Facebook Twitter
వారు ముగ్గురు (కథ)

 

వారు ముగ్గురు (కథ)

- ద్వివేదుల విశాలాక్షి

       తొలితరం కథా రచయిత్రులలో విశాలాక్షి ఒకరు. కేవలం కథలే కాకుండా నవలలు కూడా రాశారు. విదేశాల్లో పర్యటించి తెలుగుభాషా వైభవాన్ని వ్యాప్తి చేశారు. విలువైన ప్రసంగాలు చేశారు. ద్వివేదుల విశాలాక్షి రాసిన నవలల్లో వైకుంఠపాళి, వారధి, మారిన విలువలు వంటివి ఎంతో పేరు తెచ్చాయి. సుమరు 3 కథా సంపుటాలను కూడా వెలువరించారు. ఢిల్లీ తెలుగు అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. వీరి కథలు మానవ సంబంధాలలోని లోతులనే కాకుండా, మనిషి ప్రవర్తనల్లోని వైవిధ్యాన్ని వివరిస్తాయి. అలాంటి కథే వారు ముగ్గురు.
     కథలోకి ప్రవేశిస్తే- ఒక మారుమూల గ్రామంలో ఓ పాడుపడిన ఇల్లు ఉంటుంది. అది దెయ్యాల కొంపగా ఆ వూర్లో ప్రచారం జరిగి ఉంటుంది. ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. కానీ ఒకరోజు తెల్లవారే సరికి ఆ ఇంటిముందు ముగ్గేసి ఉంటుంది. అది చూసిన గ్రామ ప్రజలు ఆశ్ఛర్యపోతారు. ఆందోళన చెందుతారు. గ్రామాల్లోని ప్రజలలో ఆత్మీయత, అనురాగాలు, కలివిడి తనం ఎక్కువ. ఎవ్వరికీ ఏ ఆపద వచ్చినా అందరూ తమదిగా భావిస్తారు. కానీ వారిలో కూడా చీడ పురుగుల్లాంటి వాళ్లు, వ్యక్తుల సొంత విషయాలను కూపీ లాగి, అందరి దగ్గరా చెప్పే వాళ్లు ఉంటారు. అలాంటి వాళ్లే కామమ్మ, సోమమ్మ. వారికి ఏ విషయాన్నైనా తెలుసుకొని పక్కవాళ్లకు చెప్పందే నిద్రరాదు. అలాంటి వాళ్లు దెయ్యాల కొంపముందు ఉన్న ముగ్గును చూశారు. ఆ ఇంటి ముందుకు వెళ్లి ఎవరు ఇంట్లో- అని పిలిచారు. ఇంట్లోనుంచి ముగ్గురు స్త్రీలు తెల్లబట్టలతో బైటకు వచ్చారు. వారు జెండా అంచులు గల ఖద్దరు చీరలు కట్టుకొని ఉంటారు. కానీ వీరికి పల్లెటూళ్లో సహజంగా ఇచ్చే మర్యాద ఇవ్వరు. అంటి ముట్టనట్లు సమాధానాలు చెప్తారు. దాంతో కామమ్మ, సోమమ్మ వాళ్లు పట్నం నుంచి వచ్చినట్లు అర్థం చేసుకుంటారు. అలానే ఇల్లు అంతా నీటుగా సర్దిన దాన్ని బట్టి వీళ్లు దెయ్యాలు కాదుకదా అనే అనుమానం వస్తుంది వాళ్లిద్దరికి.
        వాళ్లు పెరటిని శుభ్రం చేసుకోవడం చూసి దెయ్యాలేమోనని పగుగులాంటి నడకతో నీలాటి రేవుకు వెళ్తారు. అక్కడ పరిచయం అయిన వాళ్లకు దెయ్యాల గురించి చెప్తారు. ఊళ్లో దెయ్యాల పేరయ్య లేడని, వారం పదిరోజుల దాకా రాడని చర్చించుకుంటారు. వాళ్లు కామినీ భూతాలని, వాళ్ల నుంచి మగవాళ్లను రక్షించుకోవాలని బాగా ప్రచారం జరుగుతుంది. కానీ వాళ్లు ఊరికి వచ్చి మూడురోజులైనా ఎవ్వరికీ ఏ ఆపదా కలగదు. తర్వాత ఆ ఊరి మునసబు రంగారావు ఊరి నుంచి రాగానే సోమమ్మ, కామమ్మ వచ్చి కామినీ భూతాల గురించి, దెయ్యాల కొంపలో వాళ్లు ఉంటున్న సంగతీ చెప్తారు. మునసబు భార్య కూడా వారి జోలికి వెళ్లకు నా సంసారం నాశనం అవుతుంది అని భయపడి భర్తకు చెప్తుంది. మునసబు రంగారావు వారికి కబురు పెడతాడు.
       వాళ్లు మునసబు రంగారావును కలుస్తున్నారని తెలుసుకున్న ఊరు ఊరుంతా మునసబు ఇఁటి ముందు గుమిగూడుతుంది. వీభూతి రాసుకొని, దండకాలు చదువుతూ భయభయంగా వస్తారు ప్రజలు. ఆ ముగ్గురు యువతులు రంగారావుతో ఇంగ్లీషులో మాట్లాడి వెళ్లిపోతారు. వెళ్లి పోయిన తర్వాత మరో రెండు ఇళ్లను కూడా స్వాదీనం చేసుకుంటారు.  పట్నం నుంచి కొంతమంది పనివాళ్లు, సామాను వస్తుంది. ఆ ఇళ్లకు రామాపురం గ్రామ మహిళా మందిరం, రామాపురం గ్రామ వైద్యాలయం, రామాపురం గ్రామ ఉచిత విద్యాలయం  అని పేర్లు పెడతారు. పిల్లలకు మిఠాయిలు ఇచ్చి, తమ బడికి రమ్మని పిలుస్తారు. ముందుగా మునసబు తన ఇద్దరు పిల్లల్ని పంపిస్తాడు. వారు ఇంగ్లీషు మాట్లాడడం చూసి మరికొంత మంది తల్లిదండ్రులు ఆ బడికే పంపిస్తారు. తర్వాత క్రమంగా కొంతమంది వారు పెట్టిన వైద్యశాలకు వెళ్లి రోగాలు చూయించుకుని మందులుకూడా తీసుకుంటూ ఉంటారు. ఊరిలో చాలామంది వారు చేస్తున్న సేవను గుర్తిస్తారు.
     కానీ ఊరిలో- వాళ్లు ముగ్గురూ కొరివి దెయ్యాలని, రాత్రిళ్లు దెయ్యాలతో వీళ్లు మాట్లాడుతున్నారనే వదంతు వ్యాపిస్తుంది. దాంతో గ్రామ ప్రజలు ప్రాణాల్ని గుప్పిటపట్టుకొని రాత్రిళ్లు నిద్రకూడా పోకుండా బతుకుతుంటారు. కొన్ని రోజులకు ఆ ముగ్గురు చేస్తున్న మంచి పనులు చేసి ఊరుఊరంతా మారుతుంటుంది. ఇంతలో ఒకరోజు నిశిరాత్రి ఊరి మధ్యలో ఉన్న ఇళ్లు అంటుకుంటాయి. అంటించిన మనిషి ఎవరో చూడలేరు. కానీ ఆ ముగ్గురు యువతులు మాత్రం మంటలు ఆర్పడానికి, తగలబడిన ఇళ్ల వాళ్లకు సాయం చేయడంలో గానీ ముందుంటారు. వారి సేవకు గ్రామస్తులందరూ ముగ్దులవుతారు. చివరకు నిప్పు పెట్టిన వ్యక్తిని పట్టుకుంటారు. ఎవరా అని అనుకుంటే... భూతాల పేరయ్య. అతడ్ని చూసి ఊరుఊరంతా ఆశ్చర్యపోతుంది. 
         గ్రామాల్లో ఇప్పటికీ ఉన్న మూఢనమ్మకాలను ఈ కథ ఆ రోజుల్లోనే వెలుగులోకి తెచ్చింది. అలానే ఊళ్లల్లో ప్రతి ఒక్కరి సొంత విషయాల్ని కనుక్కొని వ్యాపింపజేసే స్త్రీల మనస్తత్వాలను కూడా సోమమ్మ, కామమ్మ పాత్రల ద్వారా చెప్పారు విశాలాక్షి. అలానే కథంతా వ్యవహారిక భాషలో ఒక వాగు ప్రశాంతంగా సాగినట్లు నడుస్తుంది. చివరిలో ఒక కుదుపుకు గురై ఇళ్లకు నిప్పు పెట్టింది ఎవరనే ప్రశ్న వస్తుంది. ముగింపులో భూతాల పేరయ్య అని తెలియడంతో అతనిలోని అసలు గుణం బయటపడుతుంది. ఇలా గ్రామాల్లోని నేటి పరిస్థితులను తెలియజేస్తుంది ఈ కథ. 

........ డా. ఎ.రవీంద్రబాబు