి సత్యవంతుడు తన కన్నులతో లోకాన్ని చూపిస్తున్నాడు. చూపు వస్తుందని ఏ మాత్రం ఆశ లేని సమయంలో ఆశ్చర్యకరంగా దృష్టి వచ్చింది. భార్యాభర్తల ఆనందానికి అవధులు లేవు. జీవితంలో ఊహించని అదృష్టమిది.
   ఈ సంతోష సమయంలో ద్యుమత్సేనునికి ఉన్న కోరిక ఒకటే. తనకన్నులే తండ్రి కన్నులుగా చేసి కన్నతండ్రికి సేవ చేసిన పుత్రుడిని కన్నులార చూడడం. మనసారా ఆలింగనం చేసుకోవడం.
   కానీ విధి వ్రాత ఎలా ఉన్నదో.. సాయం సంధ్యా సమయానికే  ఇల్లు చేరే తనయుడు, రేయి గడుస్తున్నా ఇంకా ఆశ్రమానికి రాలేదు. కళ్ళు కనిపిస్తున్నందుకు సంతోషించాలో.. కుమారుడు కంట పడనందుకు దుఃఖించాలో పాలుపోవడం లేదు ద్యుమత్సేనునికి.
   కళ్ళు వచ్చినా కళ్ళు లేనివాని వలెనే ఉన్నది అతడి స్థితి.
   ఇక్కడే నేనొక సంఘటన కల్పించి ఉత్పలమాలలో చెప్పాను. ఇది మూలంలో వ్యాస మునీంద్రులు చెప్పలేదు.
    కన్నులు వచ్చి ఎల్లెడలు గన్గొని వృద్ధ నరేంద్రుండాత్మకుం
    గన్నులు బోలె నైన తన గాదిలి పుత్రుడు గాననంబులో
    నెన్నడు లేని యింత తడ వేటికి జిక్కెనో యంచు నార్తితో
    గన్నులు లేనియ ట్లతడు గానక యేడ్చె సతీ సమేతుడై."
   ఎర్రన చెప్పిన పద్యం విని, సూరనార్యుడు ఆనందముతో కుమారుని లేపి గాఢముగా ఆలింగనము చేసుకున్నాడు.
   పోతమాంబ వడివడిగా ఇంటిలోనికి వెళ్ళి బుట్టెడు ఉప్పు తెచ్చి దిష్టి తీసింది.
   "నీ పుత్రుడికి నా దిష్టి తగులుతుందనే.. " సూరన మేలమాడాడు.
   "కాదు కాదు.. ముందు ముందు పదుగురి దిష్టీ తగలకుండా.." రెండు చేతులతో లెంపలు వాయించుకుంటూ అని, పతి పాదాలు కళ్ళకద్దుకుంది పోతమాంబ.
   ఎర్రన చిరునవ్వుతో తల్లిదండ్రుల ఆనందాన్ని పరికించి తన గ్రంధాన్ని అందుకున్నాడు.
   "దుఃఖంతో క్రుంగి పోతున్న ద్యుమత్సేన దంపతులను ఋషులు ఓదార్చారు.
   అంతలో వారి వేదనను పోగొడుతూ సావిత్రీ సత్యవంతులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు.
   కుమారుని కౌగలించుకుని ఆనంద భాష్పాలు కార్చారు వృద్ధ దంపతులు. సావిత్రిని దగ్గరగా తీసుకుని, తలను మూర్కొని ఆశీర్వదించారు.”
   ఎర్రన కంఠం సవరించుకుని మొదలు పెట్టాడు.
   "సత్యవంతా! ఎందులకింత ఆలశ్యమయినది" ద్యుమత్సేనుడు తనివితీరా కుమారుడిని చూస్తూ అడిగాడు. పది వత్సరములు వయసు తగ్గినట్లున్నదా దంపతులకి.
   సత్యవంతుడు, తనకి సోకిన అనారోగ్యాన్ని, నల్లని వ్యక్తి దర్శనాన్ని వివరించబోయాడు. సావిత్రి భర్తను వారించి, జరిగింది అంతా వివరంగా చెప్పింది.
   సత్యవంతుడు కూడా కన్నులు విప్పార్చి విన్నాడు.
   నారద మహర్షి వివాహాత్పూర్వము తమకు చెప్పిన సత్యవంతుని మరణ రహస్యాన్ని, దానిని దృష్టిలో పెట్టుకుని తాను నియమంతో ఆచరించిన వ్రతాలని వివరించింది.
   అచ్చటనున్న వారందరూ ఎంతగానో విభ్రాంతి చెంది సంతసించారు.
   "అమ్మా! సావిత్రీ.. పవిత్రమైన నీ గాధ ప్రశంస నీయము.
    కష్టాల కడలిలో మునిగిపోతున్న మా వంశాన్ని తెప్పవై రక్షించావు.. మీ జనకులు అశ్వపతి మహారాజు చెప్పినట్లుగనే." సావిత్రిని ఆశీర్వదించారు అత్తమామలు.
   సావిత్రి మదిలో కదిలే ప్రతీ ఆలోచనలోనూ ధర్మమే నిండి ఉంటుంది.
   ద్యుమత్సేనుని ఆశ్రమంలో ప్రతి ఒక్కరూ ఆనంద హృదయాలతో తేలిపోతూ, సావిత్రిని అభినందించారు.
   సావిత్రి సౌశీల్యమును, సుగుణములను వేనోళ్ల కొనియడారు.
   పెద్దలు మనసారా ఆశీర్వదించారు.

   ఇంకొక సంతోష పూరితమయిన వార్త రావలసి ఉంది. సావిత్రి ఎక్కువ రోజులు ఎదురు చూడనక్కరలేకుండా వచ్చేసింది.
   సాళ్వదేశం నుండి మునులు, నగరవాసులు, సేవకులు, సచివులు చాలా మంది వచ్చి ద్యుమత్సేనునికి నమ్రతతో నమస్కరించారు.
   "మహారాజా! మబ్బులు విడిపోయాయి. మిమ్ములను వంచించి మీ రాజ్యాన్ని కాజేసిన శతృరాజులు అంతఃకలహాలతో అంతరించి పోయారు.
   మిమ్ములను మరల మహారాజు లాగ చూడాలని ప్రజలందరూ ఉత్సాహ పడుతున్నారు. పట్టపుటేనుగు అంబారీతో కదలి వచ్చింది. వేలాదిమంది మిమ్మల్ని ఆహ్వానించడానికి తరలి వచ్చారు."

 

P46-KA24 aallwinArts.com S 60x19inch  Kings army & doli of queen_small.jpg


           
   ద్యుమత్సేనుడు సంతోషించి మునులందరికీ చెప్పి బయలుదేరాడు, కుటుంబ సమేతంగా.
   ఆశ్రమంలో మునులు వీడ్కోలు పలికారు. నగరంలో ప్రజలు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు.
ద్యుమత్సేనుడు పట్టాభిషిక్తుడయ్యాడు. సత్యవంతుడు యువరాజయ్యాడు.
   ఇదంతా సావిత్రీ వైభవమేనని రాజదంపతులు సంతసించారు.
   తన మగని నత్తమామల
   జననీ జనకులను దన్ను సకలంబును దా
   ఘనముగ సముద్ధరించెను
   జనవర! సావిత్రి దర్మ చరితము కంటే.
   ఇదే సావిత్రి చరిత్ర. ఇది అద్భుత చరిత్ర."
   ఎర్రన శ్రోతల వంక చూశాడు.
   "అవును. నేను కుమారుని అరణ్యపర్వంలోని సావిత్రి చరిత్రను చదివాను. నూటపది పద్యాలతో ఇదే ఒక చిన్న ప్రబంధము లాగున్నది." సూరనార్యుడు చెప్తుంటే పోతమాంబ, కోడలు ఆనంద భరితులయ్యారు.
                             ……………….
                                  14
   సూరనార్యుడు చెప్పినట్లుగనే, అరణ్య పర్వంలోనే ప్రబంధాల అల్లికలను రచించిన ఎర్రాప్రగడ "ప్రబంధ పరమేశ్వరు" డైనాడు.
   మరల ఒక్కసారి తన భారత భాగమును చదువుకున్నాడు.
   కన్నబిడ్డను ఎన్ని మారులు చూచుకున్ననూ, మాతృమూర్తికి తనివి తీరదు. రోజు రోజుకూ కొత్త అందాలు కనిపిస్తూనే ఉంటాయి.
   పొద్దుపొడవగనే ఊయలలో ఒళ్ళు విరుచుకుంటున్న పాపని ముద్దులాడుతూ, నూనె రాచి, నలుగు పెట్టి వేడి వేడి నీటితో స్నానం చేయిస్తుంది.
   ఉహూ.. ఈ నామం పొట్టిగా ఉంది.. మోము మరొక్కసారి కడిగి నామం దిద్దుతుంది.
   ఈ ముత్యాలహారం కొద్దిగా మాసినట్లుందే.. పతకం మెరుపు తగ్గిందే..
   హారాన్ని శుభ్రం చేసి మెడలో వేస్తుంది.
   పీతాంబరం సర్దిందే సర్దుతూ, జారిపోకుండా కడుతుంది. అప్పుడు.. దిష్టి చుక్క పెట్టి చుట్టపక్కాలకి చూపుతుంది.
   అదే విధంగా కవి కూడా..
   తన కావ్యాన్ని అపురూపంగా తీసి కన్నులార చూసుకుంటాడు. చేతితో తడిమి స్పర్శానందాన్ననుభవిస్తాడు మరల మరల చదువుతాడు. చదివిందే చదువుతూ.. ఇక్కడొక మాత్ర తక్కువయిందే అనిపిస్తుంది, పదోసారి చదువుతుంటే.. మధనపడి మారుస్తాడు.
   చదువుతూ అందాలు పరికించి ఆనందిస్తాడు.
   ఇందులో అర్ధం అనుకున్నట్లు రాలేదే.. కొంచెం ఈ అలంకారం మారుస్తే.. ఏం ఉపమ చెప్పాలి చెప్మా!
   ఆహా.. దొరికింది. అర్ధరాత్రి లేచి మార్చేస్తాడు.
   కలలో ఇలలో అదే ధ్యాస. ఇంకే ఆలోచనా దరి రాదు.
   ఎర్రన కూడా తన కావ్యాన్ని మరమరల చదివాడు.
   చివరి భాగాలలో క్రమంగా తిక్కనగారి శైలి వచ్చినందుకు సంతుష్టుడైనాడు.
   క్రమ క్రమంగా సంస్కృత పదాల జోక్యం తగ్గి, తేటతెలుగు పలుకులు ఊపిరి పీలుస్తున్నాయి.
   విరాటపర్వంలో ద్రౌపదిని కీచకుడు వేధించినట్లే, అరణ్యపర్వంలో సైంధవుడు వేధిస్తాడు.
   ద్రౌపది తన భర్తల పరాక్రమాన్ని విరాటపర్వంలో కీచకునికి చెప్పినట్లే, అరణ్యపర్వంలో సైంధవునికి వివరిస్తుంది.. విస్తృతంగా! కీచకునితో అధికంగా మాటలాడుటకు లేదు.. అజ్ఞాత వాసం కనుక. అందుకే "దుర్వారోద్యమ" అంటూ ఒకే పద్యంలో చెప్తారు తిక్కనసోమయాజి.
   అరణ్యపర్వంలో ఆ బాధలేదు.
   కావలసినంత సమయము. ఎవరైననూ చూచెదరన్న సంకోచము లేదు.
   ఒక్కొక్కరి ప్రతిభను, ప్రతాపాన్ని పేరు పేరునా చెప్పి ఏడు పద్యాలలో చెప్పారు ఎర్రన.
   ధర్మరాజు మదపుటేనుగు వంటివాడు. ధర్మసూత్రాలు వివరిస్తూ.. లౌకిక విషయాలు పట్టించుకోనట్లు స్థిరంగా ఉంటాడు. అంకుశంతో కర్తవ్యం చూపుతే చాలు.. ఘీంకరించి..
   ’అరి’ మదమడచి పాదాలతో తొక్కి పారేస్తాడు.
   భీముడు సింహ సముడు. జూలు విదిలించి, దిక్కులు దద్దరిలేలా గర్జిస్తే..
   సమస్త జీవరాసులూ పారిపోవలసిందే. ఎవరైనా ఎర దొరికితే ఎముకలు నుజ్జు నుజ్జే.
   అర్జనుడు బెబ్బులి. మౌనముగా ఉన్నట్లే ఉండి, గురి చూసి గాండ్రిస్తూ అత్యంత వేగముగా మీదపడతాడు. శతృవుకి పారిపోవుటకు సమయమే ఉండదు.
   నకుల సహదేవులు జంటపాములు. బుసతో పగవాడు పారిపోతుంటే కాటేస్తారు.
   ఈ పోలికలు మూలంలో వ్యాసులవారు కూడా చెప్పారు.
   ఎర్రనగారు తన అనువాదంలో తెనుగుతనం చూపారు. దానితో ఎంతో హుందాగా ఉంది వర్ణన.
    “హిమవత్పాద వనాంత కేలి రతిమై నేపారి కోపారుణ
    క్రమ నేత్రాంచలమై ప్రభూతమద రేఖంభైన గంధద్విపేం
    ద్రము డాయంజని సిళ్ళు చూపుట సుమీ ధర్మాత్ము సత్యుగ్రవి
    క్రము గౌంతేయవరిష్ఠు నీవు దొడరంగా జూచు టూహింపగన్."
   ఏనుగుకు సిళ్ళు చూపడం తెలుగువారి జాతీయం. సిడి అంటే అంకుశం అని అర్ధం.
   మదించిన ఆంబోతుకు ఎర్రని వస్త్రం చూపుతే బెదిరి చిందులేసి కనిపించినవన్నీ ధ్వంసం చేస్తుంది. అదే విధంగా ఏనుగును అంకుశంతో బెదరగొడితే విజృంభించి, ఎత్తి ఆవల పడేసి, పాదతాడనం చేస్తుంది.
   అదే విధంగా సింహం జూలు పట్టుకుని వేళ్ళాడవద్దనీ..
   పులిని కోలతో కొట్టి తోసివెయ్యద్దనీ,
   బుసకొట్టే పాముల్ని కాళ్లతో రాయద్దనీ ద్రౌపది హితవు చెప్తుంది. ఇవన్నీ తెలుగువారు వాడే నానుళ్ళు. అనువాద రచనలో, చదివే వారి ఆచార వ్యవహారాలనూ, ఆ భాషలోని సామెతలనూ.. జీవన విధానాన్నీ ప్రతిబింబిస్తే ఆ రచనని వారు స్వంతం చేసుకుంటారు.
   అదే జరిగింది మహాబారత రచనలో. కథాకాలంనాటి తెలుగువారి పలుకుబళ్ళు, ఆచారాలు అన్నీ కళ్లకు కట్టినట్లు చూపించారు కవిత్రయం. అందుకే అది ఎప్పటికీ తెలుగువారి మూలగ్రంధం. ప్రియమైన గ్రంధం. యుగాలు మారినా ఆ గ్రంధరాజం స్థానం సుస్థిరం.. తెలుగువారి హృదయాలలో!
   ద్రౌపది చెప్పిన హితం వినని సైంధవుడు, ‘వృకం’ లాగ పాండవుల నివాసంలో ప్రవేశించాడు.
   తిక్కనగారు కీచకుడు నర్తనశాలలో ప్రవేశిస్తుంటే అంతటి సింహబలుడినీ బెదిరిన లేడితో పోల్చారు.
   ఎర్రనగారి సైంధవుడు అంతకన్నా హీనుడు. అతగాడిని సింహాగారము జొచ్చే నక్క అనీ, వాడి మీదకు యుద్ధానికి పోయే పాండవులను డేగలతోనూ పోల్చారు.
   సైంధవుడు ద్రౌపదిని గొని పోయేటప్పుడు, అడవిలో వేరొక చోట నున్న పాండవులకు అపశకునాలు గోచరిస్తాయి. వాటిని చూడగానే ధర్మరాజు భయపడతాడు. అప్పుడతడు..
   “చేయివెట్టి కలచినట్లయ్యెడు చిత్తంబు
    తనువు నిస్చేష్టమయ్యె.." అంటాడు.
   ఇటువంటి భావాలన్నింటినీ ఈ విధంగా అచ్చ తెలుగులో ప్రకటించాడు ఎర్రన.
   విరాటపర్వంలో భీముని ముందు పాండవులని పేరుపేరునా పొగడినట్లే, అరణ్యపర్వంలో సైంధవుని రధం మీద నిలబడి, యుద్ధానికి వస్తున్న పాండవులను రెండేసి పద్యాలతో వర్ణిస్తుంది.
   ఇక్కడ మూలంలో భావాలకి గౌరవం ఇస్తూనే తిక్కనగారి శైలిలో నడిపాడు.
   ఎనలేని ప్రతిభా సంపత్తులుంటేనే ఇటువంటి అనితర సాధ్యమైన ప్రబంధమును రచింపగలుగుతారు..
   నన్నయ తిక్కనలిరువురు తనలో పరకాయప్రవేశం చేసినట్లే అరణ్యపర్వ శేషాన్ని పూర్తిచేశాడు ఎర్రాప్రగడ.
                            …………………

 

 

 

 

 

 

 

.....మంథా భానుమతి