Facebook Twitter
కొనకళ్ళ వెంకటరత్నం

 

కొనకళ్ల వెంకటరత్నం

(బంగారి మామపాటల రచయిత) 


కొనకళ్ల వెంకటరత్నం. పరిచయం అక్కర్లేని పేరు. ఎంకిపాటల తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన బంగారి మామపాటల రచయిత. చలం, కృష్ణశాస్త్రి లాంటి ప్రఖ్యాత కవులు, రచయితలు ఎందరో వీరి పాటల్ని పాడుకుని ఆనందించేవారు. సుక్కలన్ని కొండమీద సోకుచేసుకునే వేళ... అని అవ్యక్త బాధతో, జీరపోయిన గొంతుతో వెంకటరత్నం పాటపాడితే, కృష్ణశాస్త్రి బారంగా నిట్టూర్పు విడిచాడు. ఆ మధుర క్షణాల గురించి చలం చెప్పాడు. అలాంటి కొనకళ్ల కేవలం బంగారు మామ పాటల్నే కాదు ఎన్నో కథల్ని కూడా రాశాడు. అవి తెలుగు కథా సాహిత్యంలోని లోటును పూరించాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కొనకళ్ల వెంకటరత్నం పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో 1909లో జన్మించాడు. కాకినాడలోనే విద్యాభ్యాసం చేశాడు. పోలీసు ఉద్యోగం చేసి చివరకు ఏలూరులో స్థిరపడ్డారు. ఉద్యోగరీత్యా అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ, గుంటూరు, ఉభయగోదావరి వంటి అనేక ప్రాంతాలు తిరిగారు. అక్కడి జీవన పరిస్థితులను, ప్రజల బాగోగులను అవగాహన చేసుకున్నారు. ప్రతోళి, బంగారుమామ పాటలు, పొద్దు తిరుగుడు పూలు వంటి గేయా సంపుటాలను వెలవరించారు. వీరి కథలు ఆనాడు ప్రముఖ పత్రికలైన భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్రసచిత్ర వారపత్రిక వంటి వాటిలో ముద్రితమయ్యాయి. వీరు రాసిిన బంగారిమామ పాటల్లోని- మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో పాటను మొదట 'సిపాయి కూతురు' చిత్రంలో వాడారు. తర్వాత 'అదృష్టవంతులు' సినిమాలో తీసుకున్నారు. అలాగే- రావోయి బంగారిమామా నీతోటి రహస్యమొకటున్నదోయి పాట ఘంటసాల గొంతులో తెలుగు వారి హృదయాలను కొల్లగొట్టింది.

కొనకళ్ల వెంకటరత్నం సుమారు 40 కథల వరకు రాశారు. వీరి పాటల వలే కథలు కూడా కవిత్వ వాక్యాలతో రసజ్ఞతతో నిండి ఉంటాయి. వర్ణనలు చేసేటప్పుడు వెంకటరత్నం కవితాత్మకంగా కథా వాతావరణాన్ని, పాత్రల మానసిక స్థాయిని, స్థితిని బట్టి అద్భుతంగా చేశారు. వీరి కథల్లో ప్రేమలోని వివిధ పార్శ్వాలు గమనించవచ్చు. అలాగే రాయలసీమ కరువు గురించి, స్వాతంత్ర్యపోరాట నేపథ్యంలో జరిగిన సన్నివేశాల గురించి చెప్పారు. కథా వస్తువు, కథనం రెండూ రెండు కళ్లలా ఒకే చూపును సూచిస్తాయి. 'శశిరేఖ స్వగతం' కథలో శశిరేఖ, చందర్రావు పట్నంలో చదువుకుంటూ ఉంటారు. వారిద్దరికి వారి తల్లిదండ్రులు పెళ్లి కుదురుస్తారు. కానీ శశిరేఖ పెళ్లికి విఘాతం కలిగించమని చందర్రావును కోరుతుంది. ఆమె పై ఉన్న ఇష్టాన్ని వదులుకొని ఆపని చేస్తాడు చందర్రావు. కాని చివరకు జ్ఞానోదయం అయిన శశిరేఖ మళ్లీ అతడ్నే పెళ్లాడమని అడుగుతుంది. అందుకు చందర్రావు తిరస్కరిస్తాడు. ఈ కథలో చంచల స్వభావం ఉన్న శశిరేఖ మనస్తత్వం, తన అభీష్టాన్ని వదులుకొని శశిరేఖకోసం చందర్రావు చేసిన పని గుర్తించడదినవి. ఒకనొక స్థాయిలో శశిరేఖ మథనపడి చందర్రావుతో- తనను చెడామడా తిట్టి, చాలకపోతే ఎడాపెడా చేయికూడా చేసుకుని, దైర్జన్యంగా బలత్కారం చేసినా బాగుండు అని అనుకుంటుంది.

రాయలసీమ కరవు నేపథ్యంలో రాసిన కథ చదివితే కన్నీరు వస్తుంది. జ్వాలాపతి బళ్లారి సమీపంలోని శ్రీధరగడ్డకు కరువు క్యాంపు ఇన్ ఛార్జిగా వెళ్తాడు. ఒకరోజు రాత్రి వంటిట్లో చప్పుడైతే పదిహేనేళ్ల కుర్రాడిని దొంగగా పట్టుకుంటారు. అతడిని కొడతారు. అతడు దొంగతనం కోసం రాలేదు. ఆకలితో ఇంట్లోకి వచ్చాడన్న నిజాన్ని తెలుసుకుంటారు. కానీ అప్పటికే ఆ కుర్రోడు చనిపోతాడు. చివరకు ఆ శవాన్ని తీసుకెళ్లి, క్యాంపులో చోటు దొరక్క చెట్టుకింద ఉన్న అతని తల్లిదండ్రుల చేతుల్లో ఉంచుతారు. వాళ్లు శోకంతో విలవిలలాడిపోతారు. స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించి వెంకటరత్నం రాసిన కథల్లో 'దొంగసొత్తు', 'చివరికి మిగిలిన రంగడు' లాంటివి గొప్పకథలు. 'దొంగసొత్తు' కథలో నందకిశోర్ పోరాటంలో భాగంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. అతని సహచరుల జీవనానికి కొంత డబ్బు అవసరం అవుతుంది. అందుకు తన చిన్ననాటి స్నేహితురాలైన లాయర్ రాజేంద్ర భార్య రమాదేవి దగ్గర నుంచి బంగారు కంకణాన్ని తీసుకుంటాడు. చివరకు ఆ విషయం బయటపడుతుంది. ఉదాత్త భావాలు గల పోలీసు కథ 'కత్తిమీదసాము'. ఈ కథలో జవాను 116 ఉత్తమ గుణాలు కలిగిన వ్యక్తి. అన్యాయాలను ఎదిరిస్తాడు. నిజాయితీగా జీవిస్తుంటాడు. ముసుగేసుకుని మోసం చేస్తున్న హెమాహెమీలను పట్టిస్తాడు. చివరకు అతనికి పిచ్చిపట్టిందని పిచ్చాసుపత్రిలో చేర్చుతారు. అప్పుడు రచయిత అతనిచే అద్భుతమైన ఉపన్యాసాన్ని ఇప్పిస్తాడు. 'మీ పాపాలతో పాలు పంచుకోవడం లేదని, మీతోబాటు నేరాలలో రూపాయినోట్లమీద రాజీలకు దిగడంలేదని, చీకట్లో మీ ఆటలు వెలుగులోకీడ్చి తెస్తున్నానని, నా పొట్ట కొడదామని చూస్తారా... అని అంటాడు.

ఇలాగే వీరు రాసిన నలభై కథలు అద్భుతంగా ఉంటాయి. కొత్త కోణాల్ని, సమస్యల్ని వెంకటత్నం తనదైన దృక్పథంతో, దృష్టితో చెప్తారు. అలానే వీరి కథల ప్రారంభాలు, ముగింపులు కూడా మొపాసా, ఓ హెన్రీలను గుర్తుకు తెస్తాయి. పాత్రలు మాట్లాడే రీతి చూస్తుంటే- కులాలు, మతాలు, ప్రాంతాలు, చదువు, సంస్కారం వంటి వాటిని అధిగమించాయనిపిస్తుంది. అంటే- పాత్ర స్వభావానికి అంత ప్రాధాన్యత ఇస్తారు కొనకళ్ల వెంకటరత్నం. ఎప్పుడు ఎవ్వరు ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడిస్తారు. వీరి కథల్లోని ఇతివృత్తాలు ఎక్కువగా ఆకలి, కట్నాలు, పెళ్లిళ్లు, కామం, పేదరికం, నీచమైన రాజకీయాలు, డబ్బు, విశ్రాంతి లేని పనుల ఒత్తడి, యంత్రాల్లా ఏమాత్రం మానవీయత లేని మనుషులు... వంటి వాటి చుట్టూ తిరుగుతుంటాయి. కథల మలుపుతో పాటు, చమత్కారం, కవిత్వం కథల నిండా నిండి ఉంటుంది. 'మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో' లాంటి అద్భుతమైన పాటల్ని, అడ్డదారి, అతను ఇకరాడు, అద్దంమీద ఆవగింజలు, అనుకోని విరహం, సంఘర్షణ, ఖయిదీ - జవాను, తొందరపాటు, విముక్తి, ఆఖరు గుణపాఠం, పశుపక్షుల సమావేశం వంటి ఎన్నో గొప్ప కథల్ని రాసి మనకిచ్చిన కొనకళ్ల వెంకటరత్నం 1971, జనవరి 9 వ తేదీన మరణించారు. అయినా వారి కథలు, పాటలు మాత్రం తెలుగు ప్రజల హృదయాలపై ఎప్పుడూ చిరస్థాయిగానే నిలిచి ఉంటాయి.

......డా. ఎ.రవీంద్రబాబు