కులనిర్మూలనే నా వృత్తి...జాషువా కవి
వర్ణాంతర వివాహం చేసుకొని గుట్టుగా బ్రతికే
క్రైస్తవదంపతుల ప్రార్థనాఫలమే జాషువా జననం
గుడ్డిదీపం కింద చదువు పాత మసీదు పాఠశాల
అద్దెకు ముద్దకు సరిపడని చిరుఉద్యోగాలు
చేసిన "నిరుపేద" "నిగర్వి" "నిరాడంబరుడు"
రాజు మరణించె నొకతార రాలిపోయె
కవియు మరణించె నొకతార గగనమెక్కె
రాజు జీవించే రాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు!
అని కమ్మగా పలికిన "కవికోకిల" కవి విశారద"
"పద్యకవి"ప్రజాకవి"నవయుగ చక్రవర్తి గుర్రంజాషువా"
పంజరాన పట్టుబడ్డ స్వేచ్ఛలేని పక్షిని కాను నేను
ఆరక రావణకాష్టంలా రగిలే కులంకుంపట్లను ఆర్పే
"కుంభవర్షాన్ని నేను"చిరుజల్లును కాను" అంటూ
ఆయన గుండెలోతుల్లో నుంచి పొంగిపొరలిన కవిత్వం
నిండా కన్నీటిధారలే,అంతులేని ఆవేదనలే,అవమానాల
అనుభవాల, అనుభూతులే "అంటరానివారి ఆక్రందనలే"
ఒకవైపు "దారిద్ర్యం" దహించి వేస్తున్నా
మరోవైపు "కులం" కాలసర్పమై కాటేస్తున్నా
"అంటరానితనం" వెంటబడి వేధిస్తున్నా
వెరవక మొండి ధైర్యంతో ఎదురుతిరిగి
కులమత కుడ్యాలను కూల్చి దారిద్య్రన్ని చీల్చి
మట్టి పొరలను పెళ్ళగించి సాహిత్య క్షేత్రంలో పచ్చని
పసిడిపంటలు పండించిన "సాహితీ కృషీవలుడు"
తెలియక ముందు తెగ పొగిడేసిన మిత్రులే
కులం తెలిశాక వేదికలనుండి వెలివేశారన్నాడు
గుండెల్లో అసమానతాబాకుతో పొడిచారన్నాడు
"గబ్బిలం" "ఫిరదౌసి "క్రీస్తుచరిత్రలు"జాషువాగారు
చేసిన విశిష్టమైన రచనలు.అన్ని"ఆణిముత్యాలే"
అవి అంటరానితనం"మీద సంధించిన "ఆయుధాలే"
అవి కులరక్కసి మీద ఎక్కుపెట్టిన "సాహితీబాణాలే"
గుర్రం జాషువా గారికి గురువులు ఇద్దరు
"పేదరికం" పెద్ద గురువు "కులము" కులగురువు
ఒకటి సహనాన్ని నేర్పింది వేరొకటి సమరానికి సైఅన్నది
తన కలాన్నికత్తిగా మార్చి వర్ణవ్యవస్థను చీల్చిచెండాడిన
కులాన్ని కూల్చిన"నవసమాజం నిర్మాత"సంఘ సంస్కర్త"
ఎన్నోపద్య నాటకాలు ఖండికలు కావ్యాలు వ్రాసినా
తన బ్రతుకుబాటలో అస్పృశ్యత గునపమై గుండెను
చీల్చినప్పుడు, అవమానకర సంఘటనలు జరిగినప్పుడు,
సమస్యలు ఎదురైనప్పుడు ఎదురు తిరిగి సమాజాన్ని
ప్రశ్నించి కులమనే విషవృక్షాన్ని తన కలం గండ్రగొడ్డలితో
నరికి కూకటివేళ్లతో సహా పెకలించిన "సాహితీ సింహం"
విశ్వమానవదృష్టి, ఆధునిక దృక్పథం,హేతువాదాలకు
ప్రతిరూపమైన "నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా"
"కలం నా కత్తి - కులనిర్మూలనే నా వృత్తి" యని
అణిచివేత,అంటరానితనం,అసమానతలే నాశతృవులని
"అస్పృశ్యత మాయమైతే - నవసమాజ నిర్మాణం ఖాయమని
కలంకత్తిని ఝులిపించిన, కులరక్కసిని సమాధి చేసిన
సమసమాజ స్థాపనకై కృషి చేసిన"మరో అంబేద్కర్ జాషువా"



